"ఎలా కనిపిస్తున్నాను?"
"వరమిచ్చిన దే..."
"అదేం వరం?"
"అలా మాట్లాడాలంటే సిగ్గేస్తోంది...."
"మగవాళ్ళు సిగ్గుపడకూడదు."
"తర్వాత చెబుతాలే."
"తర్వాతంటే.....తర్వాతంటే....ఈ రాత్రికి..."
"పొండి" ఈసారి మాలతి సిగ్గుపడింది.
* * *
గోపయ్య తన తెలివితేటలన్ని ఉపయోగించి గదిని అందంగానే అలంకరించాడు. తినుబండారాలలాంటివి కూడా అమర్చాడు. ఈ ఏర్పాట్లన్నీ చూసి శేఖరం నిజంగానే లజ్జితుడైపోయాడు.
"నేను సినిమాచూసి చాలా రోజులయ్యిందమ్మగారూ! సెకండ్ షోకి వెడుతున్నాను. అర్ధరాత్రి వచ్చి తలుపుకొడితే ఈ ముసలాడ్ని విసుక్కోకండేం?" అంటూ ముసిముసి నవ్వులు నవ్వి వెళ్ళిపోయాడు.
"మాలతీ!"
"యస్ సర్!"
"అలాగే అట్లానే పిలవద్దన్నాను."
"మిమ్మల్ని "ఏమండీ" అని పిలవాలంటే ఎలాగోవుంది. పేరుతో పిలవాలంటే ఎలాగోవుంది. చేతకావటంలేదు."
"కానీ సార్ మాత్రం వద్దు."
"చెప్పండి?"
"ఏమిటి?"
"రాత్రికి చెబుతానన్నారు?"
"ఓహో!అదా?" అంటూ ఆమెను దగ్గరకు లాక్కొని గుండెలకు అదుముకున్నాడు.
"ఈ దేవతనుగురించి ఊహల్లో అనుభవించాలేగానీ మాటల్లో ఇమడ్చకూడదు"
అతని పెదవులు ఆమె పెదవుల్ని కలుసుకున్నాయి.
ఒకరి ముఖానికి మరొకరు అంత దగ్గరగా వుండి, గుసగుసలాడుకుంటున్నట్లు మాట్లాడుకుంటుంటే ఆ అనుభూతి ఇద్దరికీ హాయిగా వుంది.
"అయితే నేను ఊహల్లోనే పనికివస్తానా?"
"ఊహల్లో దేవతవి....నిజంలో స్వప్నానివి."
"మేనేజర్ సాబ్...."
"యస్ మేడమ్"
"మీకు కొద్దిగా భాషకూడా వచ్చునే!"
"ఆలస్యంగా అక్షరాభ్యాసమైనా త్వరత్వరగా నేర్చుకుంటున్నాను."
ఆమె చేతులు అతని వీపును నిమురుతున్నాయి.
అతని చేతులు ఆమె తల, జుట్టు, మెడ సవరిస్తున్నాయి.
వెలుతురుగా వున్న ఆ గదిలో ఇద్దరికీ కళ్ళు మసకలు క్రమ్ముతున్నాయి.
అప్రయత్నంగా కాళ్ళు మంచందగ్గరకు నడిచాయి. బయలు పడినా పడకపోయినా, బింకంగా వున్నా, నటించినా, బుకాయించినా ప్రపంచంలో రెండే రెండు బలమైనవి. ఒకటి ఆకలి, రెండోది ఈ ఆకర్షణ.
అతని చెయ్యి దీపం ఆర్పేసింది.
ఒకరి చేతుల్లో ఒకరు.....ఒకరి ఆవేశంలో మరొకరు.....ఒకరి గుండెలో మరొకరు....
ఆమెమీదకతను పూర్తిగా వాలిపోతున్నాడు.
ఏదో పెద్ద అంతరాయం వచ్చినట్లు మాలతికి అర్ధమైనట్లయింది. మరుక్షణంలో "అబ్బా!" అన్న అతని కంఠధ్వని. ఆమెచేతుల్లో అతను మెలిదిరిగిపోతున్నాడు.
త్రుళ్ళిపడింది. "ఏమిటండీ......ఏమిటండీ?..."
"గుండెదగ్గర నొప్పి......." చెప్పలేకపోతున్నాను.
అతన్నుంచి విడివడి, గిలగిలలాడుతున్న అతని శరీరాన్ని ప్రక్కకు వాల్చి లేచి వచ్చి లైటు వెయ్యటానికి ఓ నిముషం పట్టింది.
పెళ్ళయ్యి ఒకటి రెండు రోజులన్నా గడవకముందే అంత భయానకమైన దృశ్యం చూడవలసి వస్తుందని ఆమె అనుకోలేదు. గుండెదగ్గర చేతిలో నొక్కుకుని, ఒళ్ళంతా చెమటలు క్రమ్మేస్తుండగా, ముఖంలో జీవం ఉందా లేదా అన్నట్లు అతను మంచంమీద పడివున్నాడు.
తన గుండె ఆగిపోయినట్లయింది. తేరుకుని అతని ముఖంమీదకు ఒంగి
"ఏమండీ....ఏమండీ...."అని పిలిచింది.
కళ్ళు తెరచీ తెరవనట్లయింది. అతనిలో చలనం లేదు.
మాలతికి భయంవేసింది. ఏడుపొచ్చింది. కాళ్ళు గజగజమని వణికినాయి. ఏమిటిది?ఎందుకిలా జరిగింది? అతన్నద్దంలో చూస్తోంది. జీవం వున్నట్టు రేఖామాత్రంగా స్ఫురిస్తున్నదే తప్ప ఎక్కడా కదలిక లేదు. ఇల్లంతా నిశ్శబ్దం, సమయానికి గోపయ్యకూడా అందుబాటులో లేడు.
కాసేపటికిగానీ ఆమె మెదడు పనిచేసి, ఏమి చెయ్యాలో తెలిసిరాలేదు. అతని ఫ్యామిలీ డాక్టరుగారిపేరు కృష్ణారావు. పెళ్ళికి వచ్చిన ముఖ్య అతిథుల్లో ఒకడిగా శేఖరం తనకు పరిచయం చెయ్యటం గుర్తొచ్చింది.
డైరెక్టరీ తీసి గబగబా వెతికింది. వణికే వ్రేళ్ళతో డయల్ చేసింది.
అదృష్టవశాత్తూ అవతలినుంచి రెస్పాన్స్ వచ్చింది. డాక్టర్ కృష్ణారావే రిసీవ్ చేసుకున్నాడు.
"నేను మాలతీనండీ, చంద్రశేఖరంగారి భార్యను" ఆమె గొంతు స్వాధీనం తప్పుతోంది. "ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చినట్లుగా వుంది. ప్రస్తుతం తెలివిలో లేరు."
"మైగాడ్!" అంది అవతలి గొంతు. "ఖంగారు పడకమ్మా, ఇప్పుడే వస్తున్నాను."
అతను వచ్చేదాకా క్షణమొక యుగంలా గడచింది. మంచంమీద పడివున్న శేఖరంవంక చూడాలన్న, అతని దగ్గరకు పోవాలన్నా పిరికితనం ఏర్పడింది. కానీ సహజంగా మాలతి ధైర్యస్తురాలు. తనని తానే ఊరడించుకుని, ధైర్యాన్ని కూడగట్టుకుని మంచంమీద అతని ప్రక్కనే ముఖంలోకి చూస్తూ కూర్చుంది. మధ్యలో అతను కొద్దిగా మూలిగి కదిలినట్లయింది. ప్రాణంలేచి వచ్చినట్లయి మరింత దగ్గరగా జరిగి, జుట్టులోనికి వ్రేళ్ళు పోనిచ్చి దువ్వుతూ కూర్చుంది.