అమ్మ చేతులు పైన -
తన చేతులు కింద -
అమ్మ చేతులు తనకి అందడం లేదు. "అమ్మా!" అంది దిగులుగా.
వెంటనే విలాసిని లేచి దగ్గరికి వచ్చి, "ఏమిటమ్మా!" అంది ఓదార్పుగా, భానూ చేతులని కిందకి దింపుతూ.
ఒకసారి అనాసక్తిగా విలాసిని మొహంలోకి చూసి, మళ్ళీ కళ్ళు మూసేసుకుంది భాను. తండ్రి గొంతు వినబడుతూనే ఉన్నా కళ్ళు తెరిచి అతన్ని చూడలేదు.
ఆమెకి మళ్ళీ కళ్ళు తెరవాలనిపించడం లేదు. శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోవాలని ఉంది.
కానీ, ఎలా?
* * * *
లోపల ఇదంతా జరుగుతున్నప్పుడు ఆ కాంప్లెక్సుకి బయట ఉన్న ఒక టీ షాపులో కూర్చుని ఉన్నాడు రవిచంద్ర. జయరాజ్ చేతుల్లో నుంచి భానురేఖని రక్షించిన తర్వాత అతన్నెవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎవరి గొడవలో వాళ్ళు ఉండిపోయారు.
తను కూడా అక్కడే ఉండి, ఆ అమ్మాయిని ఓదార్చి, ఆ తల్లిదండ్రులకు శతకోటి జాగ్రత్తలు చెప్పాలనిపించింది రవిచంద్రకి. కానీ ఎలా సంభవం అది? ఏం బాగుంటుంది అలా చేస్తే?
ఆ అపార్ట్ మెంట్ బ్లాక్ లో నుంచి నెమ్మదిగా బయటకు వచ్చేశాడు గానీ తన రూంకి వెళ్ళిపోలేక పోయాడు రవిచంద్ర. ఇరానీ కేఫ్ ఒకటి ఉంది అక్కడ. దాన్లో కూర్చుని టీ మీద టీ తాగడం మొదలెట్టాడు.
లోపల ఆ అమ్మాయి ఎలా ఉంది? ఆ ప్రశ్న అతన్ని నిలవనియ్యడం లేదు.
ఇందాక జనం మాటల్లో ఆమె పేరు తెలిసింది తనకి.
భానురేఖట!
మొదటిసారి ఆమెని చూసినప్పుడు ఆ అమ్మాయి పేరు రేఖ అయివుంటే బాగుంటుందని తను ఊరికే అనుకున్నాడు.
అదే నిజం అయింది. మళ్ళీ కోయిన్సిడెన్సా?
ఈ చేదు అనుభవం తర్వాత పాపం ఎలా ఫీలవుతుందో భానురేఖ!
అతను అలా ఆలోచిస్తూ కూర్చుని ఉండగానే, మళ్ళీ హడావిడి మొదలయింది ప్రేమ్ నగర్ అపార్ట్ మెంట్స్ లో. ఒక పోలీసు వ్యాను వచ్చి ఆగింది. కానిస్టేబుల్ ని బయటే నిలబెట్టి, ఒక పోలీసు ఇన్ స్పెక్టరు లోపలికి పరిగెత్తుకెళ్ళాడు.
ఆ తర్వాత 'డాక్టర్' అని పెయింట్ చేసి ఉన్న కారు ఒకటి వచ్చి ఆగింది. మెడికల్ చెస్టు పట్టుకుని ఒక బట్టతలాయన లోపలికి హడావిడిగా వెళ్ళాడు.
రవిచంద్ర గుండెలు గుబగుబలాడాయి. ఏమిటిదంతా? ఏం జరుగుతోంది? భానురేఖ - అతని గుండె ఒక్కసారి లయ తప్పింది - భానురేఖ క్షేమంగా ఉందా?
చాలాసేపు ముళ్ళమీద కూర్చున్నట్లు కూర్చున్నాడు అతను.
అరగంట గడిచాక, ఇంక ఏమయితే అది అయింది. లోపలికెళ్ళి విచారిద్దాం అని నిశ్చయించుకుని, లేవబోయేసరికి నలుగురు మనుషులు గోలగోలగా, ఎగ్జయింట్ గా మాట్లాడుకుంటూ ఆ టీ షాప్ లోకి ప్రవేశించాడు. మధుకర్ కాలే కూడా ఉన్నాడు వాళ్ళలో.
అతను లోపలికి వచ్చీరాగానే రవిచంద్రని గుర్తుపట్టి, "అడుగో హీరో! అతనే ఇందాక భానురేఖని సేవ్ చేసింది. ఆ గొడవ జరిగి గంట కానేలేదు. ఈ లోపలే ఈ సూసైడ్ అటెంప్టూ!" అన్నాడు గడగడ చెప్పేస్తూ.
హోటల్లో ఉన్న చాలామంది క్షణాల్లో మధుకర్ కాలే చుట్టూ మూగారు. వాళ్ళందరినీ పక్కకి తోసేస్తూ కాలే దగ్గరికి వెళ్ళిపోయాడు రవిచంద్ర.
"ఏమయింది? చెప్పండి! త్వరగా!"
మధుకర్ కాలే చిత్రవిచిత్రమైన హావభావాలతో చేతులు తిప్పుతూ చెప్పడం మొదలెట్టాడు.
బాగా చెయ్యి తిరిగిన రచయిత కథ చదువుతున్నట్లు, అతను కాసేపు కథలో ముందుకెళ్ళిపోయాడు. కాసేపు వెనక్కి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాడు. భానురేఖను గురించి తనకి ఎంత క్షుణ్ణంగా తెలుసునో అందరికీ అర్థమయ్యేలా సవివరంగా చెప్పాడు. ఆమెకి జరిగిన కారు యాక్సిడెంటు, తల్లి మరణం, కోమాలో ఉండడం, మెదడు పెరగకపోవడం, తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ చూపించకపోవడం (ఇక్కడ అతను విలాసిని సవతి తల్లి లక్షణాలను వైనవైనాలుగా వర్ణించి చెప్పాడు. నిజానికి ఆవిడంత చెడ్డది కాకపోయినా) ఆత్మహత్యా ప్రయత్నం, మొత్తం కథ అంతా.
నిశ్చేష్టుడై విన్నాడు రవిచంద్ర. అతని గుండె నీరయిపోయింది ఒక్కొక్క సంఘటనా వింటుంటే. భానురేఖ మీద చెప్పలేనంత అభిమానం, జాలీ, సానుభూతీ కలిగాయి.
అతనికి తక్షణం అర్థమైనది ఒక్కటే విషయం!
మానసికంగా వెనకబడిపోతున్న ఆ అమ్మాయిని అర్థం చేసుకుని, ధైర్యం చెప్పి, ముందుకు నడిపించేవాళ్ళు కావాలి తక్షణం.
అందరూ ఆమెని అపార్థం చేసుకుని కృంగదీసేస్తున్న వాళ్ళేగానీ ధైర్యం కలిగించే వాళ్ళెవరూ వీళ్ళలో లేరు.
ఇది ఇలాగే ఉంటే, ఆ అమ్మాయి మరింత డీలా పడిపోతుంది. పిచ్చిదయిపోయినా ఆశ్చర్యం లేదు.
అత్యద్భుతమైన అందగత్తే భానురేఖ. ఆ అమ్మాయిలో ఆ అమాయకత్వం కూడా ఒక అందంగానే కనబడుతుంది.
కానీ భానురేఖ పిచ్చిదయిపోతే? లేకపోతే ప్రాణాలే వదిలేస్తే?
ఆ ఆలోచనే దుర్భరం అనిపించింది రవిచంద్రకి. తక్షణం పరిగెత్తుకు వెళ్ళిపోయి భానురేఖ మొహాన్ని తన మొహం దగ్గరికి తీసుకుని, 'నీ తోడుగా నేను నీకు తోడు! ఇప్పటికీ, ఎప్పటికీ కూడా! జీవితాంతం నా అండ నీకుండాలి భానూ! లేకపోతే నువ్వు బతకలేవు ఈ లోకంలో! బతకనివ్వదు నిన్ను భానురేఖా! ఇక నుంచి నేను నీకు వీడని నీడని! నేను నీ కంటికి రెప్పని! నీవు నా కంటి పాపవి! చంటి పాపలాగా నిన్ను చూసుకుంటాను భానూ! నేను నీకున్నాను భానూ! ఈ సూర్యుడి మీదా, చంద్రుడి మీదా, నక్షత్రాల మీదా ఒట్టేసి చెబుతున్నాను. నేను నిన్ను ఏ తోడు లేకుండా ఈ తోడేళ్ళ మధ్య బతకనివ్వను భానూ! ప్రామిస్!" అని చెప్పాలనిపించింది.