Previous Page Next Page 
పడుచుదనం రైలుబండి పేజి 16


    ఒక్కొక్క హోటలే బయటనుంచే చూస్తూ చిన్న సెంటర్ లో అడుగుపెట్టారు. సెంటర్ చిన్నదయినా దగ్గరదగ్గర అయిదారు హోటళ్ళు ఉన్నాయి.


    "శ్రీ వేంకటేశ్వర నిలయం" ఆ పేరు చదువుతూనే "ఈ హోటల్ పేరు బాగుందేవ్! ఈ హోటల్లో కాలుపెడితే గుడిలో కాలుపెట్టినట్టే ఉంటుందేమో! చూడటానికి పైకి బాగుంది. వెళ్ళి వెంకటేశ్వరస్వామి ఓనర్ ని రూమ్ అడుగుదాం" అంటూ ముందుకు దారితీసింది వందనాదేవి.


    ముగ్గురు వందనాదేవి వెనకనే ఫాలో అయ్యారు.


    కౌంటర్ లో కూర్చున్న ఆయనే ఆ హోటల్ ఓనర్... ప్రొప్రయిటర్...వగైరా అన్నీ తెలుసుకున్నారు. సరాసరి కౌంటర్ దగ్గరకెళ్ళి నుంచున్నారు.


    "లోపలికెళ్ళండమ్మా! లేడీస్ కూర్చుని ఫలహారం చేయడానికి స్పెషల్ గా రూమ్ లున్నాయ్. వేడివేడిగా అన్నిరకాల టిఫెన్ లు దొరుకుతాయ్" వినయంగా చెప్పాడు హోటల్ ఓనర్.


    "చూడండి హోటల్ ఓనరుగారు! మీ పేరేమిటో నాకు తెలీదు. మీ హోటల్ రూమ్స్ అద్దెకి ఇస్తారని...బయట బోర్డుచూసి ఇక్కడికి వచ్చాం" వందనాదేవి చెప్పింది.


    "మా హోటల్ లో రెండు రూమ్స్ ఖాళీగానే వున్నాయ్. అద్దెకు కూడా ఇస్తాం కాని మీ నలుగురు ఆడపిల్లలైపోయారే! మీతో ఒక్క మగవాడు లేడా?" హోటల్ యజమాని అడిగాడు.


    "మేం తప్ప మాతో ఎవరూ లేరు. మేం నలుగురం ఒకే రూమ్ లో వుంటాం. ఖాళీ రూము చూపిస్తే...రూం చూసి దిగుతాం" అని చెప్పింది వందన.


    "రూమా...! అయ్యబాబోయ్...మీకా! ఇవ్వను...ఇవ్వను...ఇవ్వను"


    "ఎందుకివ్వరండి? మేం ఉత్త ఆడపిల్లలమేకదా!" ఈతఫా సుందర సుకుమారి సుకుమారంగా అడిగింది.


    "సుందరి! కాస్సేపు నువ్వు మాట్లాడొద్దు" అని చెప్పి హోటల్ ఓనరువైపు తిరిగి గట్టిగా అంది వందన. "మీ హోటల్లో రూమ్స్ అద్దెకు ఇస్తున్నప్పుడు మాకు మాత్రం ఎందుకివ్వరు?"


    "ఇవ్వను...ఇవ్వను...ఇవ్వను"


    "అయ్యా! మా నలుగురిలో ఎవరికి చెముడులేదు. మీరలా బల్లగుద్ది మూడుసార్లు చెప్పక్కరలేదు. ఒక్కసారి చెపితే చాలు" అంది ప్రమద.


    "అవును మీ హోటల్లో ఆడపిల్లలకి ఎందుకు అద్దెకివ్వరు?" రాణి అడిగింది.


    "రూమ్స్...రూమ్స్" అంటూ గుర్తుచేసింది ప్రమద.


    "ఓ...రూమ్స్ ఆడపిల్లలకి అద్దెకివ్వరాండి! అలా అయినప్పుడు "మా హోటల్లో రూములు మగవారికి మాత్రమే అద్దెకిస్తాం" అని బోర్డు రాసి బయట పెట్టకపోయారా!" అంది రాణి.


    "మగాళ్ళు మాత్రమే అద్దె కడతారా! ఆడవాళ్ళయితే అద్దె ఇవ్వరా! కష్టమేమి?" అంది సుందర సుకుమారి.


    "మీరంతా కాసేపు నోరుమూసుకోండే" ముగ్గుర్ని గదమాయించి మళ్ళీ ఓనర్ తో మాట్లాడింది వందన.


    "ఊ...ఇప్పుడు చెప్పండి. రూమ్సు ఖాళీగా వుండి కూడా అద్దెకి ఎందుకివ్వరు?"


    "అమ్మో! అదో పెద్ద కథ" అన్నాడు హోటల్ ఓనరు దీర్ఘంగా ఓ నిట్టూర్పు విడుస్తూ.


    "కథా!" తెల్లబోయింది వందన.


    "కథ అంటే ఉత్త కథ కాదు. ఓ యదార్థ దారుణ గాధ" మహా బాధగా చెప్పాడు హోటల్ ఓనరు.

    
    "రూము ఇవ్వటం మాట తరువాత. కనీసం ఆ గాధ అయినా చెప్పండి" తనూ బాధగా మొహంపెట్టి అడిగింది వందన.


    "ఆర్నెల్లక్రితం ఓ యువతి ఒంటరిగా వచ్చి మా హోటల్ రూములో దిగింది. మా రూమ్ సర్వీస్ బోయ్ కి ఆ యువతిని చూడంగానే ఏం పుట్టిందోగాని...ఓ అర్ధరాత్రివేళ తలుపుతట్టి రూములో జొరబడి ఆ యువతిని రేప్ చేశాడు. దాంతో...


    "అప్పుడు మీరేం చేస్తున్నారు?..." సుందర సుకుమారి అడిగింది.


    "నిద్రపోతున్నాను. ఆ సమయంలో అందరూ అదే పని చేస్తున్నారు."


    "బాప్ రే! అందరూ రేప్ లు చేస్తున్నారా?"


    "ఆ సమయంలో అందరూ చేస్తున్నది రేప్ లు కాదమ్మా! నాలాగ నిద్రపోతున్నారు. ఆ తర్వాత ఆ యువతి నానా గోల చేసింది. అందరం లేచాం. పోలీసులు రంగప్రవేశం చేశారు. ఏదో నా తిప్పలు నేను పడి హోటల్ మూతపడకుండా...కేసు దోవన కేసు నడుస్తున్నా ఏదో యిలా వున్నాను. ఇదీ విషయం" అంటూ చెప్పాడు హోటల్ ఓనరు.


    "కేసు అర్థమైంది. ఆ కేసుకు...మాకు రూమ్ అద్దెకి ఇవ్వకపోవటానికి సంబంధం ఏమిటండి?" వందన అడిగింది.


    "ఆరోజు మొదలు ఒంటరి ఆడవాళ్ళకి మా హోటల్లో రూము ఇవ్వరాదని శపథం చేసుకున్నాను."


    "మేం నలుగురం వున్నాం" గుర్తుచేసింది వందన.


    "అయినా సరే...మీకు తోడుగా ఒక్క మగపురుగు లేడు కనుక రూము ఇవ్వనూ... ఇవ్వను...ఇవ్వను"

 Previous Page Next Page