Previous Page Next Page 
అయినవాళ్ళు_పక్కవాళ్ళు పేజి 15


    కొంతసేపయ్యాక వినోద్ "అలా తోటంతా కాసేపు తిరిగొద్దాం రావే" అన్నాడు మాధురితో.
    ఇద్దరూ లేచారు.
    వాళ్ళు కొంచెం దూరం పోయేసరికి వినోద్ కి తెలిసినవాళ్ళెవరో కనిపించారు. ప్రక్కన చెల్లెలుందన్న సంగతి కూడా విస్మరించి అతను వాళ్ళతో బాతాఖానీ మొదలుపెట్టాడు.
    ఆమె కొద్దినిమిషాలు వెయిట్ చేసింది. అతని సుత్తి ఎంతకూ పూర్తి అవటం లేదు. విసుగుపుట్టి ఒంటరిగా ముందుకు కదిలింది.
    తోట విరబూసినట్లు రంగురంగుల దుస్తుల్లో, వేషాల్లో జనం.
    ఆ రంగుల ప్రపంచం ఆమెకిష్టం. కాని ఆమెది పగటి కలలు కనే స్వభావం కాదు. విశృంఖల మనస్తత్వం కాదు. తమ అంతస్థేమిటో, బాధ్యతేమిటో, పరిస్థితులేమిటో బాగా తెలుసు. మాటల్లో దుడుకుతనం వేగమున్నా జీవితం గురించి సంస్కారంతో ఆలోచించగలదు. ఆ తల్లిదండ్రులంటే ప్రేమానురాగాలు, అన్నయ్యంటే ఎనలేని గౌరవం వదినంటే విపరీతమైన అభిమానం ఉన్నాయి.
    మధ్యలో ఆమెకు తెలిసిన అమ్మాయిలూ ఇద్దరు ముగ్గురు కనిపించారు. వాళ్ళతో కొన్ని నిమిషాలు మాట్లాడి మళ్ళీ ముందుకు కదిలింది.
    ఒకచోట...కొంచెం ఏకాంతం. అక్కడ విస్తీర్ణం మొక్కలు లేకపోవటంచేత జనం చేరలేదు. చుట్టూ విశాలంగా, ఎత్తుగా పరుచుకున్న వృక్షాలు, ఆకాశంలో అక్కడక్కడా తెల్లగా కదిలిపోతోన్న మేఘాలు, దూరంగా కనిపించే ఆకుపచ్చని కొండలు. ఇక్కడ్నుంచి చూస్తోంటే వెల్వెట్ పరచినట్లుగా అనిపిస్తోంది.
    అలా చూస్తూ...నిలబడిపోయింది.
    కొంతసేపటికి తెలిసింది_ప్రక్కనుంచి తననెవరో గమనిస్తున్నారని.
    తల ప్రక్కకి త్రిప్పి చూసింది.
    ఎవరో యువకుడు, బహుశా కాలేజి స్టూడెంటయి వుండవచ్చు. తనకు చాలా సమీపంలో నిలబడి రెప్పార్పకుండా గమనిస్తున్నాడు.
    ఆమెకు విసుగనిపించింది. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు...అక్కడ్నుంచి వచ్చేద్దామనుకుంది. కాని...వెనక్కి రావాలంటే అతనిమీదనుంచే దాటిపోవాలి. అటూ ఇటూ పొదలున్నాయి.
    తన మూమెంట్సు గ్రహించి ప్రక్కకి తొలగుతాడేమోనని ముందుకు కదిలింది. కాని అతను దారివ్వకుండా అలాగే నిల్చున్నాడు.
    కోపంగా అతని ముఖంలోకి చూసింది. జులాయి కోరుగా గాని, వెకిలిగా గాని లేడు. కళ్ళలో కొంత చిలిపితనం కనబడుతోంది.
    "అడ్డు లేవండి" అంది.
    "వన్ మినిట్"
    "అంటే..."
    "ఇంకా మిమ్మల్ని కొంచెంసేపు తనివితీరా చూడాలనివుంది కాబట్టి."
    "ఎంత ధైర్యం మీకు? బహుశా ఒంటరిగా వచ్చాననుకుంటున్నారేమో, అక్కడ మా వాళ్ళంతా ఉన్నారు. ఒక్క కేక వేశానంటే...మా చిన్నన్నయ్య... బహుశా వాడి గురించి తెలీదేమో."
    "రౌడీయా?"
    "మీలాంటి రౌడీలకు బుద్ధిచెప్పే సిసింద్రీ"
    "అలాంటి వాళ్ళంటే నాకూ ఇష్టమేనండోయ్. కాని వచ్చిన చిక్కల్లా ఏమిటంటే నేను రౌడీని కాను."
    "మరి...ఆడపిల్లకు దారివ్వకుండా అడ్డు నిలబడటమేమిటి?"
    "ఒక్కోసారి పరిస్థితులలా వస్తాయండి"
    "పరిస్థితులా? ఏమిటది?"
    "నేనూ అక్కడ ఫ్రెండ్స్ కంపెనీలో బోరు కొట్టి వెరైటీ కోసం ఇలా వచ్చాను. అద్భుతమైన మీ చిత్తరువు కనిపించగానే చిత్తం చిత్తయిపోయి కదల్లేకపోయాను. మనలో మనమాట, అందంగా వున్న బొమ్మని చూడటం తప్పుకాదు కదండి ఊరికినే చూడటం."
    "కాని నేను బొమ్మను కాను"
    "అందాల బొమ్మ"
    "ఏమాత్రం పరిచయంకాని ఓ అమ్మాయితో ఇలా మాట్లాడటం మీకు సిగ్గనిపించటం లేదూ?"
    "ఇంత మంచిపని చేస్తున్నప్పుడు సిగ్గెందుకండీ! అయినా ఇప్పుడు పరిచయమయింది కదండి."
    "మీలాంటి తుంటరివాళ్ళతో మాట్లాడటం నాకసహ్యం."
    "ఈ మాదిరి పరిచయాల్లో ఆడపిల్లల మొదటి డైలాగులు ఇలాగే ఉంటాయిలెండి."
    "ఈ చిన్న సంఘటన ముందు ముందు ఏవేవో రూపులు దిద్దుకుంటుందని పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు"
    "పిచ్చి పిచ్చి ఆశలంటే నాకు నమ్మకం లేదండి. అసలు సిసలు ఆశలు మీదే నాకు నమ్మకం."
    "అలాగా?"
    "అవునండీ"
    ఆమె అతన్ని ప్రక్కకి తోసేస్తున్నంత విసురుగా అతన్ని తోసుకుంటూ వెళ్ళిపోయింది.
    అతను పులకితుడయ్యాడు. "మీరే ఉద్దేశంతో తోసుకుంటూ వెళ్ళినా ఈ స్పర్శ నాకు చాలా ఆనందం కలిగించిందిసుమండీ" అనుకున్నాడు.


                                     6


    విజయ్ కుమార్ కళ్ళు మూసుకుని ఆలోచిస్తోన్న భంగిమలోవుండి, సుజాత అతన్ని మూడుసార్లు పిలిచింది, వినిపించుకోలేదు. కొంచెం కోపమొచ్చి, అలిగి, నాలుగోసారి మరికొంత గట్టిగా పిలిచింది."
    కళ్ళు తెరిచి ఊ, అన్నాడు.
    "ఎందుకలా వున్నారు?"
    మళ్ళీ 'ఊ?' అన్నాడు ఈసారి కొంచెం ప్రశ్నార్థకంగా.
    "ఏమిటి? ఏమన్నా మూడ్ లో వున్నారా?"
    "మూడ్స్ సినిమాల్లోనో లేకపోతే నవల్లోనో వుంటాయి. నిజజీవితాల్లో వుండవు. ఎందుకంటే వుండి ప్రయోజనం లేదు. మూడ్ వున్నా లేకపోయినా భార్యలతో నవ్వుతూ మాట్లాడాలి. మిగతా మనుషుల్ని భరిస్తూ వుండాలి. ఆఫీసుకెళ్ళి పనిచెయ్యాలి. అక్కడ రకరకాల మనస్తత్వాల్ని భరిస్తూ వుండాలి."

 Previous Page Next Page