Previous Page Next Page 
అభయారణ్యం పేజి 15


    అసలు నేను నీకు ప్రియురాలిని కాక తల్లినై వుంటే ఎంత బాగుణ్ణు నిజం... నిన్ను చూడగానే ఆటల్లో అలసిన బిడ్డను చేతుల్లోకి తీసుకున్న అమ్మలా లాలించి, బుజ్జగించి స్వార్దంలేని ప్రేమతో బ్రతికినంతకాలమూ నిన్ను ఒడిలోనే దాచుకునేదాన్ని. కానీ మరి నేనూ నిస్వార్దంగా ఆలోచించలేని ఆడదాన్నిగా ప్రియా! అందుకే ఈ జన్మకే కాదు  ఏడేడు జన్మలదాకా నువ్వు నా సొంతమే కావాలని, నీ చూపుల్లో, ఆలోచనల్లో, మనసులో, మెదడులో నేను యిమిడిపోవాలని కలలకంటూ ప్రియమైన అమ్మకన్నా  నిన్ను శారీరకంగా కూడా నాలో ఐక్యం  చేసుకునే ప్రియురాలిగానే మిగలాలనుకుంటున్నాను.

     నన్ను నమ్ము!

    నీ పరిచయానికి పూర్వం నేను తరచూ దేవుడ్ని ప్రార్దించేదాన్ని. కానీ నువ్వు కలిశాక నా ధ్యానంలోనూ నువ్వే... .నా గుండె గానంలోనూ నువ్వే కావడంతో నా ఆలోచనల అభిషేకంతో నీకే పరిమితమైపోయాను.

    ఎవరన్నారు నువ్వు విడిగా వున్నావని....

    నమ్మకు నేస్తం....

    'నేను అనే పదాన్ని చెరిపేసుకుని అందులో 'నువ్వు'ని ప్రతిష్టించుకున్నానుగా! ' అప్పుడు నేనూ, నువ్వూ అంటూ వేర్వేరు ఎలా అవుతాము?

    నీ గురించి బాధపడటమూ నాకు ఓ వరమో ప్రియా! ఆ బాధకి ఎంత శక్తి వుందో  తెలుసా? ప్రతి క్షణమూ నీ తలపుల్నే మిగిల్చే ఆ బాధ నాకు లేకపోతే నీ సన్నిధి నాకు ఉపశమనాన్ని అందించదు.  నువ్వున్నావనే సంతృప్తితో నేను బ్రతుకుని చాలించే అవకాశమూ వుండదు.

    అందుకే ప్రియా!

    నీ కోసం చింధించే కన్నీళ్ల జలపాతంలో నేను కొట్టుకుపోయాను. అలాగే ప్రాణాలు విడిచి, మరోసారి జన్మించి, నీకోసం మరణించే  అదృష్టము కోసం తపస్సు చేస్తూ వుంటాను..."

    భుజంపై చేయి పడటంతో ఉలిక్కిపడిందామె.

    భాస్వంత్ నిలబడి వున్నాడు సమీపంలో.

    గుండె లోయల విస్పోటనానికి ఉపశమనంలా కనిపించే ఆ వాక్యాలనింకా ఆమె మరిచిపోలేదు.
 
    ఆ పదునైన పదాల లాలిత్యం నుంచి ఇంకా ఆమె తేరుకోలేదు.

    బెడ్ వైపు నడిపించాడు రెండోసారి.

    ఆమె ప్రమేయంతో పనిలేనట్టు, ఏ రాత్రివేళ కావాలనుకున్నా కోరిక తీర్చుకోవటానికి ఓ మనిషి తనకున్నట్టు ఆమెకు ఆక్రమించుకుని ఆవేశంగా తన కాంక్షని చల్లార్చుకున్నాడు నిర్దాక్షిణ్యంగా. ఆ క్షణంలో కూడా ఇందాకటి వాక్యాలు కాక వాటిని రాసిన రచయిత గుర్తుకొచ్చాడు.

    'ధర్మతేజ....'

    ఎంత గొప్ప రచయిత!

    ఒక ఆడదాని వేదనని కలకాలం నిలిచే వేదంలా రాయటానికి, పరిహాసానికి తప్ప ప్రేమకు నోచుకోని నేటి స్త్రీ మనసు లోతుల్ని స్పృశించే ఇతిహాసంలా విశ్లేషించటానికి ఎంతగా శ్రమించి వుంటాడు.
 
    ఇంత అసదృశ్యంగా ఎలా ఆలోచించగలడు?

    ఒకసారి అతడితో మాట్లాడాలని మనసెందుకు  ఉవ్విళ్లూరుతూంది?

    తప్పేముంది? మాట్లాడాలని దృఢంగా నిర్ణయించుకుంది.

    ఆ క్షణంలో నీకంటూ ఓ ఆత్మయుడు దొరికితే తప్ప నామాటల్లోని ఆంతర్యం  అర్దంకాదు" అని యిందాకెప్పుడో ధీర అన్నమాటలు జ్ఞప్తికి రాలేదు.

    అదే...

    ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పింది.



                      *    *    *    *
   
   
    భాస్వంత్ ఉదయం ఆఫీసుకి వెళ్లిపోయాక వచ్చింది ధీర.

    అప్పటికే వంట పని పూర్తిచేసిన ఆర్తి బడలికగా బెడ్ మీద వెల్లకిలా పడుకుని వుంది.
 
    "ఏమేవ్! ఇంత రిలాక్స్ డ్ గా వున్నావు..." అంటూ పలకరించిన ఆమె ఆర్తి మొహంలోని నిస్త్రాణని చూస్తూ ఆశ్చర్యంగా అంది "ఏమిటలా వున్నావు?" రాత్రేమన్నా గొడవైందా?"

    "అబ్బే...."

    పైకి లేచింది ఆర్తి. మృదువుగా నవ్వేస్తూ "నువ్వేమిటి చాలా ఉత్సాహంగా వున్నావు?" అంది.
 
    "ఉత్సాహమన్నది మనసుకి సంబంధించిందే!కోరినట్టు బ్రతికితే అదెప్పుడూ మనల్ని అంటిపెట్టుకునే వుంటుంది. నా గురించి అలా వుంచు. ముందు నీ సంగతి చెప్పు."

    "ఏం లేదు. మామూలే!"

    "ఏమిటి... బాధపడటమా?"

    "నేనేం బాధపడడం లేదు" ఆర్తికీ చర్చ నచ్చలేదు. తప్పించుకోవాలనుకుంది కాని ధీర విడిచిపెట్టేట్టు లేదు. "రాత్రి చాలా సేపు చదువుకుంటూ వుండిపోయాను. నిద్రలేదు."
 
    "మరి ఆ పెదవి మీద గాట్లేమిటి?" అడిగింది ధీర.

    ఉలిక్కిపడింది ఆర్తి.

    రాత్రి బెడ్ మీదికి లాక్కున్న భాస్వంత్ యించుమించు నిద్రలేచిన 'చీస్ట్' లా ప్రవర్తించాడు. ఒక్క పెదవులేమిటి ఒంటిమీద చాలా చోట్ల కొరికేశాడు.

    అలాంటి రాత్రులు, భాస్వంత్ తో అలాంటి అనుభవాలు ఆర్తికి కొత్తకాదు. తనకు తోటినట్టు నలిపేయడమే తప్ప సుకుమారంగా, సున్నితంగా ఆమెని దగ్గరకు తీసుకోవటం అతనికి అలవాటు లేదు.

    ఆ క్షణంలో శరీరానికి, ఆ తర్వాత మనసుకీ గాయం కావడం, బడలికగా రోజంతా గడపటం ఆమెకి ఎప్పుడూ వున్నదే  కాని యిలా మరో వ్యక్తి దృష్టిలో పడడం కొత్త.
 

 Previous Page Next Page