Previous Page Next Page 
గర్ల్ ఫ్రండ్ పేజి 14

    ఆమె తల దించుకుంది.
    "ఓ! అయామ్ సారీ! ఇప్పుడు నువ్వు పెద్ద ఉద్యోగస్థురాలివికదూ?"
    అతని కంఠంలో నిష్టూరం అర్ధమయింది ఆమెకి. అయినా సమాధానం చెప్పలేదు. అతడు తనను అర్ధం చేసుకోవటంకంటే అపార్ధం చేసుకోవటమే మంచిది.
    "పొజిషన్ మారగానే మనసులు మార్చుకునే వ్యక్తులు కొందరుంటారు వేదా! నువ్వూ అలాంటిదానివని నమ్మలేకపోతున్నాను."
    ఆమె నవ్వింది.
    "ఈ నవ్వులో కల్మషం ఉంటుందని దేవుడు దిగివచ్చి చెప్పినా నమ్మను."
    నిగ్రహించుకోవటం కష్టమవుతోంది ఆమెకు.
    "ఇది ఆఫీస్, ఇలాంటివన్నీ మాట్లాడకూడదు. ఎవరైనా గమనిస్తే ఇద్దరికీ మాటవస్తుంది."
    "మీ ఇల్లెక్కడ?"
    ఆమె మళ్ళీ మాట్లాడుటలేదు. తన అహం గాయపడగా ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఒక నిట్టూర్పు విడిచి ఆ అధ్యాయం అంతటితో సమాప్తమనుకొంది ఆమె. కానీ అలా జరగలేదు. ఒకవారం రోజులలోనే ఆమె ఇంటికి వచ్చాడు శ్రీనివాస్. ఆశ్చర్యమూ, సంతోషమూ, భయమూ ముప్పేటగా పెనవేసుకుని ఉక్కిరిబిక్కిరి చేయగా "మా ఇల్లెలా తెలుసుకున్నారు?" అంది.
    "అందరికీ తెలిసిన విషయాలు నాకు తెలియటం అంత ఆశ్చర్యమా?"
    ఇతనికి తెలిసిపోయిందన్నమాట! గుండెలమీద ఏదో పెద్దబరువు. కానీ ఏనాటికైనా తెలియవలసినదేగదా!
    "థాంక్స్!"
    "ఎందుకు?"
    "నాకు ఉద్యోగం ఇప్పించినందుకు."
    "మీ అప్లికేషన్ చూసాను. ఇంకా ఉద్యోగం దొరకలేదని తెలుసుకుని...."
    "ఉద్యోగం ఇప్పించావు. ఆ ఉద్యోగం వచ్చినప్పుడు నేనెంతో ఆనందించాను. ఎందుకో తెలుసా? నిన్ను పెళ్ళి చేసుకోవచ్చునని. అప్పటి నుంచీ నా కళ్ళు ప్రతి బస్ స్టాప్ లోనూ నీకోసం వెతుకుతూనే వున్నాయి. బస్ స్టాప్ లో నిలబడే స్థాయినుంచి నువ్వు ఎదిగిపోయావని నాకేం తెలుసు? ఇంతవరకూ విధి నన్ను ఏడిపించింది. ఇప్పుడు చాలా కౄరంగా పరిహసించింది."
    "జరిగిందేదో జరిగింది. చక్కగా ఉద్యోగం చేసుకోండి. చక్కని అమ్మాయిని పెళ్ళిచేసుకోండి!"
    "ఏం సలహా? ఇంకా ఈ ఉద్యోగం చేస్తాననే నమ్ముతోందా నీ అహం? నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాకే ఇక్కడికి వచ్చాను. వేదా! నా మాటవిను. నువ్వూ రాజీనామా ఇచ్చెయ్యి. నాతో వచ్చెయ్యి...."
    ఉలికిపడి విభ్రాంతితో చూసింది వేద.
    "అలా చూడకు! నాకు తెలుసు! ఏం జరిగిందో, ఎందుకు ఈ విషవలయంలో చిక్కుకున్నావో, నేను ఊహించగలను. కానీ నీ మనసు అమృతంలాంటిదని మాత్రం చెప్పగలను. నాతో వచ్చెయ్యి. ఎక్కడో ఒకచోట, ఎలాగో ఒకలాగ హాయిగా బ్రతుకుదాం."
    ఎంత హాయిగా ఉన్నాయి ఈ మాటలు! ఇన్నాళ్ళకు 'నేను నీకున్నాను' అంటూ తనవాడైన వ్యక్తి తన ముందుకు వచ్చాడు. కాని...."అయామ్ సారీ!"
    "అవునులే! నాలాంటి దరిద్రుడికి భార్య కావటంకంటె జయపాల్ లాంటి ధనవంతుడి గరల్ ఫ్రెండ్ గా వుండటమే మేలు! రాను రాను ఇలా తయారవుతోంది మన సమాజం!"
    "అదికాదు! లోకం ఏమనుకున్నా జయపాల్ నన్ను ఎలా స్వీకరించినా నేను మాత్రం ఆయనకు భార్యననే అనుకుంటున్నాను. ఏది ఎలా జరిగినా చివరివరకూ అలాగే బ్రతకాలని నా సంకల్పం" అనాలనుకొంది వేద. కానీ అనలేకపోయింది. ఎవరికైనా ఆ మాటలెంత హాస్యాస్పదంగా వినిపిస్తాయో, ఆమెకు తెలుసు.
    "సరే! నీ నిర్ణయం అర్ధమయింది. ఎవరికైనా ఈ ప్రలోభంనుంచి బయటపడటం అంత తేలికకాదు. కానీ, ఒకమాట! రాత్రి అనుభవించిన ప్రియురాలిని ఉదయమే హత్యచేసే అరేబియన్ నైట్స్ కథలలో రాజు లాంటివాళ్ళు, ఈ ధనిక రసికులు! అంచేత నీ జాగ్రత్తలో నువ్వుండు. అతనికేనాడైనా నీమీద కోపం వచ్చి నిన్ను సర్వనాశనం చెయ్యాలనుకున్నప్పుడు నిన్ను నువ్వు రక్షించుకొనే ఉపాయాలాలోచించుకో! స్నేహితుడిగా ఇదే నీకు నేనిచ్చే ఆఖరి సలహా!"
    చరచర నడుచుకుంటూ వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు శ్రీనివాస్.
    అటు శ్రీనివాస్ సృష్టిలోనూ, ఇటు జయపాల్ దృష్టిలోనూ కూడా తను నీచురాలిగా మిగిలిపోయింది. తనను సరిగా అర్ధం చేసుకోగలిగిన వారెవరు?
                                      10
    కాలింగ్ బెల్ విని తలుపు తెరిచింది వేద__"గుడ్ మార్నింగ్" అంటూ నవ్వుతూ వచ్చి లోపల పేము సోఫాలో కాలుమీద కాలేసుకుని కూర్చున్నాడు నీరద్.
    ఆ చొరవకు నిర్ఘాంతపోతూ, ఆకర్షణీయమైన ఆ చిరునవ్వుకు మండిపడుతూ "ఇక్కడికెందుకొచ్చారు?" అంది శాంతంగానే, అయినా కఠినంగా....
    "ఇవాళ రాత్రి హోటల్ గంధర్వలో నా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, మీకు టేబిల్ రిజర్వ్ చేశాను, టికెట్స్ తెచ్చాను."
    "నాకు టేబుల్ రిజర్వేషనా? నేను డాన్స్ ప్రోగ్రామ్ కి ఆ హోటలుకి వస్తానని మీకెవరు చెప్పారు?"
    "మీరు వస్తానని చెప్పలేదు, గీత వస్తానని చెప్పింది."
    "గీత వస్తానని చెప్పిందా?-మీతో?"
    "అఫ్ కోర్స్! నేను రమ్మని బలవంతం చేస్తేనే వస్తానంది."
    "రమ్మని బలవంతం చేసారా? ఎప్పుడు?"
    "నిన్న!"
    "నిన్న? నిన్న మీరెప్పుడు కలుసుకున్నారు?" ఆశ్చర్యంగా అడిగింది.
    "మేము కలుసుకోనిది ఏ రోజున?" అంతకంటె ఆశ్చర్యంగా అడిగాడు.
    కోపాన్ని దిగమ్రింగుకుంటూ "మీరు బలవంతంచేస్తే, అది ఒప్పుకుందా?" అంది.
    అంత తేలిగ్గా ఒప్పుకుంటుందా? ముందు రానుగాక రానంది. నా డాన్స్ ఎంతో బాగుంటుందని నేను చెప్పాక, మిగిలిన-అందరూ కూడా బాగుందన్నారు కనుక, చూడాలనిపించి, మీరు వస్తే వస్తానంది. అందుకే మీకు రిజర్వ్ చేయించాను."
    "అందుకా?"
    "అవును! అందుకే! తప్పకుండా గీతను తీసుకుని వస్తారుకదూ?"
    "చూస్తాను!"
    "చూడండి! ఒకసారి చూసారంటే లక్షసార్లు చూస్తారు!" ఉత్సాహంగా అన్నాడు.
    "లక్షసార్లా?"
    "సారీ! అది నా ఊతపదం! ఐ మీన్, ఐ వోంట్ డిజప్పాయింట్ యు...."
    నీరద్ మాటల్లో ఎప్పుడూ సగానికి సగం ఇంగ్లీషు మాటలు దొర్లుతూనే ఉంటాయి.
    డాన్స్ చేస్తున్నట్లుగానే నడుస్తూ ఇంచుమించు గుమ్మందాకా వెళ్ళినవాడు గిర్రున వెనక్కు తిరిగివచ్చి "మేడమ్! నాకు మీరంటే చాలా గౌరవం! ఐ రెస్పెక్టు యు వెరీమచ్!" అన్నాడు.
    వేద తెల్లబోయి చూస్తుండగానే "ప్లీజ్! నేను మీతో ఇలా అన్నానని గీతతో చెప్పరూ?" అన్నాడు జాలిగా, నవ్వు ఆపుకోలేక పైకి నవ్వేసింది వేద.
    "థాంక్ యు" అని ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. అమాయకత్వం ఉట్టిపడే ముఖం, చైతన్యం తొణికిసలాడే కళ్ళు, నైర్మల్యం పొంగి ప్రవహించే నవ్వు....ఇతనిలోనూ కపటం ఉంటుందా? త్రాచుపాము పిల్ల, పిల్లత్రాచు కాకపోతుందా?

 Previous Page Next Page