Previous Page Next Page 
అభయారణ్యం పేజి 14


    "ఓరి బడుద్దాయీ! నీ ముందే నీ పెళ్లాం నన్ను అంతలేసి మాటలంటుంటే నేనూరుకోవాలా? ఖర్మరా, అంతా నా తలరాత. ఎవర్ననీ లాభమేమిటి"కళ్లొత్తుకుంటూ కొడుకుని తిట్టి విసవిసా బయటికి నడిచింది సరస్వతమ్మ.

    ఆర్తి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ బయట ఎంతసేపు నిలబడిందో ఆమెకే గుర్తులేదు.
 
    గుండె రగిలిపోతూంది.

    అత్తయ్య మాటలు మేకుల్లా మనసుకి గుచ్చుకుని శరీరంలోని రక్తం సలసలా  కాగిపోతూంది.
 
    ఏమిటి తన జీవితం?

    రేపు ఏం కాబోతూంది?

    ఒకవేళ తనను యింతకుమించి అర్దం చేసుకుని భర్త బలవంతంగా పుట్టినింటికి  పంపితే పల్లె ఏమనుకుంటుంది? అసలు నాన్న బ్రతుకుతాడా?

    అయినా ఇష్టం లేకపోతే పుట్టింటికి వెళ్లిపొమ్మని ఎంత సులభంగా అనేయగలిగాడు.

    తను కోరుకున్నది నవల్లోనివీ, సినిమా్లలోనివా? వయసులో వున్న ప్రతి ఆడపిల్లకీ కొన్ని అభిరుచులు వుంటాయని, అవి తీర్చగలిగేది భర్త మాత్రమేనని ఎందుకు అర్దం చేసుకోలేకపోతున్నాడు?

    తనకున్న చెలిమి కన్నీళ్లతోనే అన్నట్టు కంటి చెలమల్లో నుంచి నీరు ధారకడుతుంటే అలసటగా, ఆయాసంగా నిలబడిపోయింది చాలాసేపు.

    "రా... లోపలికి."

    భాస్వంత్ కంఠం వినిపించింది. సమీపంలో నిలబడికాదు - బెడ్ రూం లో నుంచే పిలిచాడు.
 
    శూన్య వేదికపై నిలబడినట్టు ఒంటరితనం. అతడి  పిలుపుతో అణువంత ఉపశమనంలాంటిది అనిపించినా అదీ కొద్దిసేపే.

    దగ్గరకు తీసుకుంటున్నాడేమో అనుకుంది అతడి చేతులు భుజం పైపడగానే.
 
    లేదు....

    బ్లౌజు హుక్స్ కోసం తడుముతున్నాడు.

    దానికీ బాధపడలేదు ఆర్తి యవ్వనానికి అర్దం కోరిక పుట్టగానే ఆవేశాన్నిచల్లార్చడం అనిపించేట్టు భావించే భాస్వంత్ కనీసం ఇంతసేపూ జరిగిందానికి కొద్దిపాటి ఓదార్పునీ అందించటానికి ప్రయత్నించడంలేదు.

    ఒంటిసైజు తీసుకునే టైలర్ లా ఒక్కోటీ పీకేస్తూ ఉపదేశిస్తున్నాడు - "నాకు కొన్నిప్రిన్సిపిల్సున్నాయి ఆర్తీ! ఆడదంటే అణకువగా వుండాలి. నిజానికి మా వంశ సాంప్రదాయం కూడా అదే...." రఘువంశానికి చెందిన రాముడి స్థాయిలో తన గురించి తను ఎరుకపరుస్తూ ఆమెను బెడ్ మీదకి నెట్టాడు. "మగాడి మనసు తెలుసుకుని ప్రవర్తిస్తే తప్ప ఏ ఆడదీ సుఖపడలేదన్నది నా బలమైన నమ్మకం."

    అతడు మీద డి ఆక్రమించుకుంటూ నీతిసూక్తుల్ని వల్లెవేస్తుంటే అసహ్యంగా వుంది. ఏ క్షణంలో ఏం మాట్లాడాలో తెలీని అతడి అవివేకానికో లేక యిలా ఎంతకాలం అనే ప్రశ్న కలిగిస్తున్న భయానికో కళ్లు మూసుకుంది బాధగా.
 
    పక్కకి ఒరిగాడు పని  పూర్తయినట్లుగా.

    అసలు తనకోసం ఆలోచించే భర్త తనకున్నాడనే క్షణాల్ని తప్ప తను ఏం కోరుకుంటూందని!

    అలా ఆలోచించడం నేరమంటాడేం?

    ఒక చిన్న ఆత్మీయత కోసం తపించడం తప్ప తను అతడ్ని ఏం యిబ్బంది పెట్టిందని?

    గుండె గుహలో అజంతాలా కాకపోయినా, యవ్వనపు ఎల్లల్ని నిమిరే ఎల్లోరాలా అనిపించకపోయినా, తను పరిచే బ్రతుకు మైదానంలోకి అప్పుడప్పుడైనా లాలిత్యంగా  నడిచి రమ్మనీ, అలసిన తన అరమోడ్పు కనురెప్పల మీద అణువంత పెదవుల ముద్ర వేసి తెగిపోతున్న ఆశల తంత్రులకి కాస్త ఆసరా యిమ్మనీ కోరుకుంటుందే తప్ప తనేం తప్పు చేస్తూందని?

    తల ప్రక్కకి తిప్పి చూసింది.

    అప్పటికే నిద్రలోకి జారుకున్నాడతను.

    మరో గదిలో అత్తయ్య.

    కాళరాత్రిలా అనిపించిందామెకి.

    అదికాదు...

    ధీర మాటలు,ఆమె ఆలోచనలు జ్ఞప్తికొచ్చి తలపై నర్తిస్తుంటే బాధగా పైకి లేచింది.
 
    గదిలో ఓ మూలనున్న టేబుల్ లేంప్ వెలిగించి నవల పేజీల్ని తిప్పుతూందిగానీ ఏకాగ్రత కుదరడంలేదు.

    ఈరోజు ఎందుకిలా అయింది?

    తనలో నిద్రాణమై వున్న అసంతృప్తికి ధీర మాటలు ఊపిరినిచ్చాయా?

    అదే నిజం కాకపోతే ప్రత్యేకించి  తనెందుకింత ఆవేశంగా ప్రవర్తించింది?

    ఆందోళనగా వుంది.

    మనిషి జీవితాన్ని నిర్దేశించేది ఉద్రేకపరిచే అనుభవాలా లేక ఆ మనిషి మనసా అన్నది ఇదమిత్దంగా బోధపడటంలేదు.

    ధీర ఇప్పుడేం చేస్తూ వుంటుంది?

    దయాకర్ తో.....

    ఛఛ...

    ఉద్విగ్నంగా నవల్లోకి చూసింది తనను తాను నిగ్రహించుకుంటూ.

    "ప్రియా! నువ్వు నమ్మలేవుగానీ నీలో నేను అప్పుడప్పుడూ నా తండ్రిని చూసుకుంటూ వుంటాను."

    ఆర్తి ఆగిపోయింది కాదు... అవే వాక్యాల్ని మళ్లీ చదివింది.

    అవి వాక్యాలలా అనిపించలేదు. కారుణ్యంతో ఒక ఆడపిల్ల మనసుని కావ్యంగా వివరించే స్మృతుల ముత్యాల సరాల్లా అనిపించాయి.

    "నిజం ప్రియా! మొన్న నీ సమక్షంలో నేను కంటతడి పెట్టుకుంటే నువ్వే చేశావో  గుర్తుందా? నీ చూపుడు వ్రేలితో నా కళ్లు తుడిచి నేనున్నానూ అన్నట్టు ఆర్తిగా నా కళ్లల్లోకి చూశావు. అరచేతికి సరిగా పండని గోరింటాకు గురించో, పండక్కి కొనని పరికిణీ గురించో నేను నాన్న దగ్గర అశ్రుశిక్తంగా  నిలబడితే నాన్న కూడా నా కళ్లు  అలానే  తుడిచేవాడు. అందుకే నీలో నేను నాన్నని చూసుకున్నాను. నీ చిటికెన వ్రేలు పట్టుకుని యీ అనంత విశ్వం దాగా నడవగలనని మనసారా అనుకున్నాను.
 

 Previous Page Next Page