మాకో హెడ్మాష్టరుగారు వుండేవారు. ఆయన కల్ చర్డు మనిషి. జీవితాన్నీ ప్రిన్ సిపిల్సునీ కొంత యోచించినవాడు. నాకిదివరకే స్నేహం. మంచి హృదయం కలవాడు. నా శ్రేయస్సును కోరినవాడు. మొదట నన్ను చూసి సంఘానికీ, కులానికీ, మతానికీ, వెలిబడ్డ ఏకాకిని, ముందు ముందు నా గతి ఏంకాబోతోందా, నా పిల్లల గతి ఏంకాబోతోందా అని జాలిపడ్డాడు. మండిపడక జాలిపడ్డాడంటే అనేకమంది మంచివారనే వారికన్నా నిజంగా మంచివాడన్నమాట క్రమంగా స్కూల్లో పని ఘర్షణ వల్లనైతేనేం, నన్ను దగ్గిరగా పరిశీలించడం వల్ల పైతేనేం మెల్లిగా ఆయనకే తెలీకుండా కొంచెం ప్రపంచ విషమెక్కింది రక్తంలోకి. నా వల్ల బడి క్రమశిక్షణ పాడైపోతోందని భయంపట్టుకుంది. త్వరగా పరిచయం పురస్కరించుకుని వాదనలు చేస్తున్నాడు. కొంత బోధనలు చేస్తున్నాడు. స్కూల్లోగాని, సంఘంలో గాని, అందరితో కలిసిమెలిసి పూర్వంనుంచీ యేర్పడ్డ పద్ధతుల ప్రకారమే గాని, నా యిష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదని ఆయన వాదన. "గడియారంలో చక్రంవంటివాడు మనిషి__సంఘంలోనూ ఒళ్లోనూ" అంటాడు ఆయన. "నేను గడియారంలో చక్రాన్ని కాను, కావడానికి ఒప్పుకోను. ఐనప్పటికీ యీ చక్రం తన యిష్టం వచ్చినట్టు తిరగ తలుచుకుంది" అన్నాను.
"ఐతే గడియారం యెట్లా నడుస్తుంది?"
"బాగానే నడుస్తుంది; తక్కిన చక్రాలకి బుద్ధివుంటే సరి. అసలు యీ గడియారాన్ని చూస్తే నాకేమీ గౌరవం లేదు. దీంట్లో చక్రాలన్నీ తప్పుడు చక్రాలు_ మరలు తుప్పుపట్టాయి. ఇది సరైన కాలం చూపటంలేదు. గడియారం చాలా ముసలిదయింది. సరిగా నడవటం లేదు. ఈ తప్పుడు గంటలకి అలవాటై, ఇదే సరైన కాలమంటున్నారు. ఈ గడియారాన్ని చూసుకుని, సత్యాన్ని మరిచి, కాలాన్ని కల్పించే సూర్యుడే తప్పు నడకలో వున్నాడని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ యీ తుప్పు గడియారం ఆగినా నాకేం దిగులు లేదు. నేనూ ఆగిపోతానా? అదీ దిగులు లేదు. కాని నేను మాత్రం యిట్లానే తిరుగుతాను. చాతనైనంత వరకు యితర చక్రాల్ని నాతో తిప్పుతాను. తిరగరా, యీ గడియారం ఆగడమే మంచిది" అన్నాను.
"నా యిల్లు కదా అని, తక్కిన యిళ్ళ మధ్యవున్న నీ యింటికి నిప్పంటించుకుంటే యెవరు వూరుకుంటారు?"
"నిప్పంటించడమే కాదు నా యిల్లు బూజుగా వుంది దులుపుకుంటా' నన్నా, 'ఆ బూజు మా కళ్ళలో పడుతుం'దని అరుస్తున్నారు. 'మీ ఇళ్లు దులుపుకోండర్రా' అంటా నేను. 'నీ ఇల్లూ దులుపుకోకు' అంటున్నారు మీరు."
ఆయన ఆదర్శం యేమిటంటే:
"ఎవరికీ కష్టం కలగచెయ్యకుండా బతకాలి." అని
తాను యే కష్టమైనా పడతాట్ట ఇతరులకి తన నించి కలగగల బాధ నించి తప్పించడానికి.
"మీ మొహం చూస్తే నాకు చాలా బాధ అనుకోండి__ అప్పుడు__?"
అప్పణ్ణించి నాతో మాట్టాడ్డం మానేశాడు. వచ్చిన కర్మమేమిటంటే, నేను చేసిన పనులూ వదులుకున్న ఆచారాలూ, ఆయన మానాలని ప్రయత్నించి ధైర్యంలేక, మానినవి కనక వాటిని జయించినవాణ్ణి చూస్తే, inferior గా అనిపించింది ఆయనకి. అది భరించలేడు. 'తక్కువైనాము' అనే ఆలోచనని. గాంధీగారూ, చర్చిలూ, దేవుడూ, హిట్లరూ, తమకన్న అధికులంటే భరించగలరు గాని, బిచ్చగాడూ, పాపాత్ముడూ, గుమాస్తా, సోషలిస్టూ, స్త్రీ, కులభ్రష్టుడూ, తమకన్న అధికులినట్టు కనపడితే_ తమ superiorityని సమర్థించుకోడానికి కారణాలు వెతుకుతారు. సంసారం వదిలిన స్త్రీని శపించడానికి పతివ్రతలు కారణాలు వెతకడం సామాన్యమైనట్టు. కళ్లముందు తారలై ఆధిక్యతను పొందిన వేశ్యల్ని అనుకరిస్తోనే వాళ్ళమీద కులస్త్రీలు పలికే అసహ్యాలూ, వాళ్ల పటాల్ని దిళ్లకింద దాచుకుంటూనే, కాలేజి కుర్రాళ్లు వాళ్లని చేసే హేళనలూ వింటే చాలు.
అందుకని మా హెడ్మాష్టరు నా prinsiples లో ఇతరులకి కష్టం కలిగించాననే గొప్ప లోపాన్ని నాలుగు అర్ధరాత్రులు యోచించి పైకి తీశాడు. ఏమీ యోచన లేకుండా, తమ సంసారమూ, సంపాదన చూసుకుంటూ బతికేవాళ్ల కన్న, తమ స్థితినీ, అధైర్యాన్నీ, లోపాల్నీ, ఈర్ష్యనీ, సమర్ధించుకోడానికని, ఏవో principles నీ , system నీ కల్పించి, లోకం యీ ప్రకారం జరగాలని శాసించే యీ మేధావంతులు అపాయకరమైనవారు. సంస్కారం ఎంతవరకు జరగాలో, అదే సంఘానికి క్షేమం అని హద్దులు పెడతారు...అంటే తమకి అంతవరకే ధైర్యం వుందన్నమాట.
"ముందు యీ కులాలలో శాఖలు కలిసిపోతే......"
"బ్రాహ్మలూ, కోమట్లూ, కలవవచ్చును గాని......"
"ఎట్లా ఐనా పదిహేనేళ్ళ లోపలే పిల్లలకి పెళ్లి చేయాలి__ ఈ ఉష్ణ దేశంలో......"
"లోలకులూ, జాకెట్టూ, ఒప్పుకున్నాం, కాని మరీ..."
"ఏదో స్కూలు ఫైనలు దాకానే గాని...ఆడవాళ్లకి పై చదువులు నేను ఒప్పుకోను__"
"ఆడవాళ్లకి ప్రత్యేకం క్లబ్బులు ఒప్పుకున్నాంగా..... టెన్నీసు ఆడవద్దన్నామా? కాని మరీ మొగాళ్ళ క్లబ్బుల్లో......"
"నేను బాగా పరిశీలించానండీ.....యీ గర్భనిరోధం వుంటే.....ఏదో....."
"హరిజనుల్ని మన యింట్లో భోజనానికి కూచోనిచ్చినా, వాళ్ల యింట్లో మనం..... అది హైజినిక్ గా మంచిది కాదు"
"సంఘం ఎట్లా నడిస్తే దానితోబాటు మనం కూడా"
"కాలక్రమేపీ కలియుగం ఎట్లా మారుతూ వుంటుందో మనము..."
ఇప్పుడు వీరు ఒప్పుకునే సంస్కారాలన్నీ ఎదిరించి ఆ సంస్కారము జరిగితే లోకం మునిగిపోతుందని విలవిలలాడిన తాతల, తండ్రుల తాతల, అమ్మమ్మల, ఆత్మలన్నీ పకపక నవ్వుతాయి.
"అవునులెండి. ఏదో బీదసాదల్ని పోషించడం మన కర్తవ్యమేననుకోండి. ధర్మశాస్త్రాలు కూడా ఒప్పుకుంటున్నాయిగా! కాని ఆస్తీ డబ్బూ, భూములు, సమానంగా పంచడమంటే..."