Previous Page Next Page 
చిక్కలేదు చిన్నదాని ఆచూకీ... పేజి 15


    "వద్దొద్దు...అంత పెద్ద శిక్ష విధించకు. అపర్ణ ప్లీజ్" అన్నాడు శ్రీధర్.

 

    పడిపడి నవ్వుతూన్న ధ్వని కెరటాలు కెరటాలుగా విన్పించింది ఆ వేపు నుంచి.

 

    "అపర్ణా! నా పరిస్థితి నాకే అర్థంకాని స్థితిలో వున్నాను. నిన్ను చూడకుండా నేనుండలేకపోతున్నాను. ఇండియా కెప్పుడొస్తావ్? అసలు నిన్ను దర్శించే భాగ్యం కలగుతుందంటావా?" అన్నాడు బాధాతప్తమైన కంఠంతో. అది మామూలు బాధ కాదు. ఒక ప్రేమికుడు తన గుండె చివరన నిక్షిప్తం చేసుకున్న వ్యధ. బాష కందని తన భావరాశి ఎక్కడ దూరమై పోతుందోనన్న ఆవేదన!

 

    "ఎందుకంత కంగారు? వచ్చేస్తాగా."

 

    "అదే ఎప్పుడు?" అన్నాడు నిర్వేదంగా.

 

    "ఎప్పుడనేది ఖచ్చితంగా చెప్పలేను. రేపు న్యూజెర్సీ వెళ్ళాలి. అక్కడ నేనిచ్చే ప్రోగ్రాంకి వివిధ దేశాల ప్రముఖులు విచ్చేస్తారు" తన లక్ష్యసాధన దిశగా ఒక్కొక్క మెట్టే పైకి వెళుతున్నానన్న భావం తొంగి చూసిందామె గొంతులో.

 

    మారుమాట్లాడ్డానికి శ్రీధర్ దగ్గర మాటలు కరువయ్యాయి ఆ క్షణం. ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలనుకున్న శ్రీధర్ ఆ క్షణం ఏమీ మాట్లాడలేకపోయాడు. ఈలోపు ఆవేపు ఫోన్ డిస్ కనెక్ట్ అయింది.

 

    హుషారుగా, ఆనందంగా లైఫ్ ఎంజాయ్ చేయవలసిన వయసులో తన మనసును ఏవో సమస్యలు పట్టిపీడిస్తున్నట్టు, అసహనంగా ఫీలవ్వసాగాడతడు.

 

    అతనిలో తెలియని నిరాసక్తత, నిర్లిప్తత చోటుచేసుకుంది.

 

    అతడి అసహనాన్ని, నిరాసక్తతని, నిర్లిప్తతనీ పారదోలుతూ తిరిగి రింగయింది ఫోను.

 

    రిసీవర్ అందుకున్నాడు నిర్లక్ష్యంగానే.

 

    "హలో...ఏంటీ సంగతి? ఏం చేస్తున్నావ్?"

 

    అదే గొంతు... అదే మధురస్వరం... చిన్న నవ్వుతోపాటు, టెలిఫోన్ తీగల వెంట ప్రవహించొచ్చిన చిలిపి కవ్వింపు! 'తీయని కవ్వింపుకూడా ఓ కళే' అనిపించిందతనికి.

 

    "ఏంటాలోచిస్తున్నావ్? ఏంటి పరిస్థితి? ఎందాకా వచ్చింది?" ప్రశ్న మీద ప్రశ్న గుళ్ళవర్షం కురిపించేలా...

 

    "ఇంతకీ రావున్నాడా?"

 

    ఈసారి శ్రీధర్ మొహం కందిపోయింది, ఎర్రగా వుక్రోషంతో.

 

    "రావూ లేడు. గౌడూ లేడు. గుజ్రాలూ లేడు. అసలు డైలీన్యూస్ చదివే అలవాటు లేనట్టుందే నీకు?" అన్నాడు శ్రీధర్.

 

    "ఆ అలవాటైతే లేదుగానీ కణ్ణదాసన్ కవిత్వమన్నా, పాటలన్నా, పలువర్ సూక్తులన్నా, టోనీమోరిసన్ బిలవ్డ్ నవలన్నా, తస్లిమా నస్రిన్ రచనలన్నా, శోభాడే ధైర్యమన్నా, కన్నడ అనంతమూర్తి రచనలన్నా, కృష్ణశాస్త్రి కవితలన్నా, ఆత్రేయ పాటలన్నా పిచ్చిపిచ్చిగా చదివేస్తా" మళ్ళీ అడిగింది తనే అట్నుంచి చిన్నగా నవ్వుతూ.

 

    "ఇప్పుడు నేనేం చేస్తున్నానో వూహించి చెప్పగలవా?"

 

    "గొంతువరకూ మెక్కి, నిద్రరాక టీవీలో ఏ ఇంగ్లీష్ ఛానలో చూస్తుంటావ్" కసిగా అన్నాడు శ్రీధర్.

 

    అవతలనుంచి తెరలు తెరలుగా నవ్వు.

 

    "కాదు."

 

    "ఏ నవలో చదువుతుంటావ్."

 

    "లేదు."

 

    "బెడ్ మీద బోర్లా పడుకుని, రుబ్బుడు రోలులా అటూ ఇటూ దొర్లుతూ మాట్లాడుతుంటావ్."

 

    "ఊ...హు..."

 

    "మరేం చేస్తున్నావ్?" వళ్ళు మండిందతనికి.

 

    "స్నానం చేసి, ఫ్యాన్ గాలికి కురులారబెట్టుకుంటున్నా."

 

    మళ్ళీ నవ్వు!

 

    దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య హాయిగా నవ్వుకుంటున్నట్టుగా వుంది ఆమె నవ్వు.

 

    "వెరీ పూర్ ఎక్స్ పెక్టేషన్ నీది...? అసలు ఆడపిల్లలంటే ఏమనుకున్నావ్? మనోహరమైన పచ్చని ప్రకృతి ఒడిలో పూచిన ఓ అందమైన పువ్వు...నవమి నాటి వెన్నెల కాంతుల్లో వున్నట్టుండి కురిసి, తళుక్కుమని మెరిసే ఓ హిమబిందువు..." అని ఆమె చెప్తూంటే, ఓ మధురమైన స్వరాన్ని తనకు తెలీకుండా ఆసక్తిగా వినసాగాడు శ్రీధర్.

 

    "ఇంతకీ 12155 సంగతేమిటి?"

 

    మళ్ళీ మొదటికొస్తూ అడిగిందామె.

 

    "ఆ ప్రయత్నంమీదే వున్నాలేగాని నీకో పజిల్...ఆన్సర్ చెప్పగలవా?" అడిగాడు శ్రీధర్.

 

    "ఏంటీ...? పజిలా...? నువ్వు నాకు వేయడమా...?" అడిగిందామె విస్మయంగా.

 

    "బోలో...బోలో..."

 

    "ప్రపంచంలో దేనికైనా అనుభవం వుందా అని అడుగుతారు. లేకపోయినా వుందనే చెప్పాలి. ఒక విషయంలో మాత్రం అనుభవం వుండాలి. వున్నా అది లేదనే చెప్పాలి మగాళ్లు, ఏమిటది?" చెప్పాడు శ్రీధర్.

 

    అది వింటూనే పెద్దగా నవ్వేసిందా అపరిచితురాలు. ముస్సోరి హిమాలయాల కొండల్లో దుమికే కెమ్టీ జలపాతంలా వుందానవ్వు. నవ్వుకే నలత తెప్పించేంత అందమైన నవ్వు ఆమెది. బహుశా ఆ నవ్వే అతనిలోని అసహనాన్ని క్రమంగా కరిగించేస్తోందేమో!

 

    "ఇంకేం ప్రశ్నలు దొరకలేదా...ఇటువంటి ప్రశ్న అడిగావ్?" తేలిగ్గా తీసుకుంటూ అందామె అట్నుంచి.

 

    "అయితే చెప్పు చూద్దాం...." కవ్వింపుగా అన్నాడు శ్రీధర్.

 

    "ఫస్ట్ నైట్ భార్యతో భర్త చెప్పవలసిన విషయం అది. అనుభవం లేకపోయినా వుందని నిరుద్యోగి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెప్పాలి. పెళ్ళికి ముందు అనుభవం వున్నా ఫస్ట్ నైట్ లో భార్య అడిగినప్పుడు లేదనే చెప్పాలి. లేదంటే కొంప కొల్లేరైపోతుంది. ఈ మాత్రం కూడా తెలియని నువ్వేం మగాడివయ్యా... అవునూ...ఇంతకీ నీకు సెక్స్ లో అనుభవం వుందా?" చిన్నగా నవ్వుతూ అడిగింది అపరిచితురాలు.

 Previous Page Next Page