Previous Page Next Page 
కోమలి పిలుపు పేజి 15

    సహజంగా స్త్రీకి కళాకారులపట్ల గల ఆకర్షణ....లేదా ఎందరో ఇతడిని ప్రేమించడం కారణమయుండాలి.
   
    నేనతడిని పరీక్షగా చూశాను.
   
    అతడిలో చెప్పుకోదగ్గ అందమేమీ కనబడలేదు.
   
    "ప్రేమ అర్హతలు చూడదు" అన్న కోమలిమాటలు న అచేవుల్లో గింగురుమన్నాయి.
   
    ఇతడిని ప్రేమించిన ఆ వనితలు ఎలాగుంటారో చూడాలన్న కోరిక కలిగింది నాకు. లేదా నగ్న యువతుల తైలవర్ణ చిత్రాలు చూడాలన్న కోరిక అంతర్గతంగా నాలో ఉన్నదేమో!
   
    అతడిని బలవంతపెట్టాను.
   
    అతడు కాదనలేదు. ఆల్భం నాకు అందించాడు.
   
    ఆ ఆల్బం ఇరవై అంగుళాల పొడవు, ఇరవై అంగుళాల వెడల్పుతో చతురస్రాకారంలో వున్నది, కవరు తెరవగానే నా కళ్ళు జిగేల్ మన్నాయి. రెండవ పేజీకి వెళ్ళడానికి కొద్దిసేపు పట్టింది.
   
    అతడు ఎన్నుకున్న యువతి అందానికి అప్సరస. ఆ బొమ్మకు అతడు ప్రాణం పోశాడు.
   
    రెండవ పేజీ తర్వాత థ్రిల్ కాస్త తగ్గింది.
   
    ప్రతి పేజీలోనూ అద్భుత రూపలావణ్యాలు కలిగిన యువతి వున్నది.
   
    అలా ఎనిమిది పేజీలు తిప్పి కొయ్యబారిపోయాను.
   
    నా కళ్ళు పొరబడడానికీ వీల్లేదు. అనుదినమూ నా కనుల ముందు మసలే న అభార్య విషయంలో నేనెలా పొరబడతాను?
   
    ఆమె పద్మిని!
   
    నేను అక్కడే ఆగిపోవడం గమనించి అతను "మీ అభిరుచికీ నా అభిరుచికీ తేడా ఉన్నట్లు లేదు. నేను గీసిన చిత్రాలన్నింట్లో మొదటి మార్కులు ఈమె శరీర సౌష్టవానికే..." అన్నాడు.
   
    పుండుమీద కారం జల్లినట్లు అయింది.
   
    "ఎవరీమె?" అన్నాను.
   
    అతడి ముఖం గంభీరంగా అయిపోయింది. "వివరాలు అడగటం మీకూ, చెప్పడం నాకూ మర్యాద కాదు" అన్నాడు.
   
    అప్పటికి నాలో వివేకం మేల్కొన్నది. తర్వాత యాంత్రికంగా పేజీలు తిప్పాను. నన్ను చూసి అతడు నవ్వుతూ "ఆ బొమ్మను చివరకు ఉంచడం మంచిది. ఆ తర్వాత ఇంకే బొమ్మా ఎవరికీ నచ్చదు" అన్నాడు.
   
    "ఈ బొమ్మలు అందరికీ చూపుతుంటావా?" అన్నాను.
   
    "ఎప్పుడో తప్పని సరైనప్పుడు తప్ప చూపించను. ఇప్పటికీ ఆల్బం చూసినవారు మొత్తం అయిదుగురు-మీతో కూడా కలిపి!" అన్నాడు మాధవరావు.
   
    తేలికగా నిట్టూర్చి "ఇంక మీదట ఈ బొమ్మలు ఎవరికీ చూపకు" అన్నాను.
   
    "ఏం సార్?" అన్నాడతను.
   
    "నీవు చెప్పినట్లు చిత్రకారుడి దృష్టి వేరు. నా దృష్టి వేరు. ఈ బొమ్మలు చూస్తూంటే మనసు చలిస్తున్నది. ఆ యువతుల వివరాలు తెలుసుకొనవలెననిపిస్తుంది. వీలుపడితే ఈ బొమ్మలను కొనవలెననిపిస్తుంది" అన్నాను.
   
    "ఈ బొమ్మలు నా కోసం నా అభిరుచి మేరకు గీసుకున్నవి. వీటిని వ్యాపారానికి ఉపయోగించి నాపై ఆ యువతులుంచిన నమ్మకాలను వమ్ము చేయలేను."
   
    "నీకా యువతులు శారీరకంగా దగ్గరయ్యారా?"
   
    "ఇంకేమీ వివరాలు అడగొద్దు సార్" అన్నాడు మాధవరావు.
   
    అడిగే ఓపికా నాకు లేదు. నా మనసు పాడయింది.
   
    పద్మిని....ఆమె అక్షరాలా నా స్వంతమని భావించాను. నా ముందే ఎంతో సిగ్గుపడే ఆమె-ఒక చిత్రకారుడి ముందు అలా-
   
    ఇదెలా జరిగింది?
   
    పద్మిని సిగ్గు అంతా నటనేనా?
   
    నేను మాధవరావు దగ్గర సెలవు తీసుకున్నాను.
   
    "నన్ను మళ్ళీ ఎప్పుడు కలవమంటారు సార్?"
   
    "ఇంకా నీవు నన్ను కలుసుకోనవసరం లేదు. నా కొలీగ్ భానుమూర్తికి చెబుతాను. ఈ రోజు సాయంత్రం అతన్ని కలుసుకో" అన్నాను.
   
    "థాంక్యూ సార్!" అన్నాడతను.
   
    నేను డిపార్టుమెంటుకి వెళ్ళి భానుమూర్తికి మాధవరావు గురించి చెప్పాను. అతడు ఎగిరి గంతువేసినంత పనిచేసి "గురూ__ఇదెలా సాధ్యపడింది?" అన్నాడు.
   
    నేనతడి సంతోషంలో భాగం తీసుకునే స్థితిలో లేను. నా మనోవేదనను అతడికి చెప్పుకుని తేలిక పడనూ లేను.
   
    తాత్కాలికంగా మాధవరావును వదుల్చుకోవడం నాకు కావలసింది.
   
                                                                    O    O    O        O
   
    "పద్మినీ!" అన్నాను.
   
    "ఏమండీ-" అన్నది పద్మిని.
   
    ఆమె ముఖం నిర్మల గంగా నదిలా వున్నది. పాతకులు తమ పాపాలను ఆ నదీ జలాల్లోనే వదులుతారు. అయినప్పటికీ గంగానది నిర్మలమే!
   
    అటువంటి నిర్మలత్వమె పద్మినికి వున్నదా?
   
    "ఇలా దగ్గిరగా రా..." అన్నాను.
   
    "పక్క గదిలోనే పిల్లలున్నారు" అన్నది పద్మిని సిగ్గుపడుతూ.
   
    పద్మిని ఇప్పటికీ అందంగానే సిగ్గు పడుతుంది. సిగ్గు ఆడదానికి భగవంతుడు ఇచ్చిన వరం.

 Previous Page Next Page