Previous Page Next Page 
ప్లే పేజి 14


    
    పోలీస్ కానిస్టేబుల్ రాకపోతే....సాయంత్రం వరకూ నిద్రపోయేవాడు...
    
    ఏ.సి.పి. నిరంజనరావు ఇంత అర్జంటుగా... ఎందుకు రమ్మని కబురు పంపాడు?
    
    ఆలోచిస్తూనే బాత్ రూమ్ లోకి అడుగుపెట్టాడు.
    
                                                 *    *    *    *    *
    
    సరిగ్గా నలభై నిమిషాల తర్వాత-
    
    ఎ.సి.పి. నిరంజనరావు చెప్పిన న్యూస్ విని, షాక్ తిన్నట్టుగా అయిపోయాడు సూర్యవంశీ.
    
    "ఎస్..... మిస్టర్ వంశీ పదిరోజుల క్రితం.....రైడీ షీటర్.... బబ్లు కనిపించడంలేదని....బబ్లు తమ్ముడు అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చాడు. బబ్లు.... పేరుమోసిన హంతకుడు. చాలాకాలంగా పోలీసులు వాడికోసం వెతుకుతున్నారు. వాడిమీద అయిదు మర్డర్ కేసులున్నాయి. లోకల్ ట్రైన్ లో వచ్చింది.... బబ్లూగాడి శవమని నా అనుమానం.... సి.ఐ. కూడా అదే అంటున్నాడు. శవాన్ని గుర్తించడానికి ఏ ఆధారమూలేదు.... తల కూడా లేదు."
    
    "తలకూడా లేదా" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు సూర్యవంశీ.
    
    "నో డవుట్... ఇట్స్ ఏ ప్లాన్డ్ అండ్ క్రూయల్ మర్డర్స్ రైల్వే పోలీసులు ఆ కేసుని, మనకు ట్రాన్స్ ఫర్ చేసారు.... ఉయ్ హేవ్ టు సాల్వ్ ఇట్...."
    
    పోరెన్సిక్ రిపోర్ట్ ను సూర్యవంశికి అందిస్తూ అన్నాడు ఏ.సి.పి.

    "మరణించినవాడు బబ్లూ అయితే వాళ్ళ తమ్ముడ్ని పిలిపించొచ్చుగా" సలహా ఇచ్చాడు సూర్యవంశీ.
    
    నవ్వాడు ఏ.సి.పి.
    
    "వాళ్ళ తమ్ముడు వారంరోజుల క్రితమే ఫ్యామిలీతో దుబాయ్ వెళ్ళాడట....ఆ మొండాన్ని గుర్తుపట్టగలిగేది వాడు ఒక్కడే బైదిబై.... బబ్లూ గాడికి హైలెవెల్ పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నాయి. ప్రస్తుతం మనం చెయ్యాల్సింది.... అది బబ్లూగాడి శవమా కాదాఅన్నది తేలాలి....అందుకే నిన్ను పిలిపించాను" ఫోరెన్సిక్ రిపోర్ట్ ని సీరియస్ గా చదివి పక్కనపెట్టి ఎ.సి.పి కళ్ళల్లోకి సూటిగా చూశాడు సూర్యవంశీ.
    
    "ఆ మొండెం బబ్లూగాడిదేనని మీరెలా ఊహిస్తున్నారు" ప్రశ్నించాడు సూర్యవంశీ.
    
    "ఫోరెన్సిక్ రిపోర్ట్ మరోసారి చదువు" ఎ.సి.పి. చెప్పడంతో, ఆ రిపోర్ట్ ని మళ్ళీ నిశితంగా చదివాడు సూర్యవంశీ.
    
    "బబ్లూగాడుకూడా ఆరడుగుల ఎత్తే ఉంటాడా?"
        
    "ఎస్... వాడితల దొరికితే.... ఖచ్చితంగా అదే ఎత్తులో ఉంటాడు. బబ్లూగాడు సన్నంగా, పొడవుగా ఉంటాడు.....మనకు దొరికిన కాళ్ళూ, చేతులూ సన్నంగా పొడవుగా ఉన్నాయి. వాడి కుడిచేతికి వెండి కడియం ఉంటుంది. మనకు దొరికిన ఈ చేతుల్లో కుడిచేతికి వెండి కడియం ఉంది"
    
    "మనకు దొరికిన ఈ మొండానికి బట్టలేవీ లేవా...."
    
    "దాదాపు లేవు....రక్తంతో తడిసిపోయిన గుడ్డపీలికలు" చెప్పాడు ఏ.సి.పి.
    
    "శవం ప్రస్తుతం ఎక్కడుంది?"
    
    "మార్చురీలో..."
    
    "నేనొక్కసారి చూడొచ్చా"
    
    "వై నాట్... చూడు.... కానీ.... ఈ వార్తను పేపర్లో రాయొద్దు. అందుకే మీప్రెస్ పీపుల్ ని ఎవర్నీ ఎలవ్ చెయ్యలేదు."
    
    "వాంటెడ్ గా బబ్లూని మర్డర్ చేస్తే అతని శవాన్ని లోకల్ ట్రైన్లో ఎందుకు పంపించారు".... సూర్యవంశీ ప్రశ్నకు ఎ.సి.పి. నిరంజనరావు జవాబు చెప్పలేకపోయాడు.
    
    "అందుకే ఈ కేసుని పర్సనల్ గా నేను టేకప్ చేసాను!" సీరియస్ గా చెప్పాడు ఏ.సి.పి.
    
    పోలీస్ కానిస్టేబుల్ ఏడుకొండలు రెండు కప్పుల్లో టీ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. ఒక కప్పుని అందుకొని, సిప్ చేయబోతూ గోడగడియారం వేపు చూసిన సూర్యవంశీ-
    
    గబుక్కున టీ కప్పుని టేబిల్ మీద పెట్టేసి, లేచి నిలబడ్డాడు.
    
    వాల్ క్లాక్ సరిగ్గా అయిదు గంటలు చూపిస్తోంది.
    
    చటుక్కున సూర్యవంశీకి ఊరు చివర బార్ లో కన్పించిన అమ్మాయి ఆ అమ్మాయి రాసిన ఉత్తరం జ్ఞాపకానికొచ్చింది.
    
    "నన్ను మీరు చూడాలనుకుంటే రేపు సరిగ్గా అయిదు గంటలకి, అబిడ్స్ పోస్టాఫీసుకి రండి. మీరొస్తారని నాకు తెలుసు. సరిగ్గా అయిదు గంటలు.....ఏమాత్రం ఆలస్యం చేసినా నన్ను మీరు మిస్సవ్ తారు. గుర్తుంచుకోండి"
    
    "ఐ విల్ మీట్ యూ టుమారో మార్నింగ్ సర్ సీ యూ సర్"
    
    మరేం మాట్లాడకుండా పరుగు పరుగున ఎ.సి.పి. చాంబర్ లోంచి బయటికి వెళ్ళాడు సూర్యవంశీ.
    
    గాభరాగా లేచి, ఉరుకుల్తో పరుగు పెడుతున్న సూర్యవంశీవేపు ఆశ్చర్యంగా చూసాడు ఎ.సి.పి. నిరంజనరావు.
    
    గబగబా మెట్లుదిగి రోడ్డుపక్కన చెట్టుకింద పార్క్ చేసిన హీరోహోండాని స్టార్ట్ చేసాడు.
    
    మరో రెండు క్షణాల్లో హీరో హోండా, రామకోటి చౌరాస్తామీదుగా అబిడ్స్ వెళ్ళే దారిలో ఉంది.
    
    అప్పుడు టైమ్ సరిగ్గా సాయంత్రం అయిదు-అయిదు నిమిషాలైంది.
    
                                                *    *    *    *    *
    
    అబిడ్స్ లోని జనరల్ పోస్టాఫీసు కోలాహలంగా ఉంది.
    
    హీరో హోండాని పార్క్ చేసి నాలుగువేపులా చూసాడు సూర్యవంశీ.
    
    ఎక్కడా ఆ అమ్మాయి కన్పించలేదు.
    
    తనకోసం జి.పి.ఓ. మెయిన్ గేటుదగ్గర ఆ అమ్మాయి ఎదురు చూస్తూ నిల్చుంటుందని తను విష్ చేయగానే ఫైవ్ మినిట్స్ లేట్.... అని అంటుందని ఆశించిన సూర్యవంశీ వస్తూ పోతున్న అమ్మాయిల్లో ఏ ఒక్క అమ్మాయీ ఆ అమ్మాయి కాకపోవడంతో తీవ్రమైన నిరాశకు లోనయ్యాడు.
    
    మెట్లెక్కి లోన కౌంటర్స్ లోకి అడుగుపెట్టాడు....పోస్టాఫీసు అంతా రద్దీగా ఉంది.
    
    "కుర్తా పైజామాలు వేసుకున్న అమ్మాయిల్ని, ఎట్రాక్టివ్ గా, ఫేషన్ బుల్ గా కన్పిస్తున్న అమ్మాయిలనీ పరిశీలిస్తూ ముందుకు కంగారుగా నడుస్తున్నాడు.
    
    ఎక్కడా ఆ అమ్మాయి కన్పించలేదు.
    
    చేతివాచీవేపు చూసుకున్నాడు అయిదూ ఇరవై....
    
    అంటే వచ్చి వెళ్ళిపోయిందా?
    
    నాలుగుసార్లు లోనికి బయటకూ తిరిగాడు. కరెక్టు టైమ్ కు రాకుండా ఆ అమ్మాయిని మిస్ కావడం అనీజీగా ఉంది సూర్యవంశీకి.
    
    కౌంటర్స్ బయట ఉన్న వ్యక్తుల్నీ, కౌంటర్స్ లోన ఉన్న వ్యక్తుల్నీ చూస్తూ నడుస్తున్న సూర్యవంశీ చూపులు-

 Previous Page Next Page