Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 14


    "సైంటిఫిక్ యుగంలో వున్నామని ఏ దైర్యంతో అంటున్నావు మణీ? మొన్నీ మధ్యనే పత్రికల్లో వార్త  యూనివర్శిటీలో యూనివర్శిటీ ఆద్వర్యంలో జంతుబలిచ్చారని. మూఢనమ్మకాలు ఖండించాల్సిన విద్యావంతులే ఈ అనాగరిక చర్యకు ఎలా పాల్పడ్డారని మేధావులు గోలపెట్టారు. అమెరికన్లంతటివాళ్లే వాళ్ల వైట్ హౌస్ లో దెయ్యాలు తిరుగుతుంటాయనీ, ముఖ్యంగా లింకన్ దెయ్యం తిరుగుతుంటుందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇహ నిధులూ, బలి ఇవ్వడాలూ మన పల్లెటూళ్లల్లో  మామూలే. మంత్రాలూ, మహిమలూ అంటావా అవి ప్రదర్శించే మహానుభావులు  వున్నారు. మొన్న బాబాగారి జన్మదినం రోజు విభూతి సృష్టించి ఇవ్వడమేగాక బంగారు గొలుసులు, బంగారు ఉంగరాలూ సృష్టించి భక్తులకు అందజేసారు కదా?

    ఇలా ప్రతిసారీ చేస్తుంటారని పత్రికల్లో చదువుతుంటాం. గత జన్మలో తను షిర్డీ బాబానని కూడా ఆయన చెబుతారు. మరి ఇటీవల బాగా ప్రచారంలోకి వచ్చిన గణపతి సచ్చిదానంద స్వామీజీ? ప్రతి శివరాత్రీ అగ్నిగుండంలో నిలబడి  అగ్నిపూజ చేసి అగ్నిదేవుడినుండి ప్రసాదాన్ని పొందినట్లుగా పత్రికల్లో చదువుతుంటాం. పత్రికల్లో ఫోటోలతో సహా వస్తుంటాయి. ఈ సైంటిఫిక్ యుగంలోనూ తాంత్రిక స్వాములకూ, బాబాలకూ తక్కువేముంది? దేశాధ్యక్షులూ, దేశ ప్రధానులే వాళ్లకి పాదనమస్కారాలు చేస్తూ వాళ్లని నమ్ముకుని వాళ్లచుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారంటే,   పదవులు కావాలని యజ్ఞయాగాలు నిర్వహిస్తున్నారంటే మనం సైంటిఫిక్  యుగంలో వున్నామని ఎలా చెబుతావు?"

    మాకంటే అధికులెవ్వరని విర్రవీగే ఆంగ్లేయులకే గుండ్లు గీయించి, పిలకలు పెట్టించి, చిరతలు పట్టించి వాళ్లచేత హరేరామ, హరేకృష్ణ జపం చేయిస్తున్న ఆధ్యాత్మిక గురువులున్నారు మన దగ్గర. ఇటీవల యోగా బాగా ప్రచారం పొందుతున్నదే కదా! యోగా అంటే ఏమిటి? మెడిటేషన్. అంటే ధ్యానం. మనసును  ఏకాగ్రతపరచి   జపమో, మననమో చేయడం ధ్యానమంటారు.  రోజూ ఏదో టైంలో కాకుండా అదే పనిగా రోజుల తరబడి చేసేదాన్ని తపస్సు అంటారు. శ్రీచక్ర చెప్పేది నిజం కావ్చచు. కాకపోవచ్చు. అదంతా అభూతకల్పన అని ఇప్పుడే జడ్జిమెంట్ ఇవ్వలేం. ఇధి తన పూర్వజన్మ కథే అయితే ఇంత కథ చెప్పినవాడు ఆ వ్యక్తుల్నీ, ఆ ఊరినీ గుర్తుపట్టడా? చూద్దాం చివరికి ఏమౌతుందో?" అన్నాడు యోగానందం.

     కానీ మరురోజు దినపత్రిక చూసివుంటే జయసూర్య కథ అబద్దం కాదనేందుకు ఒక ఆధారం దొరికినట్టయ్యేది. దురదృష్టవశాత్తూ వాళ్లాపేపరు చూడలేదు.


             *    *    *    *    *

   
    ప్రొద్దునే కోటిలింగం నుండి ఫోన్ మారుతీరావుకు.

    "ఈరోజు పేపరు చూశావా?"

    "ఇప్పుడే చేతిలోకి తీసుకున్నాను. మా ఆవిడిచ్చిన టీ సిప్ చేస్తూ పేపరు చదవడం అలవాటు నాకు."

    "చదివావా ఆ వార్త?"

    "ఏ వార్త?"

    "నల్లమల అడవిలో గుప్త నిధి."

    "ఏ పేజీలో?" మారుతీరావు స్వరం ఉద్విగ్నంగా మారిపోయింది     

    "ఫ్రంట్ పేజీలోనే. విలేకరుల  సమావేశంలో స్వయంగా  మన సి. ఎం. గారే చెప్పినట్లుగా వుందా వార్త?"

    టీ కప్పు టేబుల్ మీద పెట్టి ఆత్రంగా ఫ్రంట్ పేజీమీద చూపులు పరిగెత్తించాడు మారుతీరావు.

     నల్లమల అడవిలో అపారమైన గుప్తనిధికి సంబందించిన ఒక తామ్రపత్రం ఒక వ్యక్తిద్వారా తనకి అందిందని, ఆ నిధి లభ్యమయితే ఎప్పుడూ కరువుకాటకాలతో అల్లాడిపోయే ఆంద్రప్రదేశ్ సుసంపన్నమై పోతుందని, త్వరలో ఆ నిధిని స్వాధీనపరుచుకునే ప్రయత్నం కొనసాగిస్తామని విలేకరుల సమావేశంలో సి. ఎం. గారు చెప్పినట్లుగా వుందా వార్త.

     "అది మన చేయి జారిన గుప్తనిధే అంటావా?" అడిగాడు మారుతీరావు.

     "అనడమేమిటి? అదే నల్లమలలో మనకు తెలీని అపారమైన గుప్తనిధి వేరే వుండడానికి వీల్లేదు.  సి. ఎ. దృష్టిలోకి వెళ్లిందంటే అది తప్పకుండా భైరవుని కొండలోని నిధే అయి వుంటుంది. కానీ ఆ తామ్రపత్రం అందజేసిన వ్యక్తి ఎవరో చెప్పలేదు. జయసూర్యకి మాత్రమే తెలుసుననుకుంటున్న ఆ నిధి రహస్యం, అతడితోపాటే అంతమైందనుకున్నాం. ఆ నిధి రహస్యం తెలిసినవాడు మరొకడున్నాడన్న మాట. ఎలాగైనాసరే అతడిని మనం పట్టుకోవాలి."

    "ఎలా?"

    "మా షడ్రకుడు ఒకాయన సి. ఎం. కి చాలా సన్నిహితుడు ఆ తామ్రపత్రం అందజేసిన వ్యక్తి ఎవరో మా షడ్రకుడు ద్వారా ట్రై చేస్తాను ఆ నిధిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకముందే మనం చేజిక్కించుకోవాలి" కోటిలింగం గొంతు పట్టుదలగా  వినిపించింది అవతలినుండి.

     "తెలుసుకుని ఏం చేస్తాం చెప్పు. అప్పుడంటే వేడినెత్తురు. వయసులో  వున్నాం. ఎంతకయినా తెగించేవాళ్లం. ఏమైనా చేసేవాళ్లం. ఇప్పుడు మనకు ఓపిక ఎక్కడుంది?  కొండల్లో, కోనల్లో ప్రయాణం చేయడం ఇప్పుడు  మనవల్లేమౌతుంది?అయినా ఇప్పుడా ప్రాంతాన్ని ప్రభుత్వం అభయారణ్యంగా ప్రకటించింది. పులులూ, క్రూరమృగాలూ  స్వేచ్చగా తిరుగుతున్న ప్రాంతం. అందులోనూ ఇప్పుడు మనకు ఓ స్టేటస్, ఊరూ పేరూ వున్నాయి. అప్పటిలా చిల్లర మల్లర పనులు చేయలేంగా?"

    "అయితే నువ్వు తప్పుకోవచ్చు. మా పాట్లేవో మేం పడతాం."
    "అపారమైన నిధి - కోటానుకోట్లు. అలా వదిలేయడానికి మనస్కరించడంలేదు. అయితే ఆ కొండల్లో, కోనల్లో పడిరాలేను. నాకసలే బి. పి. నావంతుగా నేను ఫైనాస్స్ చేస్తాను. ఎంత ఖర్చు వచ్చినా సరే. అది నేనే  పెడతాను."
    "ఎంత డబ్బయినా పెడతావుకదా?"

    "ఆ..... పెడతాను"

    "అయితే ఒక హెలీకాప్టర్ కొనిపెట్టు."

    "పిల్లలు బొమ్మ హెలీకాప్టర్ కొనిపెట్టమన్నట్టుందే నువ్వు అడగడం? హెలీకాప్టర్ ఖరీదు కోట్లు  కోట్లలో వుంటుంది."

    "నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా ఈతాకువేసి తాటాకుగుంజే రకమని నాకు తెలుసులే."

    "ఆ నిధి దక్కేందెంతో,దక్కనిదెంతో! నన్ను కొంచెం ఆలోచించుకోనీ. ముందు ఆ నిధి రహస్యం తెలియాలికదా?"

    "నేను తలచుకోవాలేగానీ అదెంత పని."


                        *    *    *    *    *
   
   
    "వస్తున్నాం లింగమయ్యా వస్తున్నాం! చేదుకో లింగమయా చేదుకో"

    చెంచుల దేవుడు సలేశ్వరం లింగమయ్యను చేరుకుంటున్న భక్తులు చేస్తున్న నినాదాలు ఆ లోయల్లో  ప్రతిధ్వనిస్తున్నాయి .స్త్రీలు, వృద్దులు కూడా వున్నారు ఆ భక్తుల్లో, లింగమయ్యను చేరుకోవడానికి వడివడి గా నడుస్తున్నారు.

     పుచ్చపువ్వుల్లాంటి వెన్నెల్లో కొండ కోనలు మరింత  అందాన్ని సంతరించుకున్నాయి.

     కొన్నికొన్ని చోట్ల దారి ఇరుకుగా, ప్రమాదకరంగా  వున్నా లింగమయ్యే తమకి చేయూతనిస్తున్నట్లుగా వృద్దులు, స్త్రీలు నడిచిపోతున్నారు సురక్షితంగా, సునాయాసంగా.

     వెన్నెల్లో  చూడాలి అడవి సౌందర్యం.

     గాలిలో కలిసిపోయిన అడవిపువ్వుల వాసన.

     వెన్నెల్లో తళతళలాడే తరుపత్రాలు.

     అలసిపోయి వచ్చిన భక్తులకు ఒక  అధ్బుతలోకం ఆవిష్కరిస్తున్నట్లుగా వుందా లోయ. ఎత్తయినా  ఎత్తయిన శిఖరాగ్రం మీద నుండి మూడువందల అడుగుల ఎత్తునుండి క్రింద గుండంలో పడుతున్న జలధార. కొబ్బరికాయ నీళ్లకంటే మధురమైన నీళ్లు. నడిచి నడిచి దాహంతో వచ్చిన భక్తులకు  లింగమయ్య ఇస్తున్న శీతల పానీయం.

    కమనీయమయిన ప్రకృతి సౌందర్యపు విందు.

    గుండంలో స్నానం చేసేవాళ్లు చేస్తుంటే ఈతకొట్టే వాళ్లు ఈతకొట్టారు.

 సూర్య, దేశికాచారి  చాలాసేపు ఈదులాడారు.

     కొంచెం ఎత్తయిన ప్రదేశంలో వెలసిన  లింగమయ్య దగ్గరికి తడిగుడ్డలతోనే పాకుతున్నట్లుగా  వెళ్లారు. కొబ్బరికాయ, చక్కెర సమర్పించుకున్నారు.

     తెల్లవారినా లింగమయ్యను దర్సించుకోవడానికి వచ్చే భక్తుల వెల్లువ తగ్గలేదు.

     కొన్ని భక్త సమాజాలవాళ్లు భక్తులకు అన్నదానం చేయడానికి ఆ అఢవిలోనే పుల్లాపుడకా ఏరుకు వచ్చిమంటలు చేయడం మొదలుపెట్టారు.

     దేశికాచారి వాళ్లు వెంట తెచ్చుకున్న అటుకుల్లో పెరుగు కలుపుకుని తిని, క్షుద్బాధ తీర్చుకున్నారు.

     "ఇక చెప్పండి డాక్టర్ బాబూ! మన ప్రయాణం ఎటు?"

    "ముందు ఈ లోయలోంచి పైకి వెడదాం. తరువాత మనసుకు ఎటు వెళ్లాలనిపిస్తే అటు వెడదాం."

    "మనసుకు ఎటు వెళ్ళాలనిపిస్తే అటు అంటే, ఈ కారడివిలో కొరివి దయ్యం త్రిప్పినట్లుగా ఇక్కడిక్కడే తిరగాల్సి వస్తుంది. ఈ అడవి నాకు సుపరిచితమే. మూలికలకోసం అప్పుడప్పుడు వస్తుంటాను. నేను తీసుకుపోతాను. నా వెంట రండి."

    "అలాగే!"

    బాగా అలసట చెందినప్పుడు చెట్ల నీడల్లో విశ్రమించినా, రోజంతా అడవిలో నడుస్తూనే వున్నారు.

     ప్రొద్దుగ్రుకుతుంటే దూరంగా గుడిసెలు కనిపించాయి.

     తాము ఇంతకుముందు వచ్చినప్పుడు బస చేసింది  ఈ చెంచుగూడెమేనని గుర్తించాడు సూర్య.

 Previous Page Next Page