"యూనిఫాం చినిగిపోయిందని శీనునీ, పుస్తకాలు లేవని రజనీని, ఫీజు కట్టలేదని మా ఇద్దరినీ" చెప్పాడు రాజు.
చిరంజీవి నీరసంగా బయట అరుగు మీదే కూలబడిపోయాడు. జ్వరం వచ్చినట్లుంది.
నిన్నటినుంచీ భోజనం లేదు. దానికితోడు నడిచి నడిచి వళ్ళు నొప్పులు, నీరసం.
"ఒరే రజనీ!" నీరసంగా పిలిచాడు చిరంజీవి.
"ఏమిటి మావయ్యా"
"ఆకలేస్తోంది తినడానికేమయినా వుందా?"
"రాత్రి అన్నం, చారు ఉన్నాయ్ మావయ్యా, తింటారా?"
"కొంచెం తీసుకురామ్మా"
ఆమె వెళ్ళి ఓ ప్లేట్లో అన్నం, చారు తీసుకొచ్చింది.
అతను ఆత్రుతగా రెండు ముద్దలు తినేసరికి ఎదురుగ్గా చుట్టుపక్కవాళ్ళందరూ గుమికూడుతూ కనిపించారు. మధ్యలో తలకు బాండేజ్ కట్టుకున్న ఓ కుర్రాడు.
"ఇదుగో చిరంజీవి చూశావా! మావాడి తల పగలగొట్టారు. ఇవాళ వాడి తల పగిలింది రేపు మా తల పగులుతుంది. ఆ తరువాత చుట్టుపక్కల ఉన్నవాళ్ళందరి తలలూ పగులుతాయ్. ఇలా అందరి తలలు పగల గొట్టించుకుని బాండేజీలు కట్టించుకుని మందులు తింటూ గడపటానికి మేమేం గాజులు తొడుక్కుని కూర్చున్నామనుకున్నావా?" గట్టిగా అరవసాగాడు నారాయణ.
చిరంజీవికేమీ అర్థంకావటం లేదు.
"ఎవరు మీవాడి తల పగలగొట్టింది?" అడిగాడతను.
అతని ప్రశ్న పూర్తవకుండా శీను, భాను నెమ్మదిగా అక్కడింట్లోకి జారుకున్నారు.
"ఎవరా? అదుగో ఇంట్లోకి జారుకుంటున్నారు చూడు ఆ రౌడీ వెధవలు.
చిరంజీవి శీను, భానుల వేపు ఆశ్చర్యంగా చూశాడు.
"వాళ్ళా?"
"అవును. ఇంకెవరు మరి?"
"వీళ్ళు మీవాడి తల పగలగొట్టారా?"
"అవునయ్యా! తెలుగులో చెప్తే అర్థంకాదా?"
చిరంజీవి లోపలకు నడిచి శీను, భానుల ఇద్దరినీ జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చాడు.
"వీళ్ళా మీ వాడిని కొట్టింది?"
"అవును. ఇవిగో, ఈ రాళ్ళతో కొట్టారు."
చిరంజీవి శీను వైపు కోపంగా చూశాడు.
"ఏరా శీనూ! నిజమేనా?" బెల్ట్ తీస్తూ అడిగాడు.
"తప్పయిపోయింది మావయ్యా! ఇంకెప్పుడు కొట్టం" అన్నాడు వాడు ధీనంగా.
"అంటే నిజంగానే మీరు వాడిని కొట్టారా?"
"కొట్టాం మావయ్యా!"
"అంత పెద్దాడిని ఎలా కొట్టార్రా?"
"చెట్టు మీద కూర్చుని, చెట్టుకింద నుంచి వెళ్తోంటే రాళ్ళతో కొట్టాం."
"ఎందుకు కొట్టారు?"
మేము బంతి ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ పెరట్లో పడింది. అది తీసుకుని వాడు దాచేశాడు. మేము వెళ్ళి అడిగితే లేదు పొమ్మన్నాడు. అందుకని చెట్టు మీద కాపు కాసి రాళ్ళతో కొట్టాము."
చిరంజీవి నారాయణవేపు చూశాడు.
"విన్నారా వాళ్ళు చెప్పింది?"
"అంతా వట్టిదే. మా పెరట్లో వాళ్ళ బంతి పడనేలేదు. మేమేం అబద్ధం చెప్తామా?"
"సరే-పదండి. ఇప్పుడే మీ ఇంటికెళ్ళి వెతుకుదాం. నిజంగా బంతి మీ ఇంట్లో లేకపోతే మా వాళ్ళనిద్దరినీ ఈ బెల్టుతో వాతలు తేలేటట్టు కొడతాను."
నారాయణ మొఖంలో కంగారు కనిపించింది.
"మేము లేదని చెప్తుంటే మళ్ళీ మా ఇంటికొచ్చి వెతుకుతానంటావేమిటయ్యా? అక్కడికి నేను అబద్ధాలు చెప్తున్నట్లా?"
"అదేదో తేలిపోతుంది కదా! ఒకవేళ బంతి మీ ఇంట్లో దొరికితే మాత్రం ఇదే బెల్టుతో నువ్వూ దెబ్బలు తినాల్సి వుంటుంది. అందుకు సిద్ధమయితే చెప్పు. ఇప్పుడే నీతో వస్తాను. సిద్ధంగా లేకపోతే నీ దారి నువ్వు వెళ్ళు. ఇంకెప్పుడూ ఇలాంటి దొంగ పితూరీలు నా దగ్గరకు తీసుకురాకు. తెల్సిందా?"
నారాయణ మొఖం పాలిపోయింది. ఏం మాట్లాడాలో తెలీటంలేదు.
చుట్టుపక్కలవాళ్ళు కల్పించుకున్నారు.
"బంతి లేదన్నావ్ కదయ్యా! వచ్చి వెతుక్కోనీ....భయమెందుకు?"
"అవును నారాయణా! రానీ...వెతుక్కోనీ."
"అక్కర్లేదు. ఒకవేళ బంతి ఉంటే మాత్రం రాళ్ళు పెట్టి కొడతారా నాకు అర్థంగాక అడుగుతాను? నువ్వు గూండా వయితే ఆ పిల్లల్ని కూడా యిప్పటి నుంచే గూండాలుగా తయారుచేస్తున్నావా? గూండాగిరీ ఎక్కువయిపోయింది ఎక్కడ చూసినా! ప్రతోడూ గూండాయే. ప్రభుత్వం అలా తయారయింది. కొజ్జా ప్రభుత్వం" అరుచుకుంటూ వెళ్ళిపోయాడతను. చిరంజీవి గుమిగూడిన వాళ్ళవంక చూశాడు.
"ఏయ్! మీరంతా ఎందుకొచ్చినట్లు? మీకేం పనీపాటా లేదా? ఇక్కడే గొడవ జరిగినా తయారు ఫాల్తుగాళ్ళు. చూస్తారేమిటింకా? పొండి! వెధవ మొఖాలేసుకుని."
అందరూ ఎవరిదారిన వాళ్ళు జారుకున్నారు.
చిరంజీవి ఇంట్లోకి నడిచాడు.
పిల్లలు నలుగురూ తలోమూలా భయంగా బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు.
"ఇట్రండి అందరూ" పిలిచాడతను మంచంమీద కూర్చుని. అందరూ భయంగా వచ్చి అతనికి సమీపంగా నిలబడ్డారు.
"ఏమిట్రా ఈ పనులు! ఎందుకురా రాజూ ఇలా గొడవలు తెచ్చిపెడుతున్నారు?" అనునయంగా అడిగాడు.
"ఇంకెప్పుడూ యిలా చేయం మామయ్యా! ఇదే ఆఖరిసారి" అన్నాడు శీను.
"అవును మామయ్యా! ఇంకెప్పుడూ ఎవరినీ కొట్టం" అన్నాడు శీను.
చిరంజీవికి నవ్వు వచ్చింది.
"రోజూ ఇదేమాట చెప్తున్నారు కదరా మీరు?"
"అవును మామయ్యా!"
"చెప్పి మళ్ళీ చేసే వెధవ పనులన్నీ చేస్తున్నారు కదా!"
వాళ్ళు మాట్లాడలేదు.
"ఇదిగో చూడండి! ఇది మీకు ఆఖరిసారి అయినా కాకపోయినా నాకు మాత్రం ఆఖరిసారి. ఇంకొక్కసారి ఇలాంటి కంప్లైంట్ వచ్చిందంటే మాత్రం తాట వలిచేస్తాను. అర్థమయిందా!"