Previous Page Next Page 
గిఫ్ట్ పేజి 16

    ముందుగా బబితే తేరుకుంది.

    "నేను వచ్చి పదినిమిషాలు అయింది!" బబిత కోపంగా అంది.

    "నేను కాదనలేదే!" కొంటెగా అన్నాడు మనోజ్.

    "మీరు కాదన్నా, అవునన్నా ఇది మాత్రం నిజం. మౌనంగా వుండటానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది."

    "ఎస్, ఎస్!"

    "నన్ను చూస్తే మీకు ఆటలుగా వున్నట్లుంది!"

    ముందు "ఎస్! ఎస్!" అని అంతలోనే సర్దుకుని "నో! నో! నా ఉద్దేశ్యం ఏమిటంటే...."

    "మీ ఉద్దేశ్యమేమిటో తెలుస్తూనేవుంది. పనిగట్టుకుని వేరే చెప్పనక్కరలేదు" బబిత ధుమధుమలాడుతూ అంది.

    "మీరు కేసేమిటో చెప్పందే....అసలు మీ కేసు...." అంటూ ఆగిపోయాడు మనోజ్.

    "నాది కేసుకాదు!" బబిత చిర్రు బుర్రులాడుతూ అంది.

    "ఏ కేసూ లేనివాళ్ళు ఇక్కడికి రారే? ఎలా?" అన్నాడు కొంటెగా మనోజ్.

    వీళ్ళ ఫార్సు చూసి, అక్కడేవున్న కానిస్టేబుల్, కిసుక్కున నవ్వాడు.

    దాంతో ఇరువురూ తెలివి తెచ్చుకుని సర్దుకు కూర్చున్నారు.

    "ఐయామ్ ప్రెస్ రిపోర్టర్, అండ్ జర్నలిస్టు మిస్ బబితని!" అంది బబిత కొంటెగా గర్వంగా ముఖంపెట్టి.

    "అనుకున్నాను!" ఇన్ స్పెక్టర్ ముక్తసరిగా అన్నాడు.

    "ఏమిటి అనుకున్నారు?" కాస్త తీక్షణంగా చూస్తూ ప్రశ్నించింది బబిత.

    "మీరు పైకి, అందంగా అలంకరించుకుని కాలేజీకి వెడుతున్న స్టూడెంట్ లాగా వున్నారని అనుకోవటం లేదు. ఇలామ్తిప్ పనిదో చేస్తున్నారని అనుకుంటూనే వున్నాను" ఓ ప్రక్క పొగుడుకూ, పొగడనట్లుగా అసలు విషయం చెప్పాడు మనోజ్.

    బబిత బూరెల్లాంటి బుగ్గలు ఎర్రబడ్డాయి. "ఈ కుర్ర ఇన్ స్పెక్టర్ కి తనని చూస్తే ఆటలుగా వున్నట్లుంది. తనేమిటో, తన సత్తాఏమిటో, పత్రికా రంగంలో తనకి ఎంత మంచిపేరు వుందో తెలిసినట్లులేదు. ఒకసారి నా తడాఖా చూపిస్తాను" మనస్సులో అనుకుని, పైకి__

    "నేను మిమ్మల్ని కలిసే ముందు మీకు కానిస్టేబుల్ ద్వారా కబురు చేశాను" అంది బబిత.

    "చెప్పాడు! ప్రెస్ రిపోర్టర్ జర్నలిస్టు అయిన ఒకామె మిమ్మల్ని కలవటానికి వచ్చారు. ఏదో ఒక కేసు విషయం మీతో చర్చించాలిట. అని వివరంగా చెప్పాడు. కానీ మీ గురించి వర్ణించలేదు. ఎందుకంటే ఆ అవసరం లేక. ప్రెస్ రిపోర్టర్, జర్నలిస్టు అనేసరికి పత్రికా రంగంలో బాగా అనుభవంవున్న పెద్ద ఆవిడ కామోలు అని అనుకున్నాను."

    "అనుకోవటాలు అలా వుంటే, అబద్ధాలు మరో విధంగా వుంటాయి. మీరేదో కేసులో తలమునకలయి తర్జన భర్జన పడుతున్నారని, చాలా సీరియస్ గా కేసు చర్చిస్తున్నారని క్షణం తీరుబడి లేకుండా వుండటమేకాకుండా, కోపంగా కూడా వున్నారని అటు కానిస్టేబుల్, ఇటు సెంట్రీ ఇద్దరూ చెప్పారు. అయినా నేను నమ్మానా? నమ్మలేదు. నాకు తెలుసు ఇలాంటివన్నీ మామూలేనని" చల్లచల్లగా అంటించింది బబిత.

    "ఓర్నాయనో! ఈ పిల్ల పిల్లకాదు పిడుగు. అయినా తను డ్యూటీలో వుండి, ఏదో కాలేజీ కుర్రాడిలాగా బిహేవ్ చెయ్యడమేమిటి? డ్యూటీలో వున్నప్పుడు డ్యూటీలో వున్నట్లే ప్రవర్తించాలి" అనుకున్న మనోజ్. "మిస్ బబితా! మీరు వచ్చిన పనీ, కేసూ ఏమిటో చెప్పండి" అని-బబిత చెప్పబోయేది శ్రద్ధగా వినటానికి సరిగ్గా ఎలర్ట్ గా కూర్చున్నాడు.

    "ఈ పట్నంలో చాలా నేరాలూ, ఘోరాలూ జరుగుతున్నాయి. మీ డిపార్ట్ మెంట్ అసమర్ధతగా పని చేస్తూంది అని నేను చెప్పటానికి రాలేదు. కానీ, వున్న విషయం చెప్పటానికి వచ్చాను. నేరం జరిగిన చోటకి మీకన్నా ముందు మేము వెళ్ళి, ఆ నేరమూ, అందులోని నిజానిజాలూ తెలుసుకుని మేము ముందుగా పత్రికలో ప్రచురించి ప్రజలకి అందిస్తున్నాము. సినిమా ఆఖరి సీనులో పోలీసులు రంగప్రవేశం చేసినట్లు. ఆఖరికి మీ డిపార్ట్ మెంటు కదిలివస్తుంది...."

    "మిస్ బబితా! మీరు ఏదైనా కేసు విషయంలో మాట్లాటానికి కానీ, లేక రిపోర్టు చెయ్యటానికి గానీ వచ్చారా? లేకపోతే మమ్మల్ని తూర్పారాపట్టటానికి వచ్చారా!" ఇన్ స్పెక్టర్ మనోజ్ శాంతంగా అడిగాడు.

    "వూర్పిళ్లు, కోతలు, తూర్పారాపట్టడాలు నాకు తెలియదు. నేను కేసు విషయం మాట్లాడటానికే వచ్చాను. ఈమధ్య ప్రొఫెసర్ రావుగారింట్లో, డజనుమంది దొంగలు దూరి నానా భీభత్సం చేస్తూంటే ఇరుగూ పొరుగూ అది చూసి మీకు ఫోన్ చేశారు. మీ డిపార్టుమెంట్ వెంటనే కదిలిరాక, ఏదో వెధవ న్యూసెన్స్ అని ఫోన్ పెట్టేశారు.

    ఫోన్ కాల్ వినగానే మీరు హుటాహుటిన బయలుదేరి వచ్చినట్లయితే, అంత అనర్ధం జరిగేది కాదు కదా! పోలీసులు ఫోన్ కాల్ ని లక్ష్య పెట్టలేదని తెలిసి, వాళ్లు మా కార్యాలయానికి ఫోన్ చేశారు. తెలివిగా సమయానికి మేము వెళ్ళబట్టి అపారమైన ఆస్తినష్టం జరగలేదు. దొంగలు పారిపోయారు...."

    బబిత సొంతమాట పూర్తి చెయ్యకముందే, ఇన్ స్పెక్టర్ మనోజ్ అడ్డు తగిలి, నేను డ్యూటీలో జేరి మూడురోజులు అయ్యింది. మీరు చెప్పే కేసు గురించీ నేను కూడా విన్నాను. ప్రతిరోజూ, రాత్రిళ్ళు ఎక్కడెక్కడి నుంచో నాలుగయిదుసార్లు ఫోన్లు పోలీసు స్టేషన్ కి వస్తున్నాయిట. 'ఫలానా వారింటిలో దొంగలుబడ్డారు అర్జంటుగా రండి' అంటూ పిలవటం జరిగేదిట.

    మావాళ్లు పరుగెత్తుకుంటూన్నట్లుగా అక్కడికి వెడితే? అక్కడ మీ వుండేది కాదుట. తెల్లముఖం వేసుకుని వీళ్ళు వెనుతిరిగి రావటం జరిగింది. అలా పదిసార్లు జరిగిన తరువాత, ఎవరో కొంటెతనానికి ఇలాంటి ఫోన్ చేస్తున్నారని ఒక నిర్ధారణకి వచ్చారు. ఆ సమయంలో రావు గారింట్లో దొంగలు పడటం, అక్కడ నుంచీ ఫోన్ రావటం జరిగింది. ఇది రోజూ వుండేగోలే. ఇది అబద్ధం కాల్ అనుకున్నారు. ఇది దొంగల ప్లాన్ లో ఒక భాగం అని అర్ధమయ్యేసరికి ఒక అనర్ధకం జరగనే జరిగింది.

    నేను వచ్చిన తరువాత ఈ విషయం తెలుసుకున్నాను. నేను మా డిపార్టుమెంట్ కి కొన్ని సూచనలు చేశాను. ఒకరిద్దరిని చంపితే తప్ప వైద్యుడు కానట్లు, ఇలాంటి నేరాలు కొన్ని జరిగితే కానీ మా డిపార్టుమెంట్ కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. నేను దీని గురించే ఆలోచిస్తున్నాను." గంభీరంగా అన్నాడు.

    అతను అంత నిజాయితీగా మాట్లాడుతూ వుంటే, ఇంకేంమనాలో తెలియలేదు బబితకి. మరికొన్ని కేసుల్ని అతని దృష్టికి తీసుకువచ్చింది.

    "నాకు తెలుసు. మా పోలీస్ డిపార్టుమెంట్ అంటే. ప్రజలకి భయమూ చిన్నచూపూ. చాలామంది మాతో సహకరించరు. దానివల్ల కూడా కొన్ని నేరాలు ఎంత విడవని చిక్కుముళ్లులాగా అలా వుండిపోతున్నాయి" అంటూ కొన్ని కేసుల్ని ఉదాహరించాడు ఇన్ స్పెక్టర్ మనోజ్.

    ఇరువురూ అలా మాట్లాడటం పూర్తి అయ్యేసరికి ఇరువురికీ అర్ధమయ్యింది లోపం ఎక్కడుందో.   

 Previous Page Next Page