Previous Page Next Page 
కోమలి పిలుపు పేజి 16

    సిగ్గుపడుతూనే పద్మిని మాధవరావు ముందు అలా నిలబడిందా? అతడి ముందు అలా నిలబడగలిగిన ఆడదానికి సిగ్గెందుకు?
    ఆడదానికి సిగ్గులేదు. అదంతా నటన!
   
    "పద్మిని దగ్గరగా వచ్చి ఏమిటండీ అలా వున్నారు?" అన్నది.
   
    "కాలేజీ రోజులు గుర్తుకు వచ్చాయి" అన్నాను.
   
    "ఎందుకు?"
   
    "నీకు ఎప్పుడయినా కాలేజీ రోజులు గుర్తు వస్తూంటాయా?"
   
    "ఏమో!" అన్నదామె.
   
    "ఆ రోజులే వేరు! కలకాలం గుర్తుంచుకోతగ్గ మధురానుభూతులు ఎన్నో వున్నాయి" అన్నాను.
   
    "అవును." అన్నది పద్మిని.
   
    ఉలిక్కిపడ్డాను. "ఒక్కటి చెప్పగలవా?" అన్నాను.
   
    "నేను, నా స్నేహితురాలు కమల కాలేజీ ఎగ్గొట్టి సినిమాకు వెడితే-డానికి కొత్తగా పెళ్ళయిన మా లెక్చరర్ వచ్చాడు, ఆయనకు మేము ముఖం చాటేశాం. ఆయన మమ్మల్ని చూడనట్లు నటించాడు ఎందుకంటే వంట్లోబాగోలేదని ఆయన సెలవు పెట్టినట్లు మర్నాడు తెలిసింది...." పద్మిని కిలకిలా నవ్వింది.
   
    నాకు అసలు నవ్వు రాలేదు "ఇందులో నవ్వడానికేముంది?"
   
    "ఇలా చాలాసార్లు జరుగుతుందండీ-దొంగకి దొంగ ఎదురుకావడం అధి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది-" అని మళ్ళీ నవ్వింది పద్మిని.
   
    పద్మిని కిలకిలా నవ్వుతుంది. కోమలి కిసుక్కున నవ్వుతుంది.
   
    స్వచ్చమైన హృదయమున్నవారే కిలకిలా నవ్వగలరని చాలామంది అంటారు. కిసుక్కున నవ్వడం ఎదుటి మనిషిని రెచ్చగొట్టడానికే!
   
    అయితే కోమలి సిగ్గుపడదు. పద్మిని సిగ్గుపడుతుంది. సిగ్గు మనోవికారం నుంచి వస్తుంది. అనగా సిగ్గుపడని వారే స్వచ్చమైన వారనుకోవాలి.
   
    ఏమీ కాని నా ముందే కోమలి సిగ్గుపడలేదు. కానీ పద్మినీ....ఇప్పటికీ నా ముందు...
   
    అయితే మాధవరావు ముందు...?
   
    నా కళ్ళముందు నేను, కోమలి, పద్మిని, మాధవరావు కనబడుతున్నారు. నా ముందు కోమలి-మాధవరావు ముందు పద్మిని...
   
    పద్మినికి సిగ్గు లేదు. నా కోసం కొత్తగా నేర్చుకున్నదామె!
   
    కోమలి నన్ను ప్రేమించానంది. ప్రేమ సిగ్గెరుగదన్నది.
   
    మాధవ్రావును పద్మిని ప్రేమించిందా? లేక పద్మిని కూడా కోమలిలాగే...
   
    నా ఆలోచనలు ఎక్కువదూరం వెళ్ళలేదు.
   
    పద్మిని అన్న మాటలు హఠాత్తుగా నాపై ప్రభావం చూపించసాగాయి. ఏమన్నది పద్మిని?
   
    "దొంగకు దొంగ ఎదురుకావడం అధి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది....? అంటే ఇందులో దొంగ ఎవరు?
   
    వివాహానికి ముందే నేనొక యువతిని చూడకూడని విధంగా చూశాను.
   
    వివాహానికి ముందే పద్మిని ఒక యువకుడి ముందు అదే విధంగా నిలబడింది.
   
    ఇద్దరూ దొంగలమా?
   
    పద్మినికి కోమలి గురించి తెలుసా?
   
    ఎందుకో నాకు నవ్వు వచ్చింది. నవ్వాను.
   
    పద్మిని కంగారుగా "అదేంటండీ, అలా నవ్వారు?" అన్నది.
   
    "ఎలా నవ్వాను?"
   
    "విలన్ లా-వికటాట్టహాసం చేశారు" అన్నదామె. అప్పుడు ఆమె ముఖంలో భయం, అమాయకత్వం కొట్టవచ్చినట్లు కనబడ్డాయి.
   
    నేను విలన్ లా నవ్వానా? ఎందుకు?
   
    మామూలుగానే నవ్వినట్లు నాకు అనిపించింది. కానీ విలన్ లానవ్వానని పద్మిని అంటున్నది. ఆమె భ్రమపడిందా? భ్రమ పడడానికి కారణం ఆమె తప్పు చేసిందా?
   
    "కాలేజీ రోజులు గుర్తొచ్చాయిలే..." అన్నాను.
   
    "అయితే అలా నవ్వడమెందుకు?"
   
    "ఓ అమ్మాయి నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని పంతం పట్టింది. ఆమె పంతం సంగతి తెలిసినప్పుడు నేనలా నవ్వాను" అన్నాను.
   
    "అలా నవ్వడమెందుకు?"
   
    "కాలేజీ రోజుల్లో ప్రేమ తప్పుకదూ?" అన్నాను.
   
    "అవునండీ-కానీ చాలామంది మగపిల్లలు ఈవిషయం మర్చిపోతారు. ఆడపిల్లలను చూడగానే..."
   
    "ఊఁచూడగానే..."
   
    "వెకిలి నవ్వులూ, ఉత్తరాలూ..."
   
    "నీకెవరయినా వుత్తరాలు రాశారా!"
   
    "నా కెందుకు రాస్తారు?
   
    "ఏం నువ్వు ఆడపిల్లవు కాదా?"
   
    పద్మిని అదోలా నావంకచూసి "ఇవన్నీ ఇప్పుడెందుకు అడుగుతున్నారూ!" అన్నది.
   
    "కాలేజీ జీవితంలో ఎవరిచేతా ప్రేమించబడని ఓ అమ్మాయికిప్పుడు నేను భర్తనయినానంటే నాకు బాధగా వుంటుంది" అన్నాను.
   
    ఆమె కిల కిలా నవ్వింది.
   
    "నావ్వుతావేం?"

 Previous Page Next Page