"భావనా! నువ్వు ఇతన్ని చూస్తూ ఉండు! నేను పక్కింటి డాక్టరుగారిని పిలుచుకువస్తాను" అంది.
అంటూనే, పరుగులాంటి నడకతో పక్కింటికి వెళ్ళింది.
"చాలా నొప్పిగా వుందా సూరజ్.
అయిదు నిమిషాల్లో డాక్టరుని వెంటబెట్టుకు వచ్చింది అరుణ.
డాక్టరు పరీక్ష చేసి, "ఎక్స్ రే తీసి చూస్తే మంచిది" అన్నాడు.
డాక్టరు కారులోనే సూరజ్ ని తీసుకెళ్ళి ఎక్స్ రే తీయించారు.
"ఫ్రాక్చర్ అయింది. ఓ నెల రోజులపాటు పూర్తి రెస్టు వుండాలి" అన్నాడు డాక్టరు.
"నెల రోజులే! ఎక్కడ వుండనూ? రేపు నేను రూం వెకేట్ చేసి తీరాలి" అన్నాడు సూరజ్ అయోమయంగా.
"మా వర్కింగ్ ఉమన్స్ హాస్టల్లో నిన్ను ఉండనివ్వరనుకుంటాను' అంది భావన. అరుణ వైపు ఓరగా చూస్తూ.
"తప్పనిసరి అయితే ఏదైనా హాస్పిటల్లో చేరుస్తాంలే! చేసేవాళ్ళూ, చూసేవాళ్ళూ ఎవరో ఒకళ్ళు దొరక్కపోరు!"
ఇంక తప్పించుకోలేకపోయింది అరుణ. "మా ఇంట్లో ఉండవచ్చులే!" అంది నానుస్తున్నట్లు మెల్లిగా.
అంత బాధలోనూ సంతోషం కలిగింది సూరజ్ కి.
చెయ్యి విరిగితే విరిగింది గానీ, అదృష్టం తిరిగింది!
తంతే బూరెల బుట్టలో పడినట్లుగా పడడం, పడడం అరుణ ఇంట్లోనే పడ్డాడు!
ఎంతటి లక్కీ ఫెల్లో తను!
కనీసం నెలరోజుల రెస్టు అని చెప్పాడు డాక్టరు.
జరిగితే జ్వరం అంత సుఖం లేదంటారు.
అట్లాగే అంతా బావుంటే ఒక్క నెల ఏమిటీ, నెలల తరబడి తను రెస్టు తీసుకుంటాడు.
పుస్తకాలు చదువుకుంటాడు.
కవితలు రాసుకుంటాడు.
దారంలేని గాలిపటంలాంటి తన బతుక్కి ఇక్కడ దారి కనబడుతుందేమో!
ఈ వాతావరణమూ, ఈ సౌజన్యమూ తనకి చెప్పలేనంతగా నచ్చేశాయి.
నెలల తరబడి ఉండడం వీలవుతుందోకాదో కానీ కనీసం ఒక్క నెల మాత్రం ఖాయంగా ఉండడానికి వీలుండేటట్లే ఉంది.
ఈ వాతావరణమూ, ఈ సౌజన్యమూ తనకి చెప్పలేనంతగా నచ్చేశాయి.
నెలల తరబడి ఉండడం వీలవుతుందోకాదో కానీ కనీసం ఒక్కనెల మాత్రం ఖాయంగా ఉండడానికి వీలుండేటట్లే ఉంది.
తమ ఇంట్లోని చిన్న రూముని త్వరత్వరగా క్లీన్ చేసింది అరుణ. ఆ రూము పూర్తిగా సెపరేట్ గా వుంటుంది. వేరే ఎంట్రెన్సు. అటాచ్డ్ బాత్ రూం.
అందులోనే మొన్నమొన్నటిదాకా భావన ఉండి వెళ్ళింది.
ఆ గదిలో చేరాడు సూరజ్. రోజులు గడుస్తున్నాయి. మెల్లిమెల్లిగా ఫ్రాక్చర్ తాలూకు బాధ కంట్రోల్ లోకి వచ్చింది. మంచి డాక్టర్. మంచి ట్రీట్ మెంటు.
అంతకంటే మరీ ముఖ్యంగా -
ఈ అమ్మాయి అరుణ వాళ్ళ ఇంట్లో తను ఉండగలుగుతున్నానన్న ఆనందం!
ఓకే కాంపౌండ్ లో -
ఒకే కప్పు కింద -
ఎంతటి అదృష్టం!
ఇక్కడ ఉండగలగడమే కాదు. బోనస్ లాగా అరుణా వాళ్ల అమ్మ జాహ్నవిగారి చేతివంట తినడం-
ఒకరోజు భావన వచ్చేటప్పటికి అప్పుడే భోజనం చేస్తున్నాడు సూరజ్.
అది చూసి గుసగుసగా అరుణతో అన్నది భావన.
"ఈ సూరజ్ మొన్న మొన్నటిదాకా ప్యూర్ వెజిటేరియన్! ఇవాళ ప్యూర్ నాన్ వెజిటేరియన్ లాగా మారినట్లున్నాడే!" నుదురు చిట్లించి, ప్రశ్నార్థకంగా చూసింది అరుణ.
నవ్వేసింది భావన.
"అదేనే! అతగాడు నిన్ను తినేసేటట్లు చూస్తున్నాడు. ఏ రియల్ కాన్నిబాల్"
తక్షణం నిటారుగా కూర్చుని చురుగ్గా చూసింది అరుణ.
"ఇట్లాంటి ఛీప్ హ్యూమర్ అంటే నాకు మహా వెగటు అని నీకు తెలుసు" అంది చురుగ్గా.
"అది కాదే"
"ఏది కాదు...ఇంకెప్పుడూ అట్లాంటి..." అని ఆగి "....ఈవారం పదిరోజుల్లోగా అతని కోసం వేరే రూము చూడు. సీరియస్ గా తీసుకో!" అంది చాలా సీరియస్ గా.
ఆమె మాటలని నిజంగానే చాలా సీరియస్ గా తీసుకుంది భావన.
అందుకనే చెప్పా పెట్టకుండా ఆ రోజు రాత్రే గోదావరి ఎక్స్ ప్రెస్ ఎక్కేసింది వైజాగ్ వెళ్ళడానికి.
వెళ్ళాక ఉత్తరం రాసింది.
"డియర్ అరుణా! వెళ్ళేటప్పుడు నీకు ఫోన్ చేసి చెబుదామనుకున్నాను గానీ - పాపం నీకు అసలు ఫోనే లేదు గదా! బిల్లు కట్టలేదని డిస్ కనెక్ట్ చేసేశారు. అందుకనే చెప్పలేకపోయాను. డియర్! పోతే ప్రస్తుతం మీరు వున్న పరిస్థితులలో ఆ రూము రెంటుకి ఇవ్వకుండా జరుగుబాటు కాదు గదా! సూరజ్ ఈజ్ యాన్ అబ్సల్యూట్ లీ హార్మ్ లెస్ క్రీచర్! కాలు నయం కాగానే తరిమేయకు. అతన్ని అక్కడే ఉండనివ్వు. అంతా నీ మంచికే!" అని రాసి, కొరియర్ లో పంపింది.
అరుణకి సర్వసాధారణంగా కోపం రాదు.
కానీ -
ఇవాళ ఈ ఉత్తరం చదవగానే ఒళ్ళు భగ్గున మండినట్లయింది.
ఆమె పుట్టి బుద్దెరిగిన తర్వాత అంతటి కోపం ఎప్పుడూ రాలేదు.
ఆ కోపం భావన మీద కాదు.
కళ్ళెదుట కనబడుతున్న కఠోరమైన నిజాల పట్ల.
బిల్లు కట్టలేదని ఫోను డిస్ కనెక్ట్ చేసేశారు. బిల్లు కట్టలేదనే ఎల్లుండి వాటర్...
అరుణ ఆ ఉత్తరం చదువుతూ వుండగానే కరెంటు పోయింది.
ఆగిపోయిన ఫ్యాను వైపు ఆందోళనగా చూసింది అరుణ. లైట్లు లేకపోతే కొవ్వొత్తులు పెట్టుకోవచ్చును.
కానీ, ఫ్యాన్ లేకపోతే దోమలకి దొరికిపోతాం గదా!
తన సంగతి కాదు - అమ్మ సంగతి!
ఇక్కడంతా గడ్డీ చెట్లూ, బోలెడన్ని దోమలూనూ!
భయపడ్డంతా అయింది!
ఆరోజు దోమల ధాటి మరీ ఎక్కువగా వుంది. అమ్మ రాత్రంతా పక్కమీద ఇటూ అటూ దొర్లుతూ ఉండడం తెలుస్తూనే వుంది అరుణకి.
అర్థరాత్రి దాటాక, ఇంక భరించలేక- దోమలబారి నుండి పారిపోవడానికా అన్నట్లు లేచి అటూ ఇటూ త్వరత్వరగా పచార్లు చేయడం మొదలెట్టింది జాహ్నవి.
ఎంతో గిల్టీగా ఫీలయింది అరుణ.
"సారీ అమ్మా! నీకోసం ఏమీ చేయలేకపోతున్నాను" అంది ఆపాలజెటిక్ గా. "అదేమిటి నాన్నా! ఆ దేవుడు ఎట్లాగో అట్లా ఏదో ఒకటి చేస్తాడులే!" అంది జాహ్నవి.
"నాకెవ్వరూ ఉద్యోగాలు ఇవ్వరు. ఇచ్చిన ఉద్యోగాలు నేను నిలుపుకోలేక పోతున్నాను" అంది అరుణ.
అరుణకి దగ్గరగా వచ్చి, ఆప్యాయంగా ఆమె నుదుటిని చుంబించింది జాహ్నవి.
ఈ కుళ్ళులో నువ్వు ఇమడలేక పోతున్నావని నాకు తెలుసు నాన్నా అంది ఓదార్పుగా.
సూరజ్ గదిలో మాత్రం చడీ చప్పుడూ లేదు.
"దోమల బాధతో అతనికి నిద్రపడుతోందో లేదో పాపం! అనుకుంది అరుణ.
మంచంమీద బాసింపట్టు వేసుకుని కూర్చుని ఉన్నాడు సూరజ్. దోమలు కుట్టడం అతనికి తెలియడం లేదు.
తల్లీ కూతుళ్ళ మాటలు మాత్రం అతనికి వినబడుతున్నాయి.
ఏమి చెబుతోంది ఈ అరుణ?
తనకి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఉండరుట.
ఒకవేళ ఎవరైనా ఉద్యోగం ఇచ్చినా అందులో ఇమడలేకపోతుందిట!
అచ్చం తనలాగే!
ఈ సిస్టమ్ లో ఇమడలేకపోవడం -
ఒక గాడిలో పడలేకపోవడం -
ఏదో తోచినట్లుగా చటుక్కున సెల్ ఫోన్ అందుకుని ఒక ఫ్రెండుకి ఫోన్ చేశాడు సూరజ్.
"పొద్దున్నే రా! వచ్చేటప్పుడు ఓ పదివేలు తీసుకురా - మళ్ళీ ఇస్తా!" అన్నాడు.
తెలతెలవారుతుండగా పడుకున్నాడు సూరజ్. అప్పుడు నిద్రపట్టింది అతనికి.
ఫ్రెండు వచ్చి తట్టి లేపేదాకా మళ్ళీ మెలకువ రాలేదు.
'అరే లేవరా! పొద్దెక్కి పదకొండవుతోంది..ఇంత లేటా? ఈ లేట్ లతీఫ్ తో నీకు కాంపిటీషనా ఏందిరా?" అన్నాడు లతీఫ్.