అతన్నే గమనిస్తున్న కీర్తి అతను తనవైపు చూడగానే చటుక్కున తల దించుకుంది.
హర్ష చిన్నగా నవ్వి "కీర్తీ! పెళ్ళెప్పుడు?" అన్నాడు.
కీర్తి సిగ్గుగా నవ్వి "త్వరలోనే" అంది.
"తెల్లగా, పొడుగ్గా వుంటాడూ నిన్ను అప్పుడప్పుడూ డ్రాప్ చేస్తాడూ అతనేనా?" అన్నాడు హర్ష.
'బాస్ మంచి రొమాంటిక్ మూడ్ లో వున్నాడు' అనుకుంటూ "అతనే" అంది కీర్తి.
"అతన్ని అదృష్టవంతునిగా మార్చు" అన్నాడు.
ఆమె అర్ధం కానట్లు చూసింది.
హర్ష పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. కళ్ళు మూసుకుని వెనక్కి జారగిలబడుతూ "మగవాడ్ని అదృష్టవంతుడిగా లేక దురదృష్టవంతుడిగా మార్చటం అన్నది అతని భార్య చేతుల్లోనే వుంటుంది" అన్నాడు.
కీర్తికి తెలుసు ఆ కనుల ముందర ఎవరి రూపం కదలాడుతోందో.
అతను మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు ఇచ్చినప్పుడు, ఇంత అందగాడూ, మంచివాడూ అయినా భర్తని కట్టేస్తున్నందుకు అమృత మీద ఈర్ష్యగా అనిపించింది కీర్తికి.
అయితే రిసెప్షన్ లో అమృతాని చూశాక అందరికీ హర్ష మీద ఈర్ష్య కలిగింది. స్త్రీ అయినా కీర్తికి కూడా! 'ఎడ్వర్ టైజింగ్ కంపెనీ జి.ఎం.కి ఆ మాత్రం టేస్టు వుండదా' అనుకున్నారు తరువాత.
కీర్తి కూడా అందమైన అమ్మాయే. రోడ్డుమీదా, బస్సుల్లోనూ ఆమె వెనుకపడి ఫాలో అయ్యేవాళ్ళకీ, ఆమెకి వచ్చే ప్రేమలేఖలకీ కొదవలేదు. కానీ ఆమె ఆఫీసులో చేరిన మూడేళ్ళల్లో ఒక్కసారి కూడా హర్ష ఎప్పుడూ చనువు చూపించడం కానీ, ఎక్కువగా మాట్లాడటం కానీ చెయ్యలేదు. అతని పెళ్ళయ్యాకనే కొద్దిగా చనువుగా మాట్లాడటం మొదలు పెట్టాడు. అదీ, అమృత గురించి చెప్పుకోవడానికి ఒకరు కావాలి కాబట్టి.
తను కూడా తలమునకలుగా ప్రేమలో వుంది కాబట్టి కీర్తికి అతని బాధ అర్ధం అవుతోంది; కానీ అర్ధంకానిడల్లా ఒకటే విషయం! పెళ్ళయ్యాకా ప్రేమించే ప్రేమలు కూడా ఇంత ఘాటుగా వుంటాయా?" అని.
ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆఫీసు పనిలో మునిగిపోయారు.
* * *
హర్ష చాలా బిజీగా పని చేసుకుంటుంటే, అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ మోగింది.
విసుగ్గా "హలో" అన్నాడు. అవతలనుంచి అమృత.
"నేనే. నాకు చాలా బోర్ గా వుంది తెలుసా?" అంది.
"నేను చాలా బిజీగా వున్నాను తెలుసా?" అన్నాడు హర్ష సీరియస్ గా.
"అంటే, ఫోన్ పెట్టెయ్యమనేనా?" ఉక్రోషంగా అడిగింది.
"ఔను" అంటూ తను ఫోను పెట్టేసి, తిరిగి పనిలో నిమగ్నమైపోయాడు.
మళ్ళీ ఫోన్ మోగింది. కోపంగా ఫోన్ ఎత్తాడు అతడు.
"హలో" అనగానే"...నేను, బోర్ గా అలా పెట్టేశారేమిటో. అనవసరంగా మీ ఆఫీసుకొచ్చి ముద్దు పెట్టుకున్నాను. ఇప్పుడేమో ఇంకా కావాలనిపిస్తోంది..." గారంగా అడిగింది.
"అమ్రూ, అల్లరి చెయ్యకు నాకు వూపిరి సలపనంత పని వుంది. అర్జెంట్ గా కొన్ని ఫైల్స్ హెడ్ ఆఫీసుకి పంపించాలి. తర్వాత నేనే చేస్తాను, పెట్టేయ్!" అంటూనే పెట్టేశాడు.
ఆ తరువాత అతను నిజంగానే చాలా బిజీగా అయిపోయాడు.
కాసేపటికి మళ్ళీ ఫోన్ అందుకుని "హలో" అన్నాడు. అవతలవైపు నుంచి "హర్షగారూ వున్నారా అండీ?" అన్న కంఠం వినిపించింది.
హర్షనే మాట్లాడుతున్నాను, చెప్పండి" అన్నాడు గంభీరంగా.
"నా పేరు రామాచారి. మీరు చిక్కడపల్లిలో వున్నప్పుడు మీ ఎదురింట్లో..." హర్షకి ఎవరూ గుర్తురాలేదు. అసహనంగా నుదుటి మీద చూపుడు వేలుతో రాసుకుంటూ-క్షణం ఆలోచించి "సారీ, నాకు గుర్తురావటం లేదు" అంటూ ఫోన్ పెట్టేయ్యబోయాడు.
"మా నాన్నగారు ఆచారిగారు మీ తండ్రిగారికి బాగా తెలుసు. చిన్నప్పుడు మీకు రొంప పడితే మందిచ్చేవారట కూడాను."
కంఠంలో విసుగు దాచుకుంటూ "చెప్పండి ఏదైనా పని చేసి పెట్టాలా" అన్నాడు. నిజంగా అతడు చాలా బిజీగా వున్నాడు.
"అయ్యో అవసరం లేదండీ నాన్నగారు ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా వుందో కనుక్కోమన్నారు" అన్నాడు.
హర్ష నొచ్చుకుంటూ, "బాగా వుందని చెప్పండి. థాంక్యూ" అన్నాడు."...వెళ్ళేలోపులో వీలైతే మా ఇంటికి రండి" అంటూ అడ్రస్ చెప్పాడు.
నేనూ, మా చెల్లీ వచ్చామండి. చెల్లికి ఇక్కడ కంపెనీలో ఇంటర్వ్యూ వుంది. హోటల్ "స్వర్గం"లో దిగాం. సాయంత్రం వెళ్ళిపోతున్నాం. ఈసారి వచ్చినప్పుడు తప్పక వస్తాం."
"సరే అలా అయితే" అని ఫోన్ పెట్టేశాడు హర్ష.
తనొక ఉచ్చులో ఇరుక్కోబోతున్నానని అతడికి ఆ క్షణం తెలీదు.