గీత రోజూలాగే ఆలస్యంగా వచ్చింది. అక్క కారణం అడక్కుండానే ఎప్పటిలాగే "ప్రాక్టికల్స్" అంది.
"గీతా! థియరీ విషయంలో ఎంత ముందుకు పోయినా ఫరవాలేదు. కాని, ప్రాక్టికల్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి! నేను నీలా మెడిసిన్ చదవలేదుకాని, జీవితాన్ని ప్రాక్టికల్ గా చూశాను."
తెల్లబోయి చూసింది గీత.
"ఇవాళ నీరద్ వచ్చాడు. హోటల్ గంధర్వలో టేబిల్ రిజర్వ్ చేయించి టికెట్స్ తెచ్చి ఇచ్చాడు. నువ్వు అతని డాన్స్ చూడాలనుకుంటున్నావుట కదూ!"
"లేదు! నువ్వు వస్తేనే వస్తానన్నాను" తల అడ్డంగా తిప్పుతూ గబగబ గాభరాగా అంది.
"అతనూ నువ్వూ రోజూ కలుసుకుంటూనే ఉన్నారా?"
"నో! నో! జస్ట్....కారులో లిఫ్ట్ ఇస్తున్నాడు?"
"అంతకుమించి ఏమీ చెయ్యటంలేదు గద!"
"అక్కా!"
"ఎందుకమ్మా! అంత ఉద్రేకపడతావు? స్త్రీల విషాదాంత జీవితకథలన్నింటికీ, నాంది ఇదే, ఈ ఆకర్షణ!"
"లేదక్కా! నేను కాని పనులేవీ చెయ్యటంలేదు. నిజం! నీమీద ఒట్టు! అలా అయితే అతని డాన్స్ కి నువ్వు వస్తేగాని రానని ఎందుకంటాను?"
"నేను వస్తాననే అనుకున్నావా?"
"కోపం వస్తుందనే అనుకున్నాను."
"మరి, నన్నెందు కడగమన్నావు?"
"కోపం వచ్చినా, నాకోసం వస్తావేమోనని ఆశ పడ్డాను. అతని డాన్స్ చాలా బాగుంటుందని అందరూ అంటారు. మా క్లాస్ మేట్స్ అతని ఆటోగ్రాఫ్ కోసం ఎలా ఎగబడతారో తెలుసునా? మామూలుగా వెళ్ళి డాన్స్ చూడటంలో తప్పేముంది? ఒకసారి చూద్దామక్కా!"
వేద ఆలోచనలో పడింది. గీత తనకెంతో గౌరవమిచ్చి తను వస్తే కాని డాన్స్ ప్రోగ్రాంకి రానంది. చిన్నతనంకొద్దీ అందరూ అనుకునేమాటలు విని అతని డాన్స్ చూడాలని సరదా పడుతోంది! ఇప్పుడు మొండిగా తిరస్కరిస్తే కుతూహలం అణచుకోలేక తనకు తెలియకుండానే చూస్తుందేమో! అప్పుడు పరిస్థితులు మరింత విషమిస్తాయి. తన గౌరవం దక్కించుకోవటమే మంచిది.
వేద ఆలోచిస్తూ ఉండటం గమనించి గీత "అక్కా! అతను నీతో నువ్వంటే తనకు చాలా గౌరవమని చెప్పాడటగా!" అంది.
"అలా అని నీతో చెప్పాడా?"
"అవును. అతను అబద్దమాడడు!"
ఇంత కొంచెం పరిచయంలో అంత నిర్ధారణగా చెపుతున్న చెల్లెల్ని కనుబొమలు పైకెత్తి చూసింది.
"అది అబద్ధమా అక్కా!"
"కాదు!"
"నిన్ను గౌరవించనివాళ్ళతో నేను మాట్లాడనక్కా." అచ్చమైన అభిమానంతో అంటున్న చెల్లెలి ముఖం చూసి జాలితో కరిగిపోయింది వేద.
భయం భయంగా "వెళదామా?" అంది గీత.
"వెళదాం!"
"థాంక్యూ!"
గీత ఆశించినట్లుగానే, నీరద్ సగర్వంగా ప్రకటించుకొన్నట్లుగానే అత్యద్భుతంగా ఉంది డాన్స్ ప్రోగ్రాం! వేద కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయింది.
"మార్వలెస్! మీ డాన్స్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందని నాకు తెలియదు!" అంది గీత తమదగ్గరకు వచ్చిన నీరద్ తో.
"ఇప్పుడు తెలిసిందిగా! ఇకముందు ప్రతి ప్రోగ్రాంకి రండి. టేబిల్ మీకు రిజర్వ్ చేయిస్తాను."
"తప్పకుండా వస్తాను."
వేద ఉనికినే మరిచిపోయి ఇద్దరూ వికసించిన ముఖాలతో మాట్లాడేసుకుంటున్నారు. ఆమె లేచి నిలబడి "వెళదామా!" అంది. గీత కూడా లేచింది. నీరద్ ను అపోలజిటిక్ గా చూస్తూ.
"నా కారులో డ్రాప్ చేస్తాను" అన్నాడు నీరద్.
"వద్దు! టాక్సీలో వెళతాము" అని బయలుదేరింది ఆమె. అక్క చూడకుండా నీరద్ వైపు చెయ్యి ఊపి అక్క వెనకాతలే నడిచింది గీత. టాక్సీలో ఇద్దరూ ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. గీత ముఖంనిండా చిరునవ్వుల మెరుపులు. వేద ముఖంమీద ఆందోళనల మబ్బులు.
భోజనాలు పూర్తిచేసి పడుకున్నాక అప్పుడు ప్రారంభించింది ఆమె.
"గీతా! వయసుపొంగులో అన్నీ అందంగా....మధురంగా కనిపిస్తాయమ్మా! నువ్వెలాంటి మాయవాగులోకి ప్రవేశిస్తున్నావో, నీకు అర్ధంకావటం లేదు!"
"ఏం జరుగుతుందక్కా!"
"తీపి తీపి మాటలతో, రకరకాల ప్రలోభాలతో నిన్ను వశపరుచుకుంటాడు. ఆ తరువాత నిన్ను నిర్ధాక్షిణ్యంగా నీ కర్మానికి వదిలేస్తాడు."
"నీరద్ ఒక్కనాటికీ అలా చెయ్యడు."
కలుగుతున్న విసుగును అణచుకోవటానికి శ్రమ పడవలసి వచ్చింది వేద,
"అతడు అలాంటివాడు కాడనే అనుకుందాం! కానీ, అతని తలిదండ్రులున్నారు కదా? ఇప్పుడు వెంట వెంట తిరిగి తీరా పెళ్ళి సమయం వచ్చేసరికి తలిదండ్రుల చాటుకి తప్పుకుంటాడు."
"అతడు నన్ను పెళ్ళి చేసుకోడంటావా?"
"చేసుకుంటాడనే అనుకుంటున్నావా?"
"పోనీయ్ చేసుకోకపోతే! నేను మానసికంగా అతని భార్యను' ఎప్పటికీ మానసికంగా అతని భార్యగానే ఉండిపోతాను."
గుండె గుభిల్లుమంది వేదకి__భగవంతుడా? ఇదెక్కడి వారసత్వం?
"అలా వీల్లేదు గీతా! నా కారణంగా నీ జీవితం నాశనమవుతుందేమోనని భయంతో అల్లాడిపోయేదానిని ఎన్నాళ్ళో? కానీ కాలం మారకపోతుందా, యం.బి.బి.యస్. చదివిన అందమైన నిన్ను, నా జీవితం గురించి ఆలోచించకుండా పెళ్ళిచేసుకునే ఉదారుడైన యువకుడు ఉండకపోతాడా, అని ఆశతో ఎదురు చూస్తున్నాను. తొందరపడి నీజీవితం నరకం చేసుకుని, అన్ని విధాలా కృంగిపోయి ఉన్న నన్ను ఇంకా చిత్రవధ చెయ్యకమ్మా!"
వేద కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అక్క కళ్ళలో నీళ్ళు చూసి ఏమాత్రమూ సహించలేదు గీత. ఎన్నెన్ని దుర్భరావేదనలు నీరై కరగకుండా ఆ కళ్ళలో కరడు కట్టుకున్నాయో, గీతకు బాగా తెలుసు. ఆ కళ్ళలో నీటిబొట్టు చిందిందంటే ఇక ఆ హృదయంలో క్షోభ వర్ణనాతీర మన్నమాట!
అక్క కన్నీళ్లు తుడిచి "నీకు కష్టం కలిగించే పని నేను చెయ్యనక్కా! ప్రామిస్!" అని చేతిలో చెయ్యి వేసింది.
ఎప్పటిలాగే మెడికల్ కాలేజి బయట కారులో ఎదురుచూస్తున్నాడు నీరద్. గీత గేటుదాటి బయటికివచ్చి చిరునవ్వుతో ఆహ్వానిస్తున్న నీరద్ ని చూసి చూపులు తిప్పుకుని వెళ్ళిపోయింది. "గీతా!" అంటూ ట్రాఫిక్ రూల్స్ కి విరుద్ధంగా కారుని రోడ్డుని క్రాస్ చేయించి, విజిల్ చేస్తూ వెంటపడిన పోలీస్ చేతిలో పదిరూపాయలు పడేసి, గీత చెయ్యి పట్టుకుని "గీతా! కమిన్!" అన్నాడు.
ఆ చెయ్యి విదిలించుకుంటూ "నేను నీతో మాట్లాడను" అంది.
కోపంగా "అంతా నీ యిష్టమేనా?" అన్నాడు.
"మరెవరి యిష్టం?"
"ఎందుకు మాట్లాడవో కారణం చెప్పు?"
"నువ్వు చాలా చెడ్డవాడివి!"
నీరద్ అమాంతం గీతని ఎత్తుకొచ్చి కారులో పడేసి కారు స్టార్టు చేశాడు.
"ఏయ్ ఏమిటిది? బుద్దుందా?"
"లేదు. నేను చెడ్డవాణ్నిగా?"
గీత ఏడుస్తూ "నన్ను వదిలెయ్యి, నేను వెళ్ళిపోవాలి" అంది.
సడన్ బ్రేక్ తో కారు ఆపాడు నీరద్.
"ఏడవకు! నిజంగా నాతో ఉండటం నీకంత కష్టంగా ఉంటే దింపేస్తాను. నిన్ను ఏడిపించను. ఐ లవ్ యూ...."
గీత మాట్లాడలేదు. డోర్ తెరుచుకుని దిగిపోనూలేదు. ఏడుస్తూ కూచుంది. గీతను దగ్గరకు తీసుకుని కళ్ళు తుడిచాడు.
"నేను ఎందుకు చెడ్డవాడినో చెప్పు?"
"నువ్వు నన్ను వలలో వేసుకుంటావు."