Previous Page Next Page 
మోదుగుపూలు పేజి 14


    అమీను బాధ అమీనుకు పట్టింది. భార్యకు గడ్డ అయింది, సలుపుతున్నది. మంగలి లేకుండా యింటికి రావద్దని చివాట్లు పెట్టి పంపించింది పెళ్ళాం. ఏం చేయాలో తోచక గిర్దావరును ఆశ్రయించాడు. గిర్దావరు బాధ గీర్దావరుకు ఉంది. అతని కొడుకు పుట్టు వెండ్రుకలు తీయడానికి ఆ రోజే ముహూర్తం, మంగళ్ళు లేక తికమక పడుతున్నాడతను.

 

    ఊరంతా తాసిల్దారును చూడ్డానికి వచ్చారు. వెంకయ్య రాలేకపోయాడు. అతని కాలు బెణికింది. తోమేవాడు లేడు. బాధకు తోడు తాసిల్దారు దగ్గరికి వెళ్ళకుంటే ఏమనుకుంటాడోనని తహతాహలాడాడు.

 

    ఊరంతా ఉడికిపోయింది, మంగళ్ళు - మామూలు మంగళ్ళు ఎంత పని చేశారు! ఊరందరినీ ఏడిపిస్తున్నారు! అందుకు కాదు. ఆ రోజు తాసిల్దారు అధికారానికి మొదటి గండి పడింది. అందుకు జనం సంతోషించాల్సింది ఆశ్చర్యపోయారు.

 

    మంగళ్ళు అచ్చం క్షౌరాలు చేసేవారే కారు. పల్లెలల్లో వారు వైద్యులు. బెణుకులు సరిచేస్తారు. వ్రణాలకు శస్త్రచికిత్స చేస్తారు. వాద్యాలు వాయించేదీ వాళ్ళే. గ్రామ జీవితంలో వారు ప్రధానాంగం. మంగళ్ళు, చాకళ్ళు, కమ్మర్లు, కుమ్మర్లు గ్రామజీవితానికి అతి ముఖ్యులయిన స్తంభాలు. అందుకే మళ్ళిచ్చి, మాన్యాలిచ్చి వాళ్ళను ఊళ్ళల్లో తెచ్చి ఉంచుకున్నారు గ్రామ నిర్మాతలు. మంగళ్ళలోను, చాకళ్ళలోను ఐక్యత ఎక్కువ. వారు గ్రామంలోని ఇండ్లను పంచుకుంటారు. ఒకరు చేసే ఇంటికి మరొకరు చస్తే వెళ్ళరు. అది వారి కలపుకట్టు. అది అనాదిగా వస్తున్నది. అందుకే మరో ఊరినుంచి మంగళ్ళను పిలిపించాలనే గిర్దావరు ప్రయత్నమూ, అమీను అధికారమూ ఫలించలేదు.

 

    ఆ రోజు గడిచిపోయింది. తాసిల్దారు బయటికి రాలేదు. ప్రభుత్వం స్తంభించిపోయింది. అతనితో పాటు అదీ మూలగ సాగింది. ఇద్దరు మంగళ్ళు ఎంత సంక్షోభం తెచ్చారు! ఊర్లో ఏ ఇద్దరు కలిసినా అదే విషయం మాట్లాడుకోసాగారు. తాసిల్దారు సర్వశక్తిమంతుడు కాదని తేల్చుకున్నారు.

 

    వారం గడిచింది. తాసిల్దారు చిక్కిపోయాడు జీవచ్చవం అయిపోయాడు. అప్పగింతలు పెట్టే దశకు వచ్చాడు. మంగళ్ళు వస్తేచాలు. అందుకు ఏ షరతులైనా అంగీకరించడానికి సిద్ధం అయినాడు. అలాంటి ఆదేశమే ఇచ్చాడు అమీనుకు, గిర్దావరుకు.

 

    మంగళ్ళకోసం గాలింపు నిరంతరం సాగుతూనే ఉంది. వారు బస్తీలో బస చేశారు. జాడతెలిసింది. గిర్దావరు మనుషుల్ని పంపాడు. రామన్నారు. అమీను జవాన్లను పంపాడు. నిరాకరించారు. తాసిల్దారు అమీను మీద అరచాడు స్వయంగా వెళ్ళి తీసుకురమ్మన్నాడు. అధికారం అడ్డం వచ్చింది అమీనుకు. గిర్దావరును కూడా రమ్మన్నాడు. గత్యంతరంలేదు. ట వెళ్ళాడు. ఇద్దరు అధికార్లు అమీను, గిర్దావను - మంగళ్ళ ఇంటికి వెళ్ళారు. తాసిల్దారే స్వయంగా తమను పంపింఛాడన్నారు. మంగళ్ళు షరతులు పెట్టారు. లాక్కున్న భూమి తమకు ఇవ్వాలి. మాన్యానికి మంగలి పనికీ సంబంధంలేదు. తాము చేసిన ప్రతి పనికీ డబ్బు చెల్లించాలి. ఆ విషయం తాసిల్దారుకు కూడా వర్తిస్తుంది. షరతులన్నింటికీ అంగీకరించారు అధికార్లు.

 

    మంగళ్ళు గ్రామానికి వచ్చారు. వారు కనిపించగానే ప్రాణం లేచి వచ్చింది తాసిల్దారుకు! మాలీష్ చేయమన్నాడు. ఇద్దరు మంగళ్ళూ అతని మీద పడ్డారు. అర్ధశేరు ఆముదం మర్దించారు.

 

    తాసిల్దారు వారికి ఐదు రాపాయలిచ్చాడు.

 

    మంగళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు.

 

    వారి చూపుల్లో విజయగర్వం తొణికిసలాడింది.

 

    మూడు గంటలకు అంగణంలోకి వచ్చాడు తాసిల్దారు.

 

    ప్రభుత్వం మళ్ళీ సాగింది.

 

    "మంగళ్ళు ప్రభుత్వాన్ని స్తంభింపచేశారు." ఈ విషయంలోనే చర్చ సాగింది. ఆ రోజు వీరయ్యగారింట్లో. సమావేశానికి వీరయ్యగారు కూడా వచ్చారు.


                                      3


    ఛో ఓ ఓ ఓ ఓ
    ఓ ఒ ఓ ఒ ఓ ఒ
    ధన్ ధనాధన్ ధనాధన్
    ధనాధన్ ధనాధన్ ధన్
    ఆఁ.... ఆఁ.... ఆఁ....
    చో చో చో చో
    జలారేలా రేల రేల రేలా
    జలరేలా రేల రేల
    హో జలరేల రేల రేల

 

    డోలు సూరయ్య డోలు వాయిస్తూ పాడుతున్నాడు. కోయగూడెం యావత్తూ కేరింతలు వేస్తూ ఆడుతున్నారు. ఆడా మగా, పిల్లా జల్లా అంతా చేరారు. అందరూ అడుగులువేస్తూ పాడుతున్నారు. అందరూ సూరయ్యతో గొంతులు కలుపుతున్నారు. అడుగులు కలుపుతున్నారు. ఇప్పపూల సాగాయి త్రాగుతున్నారు. వారి గుండెల్లో ఆనందం నిండివుంది. వారి మనసులు పొంగి పొరలుతున్నాయి. పాటల రూపంలో పరుగులు తీస్తున్నాయి.

 

    వారు ఆటవికులు నాగరికత ఎరుగనివారు. ఇంకా రాతియుగంలో ఉన్న వారు. రాతియుగం అంటే ఏమిటో తెలియని వారు. వారికి తెలిసింది జీవితం. జీవితం మాత్రమే. వారి జీవితాలు ప్రాకృతములు. ఎండవంటివి. కార్చిచ్చు వంటివి. గ్రీష్మం వంటివి. వసంతం వంటివి. శిశిరం వంటివి. చంద్రుని వంటివి. వెన్నెల వంటివి.

 

    వారి హృదయాల వలెనే చంద్రుడు నిండుగా వున్నాడు. వెన్నెల విరుస్తున్నాడు. జారుస్తున్నాడు. పరుస్తున్నాడు. వారితో నవ్వుతున్నాడు. కేరింతలు పెడుతున్నాడు.

 

    చుట్టూ కొండలు. కొండల మీద దట్టమైన అడవి. అడవిలో నెమళ్ళు, లేళ్ళు, జింకలు, ఎలుగ్గొడ్లు, చిరతపులులు, పెద్దపులులు ఉంటాయి. ఆ కొండల మధ్యన ఎత్తు ప్రదేశాన ఉన్న పాతిక పర్ణశాలలు కోయగూడెం.

 

    వెన్నెలలో తాన మాడింది కోయగూడెం. చెట్లూ, గుట్టలూ, వెన్నెల పులుముకుని చెవులు రిక్కబొడిచి పాటలు వింటున్నాయి. కనులు చీల్చుకొని వారి ఆనందాన్ని తిలకిస్తున్నాయి.

 

    "హేయ్ హెయ్ హెయ్ హేయ్
    హెయ్ హేయ్, హెయ్ హేయ్"

 

    నిన్నటి తెల్లవారుజామున నెమళ్ళు కూశాయి. కూయడం కూయడం ఒక్కటికాదు- అనేకం కూశాయి. ఒకసారి కూసి ఊరుకోలేదు. కూస్తూ ఉండి పోయాయి. అది కోయదొరలకు వర్షం రానున్నదనే చిహ్నం. వర్షం వారికి ప్రాణం. అందుకే వారి ప్రాణాలు లేచివచ్చాయి. విత్తనాల పండుగ జరుపుకుంటున్నారు. వారికి ఇతర పండుగలులేవు. ఇదే పండుగ. నెమళ్ళ కూతకు ఎదురు చూస్తాడు కోయ. అది కూసిందంటే మేఘాన్ని చూచి మయూరంవలె నృత్యం చేస్తాడు.

 

    బొడ్రాయి వారికి దేవత. దానిచుట్టూ కూడారు జనం. బుట్టల్లో నవధాన్యాలు తెచ్చారు. బొడ్రాతికి మేకలు కోశారు. వాటి రక్తం విత్తులమీద చిలకరించారు. అంతేచాలు. పొలి కలుగుతుంది. అంతటిలోనే పొంగి పోతాడతను.

 

    అతనికి నేలకు కరువులేదు. దానికోసం అతడు పోట్లాడి ఎరుగడు. ఉక్కు లాంటి శరీరం అతనిది. గొడ్డలి భుజాన వేసుకొని అడవిలో దూరాడా అడవి కొడ్తాడు పొలం చేసుకుంటాడు. నాగలి పట్టాడా నగాలను సయితం నుసి చేయగలడు. చెమటోడ్చి పంటలు పండిస్తాడు. పంటల రాసులను చూసి మురిసిపోతాడు. అంతవరకే అతని ఆనందం సాహుకారు వస్తాడు. పంటలన్నీ తుడుచుకొని పోతాడు. అతనికి ఆధారం తన రెక్కలే. ఆడా మగా అడవి మీద పడ్తారు. కాయ గసరు తెచ్చుకుంటారు. దుంపలమీద జీవనం గడుపుతారు.

 

    అతడు తనకోసం పండించడు.

 

    మేఘం తనకోసం వర్షించదు.

 

    "చో ఓ ఓ ఓ ఓ
    ఓ ఒ ఓ ఒ ఓ
    జల రేల రేల రేల
    జల రేలా రేలా రేల"

 

    వారికీ ఒక శాస్త్రం ఉంది - వారికీ ఒక పురాణం ఉంది. దాన్ని చెపుతుంటాడు డోలువాడు. దానినే మననం చేసుకుంటున్నారు ఇప్పుడు వారు. అదే వారికి మంత్రం. అతడే వారి పురోహితుడు.

 

    హేయ్ హెయ్ హెయ్ హేయ్
    హెయ్ హేయ్, హెయ్ హెయ్

 

    "ఉస్స్ ఏం దే పాడ్కపోతున్నావు. ఎట్లొచ్చిందే దొరసట్టం. ఎట్లొచ్చిండే డోలోడు. ఎట్లొచ్చిందే మనకు పదం? ఇయ్యన్ని చెప్పరాదె సూరన్న" సమ్మయ్య అడిగాడు.

 Previous Page Next Page