"రేపు సాయంత్రానికి ఆ పిల్లకి సంబధించిన కేసెట్ ఒకటి మన చేతికి రాబోతుంది. అమెరికాలో కొన్ని సుందర ప్రదేశాల్లో తిరిగిన దృశ్యాల్ని డినచర్యను, ముఖ్యమైన ఫ్రెండ్స్ ని, ఈవెంట్స్ ని తెలుపుతూ ఒక వీడియో కేసెట్ తయారుచేసుకు రమ్మని ఈ ముసలావిడ చెప్పిందట. ఇప్పుడా కేసెట్ నాయకి దగ్గర వుంది. ముందుగా దాన్ని వాళ్ళ నాయనమ్మ చూస్తుంది. ఆ తరువాత దాని నుంచి మరో కేసెట్ తయారుచేసి మనకు పంపించే ప్రయత్నంలో అర్జునరావుగారున్నారట. దాన్ని బట్టి ఆమె మనస్తత్వం కొంతైనా నీకు తెలుస్తుందని వాళ్ళ ఊహ."
"ఈలోపు మా ఇంటిదగ్గర నేనేమయి పోయానో అని అనుమానం వస్తే...?" సామంత్ అలా ప్రశ్నించినా అతని ఆలోచనంతా అన్యాయంగా తనను కొట్టి తుప్పల్లో పారేయించిన నరరూప రాక్షసుడయిన నర్సింహం మీదే వుంది.
* * * *
నాయకి హోటల్ రూమ్ లోకి వెళుతూనే భుజానున్న బేగ్ ని బెడ్ మీదకు విసిరేసి, ఫోన్ దగ్గరకు లాక్కుని ఆపరేటర్ కి రింగ్ చేసి తన నాయనమ్మ పర్సనల్ నెంబర్, ఎస్.డి.ఎస్. చెప్పి ఎదురుచూడసాగింది.
అర నిమిషంలో లైన్ దొరికింది.
"హలో... నాయనమ్మా... నేను... నాయకిని మాట్లాడుతున్నాను. హౌ ఆర్యూ?" అంది.
నాయకి గొంతులోని ఆనందోద్వేగాన్ని గుర్తించగలిగింది నాగమ్మ.
"నేను ఫైన్ బేబీ... జర్నీ బాగా జరిగిందా?" ఆవేపు నుంచి నాగమ్మ ప్రశ్నించింది గంభీరంగా.
"ఆ...బాగానే జరిగింది. మార్నింగ్ మద్రాస్ ఫ్లయిట్ అందుకోలేక పోయాను. ఈరోజు ఈవినింగ్ ఫ్లయిట్ కి వస్తున్నాను... మీ ఆరోగ్యం ఎలా వుంది?" ఉద్వేగాన్ని అణచుకోలేకపోతోంది నాయకి.
"పిచ్చి తల్లీ... నువ్వు చేసిన మొదటి ప్రశ్న అదే గదమ్మా? ఫైన్ అని కూడా చెప్పాను" నవ్వుతూ అంది నాగమ్మ.
"మరి...మరి..." ఏం మాట్లాడాలో తెలీక, మాట్లాడాలనుకుంటున్న ఎన్నో విషయాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా ఏమీ మాట్లాడలేకపోయింది.
"నీ ఆరాటం, ఆత్రుత నాకు తెలుసు తల్లీ. రాత్రికి నన్ను కూర్చోబెట్టి ఎన్ని విషయాలు కావాలంటే అన్ని విషయాలు చెబుదూ గాని, ప్రస్తుతానికి ఫోన్ పెట్టేసి రెస్ట్ తీసుకో. అమెరికా టైమింగ్ ప్రకారం ఇప్పుడు రాత్రి కదా! స్నానం చేసి, టిఫెన్ చేసి, తలుపులు వేసుకుని హాయిగా నిద్రపో. ఫ్లయిట్ టైమ్ కి అర్జునరావే వచ్చి నిద్ర లేపుతాడు. సరేనా? నేనుండనా?"
"ఊ... సర్లే..." అలిగినట్లు అంటూ ఫోన్ క్రెడిల్ చేసింది నాయకి.
ఆనందాన్ని, దుఃఖాన్ని, లాభనష్టాల్ని క్లియర్ మైండ్ తో రిసీవ్ చేసుకోగలుగుతుంది నాగమ్మ. ఆనందానికి పొంగడం కాని, దుఃఖానికి కృంగిపోవడం కాని ఆమెలో ఎవరూ ఇంతవరకు చూడలేదు. ఏ విషయాన్నైనా ఒక మాదిరిగానే తీసుకుంటుంది. తన అంతర్గత భావాల్ని బయట పడనివ్వదు. ఆమెలో పాదుకున్న గంభీరత బహుశా చాలా తక్కువ మందిలో కనిపిస్తుందేమో?
నాయకి తండ్రి యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు ఆమె షాక్ అవుతుందని, ఫెయింటయి పడిపోతుందని ఆ వార్తను మోసుకొచ్చిన వ్యక్తి చాలా భయపడ్డాడు. కాని ఆమెలో అదేం కనిపించలేదు. ఘనీభవించిన మహాసముద్రంలా కొడుకు శవాన్ని చూసి నిర్వికారంగా నింగికేసి చూసింది.
శవాన్ని దహన సంస్కారాలకు తీసుకువెళ్ళే ముందు మాత్రం కళ్ళ చివర రెండు కన్నీటి బిందువులు నిలిచాయి ఆమె కడుపుకోతకు నిద్రర్శనంగా.
మరికొన్నాళ్ళకి కోడలు చనిపోయిందని తెలిసినప్పుడు కూడా అంతే! తల్లి శవాన్ని చూసి నాయకి ఏడుస్తుంటే "శవాన్ని తరలించండి... చిట్టితల్లి బాధ ఎక్కువవుతుంది" అని చెప్పి నాయకిని ఎత్తుకుని కన్నీళ్ళు తుడుస్తూ- "నేనున్నానుగా తల్లీ..." అంటూ ఒకేమాట అని నాయకిని గుండెల్లో పొదువుకుంది.
ఒక స్థితి దాటాక మనిషి సుఖదుఃఖాలకి అతీతమవుతాడనేది ఆమెను చూస్తే తెలుస్తుంది.
* * * *
నాయకి స్నానం చేసి వచ్చి కాఫీ తీసుకుని అలాగే బెడ్ మీద వాలిపోయింది.
"అమెరికా నుంచి రాగానే నీకు పెళ్ళి చేసెయ్యాలనుకుంటున్నాను" అని నాలుగు నెలల క్రితం తను నాయనమ్మ ఫోన్ చేసి చెప్పింది.
ఎప్పుడు... ఏది... ఎలా... ఎందుకు చెయ్యాలో నాయనమ్మకు బాగా తెలుసు. అందుకే తను మరో మాట లేకుండా "నీ ఇష్టం" అంది.
ఈ పాటికి అన్నివిధాలా అర్హుడైన వ్యక్తిని వెతికి పట్టుకుని వుంటుంది నాయనమ్మ. అతనెలా వుంటాడో? ఏం చదువుకున్నాడో? బిహేవియర్ ఎలా వుంటుందో? తనకు మాత్రం ఎంత కష్టమొచ్చి మీదపడినా తొణక్కుండా నిబ్బరంగా వుండగలగాలి. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి... ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది నాయకి.
* * * *
"ఏం పీటర్... ఏమిటి తాజా వార్తలు?" అర్జునరావు హోటల్ రూమ్ లో నెమ్మదిగా పచార్లు చేస్తూ అడిగాడు.
టిఫెన్ చేస్తున్న పీటర్ వెంటనే సమాధానం ఇవ్వలేదు. తినడం పూర్తిచేసి నేప్ కిన్ తో పెదాల్ని అద్దుకుంటూ "దర్గా ఎస్టేట్ నుంచి ఫోన్ వచ్చింది. అతను చాలా ఫాస్ట్ గా అన్నీ నేర్చుకుంటున్నాడట. మనల్నేం వర్రీ అవ్వొద్దని కనకారావు చెప్పాడు. అందుకే సుష్టుగా బ్రేక్ ఫాస్ట్ చేశాను" అన్నాడు టీ కలుపుతూ.
"హైదరాబాద్ వెళ్ళగానే నేనతన్ని చూడాలి. నేను సంతృప్తి పడాలి. లేదంటే మనిషిని మార్చవలసి వస్తుంది"
"క్యాసెట్ ప్రిపేర్ చెయ్యమని ఈరోజే కనకారావుకి చెబుతాను"
"నాయకి దగ్గరున్న కేసెట్ ని డూప్లికేట్ చేసి కనకారావుకి అందించే ఏర్పాట్లు..."
"తెలియజేశాను... మనదే ఆలస్యం" అన్నాడు పీటర్ కప్పు టీపాయ్ మీద పెడుతూ...
* * * *
నాలుగురోజుల్లో సామంత్ చాలా వరకు నేర్చుకున్నాడు. ఇరవై నాలుగ్గంటలూ అదే పనిలో వున్నా అతని ఆలోచనలు మాత్రం ఎస్.ఐ. నరసింహం మీదున్నాయి.
ఎలాగైనా ఆ ఎస్.ఐ.ని సస్పెండ్ చేయించాలి. అందుకు వాడిచేత ఓ పెద్ద తప్పు చేయించాలి. ఎలా...?
"కనక... ఓయ్ కనకం"
కనకారావు తనను కాదన్నట్టు మ్యాగజైన్ తిరగవేయసాగాడు.
"ఏయ్ కనకీ..." చిరాకు వ్యక్తం చేస్తూ పిలిచాడు సామంత్.
అప్పుడు చప్పున తలెత్తి "ఆ పేర్లేంటయ్యా బాబు... దిక్కుమాలిన పేర్లన్నీ పెట్టి పిలుస్తున్నావ్?" అన్నాడు ఇబ్బందిగా మొఖం పెట్టి.
"మరి ముందే పలికిచావొచ్చుగా?"
"బుద్ధి గడ్డి తిని పలకలేదయ్యా. ఇంతకీ విషయమేమిటి?"