Previous Page Next Page 
క్రిమినల్స్ -1 పేజి 15


    మధుమూర్తి మాటలో ఒకింత ఆందోళన స్పష్టమయింది.

    పట్టాభి నవ్వాడు. విరగబడి నవ్వాడు.

    "అందుకే మనం పిడి పట్టుకుంటాం. అప్పుడు కత్తికి ఎదురు, ఎడమ, కుడివేపులే  బలవుతాయ్ కాని మనవేపు కాదు" పట్టాభి దిలాసాగా అన్నాడు.

    "నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళి వుండవలసింది బాగా పైకి వచ్చేవాడివి. ఎందుకంటే  పరమలుచ్చాలు రాజకీయాల్లో బాగా రాణిస్తారని చరిత్ర చెబుతుంది."

    పట్టాభి గుర్రుగా చూశాడు.

    "కోపం తెచ్చుకోకు. నేనన్నమాట గొప్ప క్వాలిఫికేషన్ క్రింద లెక్క. నువ్వు మామూలుగా  వుంటే.... ఊరా? పేరా? డబ్బా?

    అదే రాజకీయాల్లోకి వెళ్ళావనుకో_పదవి చేజిక్కించుకున్నావనుకో ఆయుధాల్లో  కమీషన్స్-స్విస్ లో నిల్వలు-లైసెన్స్ ల కుప్పలు.

    దేశాన్ని  నంజుకు  తినే వయస్సు.

    పదవి పోయినప్పుడు ఒకరకంగా-

    పదవికోసం ఒకరకంగా-

    పదవిని  నిలబెట్టుకునేందుకు ఇంకొకరకంగా -

    పార్టీ పదిలం  చేసుకునేందుకు  వేరొకరకంగా - నోటికొచ్చినట్లు  వాగొచ్చు.

    నువ్వు ఎంత మాట్లాడినా  వేసుకునేందుకు  పత్రికలుంటాయి. నమ్మేందుకు  వెర్రిబాగుల  ప్రజలుంటారు. అనుక్షణం అబద్ధాలు చెప్పగల గటం ఎంత అదృష్టం.

    దేశభక్తి  నాకేవుంది. మిగతావారికిలేదు  అనొచ్చు. అది లేకపోతే  అవిచేస్తాననొచ్చు. అనుయాయులకు పదవులివొచ్చు. ప్రజాసేవకే పుట్టానని, ప్రజలకే నా జీవితం అంకితం అని మా పార్టీ పుట్టింది దేశాన్ని ఉద్దరించటానికని, మాకు స్వార్ధంలేదని-

    మేం తినడంలేదని, ఫలానావాడే నియంతని, ఫలానావాడికే ఎక్కువ వుందని, ఒక్కటేమిటి....ఎన్ని జోకులయినా వేయవచ్చు.

    ఎన్ని అబద్దాలయినా ఆడేయవచ్చు. ఉన్న పార్టీకి వెన్నుపోటు పొడిస్తే పక్కపార్టీ, డబ్బులేని పార్టీని పొగిడితే సీటు. ఈ దేశప్రజలు చైతన్యవంతులుకారు.

    వెధవ మీటింగులు పెట్టినా గొర్రెల్లా వస్తారు చూశావా. మనదేశ జనాభాని  పుట్ బాల్ ఆడుకుంటూ  ఎన్నిరకాలుగా బాగుపడొచ్చో. ఇంతకంటే  గొప్పవ్యాపారం  మరొకటి  లేదని నా అభిప్రాయం. మిగతావ్యాపారాలకి లైసెన్స్ లు, పెట్టుబడులు కావాలి.

    యంత్రాలు  కొనాలి, సరుకులు కొని అమ్మాలి, ఇక్కడో....రాష్ట్రాల్ని, దేశాన్ని, జనాన్ని అమ్ముకుంటే  చాలు. ఏజ్ బార్ లేదు. రిటైర్మెంటులేదు. హాస్పిటల్ లో అవసానదశలో  వుండికూడా ఎలక్షన్స్ లో గెలవొచ్చు.

    సంతకం పెట్టే ఓపికకూడా లేని  దీర్ఘ రోగికి కూడా పట్టం కడతారిక్కడ. ప్రజలసొమ్ముతో అమెరికా వెళ్ళి ఆరోగ్యం కొనుక్కోవచ్చు. నీతి నిజాయితీ సామర్ధ్యంకూడా వుండక్కరలేదు. సొంత పనులొదిలేసి పక్కపార్టీల్ని పడగొట్టడం చేతనయితేచాలు. అందుకే రాజకీయాల్లో చేరటానికి లుచ్చాతనమే గొప్ప అర్హత.

    ప్రాణమిత్రుడ్ని  దెబ్బకొట్టి  మనం పరమనీచులవుతున్నాం. ఒక్కసారయినా ,వెయ్యిసార్లయినా  ఒకటే అందుకే అంటున్నాను.

    నిన్ను విమర్శించటానికి కాదు. నువ్వు రాజకీయాల్లో చేరు. ఆవేపు నుంచి  జనాన్ని నంజుకుతింటారా, నేను ఇటువేపు మరో నికృష్టమైన వ్యాపారాన్ని ఆరంభిస్తాను.

    అదే ఫైనాన్స్ అండ్ ఇన్ వెస్టుమెంట్ బిజినెస్. ఇరవయి ముప్పయిశాతం  వడ్డీలనీ పిచ్చిజనాన్ని నమ్మించి నట్లేట్లో ముంచేసి నీ వెనకొచ్చి దాక్కొంటాను. కాని ఒకటి గుర్తుపెట్టుకో. ఎవరెంత సంపాదించినా చెరిసగం పంచుకోవాలి ఓకె...."

    మధుమూర్తి తన ఎనాలసిస్ చెప్పుకుపోయాడు.

    పట్టాభి  ఆలోచనల్లో  పడ్డాడు.

    మొత్తానికి ఓ గంటకి  యిద్దరు ఓ ఒప్పందానికొచ్చారు.

    పట్టాభికి రాజకీయ వ్యాపారం.

    మధుమూర్తిది ప్రలోభ వ్యాపారం.

    లాభం చెరిసగం.

    ఇద్దరూ  సాధ్యమైనంత  ఎక్కువమందిని మోసంచేసి ముంచెయ్యాలి.

    పట్టాభిని  గెలిపించే పని మధుమూర్తిది.

    మధుమూర్తిని చట్టం నుండి  రక్షించే  బాధ్యత పట్టాభిది.

    ఇద్దరూ  ఆనందంగా  మర్చిపోయి  మరోసారి  చీర్స్ చెప్పుకున్నారు.

    దుర్గాదాసులాంటి  పరమకిరాతకుడు కూడా మారి ఒప్పందం విని ఉలిక్కిపడ్డాడు.


                                o    o    o


    రెండోరోజు....ఉదయ్ ఎప్పటిలా  నాలుగున్నరకి స్కూలు నుంచి బయటికొచ్చాడు.

    రాజర్షి అతన్ని అనుసరించసాగాడు.

    ఈలోపు  రాజర్షి  అనుచరులు  ఆ ఊర్లో  వున్న ఏకైక సినిమా హాలుకి వెళ్ళి మేనేజర్ తో మాట్లాడి కొన్ని సినిమాపేర్లు చెప్పి వాటినే ఆడించఅని కొంతసొమ్ము  అప్పజెప్పారు.

 Previous Page Next Page