Previous Page Next Page 
క్రిమినల్స్ -1 పేజి 14


    ఆ మరుసటిరోజు ఉదయమే  అతని అనుచరులిద్దరూ  రంగప్రవేశం చేశారు.

    అనుచరుల రంగప్రవేశం  వార్త దుర్గాదాసు ఎంతో  జాగ్రత్తగా పట్టాభికి చేర్చాడు.

    చేర్చడంతోపాటు  రాజర్షి ఉగ్రరూపం  దాల్చడానికి అవసరమైన  ఉప్పులాంటి  సూచననుకూడా అందించాడు....

    దాని ప్రకారం రాజర్షి అనుచరులు పరమశివం, శశిభూషణ్ ల అవమానానికి గురికావాలి.

    పట్టాభి వెంటనే గతంలో  పరమశివం, తాము కలిసి వున్నప్పుడు  అందరికి మిత్రుడయిన  ఒక వ్యక్తిని పిలిపించి  అతనిచేతిలో  అయిదువేలు పెట్టాడు. అప్పుడు చెప్పడం  ప్రారంభించాడు పట్టాభి.

    "ఇప్పుడు నువ్వు చేయవలసింది  వాళ్ళిద్దరి మూడ్స్  అప్ సెట్ చేయాలి. రాజర్షి అనుచరులు మా తరపున రాయబారానికి  రాబోతున్నట్లు తెలియజేయాలి. రాయబారం సఫలీకృతం కాకపోతే బెదిరించటానికయినా  వాళ్ళు సిద్ధంగా వున్నారు. అని వారిని ఆవేశపరుల్ని  చేయాలి. మరో విషయం. ఇది నీకై నీవు మాకు గతంలోవున్న స్నేహంపోయిందే అన్న బాధతో  పరమశివం, శశిభూషణ్ క్షేమంపట్ల వర్రీ అవుతూ చెప్పినట్లుగా  వుండాలి. ఆఖరిగా పట్టాభి, మధుమూర్తి దొంగవెధవలు. వాళ్ళరాయబారాన్ని  ఖాతరు చేయవద్దు అని చెప్పుతో  కొట్టినట్లు  సమాధానం  చెప్పమని సలహాఇవ్వు. అనుకున్నది అనుకున్నట్లు  జరిగితే  ఇంకో ఐదిస్తాం. జాగ్రత్త...."

    చేతిలో వున్న  ఐదువేలు చూసుకుని అతనికళ్ళు  మెరిస్తే  రాబోయే ఐదువేలను తలచుకుని అతని మనసు ప్రలోభపడింది.

    అతను మెంటల్ గా ప్రిపేర్ అవుతూ  బయలుదేరాడు. సరిగ్గా అప్పుడే  అనుచరులు  రంగప్రవేశం చేశారు.

    అక్కడ  ఆశ్రమంలో  దుర్గాదాసు.

    ఇక్కడ  పట్టాభి, మధుమూర్తి  ఆందోళనగా ఎదురు చూస్తుండగా పట్టాభి  నియమించిన వ్యక్తి శశిభూషణ్  ఇంటిలోకి ప్రవేశించాడు.

    అనుకోకుండా పరమశివంకూడా ఆ సమయంలో  అక్కడే వుండటం  ఆ వ్యక్తికి ఆనందం కలిగించింది.

    ఆ వ్యక్తి  పరామర్శలయ్యాక  నిప్పుతో ఉప్పువేయటం  ప్రారంభించాడు.

    అనుచరులు  ముందుగా పరమశివం యింటికి వెళ్ళారు.

    అతను శశిభూషణ్  ఇంటికెళ్ళినట్లు  తెల్సుకుని అక్కడికే  బయలుదేరారు వేగంగా.

    సరిగ్గా  అనుచరులు శశిభూషణ్  ఇంటికొచ్చేసరికి పట్టాభి పంపించిన వ్యక్తి  తను తీసుకున్న  డబ్బుకు  న్యాయం  చేకూర్చాడు.

    రాజర్షి అనుచరులు పరమశివం, శశిభూషణ్ ల విరసనను మోసుకుని ఆశ్రమానికి  బయలుదేరారు ఆవేశంగా....

    "సరిగ్గా  పదోరోజుకు  పని పూర్తయిపోతుంది. రాజర్షి నిర్ణయం తీసుకున్నాడు."

    పట్టాభి ఆనందంగా అన్నాడు.


                                o    o    o


    సరిగ్గా  4.30కి రాజర్షి  ఉదయ్ స్కూల్ ముందువున్నాడు. అప్పటికే  అతనిమెదడులో  అద్భుతమైన  పధకం  ఒకటి  రూపుదిద్దుకుంది.

    దాన్నే  నెమరువేసుకుంటూ  అతను ఉదయ్ రాకకోసం  ఎదురుచూస్తూ కూర్చున్నాడు.

    రక్తపాతం, భీభత్సం, హింసలాంటి వాటితో పనిలేకుండా  పరమశివం, శశిభూషణ్ లు జీవితాంతం కుళ్ళికుళ్ళి ఏడ్చేలా  రాజర్షిలాంటి  మేధావి పథకంతో  రంగంలోకి దిగాడని వారికింకా  తెలియదు.

    సరిగా 4-30కి స్కూల్ బెల్ మ్రోగింది. పిల్లలు ప్రవాహంలా బయటకు  దూసుకొచ్చారు.

    రాజర్షి  పోలీసు జాగిలంలా ఉదయ్ కోసం అన్వేషిస్తున్నాడు.

    క్షణాలు....నిమిషాలు__దొర్లిపోతున్నాయ్.

    ఒకింతసేపు గుంపులు గుంపులుగా చేరి అల్లరిచేసుకున్నాక  విడిపోవటం  ప్రారంభించారు పిల్లలు.

    ఉదయ్ ని అప్పుడు గుర్తుపట్టాడు  అతను. లేచి నెమ్మదిగా  నడక ప్రారంభించాడు. అతని మెదడునిండా  ఇప్పుడు చిన్నపిల్లల  మనస్తత్వం గురించిన  ఆలోచనలే చోటుచేసుకున్నాయి.

    అరఫర్లాంగు  నడిచేవరకూ రాజర్షి ఉదయ్ దృష్టిలో  పడకుండా  జాగ్రత్తపడుతూ  అతన్నే పరిశీలించ సాగాడు.

    కేవలం  అయిదారడుగులదూరాన్ని  మెయిన్ టెన్ చేస్తూ.

    హుషారయిన కుర్రాడు ఊరకే  ఉద్రేకపడిపోయే  మనస్తత్వం. అనవసరంగా మాటంటే  పడని  ఆత్మాభిమానం. ఆవేశమొస్తే  అంతుచూపే పౌరుషం. వీటన్నిటికీ తోడు తెలుగుసినిమా హీరోలా  సాధ్యమైనా, కాకపోయినా అన్నీ తనే చేయాలనుకునేడ్రీమర్. సన్నని చిరునవ్వు రాజర్షి పెదవులపై క్షణకాలం మెరిసి అదృశ్యమైంది.


                                o    o    o


    పట్టాభికి  ప్రపంచాన్ని  జయించినంత  ఆనందంగా వుంది. రాజర్షిని రంగంలోకి దింపగలిగినందుకు  దుర్గాదాసుని ఆకాశానికెత్తి వేస్తున్నాడు.

    సరిగా  తొమ్మిదిరోజులలో  శత్రునాశనం  పరి సమాప్తం. "ఊరకే అలా ఆనందపడిపోకు పట్టాభి. రాజర్షి రెండువేపులా పదునున్న  కత్తిలాంటివాడు....ఓవేపు  అటుకేసి  నరుక్కెలుతుందని  ఆనందపడిపోతూ ఆదమరిస్తే. ఈవేపు మనకేసి నరుక్కుంటూ  వస్తుంది."

 Previous Page Next Page