Previous Page Next Page 
అభయారణ్యం పేజి 16


    ఏం చెప్పినా ధీర వూరుకోదని తెలుసు. అందుకే టాపిక్ ని మళ్లించాలనుకుంటూ అంది "మా ఆయన ఒక్కోమారు యిలా రెచ్చిపోతుంటాడు."

    "నిజమా!" ఆమె నిజాన్ని కప్పిపుచ్చుతుందని తెలిసిపోయింది. "రెచ్చి పోతుంటాడు. అంతేతప్ప నిన్ను రెచ్చగొట్టడు."

    "ఇదంతా దేని గురించే?"

    ధీర వెంటనే జవాబు చెప్పలేదు.
 
    నిట్టూర్పుగా చూసింది. "సెక్స్ లో మగాడు ఓ మృగంలా ప్రవర్తించడం అనూహ్యమైన విషయంకాదు. అది నేరమూ కాదే. కానీ శృంగారం తెలిసిన మగాడు ముందు ఆడదాన్ని అంతగా ప్రిపేర్ చేయాలి. అలా ప్రిపేర్ చేసినప్పుడు శరీరం తూట్లుపడేట్లు అతడి కోరిక తీర్చుకున్నా అమ్మాయి హార్ట్ కాదు. అది లేనప్పుడే తెల్లవారేక ఆడది శవంలా పడి రోజంతా నిర్జీవంగా గడుపుతుంది."

    "చాలా రీసెర్చి చేసినట్టున్నావు." అంది ఆమె చిరుకోపంగా.
 
    "లేదు. ప్రాక్టికల్ గా తెలుసుకున్నాను. ఇంకా వివరంగా చెప్పాలీ అంటే దయాకర్ నుంచి నేర్చుకున్నాను."

    తను ఓ పరాయి మగాడి గురించి చెబుతున్నానన్న ఆలోచన లేదు. కళ్లను అరమోడ్పులుగా మార్చి కలలోలా మాట్లాడుతుంది.

    "అసలు దయాకర్ మంచి ప్రియుడు, తెలివైన మగాడు మాత్రమే కాదే. తన ప్రజన్స్ ని స్వర్గంగా మలిచి ప్రతి కలయికనీ సరికొత్త అనుభవంగా మార్చగల వ్యక్తి ఆడపిల్ల సైకాలజీని క్షుణ్ణంగా చదివిన  జీనియస్."

    ఇష్టమైన వ్యక్తి గురించి ఏ ఆడపిల్లయినా ఇలా మాట్లాడుతుంది.

    కానీ ధీర మాటలు దయాకర్ ఓ మానవాతీతుడన్న భావాన్ని స్పురింపచేస్తున్నాయి.
 
    "నీకు నిన్న నేనో విషయం చెప్పలేదు ఆర్తీ!" ధీర భ్రాంతిలో వున్నట్టు గొణిగింది "అతడు భార్యని అమితంగా ప్రేమిస్తాడు కాని శృంగారంలో మాత్రం ఆమెకన్నా నన్నే యిష్టపడతాడు."

    నవ్వింది ఆర్తి - "ఇదో గొప్ప విషయం కాదు."

    "ఎందుకలా అంటున్నావు?"

    "అందుబాటులో వున్నదానికన్నా అప్పుడప్పుడూ మాత్రమే అందుకునే దానికోసం ఏ మగాడైనా ఆ మాత్రం ప్రత్యేకంగా ప్రవర్తిస్తుంటాడు."

    "అది నీకు తెలిసిన థియరీ కావచ్చు. కానీ ఈ ప్రపంచంలో అన్యోన్యంగా వున్న చాలా జంటలు సెక్స్ లో పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించగలుగుతున్నవాళ్లే."

    "అంతేతప్ప ప్రేమతో పనిలేదంటావు."

    "ప్రేమన్నది భార్యాభర్తలకి సంబంధించింది ఆర్తీ! అది నిజానికి రెలిటివ్ టెర్మ దాని ఇంటెన్సిటీని   తెలియచెప్పేది భార్యాభర్తలు బహిర్గతముగా ప్రవర్తించే విధానమే. ప్రేమలో సబ్మిషన్ వుంది - కాదనను. కానీ అది వట్టి మాటలతో పరిపూర్ణతను పొందలేదు. శారీరకమైన కలయిక దానికి శాశ్వతత్వాన్ని అందిస్తూంది. అంటే దైహికంగా ఒకరినొకరు అంకితమయ్యే ప్రొసెస్ లో ఒకరి నుంచి మరొకరు మానసికంగా ట్రాన్సిమిట్ చేసుకునే మౌన భాషకి సంకేతంగా నిలుస్తుంది ఆ ప్రేమ."

    "నాకు అర్దం కాలేదు."

    "ఒక మంచి మొక్కని నాటాలనుకోవడం ఇష్టం అయితే భూమిని తవ్వి విత్తనాన్ని వుంచి నీరు పోయడం అభిమానం అవుతుంది. అయితే ప్రతిక్షణమూ దాని పెరుగుదల గురించి ఆలోచిస్తూ అవసరమైనప్పుడు దానికి ఎరువును వేసి నేనున్నానన్న భావాన్ని ప్రకటిస్తూ దానికోసం పరితపించడం ఆరాధన లేదూ తాదాత్మ్యత. ప్రేమలో ఇలాంటి పరిపక్వతని అందించేది సెక్స్ మాత్రమే. అదికూడా పాతబడకుండా  కాపాడుకుంటే ఆ ప్రేమ పది కాలాలపాటు నిలుస్తుంది. దయాకర్ భార్యకి అర్దంకానిదిదే. అందుకే తను గాఢంగా ప్రేమించిన భార్యయినా రెసిప్రొకేషన్ తెలీని ఆమెకన్నా నన్నే ఎక్కువ కోరుకుంటాడు."

    అర్దంలేని తర్కంలా అనిపించింది ఆర్తికి. "కానీ ఇది నేను అవకాశవాదమంటాను. అలా కోపం తెచ్చుకోకే.  ఒకవేళ నువ్వన్నట్టు దయాకర్ కి భార్యమీద అంత ప్రేమ వుంటే, నీ అంచనా ప్రకారం అతడు మేధావి అయితే అతడి భార్యని తన వూహలకి అనుకూలంగా మలుచుకోవచ్చుగా."

    "మరో ఆడదానితో సంబంధం పెట్టుకునే ముందు ప్రతి భర్తా ఇలా మలుచుకోవాలని ప్రయత్నిస్తాడు ఆర్తీ! దయాకర్ కూడా చాలా ట్రైచేసి విఫలమై ఆ తర్వాత నాకు దగ్గరయ్యాడు. అయితే ఆదిలో మా పరిచయం సెక్స్ కోసం కాదు. ఇంటెల్లెక్చువల్ కంపెనియన్ షిప్ అవసరమై. అదే మా మధ్య స్నేహం పెరగటానికి కారణమైంది."

    "నువ్వెంత చెప్పినా..." ఆర్తి సాలోచనగా అంది "నువ్వు చెప్పిందిగాని, చేస్తున్నదిగాని నాకు సమంజసంగా అనిపించడం లేదు. ఎందుకో దాంపత్యంలో సమస్యలకి యిలాంటి ఆల్టర్నేటివ్స్ వెదుక్కోవడము పరిష్కారం కాదన్నది నా అభిప్రాయం."

     "అది సాంప్రదాయాల ముసుగులో కుమిలిపోతూ చావాలనుకునే వాళ్ల సిద్దాంతం" ధీర కాస్త ఆవేశంగా అంది "ఏం! నువ్వింత తెలివైన దానివే నీ భర్తని నీకనుకూలంగా మార్చుకోగలిగావా? నేనూ మా బావని మంచి భర్తగా మలుచుకోగలిగానా? అలాగే దయాకర్ కూడా."

    "అదికాదు ధీరా! ఒకవేళ మలుచుకున్నా కొంతకాలానికి అది రొటీన్ అయిపోతుంది."

    "కాకుండా చూసుకోవడమే మంచి దాంపత్యమంటే."

    "అంటే భార్యాభర్తలు ఇద్దరూ అదే పనిమీద వుండాలా?"

    "తప్పదే లేకపోతే వాళ్లు వాళ్లకోసం కాక సంఘాన్ని మభ్యపెడుతూ బ్రతకడం కోసం బ్రతుకుతున్న  వాళ్లవుతారు" ధీర క్షణంఆగింది. "ఉదాహరణకి మనల్నే తీసుకుందాం.  అయిదో తరగతి చదివేటప్పుడు మనకి కీట్స్ షెల్లీస్ గురించి తెలీదు. అప్పటి సిలబస్ ని బట్టి, మన ఎదుగుతున్న కొద్దీ, క్లాసులు మారుతున్న  కొద్దీ కొత్త సిలబస్. జీవితం గురించి కొత్త అవగాహనలు తద్వారా అనుభవాలు, విస్తృతం కావడాలూ మామూలేగా."

    "అంటే దాంపత్యమూ అంతే అంటావ్."

    "ఎస్! తొలిరాత్రి దాటాక బంధం ఆగిపోతే అది మురికి కొలనుగా మిగిలిపోతుంది. దాన్ని నిరంతరం ప్రవహించే నదిగా మార్చుకోగలిగితే చివరికి చేరే సముద్రం దాకా సంతోషంగా సాగిపోతాం. ఉదాహరణకి దయాకర్ భార్యనే తీసుకుందాం...."
 

 Previous Page Next Page