చిన్నగా నవ్వింది ఐశ్వర్య.
'బ్లాక్ అండ్ వైట్ విస్కీలాగా, 'రోసీ అండ్ మార్జినీ'లాగా మా 'శ్రీ అండ్ లక్కీ' ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ పోర్టు ఓరియెంటెడ్. ఒకవేళ ఇక్కడ ఎవరన్నా తాగదలచుకున్నా ఏ సింగపూర్ నుంచో తెచ్చుకు తాగవలసిందే. మరి ఇండియన్స్ కేం కష్టం! పైగా, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టడం వల్ల ఎంతమందికి ఉద్యోగావకాశాలు! ఒక పాలసీ మేటర్ పెట్టుకున్నాం. మా ఫ్యాక్టరీలో ఉద్యోగాలు నూటికి నూరు శాతం స్త్రీలకే!" అంది ఐశ్వర్య.
అలా ఆమె అనగానే, అక్కడున్న జనంలో కలకలం మొదలయింది. ఉద్యోగాలు! నూటికి నూరు శాతం స్త్రీలకే!
లక్కీ రియాక్షన్ ఎట్లా ఉందో అని ఓరకంటితో చూసింది ఐశ్వర్య. కొద్ది దూరంలో లక్కీ తన ప్రయత్నంలో తను ఉంది. కాస్ట్యూమ్ మార్చింది. పట్టుచీరెలోకి మారింది తను ఇప్పుడు. మెళ్ళో నాలుగు గొలుసులు, నెక్లెస్ లు, ముత్యాల దండలు, పాపటి బొట్టు, నడుముకి వడ్డాణం. ఐశ్వర్యతో చూపులు కలవగానే బొటనవేలు ఎత్తి, థమ్సప్ సైన్ చూపించింది.
అది చూసి, ఉత్సాహం పుంజుకుని అంది ఐశ్వర్య.
"సారా తాగడం, అమ్మడం, తయారు చెయ్యడం తప్పని మీ సిద్ధాంతం. ఇండియాని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్ళాలనీ పేదరికాన్ని పారదోలాలనీ నా ఆశయం! ఇక్కడ కట్టుకుపోయినంత మంది జనం ఉన్నారు. కానీ పొట్టకు తిండి లేదు. తిండి సంపాదించే ఉద్యోగాలు లేవు. చూడండి! మీరు మాకు వ్యతిరేకంగా ఉద్యమం చెయ్యవచ్చు. ఉద్యమం ఓ బస్సు లాంటిది. బస్సులో పీక్ అవర్స్ లో జనం ఎక్కుతుంటారు. కొందరు సగం దారిలో దిగిపోతూ ఉంటారు. స్టార్టింగ్ పాయింట్ లో ఎక్కి టెర్మినల్ దాకా ఉండేవాళ్ళు తక్కువ. పీక్ అవర్ దాటితే సీట్లన్నీ ఖాళీ! డ్రైవరూ, కండక్టరూ మాత్రమే మిగుల్తారు. బస్సు మాత్రం ముందుకీ వెనక్కీ పోతూనే ఉంటుంది. కొన్నాళ్ళకి బస్సు పాతబడి పోతుంది. సిద్ధాంతాలు పాతబడిపోతాయి. తాగడం ఇవాళ తప్పు కావచ్చు. రేపు ఒప్పు కావచ్చు. ఎల్లుండి తప్పు కావచ్చు. ఎన్టీఆర్ పోలీసు స్టేషన్ లో సారా అమ్మించాడు. రేపు ఇంకొకడు డాక్టర్లని పెట్టి హాస్పిటళ్ళలో సారా బలవంతంగా మనుషులకి ఇంజెక్టు చెయ్యవచ్చు. కానీ, పైకి అందరూ చెప్పే గోల్ ఒక్కటే - అందరూ బాగుండాలి అని. ఆ గోల్ చేరుకోవడానికి మేం మీ బస్సే ఎక్కక్కర్లేదు. మా కార్లో మేం వెళ్ళొచ్చు. మీ రూటులోనే వెళ్ళక్కర్లేదు. మా రూట్ లో మేం వెళ్ళొచ్చు. ఒకే టెర్మినస్ చేరడానిక్కూడా అన్ని బస్సులూ ఒకే రూట్ లో వెళ్ళవు. వేరే వేరే రూట్లు ఉంటాయి. అలాంటప్పుడు మీరు..." అని ఓరకంటితో చూసింది ఐశ్వర్య. ఆమె పెదిమల మీద సన్నటి చిరునవ్వు మెరిసింది.
తను చెప్పిందాంట్లో పాయింట్ ఉందో లేదో తనకే తెలీదు. కాస్త టైమ్ గెయిన్ చెయ్యాలని ఏదేదో మాట్లాడేసింది తను.
బ్లా...బ్లా...బ్లా... ఈలోగా...
ఆమె ఊహించినట్లే జనంలో కలకలం మొదలయింది. "పాలపొంగు" టైపు జనం కకావికలై చెదిరిపోవడం మొదలెట్టారు.
"ఎక్కడ...ఎక్కడ...?" అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి.
"ఏమిటి? ఏమిటి?" అని ఇంకెవరో.
"చీరెలు పంచుతున్నారట. పట్టుచీరెలు!" అన్నారెవరో!
"పట్టుచీరెలే... ఎక్కడ?"
"అదిగో! ఆమె... లక్ష్మీదేవిలా ఉంది... అమ్మో... ఎన్ని చీరెలో..."
చాలామంది ఆడవాళ్ళు అటువైపు పరిగెత్తిపోయారు. ఆడవాళ్లు అనడం కంటే ఆడవాళ్లలో అవగాహన లేనివాళ్ళు అనడం బావుంటుందేమో!
అక్కడ నిజాయితీగా నిలబడిపోయిన వాళ్ళు తక్కువ. వాళ్ళు నిస్సహాయంగా తమ కళ్ళముందే జరిగిపోతున్న డ్రామాని చూస్తూ నిలబడిపోయారు.
అక్కడికి కొద్ది దూరంలోనే -
లక్కీ అపర లక్ష్మీదేవిలా నిలబడి ఉంది. ఆమె చేతిలో ఒక బంగారు పళ్ళెం. దాన్లో చీరెలు. ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క చీరె ఇస్తోంది. నాలుగు చీరెలు ఇవ్వగానే ఇంకో నాలుగు చీరెలు పళ్ళెంలోకి వస్తున్నాయి. ఐశ్వర్య తాలూకు సెక్యూరిటీ మెన్ అక్కడ తుపాకులు పట్టుకుని నిలబడడం వల్ల గొడవ జరగట్లేదు. అందరూ గప్ చుప్ గా చీరె తీసుకుని, నమస్కరించి వెళ్లిపోతున్నారు. మూఢజనం కొందరు కాళ్ళకి దణ్ణాలు పెడుతున్నారు కూడా.
ఇక్కడ -
ఐశ్వర్యని ఎవరో ఆశగా అడుగుతున్నారు.
"అయితే మాకు ఉద్యోగాలు ఖాయమేనా అమ్మా! ఫ్యాక్టరీ ఎప్పుడు మొదలవుతుంది?"
విజయగర్వంతో ఆ ప్రదర్శనకారుల లీడర్ లవైపు చూసింది ఐశ్వర్య. ప్రజల అజ్ఞానాన్ని దూరం చెయ్యాలనే తపనతో వాళ్ళు. ప్రజల అజ్ఞానంతో వ్యాపారం చెయ్యాలని తపిస్తూ తను...!
విజయం ఎప్పుడూ ఐశ్వర్యాన్నే వరిస్తుంది.
కనీసం, చాలాసార్లు!
* * * *
అక్కడికి అతికొద్ది దూరంలో చెట్టు కిందపడి ఉన్న కాశీకి తను ఆకాశంలో అంత ఎత్తున ఎగురుతూ చూస్తున్న భ్రమ కలుగుతూనే ఉంది. కిందికి చూస్తున్నాడు తను.
కిందంతా సందడి. వనభోజనం ఏర్పాట్లు, పెద్దగా మాటలు, నవ్వులు.