Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 15

     "ఇంతకుముందు అంబాజీ బృందంతో కలిసి వచ్చినప్పుడు ఇదే చెంచుగూడెంలో రాత్రిపూట బస చేశాం. గూడెం వద్ద పెద్దమనసున్న వాడు మాకు ఆ రోజు చాలా చక్కటి ఆతిధ్యం ఇచ్చాడు జింక మాంసం,  ఇప్పసారాతో సారా త్రాగనంటే  బలవంతం చేసి త్రాగించాడు.  నిజంగా జీవితంలో మరచిపోలేని ఆతిధ్యం ఇచ్చాడు. నాగరికతకు దూరంగా, అలాంటి అతిధి సత్కారం దొరుకుతుందని అసలు ఊహించలేం."   
       
    వీళ్లు అడవి మనుషులేగానీ మంచి మనసున్న వాళ్లు. ఆతిధ్యమివ్వడమంటే తన భాగ్యంగా భావిస్తారు వీళ్లు. ఈ గూడెంపెద్ద నాకూ పరిచయమే. ఇతడి ఆతిధ్యం నేనూ ఎన్నోసార్లు పొందాను. ఈ అడవిలో  ఏ మొక్క ఎక్కడుందో, ఏ పుట్ట, ఏ గట్టు ఎక్కడుందో అంతా కొట్టినపిండి ఈ గూడెం పెద్దకు. మూలికా సేకరణలో నాకు చాలా చక్కని సహకారం ఇస్తాడు. డబ్బు ఇస్తే తీసుకోడు. అలాంటి మనుషులు చాలా అరుదుగా వుంటారు."

    గుడిసె ముందు నులకమంచం మీద కూర్చుని, చుట్టలాంటిదేదో గుప్పుగుప్పున పీలుస్తున్నాడు గూడెంపెద్ద. వీళ్లను చూడగానే లేచాడు.

    "శాన్నాళ్లకి వస్తిరి అయ్యగారూ! బాగున్నారా?"

    "ఆ ... బాగున్నాను. మీరంతా క్షేమమేకదా?"

    "ఆ..... అంతా బాగున్నమయ్యగారూ. ఈ డాక్టరుబాబు మళ్లీ వచ్చారే? మా అడవి అంటే శానా ప్రేమ వున్నట్టుంది."

    "చెట్లకోసం నేనొస్తుంటే నాతో వచ్చారు."

    "బ్రాహ్మలు... రాత్రివేళ వస్తిరి.  మీకు భోజనం... అదీ...."

    "మా భోజనం గురించి నువ్వు చింత చేయొద్దు పెద్ద మనిషీ .............!బియ్యం, పాత్రలు వెంటతెచ్చాను. ఆకులు కూడా దారిలో కోసి  తెచ్చాను కొన్ని కట్టెపుల్లలు ఇస్తే, గుడిసెముందు రాళ్లు పెట్టి  వంట చేసుకుంటాము పచ్చళ్లున్నాయి. పెరుగుంది.  మా బ్రాహ్మలకి అంతకంటే  చక్కని భోజనం ఇంకేముంటుంది చెప్పు?"

    "మాకాడ ఆవునెయ్యుంది అయ్యగారూ!"

    "అంతకంటే ఇంకేం కావాలి. వేడి వేడి అన్నం, పచ్చళ్లు, మంచి నెయ్యి.... మంచి ఆకలిమీదున్న వాళ్లకి పంచభక్ష పరమాన్నాలతో సమాన మనుకో."

    చివరికి భైరవుని కొండ దిగువన వున్న ఆంజనేయస్వామి సన్నిధినే తన తపస్సుకు అనువైదిగా ఎంచుకున్నాడు సూర్య. గుడిముందున్న కోనేట్లో స్నానంచేసి, గుడి ముందున్న అశ్వర్ద  వృక్షం కింద అరుగుమీద పద్మాసనంలో కూర్చుంటున్నాడు సూర్య. అతడి చేతిలో జపమాల నిశ్శబ్దంగా కదులుతూ వుంటుంది.

     ఆకలిదప్పులు వేధించకుండా దేశికాచారి ఏవో దుంపలు, మూలికలు అతడిచేత తినిపించాడు.

     ఆ ఆడవిలో మూలికల కోసం తిరుగుతున్నప్పుడు తినడానికి మంచి ఫలాలు దొరికితే తెచ్చి పెడుతున్నాడు.
 
     సూర్యాస్థమయం వరకు ధ్యానం. తరువాత ఏదైనా కొంచెం తిని, ఆవుపాలు త్రాగడం. ఆవుపాలు గూడెం పెద్ద ఇస్తున్నాడు.

     దేశికాచారి మాత్రం ఒక్కపూట వంట చేసుకుంటున్నాడు. రాత్రికి పళ్లు, పాలతో గడిపేస్తున్నాడు.

    ఇధ్దరూ నిద్ర  వచ్చేవరకూ ఆధ్యాత్మిక విషయాలమీద చర్చించుకుంటారు.

    దేశికాచారికి వేదాంత విషయాలలో మంచి పరిజ్ఞానం వుంది. అతడు ఏది చెప్పినా శ్రద్దగా వింటున్నాడు సూర్య.
 
     అతడి మాటలు వింటూంటే ఈ ప్రపంచం ఒక నాటకరంగమని, మనుషులంతా పాత్రధారులని అనిపించకమానదు. నాటకంలో తను పాత్ర పరిధి ఎంతో అంతే. అయిపోగానే రంగస్థలం మీదినుండి నిష్క్రమించక తప్పదు.

 
                       *    *    *    *    *   


    ఒకరోజు మునిరాజు, మారుతి బృందం అక్కడికి వచ్చేసింది. కోనేటి ప్రక్కనే డేరా వేశారు.

    ఈసారి వాళ్లతో అంబాజీ రాలేదు. నిధులు కనిపెట్టడంలో దిట్ట అయిన మరొక మంత్రగాడిని వెంటబెట్టుకు వచ్చారు.

     మంత్రగాడు ఒక రోజంతా కొండ చుట్టూ తిరిగాడు. రాయిరాయీ పరీక్షించాడు.

    "నిధికేం బ్రహ్మాండంగా వుంది. నవరత్నాలతో కూడిన అతి విలువైన నిధి వుంది. ఆ పెద్ద గుండుమీద చెక్కిన  బొమ్మలో ఏదో సంకేతం  వుంది. ఎంత ఆలోచించినా అదేమిటో తెలియడం లేదు."
   
    "నిధి వుందని ఎలా చెప్పగలవు?"

    "గుప్త నిధులున్న స్థలంలో ఒక విధమైన స్మెల్ వస్తుంది. అది నాకు  తెలుస్తుంది."

     "ఖచ్చితంగా ఇక్కడే వుంది కదా? తలా ఓ పలుగూ, పారా తీసుకుని  కొండను త్రవ్వుకుంటూపోతే?" అన్నాడు మారుతి.

     "కొండను త్రవ్వడమంటే మాటలా? మన అయిదుమందితో  అయ్యే పనికాదులే. డైనమైట్లు పెట్టి పేల్చేయడం ఒక్కటే ఉపాయం.  కొండ చుట్టూ కన్నాలుచేసి, డైనమైట్లు అమర్చి పేల్చేద్దాం. నిధి కాదు కదా, దాని తల్లో జేజెమ్మ కూడా బయటపడి తీరుతుంది."

    కొండ చుట్టూ కన్నాలు పెట్టి డైనమెట్లు అమర్చి, నిప్పు పెట్టడం తో మూడురోజులు గడిచిపోయాయి.
 
     పేల్చిన డైనమైట్లలో చాలావరకు సరిగా పేలలేదు. పేలినవాటిలో  ఒకటి ఒక పెద్ద గుండును బద్దలు చేసింది. బద్దలైన రాళ్లలో ఒకటి గుడారంలోకి దూసుకువచ్చింది. ప్రసాద్ అన్నవాడి తలను తాకింది.

     చాలామంది దూరం నుండి శరవేగంతో దూసుకువచ్చిన  రాయి తాకడం  తాకడంతోనే తల రెండు చెక్కలైంది. రక్తం మడుగు కట్టింది. క్షణంలో వాడు నిర్జీవంగా  రక్తం మడుగులో వాలిపోయాడు.

     తమ జట్టులో ఒకడు చచ్చిపోయాడని బాధపడుతూ కూర్చునే తీరిక లేదు.

     కొండ పేలిపోయి, గుహ బయటపడిందా లేదా అన్న జిజ్ఞాసతో అందరూ ఆత్రం గా గుడారంలోంచి బయటకు వచ్చి కొండపైకి దూసుకుపోయారు.

     కొండ కొండలాగానే వుంది. పేలిన డైనమైట్ ఒక పెద్ద బండరాయిని మాత్రం ముక్కలు చేసింది. ఆ ముక్కల్లో నుండి ఒక పెద్ద ముక్క గుడారంలోకి దూసుకువచ్చి  ఒకడి ప్రాణం తీసింది.

     మిగతాచోట్ల అమర్చిన డైనమైట్లని కూడా చూశారు. చాలావరకు తుస్సుమన్నాయి. కొన్ని పేలినా కొద్దికొద్దిగా రాళ్లను, మన్నును చిమ్మాయి.

     కొండకేమీ కాలేదు. అది రాజఠీవితో నిలబడే వుంది.

     గుడారానికి తిరిగి వచ్చి తలా ఓ చెయ్యి వేసి ప్రసాద్ ని తీసుకుపోయి లోయలో గుంత తవ్వి పూడ్చిపెట్టారు.
 
     ఇప్పుడు ఏమిటి కర్తవ్యం ?  వెంట తెచ్చిన డైనమైట్లన్నీ ఒకేసారి పేల్చేసారు. అవి తుస్సుమని కూర్చున్నాయి.
 
     ఈసారి కూడా రిక్తహస్తాలతో వెనుదిరగడమేనా?

    గుడారంలో కూర్చుని తీవ్రంగా చర్చిస్తున్నారు.

     తిరిగి తిరిగి వాళ్ల చర్చ సూర్య దగ్గరికి వచ్చింది.

     "అసలీ డాక్టర్ గాడు ఇంత దూరం వచ్చి తపస్సు చేస్తున్నాడంటే మీరు నమ్ముతున్నారా?" అడిగాడు మునిరాజు.

     "అతడు చేసేది తపస్సుకాక ఇంకేమిటి?"

    "పాపం! ముక్తి కోసం తపస్సు చేస్తున్నాడు. ఎంత అమాయకులు మీరు? వాడికి నిధి రహస్యం తెలుసు. దెయ్యాలతో మాట్లాడేవాడికి నిధి రహస్యం తెలీకుండా వుండడానికి వీల్లేదు. ఒకరోజు రేవు దగ్గర ఒక అదృశ్య వ్యక్తితో మాట్లాడడం నేను విన్నాను. అతడి నోటి నుండి  బైరవుని కొండ, నిధి అన్న మాటలు కూడా రావడం  నేను విన్నాను. నిధి రహస్యం తెలుసుకాబట్టే  వాడు ఇంత దూరం వచ్చాడు. మనందరం కలిసి ఒకనాడు ఈ నిధికోసం వచ్చిన వాళ్లమేకదా! మనల్ని వదిలిపెట్టి, ఆ బాపనాయన్ని వెంటబెట్టుకుని వచ్చాడంటే అర్దమేమిటి? ఆ నిధిని తానొక్కడే కొట్టేయాలన్న దుర్బుద్ది. నిధిని స్వంతం చేసుకోవడానికి మంత్రమో తంత్రమో చేస్తున్నాడు. మనం వెళ్లిపోయామనుకో, వాడొక్కడే ఆ నిధిని చంకనెత్తుకుని వెళ్లిపోతాడు. అందుకని వాడినో కంట కనిపెట్టి మనం వుండక తప్పదు. వాడున్నంతవరకూ!" మునిరాజు చెప్పాడు.

    "గుంటకాడి నక్కల్లా ఇక్కడే కూర్చోవాలంటావు? ఇల్లువాకిలి వదిలిపెట్టి ఎన్నాళ్లుంటాము ఇక్కడ? పాములు, తేళ్లు కరువకుండా ఒంటి నిండా తాయెత్తులు కట్టుకున్నామనుకో. కానీ ఏ రూపంలో మృత్యువు మనల్నికాటేస్తుందో తెలియదు. ప్రసాద్ అలా మనం పెట్టిన డైనమైట్ల వల్ల తల పగిలి చస్తాడనుకున్నామా? పైగా పులుల భయం ఒకటి. మొన్న పులి గాండ్రింపు కూడా వినిపించింది. ఎన్నాళ్లని రాత్రిపూట నెగళ్లువేసి, వంతులవారీగా కాపలా వుంటాం? వెంట తెచ్చిన ఆహార పదార్దాలు కూడా అయిపోతున్నాయి్. ఏం తింటాం? ఎలా వుంటాం?నా వల్ల కాదు. మీరు కావాలంటే వుండండి. నేనువెళ్లిపోతాను." అన్నాడు మారుతి.

     "వెడితే అందరం కలిసి వెళదాం. లేదా అందరం ఉందాంత చస్తే చస్తాం!" ఆ దరిద్రపు బ్రతుకులు బ్రతికే కంటే చావడం నయం. బ్రతికితే రాజుల్లా బ్రతకాలి. కాలుమీద కాలు వేసుకుని దర్జాగా బ్రతకాలి' అన్నాడు పీర్ సాహెబ్.

     ఏదో ఒకటి తేలకుండా వెళ్లిపోకూడదన్న నిర్ణయానికే వచ్చారు చివరికి.

     ఇప్పుడు వాళ్లకున్న పని ఒక్కటే. జయసూర్య మీద కన్నువేసి వుంచడం. ధ్యానం చాలించి, కొద్దిరోజులుగా ఏదోహోమం చేస్తున్నాడు సూర్య. దేశికాచారి సలహామీదనే సూర్య ఆ హోమం నిర్వహిస్తున్నాడు. అది చంద్ర ఆత్మ విముక్తి కోసం.

     ఇంకొక్క రోజుతో అయిపోతుంది హోమ కార్యక్రమం.

    చంద్ర ఆత్మకు విముక్తి.


                       *    *    *    *    *

   
    అంత్యక్షణాలు సమీపిస్తున్నకొద్దీ ఆమెలో పైశాచికత్వం చెలరేగిపోతోంది.

     రక్తం కళ్లజూడాలన్న తహతహ!

    నిండు పున్నమి రాత్రి!పన్నెండు గంటలవుతోంది.

     సూర్య హోమ కార్యక్రమంలో అలసిపోయి వున్నాడు. కొంచెం పాలు, పళ్లు తీసుకుని నడుం వాల్చగానే నిద్ర పట్టేసింది.

 Previous Page Next Page