"ఇప్పటి రోజుల్లో జీవితమంటేనే భరించటం"
"అవుననుకో. ఈ భరించటంలో మనల్ని మనం పోగొట్టుకుంటున్నాంగా."
"తప్పదు...ఈ రోజుల్లో...ప్రస్తుతం సొసైటీ లక్షణం అంతే"
"కాని నా సమస్య నీకర్థం కావటంలేదు. బ్యాంక్ లో బ్యాలెన్స్ నిల్. ఈ రామేశం మావయ్య వచ్చి నెల దాటింది. ఇక్కడ్నుంచి కదిలే ప్రయత్నం చెయ్యకపోగా సమస్తం మనతో ఖర్చు పెట్టించేస్తున్నాడు. పథ్యం పథ్యం అంటూనే ఆయన కిష్టమైనవన్నీ చేయించుకుని తిని పారేస్తున్నాడు. ఆయన తింటూంటే ఆ దృశ్యమెంత భయంకరంగా వుంటుందో తెలుసా? ఎప్పటికప్పుడు వారం రోజుల్నుంచీ తిండి తినని వాడిలా. పైగా నోటితో చప్పుడు చేస్తూ తినటం, ఆ అన్నం ఉడకటం, పెరుగయితే జుర్రటం, మజ్జిగయితే కంచమెత్తుకొని తాగటం...తిండి అనేది క్యాజువల్ గా వుండాలిగాని. ఇంత ఆబగానా?"
సుజాత నవ్వాపుకోలేకపోతోంది.
"మిమ్మల్ని చూస్తే..."
"ఊఁ"
"జాలేస్తోంది"
"దేనికి?"
"నాతో సహా అనుక్షణం అందరూ నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని హింసిస్తోంటే_అద్భుతమైన ఓర్పు ప్రదర్శిస్తున్నందుకు."
"మరేం చెయ్యమంటావు?" అంటూ మౌనంగా వుండిపోయాడు.
సుజాత అతని ముఖంలోకి ఆసక్తిగా చూస్తోంది.
కొంచెం ఆగి అతను మళ్ళీ అన్నాడు. "కాని సుజా. ఇప్పుడు నేను నిజంగా ఓర్పు కోల్పోతున్నాను. మామయ్య ఏదో పని కల్పించుకుని, బయటకు తీసుకెళ్ళి, అర్థంలేనివన్నీ కొనేసి నాతో బిల్లు పే చేయించేస్తున్నాడు. ఎంతసేపటికీ యిస్తా యిస్తా అని జేబులో చెయ్యి పెడతాడుగాని బయటకు తియ్యడు. ఒంట్లో బాగా లేదని డాక్టర్లు దగ్గరకు తీసుకెళ్ళటం, ఆ ఫీజులు నాతో కట్టించటం సందు చివరున్న ఆ కిళ్ళీ కొట్లోంచి రోజుకి నాలుగయిదు సిగరెట్ ప్యాకెట్ నా పేరుమీద పద్దు రాయించి తీసుకుని జల్సాగా వూది పారేస్తున్నాడు."
"ఇక్కడ్నుంచి వెళ్ళిపొమ్మని చెప్పండి"
"చెప్పలేకుండా వున్నాను."
"ఎందుకని?"
"చేతకావటం లేదు."
"ఎందుకని? ఎందుకని ఈ లౌకిక ప్రపంచంలో మీరు కఠినంగా ఉండలేకపోతున్నారు? మీరు... ఎవరి దగ్గరా పైసా కూడా అప్పు చెయ్యరు. కాని ఎవరన్నా అడిగితే మీ దగ్గర లేకపోయినా... బాధపడయినా ఇస్తారు. ప్రక్క పోర్షన్ సుబ్బారావు, ఆఫీసులో అప్పారావు ఏవేవో సాకులతో అయినవాళ్ళమని చెప్పుకుంటూ పీల్చి పిప్పిచేసే యీ చుట్టాలు...వీళ్ళలో ఒక్కళ్ళయినా తిరిగొచ్చాలా? పోనీ ఏ విధంగానైనా ఉపయోగపడ్డారా? వద్దనుకుంటూనే ఉంటారు. సహాయమొచ్చేసరికి మెత్తపడిపోతారు. పైగా చందాలకనీ, ఏవేవో సహాయ కార్యక్రమాలకనీ ఎవరయినా వస్తే...ఆరోజు వెచ్చాలు కొంటానికి యింట్లో డబ్బు లేకపోయినా, ప్యాంటులూ, షర్టులూ చిరిగిపోయి కొత్తవి కొనుక్కోలేక అవస్థ పడుతున్నా, కాదని చెప్పలేక దేనికోసమో ఎంతో జాగ్రత్తగా దాచుకున్న డబ్బును క్షణంలో వాళ్ళకిచ్చేస్తారు. తర్వాత ఆ బాధ తట్టుకోలేక విలవిల్లాడిపోతారు. ఎందుకండి మీ సొంతానికి ఉపయోగపడని ఈ మంచితనం, మిమ్మల్ని దారుణంగా తినేస్తోన్న ఈ మెతకదనం?"
ఆమె ముఖంలో ఆవేశం, ఆవేదన, దుఃఖం...అతను నిస్సహాయంగా చూశాడు.
"సుజా! నువ్వు కూడా నన్ను దెప్పిపొడుస్తున్నావా?"
"లేదండీ. జీవితంలో పొరపాటున కూడా అలాంటి పని చెయ్యను. మీ మంచితనానికి గర్విస్తానండీ. మీ అమాయకత్వానికి జాలిపడతానండి. మీలో ఉన్న బేలతనానికి నేను కూడా కరిగిపోయి, మనస్ఫూర్తిగా...మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నానండి...కాని మీ మంచితనం, ఈ దుష్ట సమాజంలో బలహీనతగా మారి బలైపోవటం నేను తల్చుకోలేకపోతున్నానండి."
"సుజా! అలాంటి పెద్ద మాటలు మాట్లాడకు...ఏదో...ఎలాగో...వుంటుంది?"
"శృతిమించి మాట్లాడటం నాకూ యిష్టంలేదు. కాని...ఒక్కోసారి పవిత్రత వెనక వున్న ఈ వేదనను దాచుకోలేకపోతున్నానండి."
"సుజా! నీకు చాలా అన్యాయం చేస్తున్నాను."
"అదేమిటండి అలా అంటారు?"
"తోటివాళ్ళంతా భార్యలను సుఖపెడుతూ, కావాల్సినవి అమరుస్తూ, అందల మెక్కిస్తోంటే నిన్నేవిధంగానూ సుఖపెట్టలేకపోతున్నాను. నీ వొంటిమీద కాసు బంగారం కూడా లేకుండా..."
"బంగారం..." అంటూ నవ్వింది సుజాత. ఈ బంగారం మీద మమకారం స్టేటస్ సింబల్ గా సొసైటీని ఎలా ఏలుతూందో, ఎన్ని కుటుంబాలను పీల్చి పిప్పి చేస్తోందో, ఎంతమంది భర్తలను భార్యల చేత కాల్చుకు తినేటట్లు చేస్తోందో. ఇదో వికృతమైన నాగరికత. మెళ్ళో గొలుసు లేకపోతే పెళ్ళిళ్ళకీ పేరంటాలకూ వెళ్ళటం నామోషి. కొంతమంది ఇదంతా పెట్టుబడి క్రిందకే వస్తుంది. రేపు అత్యవసరమైనప్పుడు ఆమ్మేసుకుంటే బోలెడు డబ్బు, అని ప్రగల్బాలు పలుకుతారు. తీరా అలాంటి అవసరమొచ్చినప్పుడు అమ్మటానికి జీవితమంతా నాశనమైపోయినట్లు విలవిల లాడిపోతారు. మనుషుల్ని పీల్చి పిప్పిచేసే ఈ బంగారం మీద నాకు మమకారం లేదండి."
"సుజా! ఐ లవ్ యూ"
"ఇప్పుడు కొత్తగానా?" అంటూ కిలకిల నవ్వేసింది.
"ఎంత అందంగా వున్నావు? ఒక్కసారి నన్ను కౌగలించుకో"
"అమ్మా ఆశ"
"ఏం ఆశపడకూడదా?"
"పడవచ్చు. కాని కొంచెం సమయం, సందర్భం వేళాపాళా చూసుకోవాలి కదా"
"అవన్నీ కుదిరేసరికి మూడ్ సస్టెయినవ్వాలి కదా"
"మూడ్స్ సినిమాల్లోగాని, నిజజీవితాల్లో వుండవని మీరేగా అన్నారు."
"అన్నాననుకో. ఆ అభిప్రాయం కొంతవరకూ తప్పని ఇప్పుడే తెలుసుకున్నాను."