Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 17


    పావుగంట తరువాత బయట కారాగినట్లయింది. చప్పున లేచి హాల్లో లైటు కూడావేసి తలుపు తెరిచింది.  డాక్టర్ కృష్ణారావు అతని కాంపౌండర్ తో కూడా కావలసిన సరంజామా అంతా తీసుకువచ్చేశాడు. జరగవలసిన తతంగమంతా ఒక నర్సింగ్ హోమ్ లో చేసినట్లు చకచకమని చేసేస్తుంటే, మాలతి బొమ్మలా చూస్తూ నిలబడ్డది. డాక్టరుగార్ని పెళ్ళిలో చూడటంతప్ప, వెనుకటి పరిచయం లేదు. కానీ ఆయన ప్రదర్శిస్తున్న ఆదుర్దా, తీసుకుంటోన్న శ్రద్ధా అదంతా చూస్తే ఆ కుటుంబానికి ఎంతో ఆప్తుడిలా, ఆత్మీయుడిలా కనిపించాడు.

    దాదాపు రెండుమూడు గంటలుసేపు క్రైసిస్ పిరియడ్ గడిచినట్లు గడిచింది. ఈలోపల డాక్టరుగారు ఒక్కక్షణంకూడా ఎలర్ట్ గా లేకుండా లేరు.

    శేఖరం "అమ్మా!" అని మూలిగి కళ్ళు విప్పినప్పుడు, ఆయన ముఖం వికసించింది.

    శేఖరం నీరసంగా నలువైపులా చూసి,  ఏదో మాట్లాడబోయాడు. డాక్టరు అతన్ని మాట్లాడవద్దని సంజ్ఞచేసి, చేతులు వాష్ చేసుకోవటానికి ప్రక్క గదిలోకి వెళ్ళాడు. అతనికి టవల్ అందించటానికి మలతికుడా వెళ్ళింది.

    వాష్ బేసిన్ దగ్గర సబ్బుతో చెయ్యి కడుక్కుంటుండగా అప్పుడు చూసింది ఆయనవంక పరిశీలనగా. యాభైఏళ్ళు దాదాపుగా వుంటాయి. పొడవుగా, దృఢంగా, ఆరోగ్యంగా వున్నాడు. ఆయన ముఖంలో గంభీరత్వం, చురుకుదనం, అంతకుమించి వ్యక్తిత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మాలతికి ఆయనంటే ఎనలేని గౌరవం, భక్తి శ్రద్ధలూ కలిగాయి.

    నేప్ కిన్ అందిస్తుండగా "నువ్వు చాలా ధైర్యవంతురాలవు. ఇంతసేపూ ఒక్కప్రశ్న వేయకుండా, సైలెంటుగా నిలబడి ఎంతో కోపరేట్ చేశావు. అదే ఇంకొకరైతే ఇలాంటి స్ధితిలో ఏడుపులూ పెడబొబ్బలూ పెట్టి మమ్మల్ని ప్రశ్ననలతో ముంచెత్తి అడుగడుగునా అడ్డుతగుల్తూ ముందు మా ప్రాణాలు తీసేవాళ్లు" అన్నాడు ప్రశంసాపూర్వకంగా చూస్తూ.

    "పిలవగానే రావటమేగాకుండా మీ ధర్మం మీరు నిర్వహిస్తుండగా ప్రశ్నలు వేసి వేధించడం ఎందుకు డాక్టర్? సీరియస్ కేసని తెలుస్తూనే ఉంది. పదే పదే దాన్ని తరచి ప్రయోజనమేమిటి చెప్పండి?"

    డాక్టర్ ఆమె మాటల్లోని సంస్కారానికి ఇంకా విస్తుపోయాడు. అంతేకాకుండా ఆమె అలంకరణా, గదిలోని సరంజామా ఇదంతాచూసి ఈ రాత్రి ఎలాంటిదో గ్రహించాడు. ఇటువంటి సమయంలో ఆమె ఎంత భయంకరమైన సంక్షోభాన్ని మనసులో ఇముడ్చుకుని నిగ్రహం అవలంబించిందో తలచుకుంటే మనసులో అభినందించకుండా ఉండలేకపోయాడు.

    డాక్టరుతో ఆమె గదిలోకి వచ్చింది. ఎప్పుడు వచ్చాడోగానీ గోపయ్య నిలబడి వున్నాడు. అతను గుడ్లనీరు  కుక్కుకుంటూ "అమ్మగారూ! మీరింత అవస్థలో వుంటే, సమయానికి నేను లేకుండా పాడుసినిమా చూస్తూ కూర్చున్నానా ? నా మొహంమండా, ఎంత పనిచేశాను!" అని చిందులు త్రొక్కుతుంటే డాక్టర్ ఉష్ అని వారించాడు.

    శేఖరాన్ని మరోసారి పరీక్షచేసి, అతని భుజం మృదువుగా తట్టి ఫర్వాలేదన్నట్లు సంజ్ఞచేసి ఇవతలకు వస్తుంటే మాలతి అతని వెనుక నడిచింది.

    బయటికి వచ్చాక "నేనిహ వెడతానమ్మా! ఫర్వాలేదకుంటాను. ఏదయినా అవసరం వుంటే ఫోన్ చెయ్యి. రేపు ప్రొద్దున వస్తాను. అంతవరకూ అతన్ని మాట్లాడనివ్వకు. మంచంమీద నుంచి కదలనివ్వకు" అన్నాడు.

    ఆమె తల ఊపింది.

    ఆయన కాంపౌండర్ తో సహా కారులో వెళ్ళిపోయాక, ఆమె ఒక్కక్షణం అక్కడే ఎటో చూస్తున్నట్లు నిలబడి తర్వాత లోపలికొచ్చింది. గోపయ్య తలుపులు వెయ్యటానికి బయటకు వెళ్ళాడు.

    ఆమె మంచందగ్గరకు వచ్చి శేఖరం ప్రక్కన కూర్చుంది. నీరసంగా, జాలిగా పేలవంగా వున్న కళ్ళతో ఆమెవంక చూస్తున్నాడు.

    ఆ కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి.

    "మాలతీ! తెలీలేదు......నీకు అన్యాయం......."

    "ఉష్......!" అంటూ తన చేత్తో మృదువుగా అతని పెదవులు మూసింది. "తర్వాత మాట్లాడుకుందాం, మీరు పడుకోండి."

    అతనిలాగే ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు. ఆమెకూడా అతని కళ్ళలోకి చూస్తున్నది. విధివిరామం లేకుండా చూస్తే శక్తి పోకుండా, ఆసక్తి నశించకుండా ప్రక్కకి త్రిప్పుకోకుండా చూసుకోగల కళ్ళు కొన్నే ఉంటాయి.

                                             8

    మరో రెండువారాలు గడిచేసరికి శేఖరం ప్రమాదావస్థనుంచి క్రమంగా కోలుకున్నాడు. అంతవరకూ ప్రతిరోజూ డాక్టర్ కృష్ణారావు రెండుపూటలా వచ్చి చూసి వెడుతూనే వున్నాడు.

    భానుమతి మొదటిసారిగా చూడటానికి వచ్చినప్పుడు మాలతి ఆమెను చూసి ఏడుపును ఆపుకోవటానికి ప్రయత్నించింది.

    "ఎందుకో - నీ జీవితంలో ముందు ముందు చాలా మెలోడ్రామా వుంటుందనిపిస్తుందే మాలీ! నీ జీవితం సంఘటనలమయం అని తోస్తున్నది."

    మాలతి ఆమె కళ్ళలోకి చూసి ఊరుకుంది. తర్వాత ఆ విషయాన్నిగురించి సంభాషణ ఎవరూ పొడిగించలేదు.

    ఒక సాయంత్రం డాక్టరుగారు వచ్చి పరీక్షచేసి వెళ్ళిపోతూ "నీతో కొంచెం మాట్లాడాలమ్మా!" అన్నాడు.

    మాలతి అతను ఏకాంతంగా మాట్లాడగోరుతున్నట్లు గ్రహించి గోపయ్యను శేఖరం దగ్గర ఉండమనిచెప్పి, ఆ గది తలుపులు దగ్గరగా వేసి వచ్చింది. ఇద్దరూ సోఫాలో ఎదురెదురుగా కూర్చున్నారు.

    "శేఖరాన్ని నేను చిన్నప్పటినుండీ ఎరుగుదునమ్మా! కానీ అవసరం రాకపోబట్టి క్రిందటిసారి అతను జబ్బుపడేదాకా అతన్ని పరీక్షచేసే అవకాశం కలగలేదు. అప్పుడు తెలిసింది - అతనికి కన్ జనిటిల్ హార్టు డిసీజ్ వుందని. అయితే ఇన్నాళ్ళు సింటమ్ లెస్ గా వుండడంవల్ల బయటపడలేదు. పోయిన సారి ఈ జబ్బుగురించి నేను తెలుసుకున్నాక, తీసుకోవలసిన జాగ్రత్తలగురించి అతనితో చర్చిద్దామనుకున్నాను. కానీ అసలే తల్లి పోయిన షాక్ లో వున్నాడు. అతనికి గుండెజబ్బు వున్నట్లు చెబితే మరింత మనోవ్యధకు కారణమవుతుందని అతను తన్ను గురించి అడిగినా ఏమీలేదని, మామూలునొప్పే అని నేనే మభ్య పెట్టాను. తర్వాత వీలుచూసుకుని నెమ్మదిగా చెబుదామనుకున్నాను. అదే పొరపాటయిందనిపిస్తుంది ఇప్పుడు. తర్వాత నేను ఇంటర్నేషనల్ మెడికల్ కాన్ఫరెన్స్ కి ఎటెండ్ అయి తిరిగి వచ్చేసరికి మీ పెళ్ళి స్థిరపడిపోవడం, మడునాడే ముహూర్తం కావడం......ఈ స్థితిలో నిజంచెప్పి ఈ పెళ్ళి చెడగొట్టే శక్తి లేకపోయింది. కొన్నాళ్ళదాకా శారీరానికి అలసట కూడదనీ, ఆపరేషన్ అవసరమనీ చెబుదామనుకున్నాను. అదీ సాధ్యపడలేదు......."                                            

 Previous Page Next Page