Previous Page Next Page 
వైరం పేజి 13


    "ఎవరూ?" అంటూ బయటికి వచ్చింది ఒక నడి వయసు స్త్రీ.
    "భావన పంపించింది-రూము కోసం" అంది అరుణ, తన అయిష్టాన్ని కొద్దిగా గొంతులో పలికిస్తూ.
    "వీరు..." అన్నాడు సూరజ్ ప్రశ్నార్థకంగా.
    ఆమె ఆ ఇంట్లో నుంచే బయటికి వచ్చింది కాబట్టి పరిసర న్యాయం ప్రకారం ఆమె అరుణకి అమ్మగారయి ఉండాలని అనుకోవాలి గానీ, ఇద్దరికీ రూపంలో పోలికలు తక్కువ. అయితే, ఆమె కూడా అరుణలాగే సౌమ్యంగా, నెమ్మదస్తురాలిలాగా కనబడుతోంది.
    'అందులో ఆశ్చర్యం ఏముందీ? ఇక్కడ ఉన్న పాములు కూడా చాలా సాధువులలాగే కనబడుతున్నాయి కదా!" అనుకున్నాడు సూరజ్.
    "మా అమ్మ" అంది అరుణ ముక్తసరిగా.
    "భావన ఎవరో ఆడపిల్లని పంపిస్తానని అంది కదా!" అంది జాహ్నవి, అరుణ తల్లి.
    అంతలోనే -
    గేటు బయట స్కూటర్ ఆగిన చప్పుడు.
    తలతిప్పి చూశాడు సూరజ్.
    తన కెనెటిక్ హోండాని లాక్ చేస్తోంది భావన.
    తన తరఫున వాదించడానికి వస్తున్న ఏస్ లాయర్ని చూడగానే కేసు గెలిచి తీరతానని క్లయింటుకి ధైర్యం కలిగినట్లుగా...గొప్ప రిలీఫ్ కలిగింది సూరజ్ కి.
    భావన వెంటనే గేటు తెరుచుకుని ఇంట్లోకి రాలేదు. అక్కడే ఆగి, ఇంకెవరికోసమో వెనక్కి వెనక్కి తిరిగి చూస్తోంది.
    ఇంకో నిమిషం తర్వాత డొక్కు సైకిల్ ఒక దానిని నడిపించుకుంటూ ఒక మనిషి వచ్చాడు. ఎండల్లో తిరిగి ఎండిపోయిన వాడిలాగా ఉన్నాడు. సైకిల్ వెనక ఒక వెడల్పాటి బుట్ట. అందులో పైదాకా పేర్చి వున్న జామపళ్ళు.
    "లోపలికి రా!" అంది భావన గేటు తెరిచి పట్టుకుంటూ.
    సైకిల్ ని నడిపించుకుంటూ వచ్చాడు అతను.
    "జామ పళ్ళెందుకే? ఇక్కడ ఈ చెట్టు విరగకాస్తోంది కదా!" అంది అరుణ.
    "జామపళ్ళకోసం కాదులే! వాటిమీద పూసే జామ్ కోసం! గుర్తులేదూ - మనం చిన్నప్పుడు స్కూలు దగ్గర తినేవాళ్ళమే- నల్లగా, పుల్లగా, తియ్యగా..." అంది భావన నోరూరిస్తున్నట్లుగా.
    ఆ సైకిల్ వాలా దగ్గర బుట్టలో జామపళ్ళతో బాటు, ఒక సీసాలో జామ్ కూడా వుంది. అదేమిటో అరుణకి బాగా తెలుసు! హైదరాబాదీ స్పెషాలిటీ! తరాల క్రితం వచ్చి ఇక్కడ సెటిలయిపోయిన అరబ్బులు చేస్తారు దానిని.
    "నువ్వు చావూష్ వా?" అని అడిగింది అరుణ, కుతూహలంగా చూస్తూ.
    "హాజీ!" అన్నాడు అతను, నవ్వు మొహంతో.
    ఎప్పుడో వచ్చి ఇక్కడ సెటిలయిపోయిన అరబ్బులను చావూష్ లు అంటారు లోకల్ పరిభాషలో.
    "అప్పట్లో అరేబియా నుంచి ఇక్కడికి ఉద్యోగాల కోసం వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనవాళ్ళు ఉద్యోగాల కోసం గర్ఫ్ కి వెళ్తున్నారు" అంది అరుణ.
    "గల్ఫ్ కి వెళ్ళడం అనేది బహుత్ పురానీ బాత్ - చాలా పాత మాట! ఇప్పుడందరూ కేరాఫ్ అమెరికా కదా - ఇదుగో! ఈ సూరజ్ ని కూడా అమెరికా తోలెయ్యాలని చూస్తోంది వాళ్ళమ్మ. సూరజే ఒప్పుకోవడం లేదుగానీ" అంది భావన.
    ఒక్కసారి భావన వైపు పదునుగా చూసింది అరుణ.
    భావనలో ఒక స్పెషాలిటీ వుంది. ఆమె ఏ ఒక్కముక్క మాట్లాడినా, లేదా ఏ చిన్నపని చేసినా కూడా దాని వెనుక ఏదో ఒక బ్రహ్మాండమైన బిల్డప్ లాంటిది ఉంటుందని చిరకాల స్నేహం ద్వారా అరుణకి బాగా తెలుసు. ఏం మాట్లాడినా, ఏం చేసినా కూడా "దీని ఎఫెక్టు డెబ్బయ్ ఏళ్ళ తరువాత ఎట్లా వుంటుందీ?" అని ఆలోచించి మరీ చేస్తున్నట్లుగా ఉంటుంది భావన పద్ధతి!
    "రెండు డజన్ల కాయలు ఇత్తునా అమ్మా?" అన్నాడు పళ్ళ వ్యాపారి ఉత్సాహంగా.
    "ముందు ఎట్లా ఇస్తావో చెప్పూ!" అంది భావన.
    డజను ఇరవై - జామ్ తో కలిపి"
    "అబ్బో! చాలా ఎక్కువే చెప్పెస్తున్నావే!"
    "వాజ్ బా రేటే చెప్పినానమ్మా. కాయలు చూడుండ్రి...బంగారం!"
    "ఆ! అట్లాగే అంటావ్!" అని అతన్ని కట్ చేసేసింది భావన. "పోనీ ఓ పనిచెయ్! ఇక్కడ మా చెట్టుకే జామపళ్ళు వున్నాయ్ కదా- జామపళ్ళు మావి. జాం నీది...ఎంతకిస్తావ్?"
    బేరం సగానికి సగం తగ్గిపోతుందనేసరికి అతని మొహం చిన్నదయిపోయింది.
    "డజనుకి పది ఇవ్వండి" అన్నాడు నీరసంగా.
    "ఆ! పదా! పాడా! ఐదు చేసుకో!"
    "పడదమ్మా!"
    "ఆరు ఇస్తా"
    అతను నసుగుతూ, "నాకు ఒక్క పైసా అన్నా మిగలాలి కద అమ్మా!" అని "సరే! తీసుకోండ్రి" అన్నాడు.
    "ఏం? ఎందుకు మిగలదూ? కనీసం ఐదు పైసలన్నా లాభం లేనిదే నువ్వు వ్యాపారం చేస్తావా ఏమిటీ?" అంది భావన, షైలాక్ లా గొంతుపెట్టి, స్టేజి డైలాగులా చెప్పి. రియాక్షన్ కోసం అరుణ మొహంలోకి ఓరగా చూస్తూ.
    అచ్చం భావన ఊహించినట్లే రియాక్టు అయింది అరుణ.
    "ఐదు పైసలు మిగలడం కాదు - ఎన్ని ఐదు పైసలయితే అతని కడుపు నిండుతుందో ఆలోచించాలి" అని భావన మీద చిరాకునంతా అతని మీద చూపించేస్తూ. "ఆమెకి కావాల్సిన జాం ఆర్రూపాయలు కూడా ఎందుకూ - ఊరికే ఇచ్చేసెయ్! నీకు కావాల్సినన్ని జామపళ్ళు మా చెట్టునుంచి కోసుకుని వెళ్ళి అమ్మేసుకో - కనీసం ఐదు పైసల లాభం మిగిలేటట్లు చూసుకో!" అంటూ భావన వైపు పదునుగా చూసింది.
    తన ఆర్టిస్టు దగ్గర నుంచి కోరుకున్న ఎక్స్ ప్రెషన్ ని ఒక్క టేకులోనే రాబట్టుకోగలిగిన డైరెక్టరులాగా భావన మొహం వికసించింది.
    అరుణ తాలూకు ఆ ఎక్స్ ప్రెషన్ కి సూరజ్ రియాక్షను ఎట్లా వుంటుందోనని అతనివైపు చూసింది.
    మరి 'హీరో హీరోయిన్ల' ఇద్దరి రియాక్షనూ సమతూకంగా వస్తే కదా సీను పండేది.
    సరే! ప్రస్తుతానికి తను ఈ సీనులో డైరెక్టర్ కమ్ విలనో వాంపో అయితే అవనీ.
    తను కోరుకున్నది కోరుకున్నట్లుగా జరిగితే అదే చాలు!
    జామపళ్ళు అమ్మే అతను అరుణ మాటలకు మహానందపడిపోతూ, బాగా వంగిపోయి, చేతిని నేలకీ మొహానికీ తాకిస్తున్నంత ఇదిగా మూడుసార్లు సలాం చేశాడు.
    ప్రజానీకంలో ఎవరో ఒకతను పట్టపురాణికి అభివాదం చేస్తున్నట్లుగా!
    ఒక రజియా సుల్తానాకు, ఒక చాంద్ బీబీకి, ఒక రాణి రుద్రమకి, ఒక..
    'ఈ అమ్మాయికి ఏదో ఒక నాటికి నిజంగానే రాజయోగం పడుతుందేమో!' అని మళ్ళీ ధృడంగా అనిపించింది సూరజ్ కి.
    అవును మరి- పామే పడగబట్టినప్పుడు -
    ఇంతకీ ఆ పాము ఎటు పోయిందో?
    తక్షణం అతని పాదాలకి మెత్తగా ఏదో తగిలింది.
    ఉలిక్కిపడి పక్కకు జరగబోతే -
    అది అతని పాదాలని పెనవేసుకుపోయింది!
    "ఆ..ఆ..ఆ.." అని విహ్వలంగా అరిచి, అసంకల్పిత ప్రతీకార చర్యలాగా ఒక్క ఉదుటున గాల్లోకి ఎగిరాడు సూరజ్. అదే సమయంలో, తన కాలిని పెనవేసుకున్న పాముని వదిలించుకునే ప్రయత్నంలో, తనకు తెలియకుండానే ఒక కాలుని ముందుకు జరిపాడు.
    కదలికలకి కో ఆర్డినేషన్ కుదరలేదు.
    కాలు మెలిక పడింది.
    దభేలుమని కింద పడిపోయాడు సూరజ్. బరువంతా ఒకే చేతిమీద పడింది.
    కళ్ళముందు మెరుపులు మెరిసినట్లయింది.
    యమ బాధ!
    పెదాల బిగువున ఓర్చుకుంటూ, లేచి కూర్చోబోయే ప్రయత్నం చేయబోయాడు.
    తక్షణం -
    వెయ్యి ఓల్టుల షాక్ తగిలినట్లుగా విలవిల్లాడిపోయాడు సూరజ్. అంత బాధలో కూడా ఒకసారి తన పాదాలవైపు చూసుకున్నాడు.
    కాళ్లని పెనవేసుకుని వున్నది పాము కాదు -
    లావుపాటి తాడు!
    రజ్జు సర్పభ్రాంతి! అంతే!
    త్వరత్వరగా వచ్చి, అతని పక్కన కూర్చుండిపోయింది అరుణ.
    "దెబ్బ తగిలిందా?" అంది ఎంతో ఆదుర్దాగా, చాలా అనునయంగా.
    సమాధానం చెప్పడానికి చేతగాక "హ్ మ్మ్.." అని మూలిగి, కూర్చోవడానికి మళ్ళీ విఫలప్రయత్నం చేశాడు సూరజ్.
    మళ్ళీ షాక్ కొట్టినట్లయింది. కళ్ళంబడి నీళ్ళు తిరిగాయి.
    తలెత్తి చూసింది అరుణ.

 Previous Page Next Page