స్టాంప్స్ కౌంటర్ లో కూర్చున్న వ్యక్తిని చూడగానే మిలమిల మెరిశాయి ఆశ్చర్యంతో అతని కళ్ళు విచ్చుకున్నాయి.
ఏదో తెలీని విస్మయం.
అదే అమ్మాయి.... బార్లో క్షణకాలం మెరుపులా మెరిసి, మాయమైన అమ్మాయి....కౌంటర్ ముందున్న ఆరుగురు వ్యక్తుల్ని దాటుకుని, కౌంటర్ గ్లాస్ విండోకి ఆనుకుని, ఆమెవేపే తేరిపార చూసాడు.
"హలో..."
ఆ అమ్మాయి తన పనేదో తను చేసుకుంటోంది.
"హలో..." పొడిదగ్గు దగ్గి, నెమ్మదిగా అన్నాడు.
ఒక్కసారి తలెత్తిచూసి, మళ్ళీ తలదించుకుంది.
తనని చూడగానే ఆ అమ్మాయి ముఖంలో ఏ రియాక్షనూ లేకపోవడంతో ఆశ్చర్యపోయాడు సూర్యవంశీ.
ఆ అమ్మాయిని ఎలా విష్ చేయాలో అర్ధంకాలేదతనికి.
"హలో..... మీరు...."
ఆ అమ్మాయి తలెత్తడంతో సూర్యవంశీకి నోటిలోంచి మరిమాటలు బయటకు రాలేదు.
"చెప్పండి....ఏం కావాలి" ఆ ప్రశ్నకు బిత్తరపోయాడు సూర్యవంశీ.
"నువ్వు...." మనసులోని మాట మనసులోనే ఉండిపోయింది.
"ఫస్ట్ డే కవర్స్ స్టాకయిపోయాయి. రేపు మార్నింగ్ రండి...."
"నేను ఫస్ట్ డే కవర్స్ కోసం రాలేదు...." కోపాన్ని అణచుకుంటూ అన్నాడు సూర్యవంశీ.
"మరి?..."
తనవేపే సూటిగా చూస్తున్న ఆ అమ్మాయివేపు మరింత స్పష్టంగా చూశాడు. అదే కోలముఖం....అవేకళ్ళు....అవే పెదాలు...
తను అసలు తెలియనట్టు ప్రవర్తిస్తుందేం?
"ఫస్ట్ డే కవర్సు లేవని చెప్పానుకదా..... స్టాంప్స్ కావాలా"
ఫస్ట్ డే స్టాంప్స్ తనకెందుకు?
"నువ్వు కొంటావా.... మమ్మల్ని కొనుక్కోమంటావా..." ఆ మాట విన్పించిన వేపు చూసాడు సూర్యవంశీ.
అక్కడ మరికొన్ని నిమిషాలైనా నిలబడాలంటే తను ఏవైనా కొనాలి.....తప్పదు....
"ఫస్ట్ డే స్టాంప్స్ ఎన్నున్నాయి?" అడిగాడు సూర్యవంశీ.
"టూ రుపీస్....పిఫ్టీ ఉన్నాయి."
"అంతేనా మరి లేవా?"
"ఆ ఫిఫ్టీ స్టాంప్స్ నాకే ఇవ్వండి" పాకెట్లోంచి వందరూపాయల నోటుని తీసి ఆమె ముందుంచాడు.
ఆ అమ్మాయి స్టాంప్స్ ని లెక్కపెడుతోంది.
"మరి స్టాంప్స్ లేవు....ఇక మీరు వెళ్ళొచ్చు" తనవెనక నుంచున్న వ్యక్తివేపు చూస్తూ వ్యంగ్యంగా అన్నాడు సూర్యవంశీ.
ఆ వ్యక్తి కోపంగా సూర్యవంశీ వేపు చూసి, క్యూలోంచి పక్కకు తప్పుకున్నాడు. మరికొంత సేపటికి సూర్యవంశీ తప్ప మరెవ్వరూ లేరక్కడ.
"ఫిఫ్టీ స్టాంప్స్ నేనే ఎందుకు తీసుకున్నానో తెలుసా" ఆ స్టాంప్స్ అందిస్తున్న ఆ అమ్మాయి ముఖంలోకి చూస్తూ అన్నాడతను.
ఆ ప్రశ్నకు ఆ అమ్మాయి జవాబు చెప్పలేదు.
"మీతో మాట్లాడడానికి...." సూర్యవంశీవేపు, స్టాంప్స్ ని తోసి, ఆ అమ్మాయి సీట్లోంచి లేచి నిలబడింది.
"హలో.... మాట్లాడుతుంటే లేచిపోతారేం.... మీరు జి.పి.ఓలో పని చేస్తున్నట్టు నిన్న చెప్పలేదేం.... డ్యూటీ అయిపోయిందా.... బయటికొస్తారా" అన్నాడు సూర్యవంశీ ఏ ఒక్క ప్రశ్నకూ ఆ అమ్మాయి జవాబు చెప్పలేదు.
రెండు క్షణాలు గడిచాయి.
"సీ మిస్టర్.... సెక్యూరిటీ గార్డ్ తో చెప్పాలా.... పోలీసులకి కంప్లయింట్ చెయ్యలా...." ఆ అమ్మాయి నోటిలోంచి ఆ మాటలు కోపంగా వచ్చాయి.
"పోలీసులకు కంప్లయింటా ఎందుకు?" మరింత ఆశ్చర్యంగా ప్రశ్నించాడు సూర్యవంశీ.
"ఎందుకో తెలీదా ఓ గవర్నమెంట్ ఎంప్లాయిని ఆఫీసులోనే టీజ్ చేస్తున్నందుకు" ఆ అమ్మాయి అంతెత్తున లేచింది.
ఆ అమ్మాయి అకస్మాత్తుగా అలా అరవడంతో సూర్యవంశీ ముఖం వెలవెల బోయింది. అక్కడున్న నలుగురూ వాళ్ళిద్దరివేపే చూడసాగారు.
"మిస్... మీరు నన్ను నిన్న.... బార్ లో..... రూమ్.... కీస్..... లెటర్...." పొడి పొడి పదాలతో వివరించడం మొదలెట్టాడు సూర్యవంశీ.
"బార్ ఏమిటి, రూమేమిటీ కీసేవిటి.... వాడ్డూయూ మీన్.... వెళ్తారా పోలీసుల్ని పిలవమంటారా..." మళ్ళీ అరిచిందా అమ్మాయి.
సూర్యవంశీకి అంతా అయోమయంగా ఉంది.
తనెక్కడో పొరపాటు పడ్డాడు.
"నిన్న మీరు నా హీరోహోండా" ఆ మాటకు మళ్ళీ ఆ అమ్మాయి ఏం అల్లరి చేస్తుందోనని-
"సారీ మేడమ్.... నాకు తెల్సిన వ్యక్తిని మీరనుకున్నాను..... అయామ్ సారీ..... ఆ వ్యక్తిని విష్ చెయ్యాలనే ఈ స్టాంప్స్ తీసుకున్నది.... ఈ స్టాంప్స్ తో నాకేం అవసరంలేదు.... కీప్ దిస్ విత్ యూ" స్టాంప్స్ ని.....ముందుకు తోసి....ఆ అమ్మాయి కళ్ళల్లోకి మరొక్కసారి చూసి దిగాలు పడ్డ మనసుతో తనచుట్టూ మూగిన మనుషుల మధ్యనుంచి, గబగబా బైటకొచ్చి, హీరో హోండా ఎక్కాడు సూర్యవంశీ.
సమయం ఆరుగంటలు దాటింది- రోడ్లన్నీ చీకటిని పులుము కున్నాయి. తనకు బార్ లో కన్పించిన అమ్మాయి, ఈ అమ్మాయి ఒక్కరు కాదా....?" అదే పోలికల్తో అలా ఉండడం సాధ్యమా?
ఆ అనుభవం విచిత్రంగా ఉంది సూర్యవంశీకి.
హీరోహోండా, అతను పనిచేస్తున్న డైలీ పేపర్ ఆఫీసువేపు పరుగుతీస్తోంది.
సూర్యవంశీ ఆలోచనలనిండా ఆ అమ్మాయే.... ఆ అమ్మాయి తనని మిస్ లీడ్ చేసిందో, తనే పొరపాటు పడ్డాడో.... ఏమీ అర్ధంకాని అయోమయ పరిస్థితి....
మరో అరగంట తర్వాత-
జి.పి.ఓ స్టాంప్స్ కౌంటర్ దగ్గర సంభాషణ నడుస్తోంది.
"ఏదో హడావుడి చేసావట....ఎవరో కుర్రాడికి చెమటలు పట్టించేసావట..." కౌంటర్ లోని అసలు క్లర్క్ నలభైఏళ్ళావిడ నవ్వుతూ ఆ అమ్మాయి వేపు చూస్తూ అంది.
"ఈజాబ్ ఎలా చేస్తున్నావే బాబూ.... ఈ గంటసేపూ చచ్చిపోయాను.....ఎనీ హౌ థాంక్యూ..." చెప్పిందా అమ్మాయి.
"ఇంతకూ ఎవరా కుర్రాడు -" తన సీట్లో కూర్చుంటూ అడిగిందావిడ.
"డేరింగ్ అండ్ డేషింగ్ హీరో" చెప్పిందా అమ్మాయి.