Previous Page Next Page 
అనితర సాధ్యుడు పేజి 16


    "అతను కారు ర్యాలీలో పాల్గొనాలని గతంలో తెగ ప్రయత్నించాడు. అయితే పరిస్థితులు కలిసిరాక పాల్గొనలేకపోయాడు. ఈలోపు వెహికల్ ఎనాటమీ అంతా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు. నేర్చుకున్న పనితనాన్ని అప్పుడప్పుడు చూపిస్తుంటాడు.

 

    కానీ మూడీ... ఇష్టమున్నప్పుడు హిబ్రూదాదా షెడ్ కొచ్చి కొద్దిసేపు పనిచేసి వెళ్ళిపోతాడు. నా ఉద్దేశం ప్రకారం ఇంట్లోవాళ్ళకి తన సంపాదన న్యాయమయిన సంపాదనని తెలియటానికే ఆ షెడ్ లో పనిచేస్తుంటాడు. ప్రధానంగా మాత్రం డబ్బున్నవాళ్ళ తప్పుల్ని నెత్తినేసుకోవటం"

 

    మెట్లు దిగి ఇద్దరూ గ్రౌండ్ ఫ్లోర్ లోకి వచ్చారు.

 

    "చిత్రమైన వృత్తినే ఎన్నుకున్నాడు"

 

    "అవును సార్"

 

    "మనిషిలో సీరియస్ నెస్ వుందా?"

 

    "ఎప్పుడూ సరదాగా, తమాషాగా వుంటుంటాడు. అవసరమయినప్పుడు అతనంత సీరియస్ గా ఎవరూ వుండరనిపిస్తుంది. ఒకటి అనుకున్నాడంటే సాధించేవరకు నిద్రపోడు"

 

    "అతన్నే ఎన్నుకోవడానికి ప్రధానకారణాలు?"

 

    అవుటర్ గేట్ లాంజ్ లోకి వచ్చారిద్దరూ.

 

    కస్టమ్స్ క్లియరెన్స్ అయి వచ్చేసరికి మరో అరగంట పట్టవచ్చనిపించింది.

 

    పీటర్ వెళ్ళి రెండు ఎక్స్ ప్రెస్ కాఫీ తెచ్చాడు. అర్జునరావుకి ఓ కప్పు అందించి తనొకటి తీసుకుని కొద్దికొద్దిగా చప్పరిస్తూ తిరిగి చెప్పటం ప్రారంభించాడు.

 

    "అతను ఏ డ్రస్ వేసుకున్నా కరెక్ట్ గా సూటవుతాడు. మొఖం కళగా వుంటుంది. కళ్ళు చిరుగ్గా వుంటాయి. కామన్ సెన్స్ వుంది. తెలివి తేటలున్నాయి. మంచి పర్సనాలిటీ వుంది. సీస్ కానరీ చిలిపితనం అతని కళ్ళ చివర్ల వుంటుంది. డస్టిన్ హాఫ్ మెన్ అమాయకత్వం వుంది. టాప్ సీడ్ బాక్సింగ్ ఛాంపియన్ మొరటుదనం, పుష్టి అతని కండరాల్లో దాగి వుంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంటే ఏమిటో తెలీకపోయినా ఏదడిగినా క్షణాల్లో చెప్పగల అనుభవపూర్వకమైన పరిజ్ఞానం వుంది. వీటన్నిటినీ మించి మంచి మాటకారి- చతురుడు. ఆపైన అతను డబ్బు అవసరంలో వున్నాడు. చెల్లెలి పెళ్ళి, తమ్ముడి చదువు, తల్లి బాధ్యతలు, తండ్రి అనారోగ్యం అతన్ని వెంటాడుతున్నాయి. నిజాయితీ వుంది. నిలకడా వుంది. నిగ్రహం వుంది" తాగిన కాఫీ కప్పును పక్కనే వున్న డస్ట్ బిన్ లోకి నలిపి విసిరేసి తిరిగి అన్నాడు.

 

    "మీరు కోరినవన్నీ అతనిలో వున్నాయి నాయకి చూడగానే ఇంప్రెస్ అయ్యే లక్షణాలున్నాయి. నాగమ్మగారు పట్టి పట్టి చూసినా అందని డెప్త్ వుంది. ఇవి చాలవంటారా?"

 

    "ఎన్నాళ్ళయింది ట్రైనింగ్ మొదలయి?"

 

    "మూడురోజులయింది. ఇంకా వారం వుంది"

 

    "పదిరోజులు చాలా?"

 

    "అతను సూక్ష్మగ్రాహి"

 

    "ప్రస్తుతం ఎక్కడున్నాడు?"

 

    "దర్గాలో వున్న మీ ఎస్టేట్ లో"

 

    "ఎవరు చూసుకుంటున్నారు?"

 

    "కత్తెర్ల కనకారావు. నోటోరియస్ క్రిమినల్. అతని లేత్ మిషన్ మీద తయారయిన కత్తెర్లు కనీసం రెండొందల మందినయినా చంపేసి వుంటాయి. మనకు నమ్మకస్తుడు. దొంగనీతి బాగా వుంది"

 

    కస్టమ్స్ క్లియరెన్స్ అయిన ప్యాసింజర్స్ ఒక్కొక్కరే బయటకు వస్తున్నారు.

 

    సంభాషణ కట్టేసి ఇద్దరూ ఆ వేపుకి నడిచి కస్టమ్స్ గేట్ దగ్గరగా వెళ్లారు.

 

    మొత్తానికి ఓ అరగంటకు నాయకి బయటకు వచ్చింది.

 

    వస్తూనే చుట్టూ పరికించి చూసింది తనకోసం ఎవరన్నా వచ్చారేమోనని.

 

    అప్పుడే చిన్నగా దగ్గుకుంటూ అర్జునరావు ఆమె దగ్గరకు వెళ్ళాడు.

 

    ఆమె వెంటనే అర్జునరావుని గుర్తుపట్టి చిన్నగా నవ్వింది.

 

    "ప్రయాణం బాగా జరిగిందామ్మా?"

 

    సొంతకూతుర్ని పరామర్శించినట్లే అడిగాడు.

 

    "బాగానే జరిగింది. నాయనమ్మ ఎలా వున్నారు?"


    
    "నీకోసమే ఎదురుచూస్తున్నారమ్మా! నువ్వేగా ఆమెకు పంచప్రాణాలు. 'ఈ టైమ్ లో చిన్నా ఏం చేస్తుంటుంది? ఇప్పుడు చిన్నా ఎక్కడికి వెళ్ళి వుంటుంది?' ఈ రెండు ప్రశ్నలు ఇప్పటికి కొన్నివేలసార్లు వేసుంటుందమ్మా" అంటూ చుట్టుపక్కలకు చూసాడు.

 

    పీటర్ దూరంగా నిలబడి తమకేసే చూడటం గమనించి వెంటనే చూపులు మరల్చుకొని "బ్యాగేజీ... అదీ?" అన్నాడు.

 

    "ఈ పక్కనే వుంది" అంటూ నాయకి వెనక్కి రెండడుగులు వెళ్ళి సూట్ కేసుల్ని వీల్ ట్రాలర్ మీదకు తనే ఎక్కించి తోసుకుంటూ వచ్చింది అర్జునరావు వున్న చోటుకి.

 

    మరో పదినిమిషాలకి ఇద్దరూ రోవర్ లో వున్నారు.

 

    అది రివ్వున సెంటౌర్ కేసి దూసుకుపోసాగింది.

 

    "ఈవెనింగ్ ఫ్లయిట్ కి టికెట్స్ దొరికాయమ్మా. నువ్వు సాయంత్రం వరకు హోటల్ లో విశ్రాంతి తీసుకుంటే నేనే వచ్చి పికప్ చేసుకు వెళతాను" అన్నాడు అర్జునరావు తన పథకాన్ని నెమరు వేసుకుంటూ.

 

    "అలాగే బాబాయ్" అంది నాయకి నాయనమ్మను తలుచుకుంటూ.

 

    సాయంత్రం వరకు ఆగడమంటే ఆమెకు దుర్భరంగా వుంది.

 

    కారు దూసుకుపోతూనే వుంది.

 

    నాయకి ఫ్లాస్ ని కొద్దిగా దింపింది. చల్లనిగాలి కారులోకి దూసుకు వచ్చింది. ఆ చలి ఆమెకంత ఇబ్బంది లేకపోయినా అర్జునరావు మాత్రం ఒకింత ఒణికాడు.

 

    'ప్రకృతిని అనుభవించాలంటే అభిరుచి వుండాలి. అనుభూతించగల సున్నితత్వం వుండాలి' అని మనసులోనే అనుకుంటూ గ్లాసెస్ ని తిరిగి పైకిలేపింది.  


                                 *    *    *    *


    సామంత్ నడవటం, స్టెప్స్ ఎక్కడం, తల ఎగరేయడం, రేబాన్ గ్లాసెస్ ని కళ్ళ నుంచి సుతారంగా తియ్యటం బాగా ప్రాక్టీస్ చేసాడు.

 

    నిత్యజీవితంలో వాడే కొన్ని ఇంగ్లీషు మాటల్ని బాగా గుర్తు పెట్టుకున్నాడు.

 

    పదిమంది విద్యాధికులు ఎదురయినా సిగ్గుపడకుండా, ఇన్ ఫీరియర్ గా ఫీలవ్వకుండా మసలటం ప్రాక్టికల్స్ గా నేర్చుకోలేకపోయినా ఆ విషయంలో మాత్రం మెంటల్ గా బాగా ప్రిపేర్ అయ్యాడు.

 

    పాలిష్ట్ కల్చర్, రిచ్ క్లాస్ సోఫిష్టికేషన్, రిఫైన్డ్ నెస్ ఇప్పుడతని ప్రతి కదలికలోను ప్రస్ఫుటమవుతోంది.

 

    "బయటకు వెళ్ళకుండా, రోజుల తరబడి ఇదేపనిగా నేర్చుకోవడం నాకు ఇబ్బందిగా వుంది. పోనీ ఓసారి బయటికి వెళ్ళిరానా?" సామంత్ కళ్ళనుంచి రేబాన్ గ్లాసెస్ ని తీసి పెట్టుకుంటూ అన్నాడు.

 

    "బాబ్బాబు... మధ్యలో ఇలా నన్ను వదిలేసి వెళ్ళవద్దు. ఇప్పటికే పీటర్ గారు నాకు నాలుగుసార్లు ఫోన్ చేసి 'ఎంతవరకు వచ్చాడు' అని అడిగారు ఆల్ రెడీ కథానాయకి దేశరాజధానిలో దిగిపోయిందట!"

 Previous Page Next Page