Previous Page Next Page 
మోదుగుపూలు పేజి 13


    గదిలో మౌనం రాజ్యం చేసింది. అందరి గుండెలూ మాట్లాడుతున్నాయి గాని పెదవులు పలకడంలేదు.

 

    "అన్నా! నీతో వాదించలేను. ఏం చేద్దామో చెప్పు" అన్నాడు నాగేశ్.

 

    "జరిగిన అన్యాయాన్ని గురించి వారికి చెప్పాలె."

 

    "చెప్పటంలో నాకు విశ్వాసంలేదు. ఏం చేయాల్నో చెప్పు."

 

    అదిరిపడ్డాడు రఘు. తరువాత అందును గురించి సుదీర్ఘం అయిన చర్చ జరిగింది. జానకికి 'అమ్మ'లో జరిగిన సమ్మె గుర్తుకు వచ్చింది. మంగళ్ళతో సమ్మె చేయించాలని ప్రతిపాదించింది. ప్రతిపాదన మిగతా ఇద్దరికీ నచ్చింది. కాని దాని సాధ్యాసాధ్యాలను గురించి చాలాసేపు చర్చ జరిగింది. తుదకు మంగళ్ళను ఊళ్ళో ఉంచకుండా పంపించేస్తే తప్ప ఆ పని సాధ్యపడదని నిర్ణయించారు. అందుకు ఏర్పాట్లు చేయడానికీ, వారిని ఒప్పించడానికి బయలుదేరారు రఘు, నాగేశ్.

 

    జానకి మేను వాల్చిందనేగాని నిద్రరాలేదు. ఆమెకు చాలా గర్వంగా ఉంది. తన ప్రతిపాదన నెగ్గింది. మంగళ్ళు ఒప్పుకుంటారా? ఏమో ఇంతలో రఘు నాగేశ్ ల వాదన గుర్తుకువచ్చింది. చిచ్చు పెట్టినట్లుంది నాగేశ్ ఉపన్యాసం. రఘు, ఓడిపోయాడు! నాగేశ్ గెలిచాడు! కాదు. నాగేశ్ తానూ కలిసి గెలిచారు. నాగేశ్! వట్టి ఎముకల గూడు! పొట్టివాడు! కళ్ళు ఎందుకో ఎప్పుడూ ఎర్రగా ఉంటాయి. ఎంత ఆరాటం ఉంది అతనిలో! ఎంత ఉద్రేకం ఉంది! అతని రూపమే అగ్నిలా ఉంటుంది. అతడు అగ్గి. కాదు పిడుగు!!! ఆలోచనలో మునిగిపోయింది. కొంతసేపటికి నిద్రపట్టింది.

 

    రఘు, నాగేశ్ మంగలి రావఁడి ఇంటికి వెళ్ళారు. ఆ రాత్రి, వారిని చూచి దేవుడు దిగివచ్చినట్లు ఆదరించాడు. 'దొరలు పిలువనంపుతె రాకపోయినానండి. ఎందుకొచ్చిన్రు?" అన్నాడు.

 

    రఘు వివరించి చెప్పాడు. రావఁడు చేయవలసిన పనిని గురించి వివరించాడు. మరికొంత వివరించాడు నాగేశ్. మంగళ్ళు లేకుంటే ప్రజలకు, ముఖ్యంగా తాసిల్దారుకు జరిగే ఇబ్బందిని గురించి తెలియపరచాడు. వారి ప్రాధాన్యతను గురించి నొక్కి చెప్పాడు. పోయిన భూమి రాబట్టుకోవాలన్నాడు. తాసిల్దారుకు తలవంపులు తేవాలన్నాడు.

 

    రావఁడికి అన్నీ అర్థం అయినాయి. కాని భయం అలుముకుంది. తాసిల్దారును లొంగదీయడం అనేదాన్ని గురించి ఆలోచించలేకపోయాడు. తన మనుగడకు ఏం ముప్పు వస్తుందో అనుకున్నాడు, ఆ ధోరణిలోనే మాట్లాడాడు. అయినా అన్నను అడిగి చెప్పుతానన్నాడు. అన్నతో ఎలా మాట్లాడాల్సింది, ఏ విధంగా సిద్ధం చేయాల్సింది కూడా చెప్పాడు రఘు. మరుసటి రోజు వస్తామని చెప్పి రఘు, నాగేశ్ లు బయలుదేరారు. కాని రావఁడే రఘు యింటికి వస్తానన్నాడు.  

 

    మరుసటిరోజు రావఁడు రఘు ఇంటికి వచ్చాడు. జానకిని చూచి ఆశ్చర్యపోయాడు! తాను భుజంమీద ఎత్తుకొని తిరిగిన జానకమ్మ ఎట్లా మాట్లాడుతూంది!! తన తండ్రి తాతల నుంచి అసలు తమను గురించి ఆలోచించేవాడు ఉంటాడనీ, ఉండాలని కనీసం ఊహించలేదు తాను. ఈ ముగ్గురు గదిలో కూర్చుని ఎన్ని విషయాలను గురించి మాట్లాడుతున్నారు! తమను గురించి ఎంత బాధపడుతున్నారు. అసలు వీరు తాసిల్దారును గెలవగలరా? అనుమానం అతన్ని బాధించింది. అదే ప్రశ్న అడిగేశాడు.

 

    "లొంగుతాడుండి తాసిల్దారు?"

 

    "రావఁడూ! మీ బలం మీకు తెలియదు. హనుమంతునికి కూడా తన బలం తెలియదు. జాంబవంతుడు చెపితే తెలుసుకున్నాడు. పోయి లంకకాలపెట్టివచ్చిండు. మంగలోళ్ళు ఊళ్ళో లేరనుకో, మంది ఎంత సతమతమైతరు? మళ్ళు మాన్యాలిచ్చి ఎందుకు తెచ్చి పెట్టుకున్నారనుకున్నవు ఊళ్ళో? ఉన్నప్పుడు ఏది తెల్వదు. మీరట్ల ఊరు దాటిన్రా మొదలు తాసిల్దారు చస్తడు, మీ కాళ్ళు పట్టుకొని తీసుకొస్తడు. భూమి గుంజుకునెకద! ఇంక ఏమున్నది మీకాడ? నాలుగు రోజులు బయట ఉండుండి అంతె. ఇగ చూడుండి ఎంత గడబిడ అయితదో?" రఘు వివరించి చెప్పాడు.

 

    నాగేశ్ అలాంటి మాటలే కాస్త ఉద్రేకంగా చెప్పాడు. జానకి అతను చెప్పిందాన్నే మరోవిధంగా చెప్పింది.

 

    తమ వద్ద ఉన్న శక్తిని విడమర్చి చెప్పేవరకు రావఁడికి కొంత బలం వచ్చింది. తనమీద విశ్వాసం ఏర్పడింది. తన అన్నతో చెపుతానన్నాడు. తెల్లవారి తీసుకొని వస్తానన్నాడు.

 

    "ఎవ్వరికి ఎరక కావద్దు" హెచ్చరించాడు నాగేశ్.

 

    "ఎరక కానిస్తనుండి, కాల్మొక్త, పానాలు పోవు. ఊరిడిచి పొయ్యెడిదాక చీమకు తెల్వదనుకోండ్రి, నీ బాంచను." అని వెళ్ళిపోయాడు రావఁడు.

 

    మరుసటిరోజు రాత్రికి రావఁడు అన్నను తీసుకొని వచ్చాడు. అన్నకూ అనేక అనుమానాలు కలిగాయి. నలుగురూ కలిసి వాటికి సమాధానాలు చెప్పారు.

 

    ఇలా వారం రోజులు జరిగిం తరువాత మంగళ్ళిద్దరూ ఊరు విడిచి పోవడానికి సిద్ధం అయినారు. ముందు ఆడవాళ్ళను బళ్ళతో ఏదో నెపం మీద పంపేశారు! ఒకనాటి రాత్రి మంగళ్ళిద్దరూ మాయం అయినారు.

 

    తాసిల్దారు బాగా పొద్దెక్కిం తరవాతగాని లేవడు. అందుకు కారణం అతనికి రాత్రి తొమ్మిదికిగాని సాయంకాలంగాదు. అప్పటిదాకా వ్యవహారాలు సాగిస్తాడు. ఇంట్లో దూరి గంట విశ్రాంతి తీసుకుంటాడు. పది తరువాత అతని తాగుడు ప్రారంభం అవుతుంది. తాగుడంటె తానొక్కడు తాగడు. మగవారితో కలిసి బొత్తిగా తాగడు. అంత పెద్ద జాగీరులోనూ అతనికి అంతరంగికుడు ఒకే ఒకడు. అతడు కులశేఖరరావు - గిర్దావరు. గిర్దావరు తాగడని కాదు. కాని తాసిల్దారు ముందు తాగడు. తాగే ధైర్యంలేదు అతనికి. అయితే తాసిల్దారు పానగోష్టి పడతులతో సాగుతుంది. తాసిల్దారు ఇంట్లో ఉన్న విశాలమైన హాలు ఆ సమయానికి అందుకు సిద్ధం చేయబడుతుంది. పెట్రోమాక్సులైట్లతో వెలిగిపోతుంది. అంగనలు అందంగా అలంకరించుకుని అక్కడికి సిద్ధం అవుతారు. తాసిల్దారు వచ్చి పరుపు మీద పరచిన చలవ చద్దరు మీద కూర్చొని బాలీసుకు అనుకుంటాడు. నిప్పువంటి సారాయి అక్కడికి చేరుతుంది. అబ్కారీ కంట్రాక్టర్లకు అందులో నీరు కలిపే ధైర్యం ఉండదు.

 

    తాగుడు ప్రారంభిస్తాడు తాసిల్దారు. తాను స్వయంగా కొందరికి తాగిస్తాడు. ప్రమదలు అతనికి తాగిస్తారు. మత్తెక్కితే గానా బజానా కావాలంటారు. అప్పుడు డోలక్ మ్రోగుతుంది. హార్మోనియం శృతి కలుపుతుంది. గజళ్ళు, కవాలీలు సాగుతుంటాయి. ఆ హాలు సంగీతంతో మారు మ్రోగుతుంది. అతడు అందిన అతివను ఆలింగనం చేసుకుంటాడు. క్షణంలో వదిలేస్తాడు. మరొక అమ్మాయిని ముద్దు పెట్టుకుంటాడు. ఒక దాని కురులు సవరిస్తాడు. ఒక దాని బుగ్గమీద చిటిక వేస్తాడు. ఒకదాని బుగ్గ గిల్లుతాడు. ఒకదాని కళ్ళలోకి చూస్తాడు. ఒకదాని పాట ఆపుతాడు. మరొకదాన్ని పాడమంటాడు. ఒకదాని తానే డోలక్ వాయిస్తాడు. ఒకసారి హార్మోనియం అందుకుంటాడు. పాట కూడా పాడ్తాడు. అతని గొంతు బాగుండదు. అయినా అందరూ శ్రావ్యంగా ఉందంటారు. వింటారు. ఆ విందు ఎంతసేపు సాగుతుందో చెప్పలేం కాని అక్కడే పడి నిద్రపోతాడు తాసిల్దారు. ఏ తెల్లవారుఝాముకో నిద్ర పడుతుందతనికి.

 

    అందుకే అతడు పదింటికి కాని లేవడు. లేవగానే కాలకృత్యాలు తీర్చుకొనే వరకు యిద్దరు మంగళ్ళు హాజరుండాలి. పావుశేరు ఆముదం అతనికి వంటికి పట్టించి మర్దన చేయాలి. అతనికి వళ్ళు నొప్పులు అందుకు అది ఔషధం. ఇద్దరు మంగళ్ళు గంటసేపు మర్దన చెసిం తరువాతగాని అతడు మనిషికాడు. తరువాత గంట స్నానం చేస్తాడు. అతడు సబ్బు రుద్దడు. సున్నిపిండి, చందనపు పొడి రుద్దుతాడు. అది ప్రత్యేకంగా హైదరాబాదు నుంచి వస్తుందతనికి. తరువాత భోజనం, అతడు భోజన ప్రియుడు. పదిరకాల మాంసాలు, అయిదురకాల కూరగాయలు, పచ్చళ్ళు, పెరుగు, వెన్న, మీగడ, హల్వాలు అతనికి నిత్యం ఉండాల్సినవి. అతడు భోజనానికి బకాసురుడు. భోజనానంతరం పడకవేస్తాడు. కుంభకర్ణుడు అవుతాడు. నిద్రలేచి ఫలహారం చేసి చాయ్ తాగిగాని అంగణంలోకి రాడు, అప్పటికి మూడు అవుతుంది. అప్పణ్నుంచి అతని వ్యవహారం ప్రారంభం.

 

    ఆ రోజు మామూలుగానే లేచాడు తాసిల్దారు. చేతులు కట్టుకొని నుంచోవాల్సిన మంగళ్ళు కనిపించలేదు. అది అసాధారణం! అతని జీవితంలో అదే మొదటిసారి. అందువల్ల అగ్గి అయిపోయాడు. కేకలు పెట్టాడు. ఇంటి పెంకులు ఎగిరిపోయాయి. ఊర పిచ్చికలు చచ్చిపడ్డాయి. మంగళ్ళను చీలుస్తానన్నాడు. నిలువునా పాతేస్తానన్నాడు. ఆ కేకలు విని గుమికూడిన జనంమీద ఎగిరాడు. మంగళ్ళను కట్టి పట్టుకురమ్మని ఆజ్ఞాపించాడు. జనం పరిగెత్తారు. పిట్టల్లేని గూళ్ళలా ఉన్నాయి ఇండ్లు. ఆ మాటే విన్నవించారు తాసిల్దారుకు. వెంటనే నొప్పులు పట్టుకున్నాయి తాసిల్దారుకు. పడిపోయాడు. అరవసాగాడు. ఏడ్వసాగాడు. నొప్పులు, నొప్పులు, నొప్పులు ప్రాణాలు తీస్తున్నాయి. మంగళ్ళు లేరు ఎలా బ్రతుకుతాను? అని మొత్తుకుంటున్నాడు. కొంతసేపటికి వగర్పు వచ్చేసింది.

 

    అమీను వచ్చాడు. చేతులు కట్టుకొని నుంచున్నాడు. అప్పటికే జరిగిందంతా తెలుసుకున్నాడు తాసిల్దారు. అమీనుకు అధికారం లేదన్నాడు. ఉద్యోగం ఊడపీకేస్తానన్నాడు. తాసిల్దారు తనమీదనే తప్పంతా వేస్తున్నాడు. ఏం చేయాలో అర్థంకాలేదు అమీనుకు. ఇంతలో గిర్దావరు వచ్చాడు. అతని మీదకూడా ఎగిరాడు. అమీన్ను అక్కణ్ణుంచి వెళ్ళిపొమ్మన్నాడు తాసిల్దారు. మంగళ్ళను తీసుకొని రాకుండా తనకు ముఖం చూపించవద్దన్నాడు. వగరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు.

 Previous Page Next Page