"ఛత్! ఎంతసేపు నీకు తిండియావే. ఆ వ్యక్తి మన్ని వెంబడిస్తున్నాడన్నది ఖాయం. మనది అనుమానమో...నిజమో చూసి ఆపై ఏం చేయాలన్నది ఆలోచిద్దాం."
వందన అన్నదానికి "ప్రయాణంలో ప్రమాదం తప్పదా? మనలో ఎవరినన్నా ఎత్తుకెళతాడేమో...ఏమో" సుందర సుకుమారి అంది.
"చూస్తూ...చూస్తూ నిన్ను మాత్రం ఎవరూ ఎత్తుకెళ్ళరు సరేనా." వందన అంది.
"చాలామంది మగాళ్ళకి ఓ తెగులుంటుంది. అందమైన ఆడపిల్లలు కనిపిస్తే అలా చూస్తుంటారు. అసలు నా ఉద్దేశ్యమేమిటంటే చెప్పనా! వద్దా" రాణి అడిగింది.
"సగం చెప్పి చెప్పనా...వద్దా... అంటావేంటి? చెప్పు" అంది ప్రమద.
"ఏమీ తోచక చాలామంది మగవాళ్ళు అటు బజార్లలోను... ఇటు రైల్వే ప్లాట్ ఫారాలమీద చక్కట్లు కొడుతూంటారు. కళ్ళతో అందాలు జుర్రుకుంటే చాలు వాళ్ళకి...డబ్బులు పోయినా ఫరవాలేదు. మనం రైలెక్కాం కదా! అతనూ రైలెక్కుంటాడు ఏముంది? పక్క స్టేషనులో దిగుతాడు. మగాళ్ళు చేసే పనులే అవి."
"అహ...ఏం కనిపెట్టారండి రాణీగారు! నువ్వు గమనించావో లేదో! అతనితోపాటు చిన్న సూట్ కేస్ ఉంది. కాబట్టి అతను జర్నీ చేస్తున్నట్టే. పాయింట్ వైజ్ గా చెప్పింది వందన.
"రాణి అతన్నే చూస్తోంది గాని అతని చేతిలో ఉన్న పెట్టెని చూసుండదు" అంది ప్రమద.
"ఇలా మాట్లాడారంటే ఇప్పుడే దిగిపోతాను" రాణి బెదిరింపుగా అంది.
"ఏమిటి? పరుగెత్తుతున్న రైల్లోంచి నడుస్తూ దిగిపోతావా! ఈ వింత ఏమిటో చూడాల్సిందే" సుందర సుకుమారి అంది.
రాణి ఈ తఫా ఏమీమాట్లాడలేదు. చిరు కోపం ప్రదర్శిస్తూ మూతి ముడుచుకుని కూర్చుంది.
"అతని దగ్గర బ్రీఫ్ కేస్ ఉంది. ఆ గడ్డిపోచ విలన్ గాడి దగ్గర గుడ్డసంచీ ఉంది. కాబట్టి ఇద్దరూ ప్రయాణీకులే. మనం దిగిన చోట వాళ్ళు దిగితే అనుమానిద్దాం. లేకపోతే వాళ్ళపై ఎటువంటి అనుమానమూ పెట్టుకోనక్కరలేదు. ఏదో ఎప్పుడో వస్తుందని అనుమానంతో అనుకోవడం అంత బాగుండలేదు. ఇంక ఈ విషయం వదిలేద్దాం" అంది వందనాదేవి.
"అయితే మనం మధ్య మధ్య వాళ్ళని ఓ కంట గమనించాలా అక్కర్లేదా" రాణి అడిగింది.
"నువ్వేమో అతన్ని గమనిస్తూ ఉండు. నేనేమో హిట్లర్ మీసాలగాడ్ని గమనిస్తుంటాను. మహా కవయిత్రి సుసు యేమో పిండివంటలున్న డబ్బాలని గమనిస్తూ ఉంటుంది. లీడర్ వందనాదేవేమో మన ముగ్గురిని గమనిస్తూ ఉంటుంది...దట్సాల్" అంది ప్రమద.
ప్రమద మాటలకి అందరూ నవ్వారు.
వాళ్ళలా మాట్లాడుకుంటూండగానే రెండు స్టేషన్ లుదాటిపోయాయ్. మూడో స్టేషన్ లో అతను బ్రీఫ్ కేస్ తీస్కొని బండి ఆగుతూనే దిగిపోయాడు.
"నాథుడు దిగిపోయాడే?" అంది రాణి.
"ఎవరి నాధుడే తల్లీ!" ప్రమద అడిగింది.
"నాకేం తెల్సు...మాటవరసకి అన్నాను. ఏదో ఒక ఆడపిల్లకి నాధుడే అయుంటాడు" అంది రాణి.
మళ్ళీ ట్రైన్ బయల్దేరింది.
వాళ్ళు అతని విషయం వదిలేసి వేరే కబుర్లలో పడ్డారు.
స్టేషన్ లో బండి ఆగగానే బ్రీఫ్ కేస్ తో దిగిన అతను స్టేషన్ బయటికి వెళ్ళిపోలేదు. బండి బయల్దేరంగానే రెండు పెట్టెల అవతలి పెట్టెలో ఎక్కాడు.
ఈ నిజం తెలియని నలుగురు మిత్రురాళ్ళు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూండి పోయారు.
"ఇలా ఇల్లు వదిలి మనందరం కలిసి ప్రయాణం చేయడం భలే సరదాగా ఉంది. కాని ఇంటిని...మనవాళ్ళని తలచుకోగానే కాస్త గుబులుగానే ఉంది. మీక్కూడా అలానే ఉందా?" ప్రమద అడిగింది.
"చూడు ప్రమదామణి...వనితామణి! అందరికి అలానే ఉంటుంది. కాసేపు ఇంటిని మర్చిపోదాం. లేకపోతే సరదాగా ప్రయాణం చేయలేం. మన గురించి మన పెద్దవాళ్ళకి విచారంగాని మనకేం విచారం?" అంది వందన.
"అవునవును" అన్నారు వంతపాటగా మిగతా ఇద్దరూ.
"ముందు ముందు విచారించే సంఘటనలు జరగనున్నాయని పాపం ఆ నిమిషంలో వారికి తెలియదు.
ఇదేం పట్టని రైలు తన మానాన తాను శరవేగంగా ముందుకి పోతూనే వుంది.
7
నలుగురు ఊళ్ళోకి బయలుదేరారు.
కాలకృత్యాలన్నీ స్టేషన్ లోనే ముగించుకుని సామాన్లని క్లోక్ రూమ్ లో ఉంచారు. ఊళ్ళోకి వెళ్ళి మంచి హోటల్ గది సంపాదించిన తర్వాత సామాన్లు తీసుకెళ్ళవచ్చని...వ్యానిటిబాగ్ లో మాత్రమే పుచ్చుకొని ఊళ్ళోకి బయలుదేరారు.