Previous Page Next Page 
అనితర సాధ్యుడు పేజి 14


    కారు ఒక్క ఉదుటున లోపలికి దూసుకుపోయింది. లోపలంతా చిట్టడవిలా వుంది. సన్నని రహదారి ఒకటి ఆ చిట్టడవిలోంచే దూరానికి సాగిపోయి వుంది. సామంత్ కారాపాడు.

 

    కనకారావు వచ్చి కారెక్కగానే తిరిగి బయలుదేరింది. మరో మూడు నిముషాలు ప్రయాణించాక అప్పుడు కనిపించిందో పురాతన కాలం నాటి కోట.

 

    కోట చిన్నదయినా వాస్తుకళకే అద్దం పడుతున్నట్టు అద్భుతంగా వుంది.

 

    "ఆ బిల్డింగ్ ముందు ఆపు" అన్నాడు కనకారావు.

 

    "ఇదెవరిది?" కారును స్లో చేస్తూ అడిగాడు సామంత్.

 

    "అర్జునరావుగారిది"

 

    "ఆయనెవరు?"

 

    "రింగ్ మాస్టర్ ఆయనే. నేను పీటర్ గారి దగ్గరెలా పనిచేస్తున్నానో, పీటర్ గారు ఆయన దగ్గరలా చేస్తున్నారు."

 

    "అర్జునరావుకి, నాగమ్మకి ఏమిటి సంబంధం?" కారుదిగుతూ అడిగాడు సామంత్.

 

    "తెలీదు"

 

    "నమ్మమంటావా?"

 

    "నువ్వు పెట్టే హింస మీద ఒట్టు"

 

    "తెలిసింది చెప్పు"

 

    "నాగమ్మగారి మీద అర్జునరావుకి పీకల వరకు కోపం వుందని, ఆమెను మానసికంగా దెబ్బకొట్టాలని ఆయన చూస్తున్నట్టు మాత్రమే నాకు తెలుసు."

 

    "అర్జునరావు ఎలాంటివాడు?"

 

    "చాలా ప్రమాదకరమయిన ప్రశ్న. ప్రమాదకరమయిన మనిషి. పగబట్టాడంటే కాటు వేసే వరకు పచ్చి మంచినీళ్ళు ముట్టడట. నేనూ ఆయన్ని ఇంతవరకు చూడలేదు. నన్ను నమ్ము... ఆయన గురించి తెలుసుకోవాలను కోవడం ప్రమాదమని మా పీటర్ సారే చెప్పారు."

 

    ఇద్దరూ బిల్డింగ్ కేసి నడుస్తున్నారు.

 

    సింహద్వారం వద్దే ఓ వ్యక్తి గన్ చేతిలో పట్టుకొని పచార్లు చేస్తూ కనిపించాడు.

 

    "వాడేమిటి అలా వున్నాడు?"

 

    "ఎలా?"

 

    "యమలోకపు సింహద్వారం ముందుండే యమభటుడిలా"

 

    "వాడెలా వుంటే మనకెందుకు చెప్పు. ఈ బిల్డింగ్ లోనే నీకు ట్రైనింగ్ ఇవ్వమని నాకు ఆర్డర్స్ పాస్ చేశారు"

 

    ఇద్దరూ మెట్లెక్కి సింహద్వారం ముందుకు రాగానే అతను తల పంకిస్తూ "ఇతనేనా?" అన్నాడు.

 

    డబ్బాలో కంకరరాళ్ళు వేసి ఊపితే ఎలాంటి ధ్వనివస్తుందో అలా వుందతని గొంతు.

 

    కనకారావు తలూపాడు.

 

    అతను ద్వారం తెరిచాడు.

 

    ఇద్దరూ లోపలికెళ్ళిపోయారు.

 

    "అతని గొంతేమిటి అలా వుంది?"

 

    "ఏ సమాచారం కావాలో చెప్పు బాబు. నన్ను కన్ ఫ్యూజ్ చేసి నా డ్యూటీని మర్చిపోయేలా చెయ్యకు" అన్నాడు కనకారావు జాలిగా ముఖం పెడుతూ.

 

    సామంత్ మౌనంగా ఆ హాలంతటినీ కలియజేస్తూ "ఇది ఏ రాజు కట్టించిందంటావ్?" అన్నాడు.

 

    "దిక్కు మాలింది... ఏమిటయ్యా ఈ ప్రశ్నలు? నన్ను నంజుకు తింటున్నావేమయ్యా మగడా?" కనకారావు పరిస్థితి హృదయవిదారకంగా వుంది.

 

    గట్టిగా దబాయించి తన డ్యూటీ తాను చేసుకుపోదామన్న మనిషి బలంగా వున్నాడు. ఒక్కటేస్తే తన బ్రతుక్కే చివరి క్షణాలవుతాయి.

 

    "ఇది అర్జునరావుదా? నాగమ్మగారి దగ్గర కొట్టేసిందా?"

 

    "ఎంతిస్తే వదిలేస్తావు బాబు? అసలీ దేశంలో వున్న అసందర్భ ప్రేలాపుల్నందర్నీ షూట్ చేసి పడెయ్యాలి. దాంతోగాని దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోదు. మీ అమ్మేమన్నా వస ఎక్కువ పోసిందా?"

 

    "అంత చిరాకు దేనికి కత్తుల కనకారావు?"

 

    "ఇది చిరాకా? నాగోడు, నా బాధ, నా వ్యథ"

 

    "కథలేమన్నా రాస్తుంటావా?"

 

    "మళ్ళీ ఇదేం ప్రశ్న? కత్తెరలు అమ్ముకొని బ్రతికానని సిగ్గు విదిచి చెప్పాను. కథాంటావేమిటి?"

 

    "పెద్ద పెద్ద పదాలు వాడితేను"

 

    "వాడనయ్యా వాడను... నువ్వసలు విషయంలోకి వాస్తవా, రావా?

 

    "నాకు మందుకొట్టే అలవాటు లేదు"

 

    "అదిగో అలా అర్థం కాకుండా మాట్లాడొద్దన్నానా?"

 

    "విషయంలోకి వద్దామన్నావుగా? అందుకన్నాను"

 

    "ఓరి నీ విషయం అణుబాంబు పడి నాశనమయి పోను. విషయమంటే అదికాదయ్యా... ట్రైనింగ్. ఒకవేళ మందు తాగినా కిక్కు ఎక్కదయ్యా బాబు... స్కాంట్ లాండ్ లో తయారుచేసిన మందయినా నీ హింస ముందు తల వంచాల్సిందే..." కనకారావు భరించలేక పోతున్నాడు సామంత్ వాగ్ధాటిని.

 

    "మరి..." సామంత్ మాటలు పూర్తికాలేదు, కనకారావు అతని కాళ్ళమీద పడిపోయాడు.

 

    "నన్ను రక్షించు మహాప్రభో... రక్షించు. ఏదో గతిలేక లక్షకు కక్కుర్తిపడ్డాను. అంతమాత్రానికి ఇంత హింస నేను భరించలేను. నా వల్ల కాదు. అసలా అర్జునరావుగారు లక్షలు ఖర్చయ్యే ఈ పథకం వేశాడు కాని- అదెందుకయ్యా- నిన్ను వదిలితే నాగమ్మగార్కి పావుగంటలో పిచ్చెక్కించేస్తావు. నన్ను మొదలుపెట్టనిస్తావా?" దీనంగా వేడుకున్నాడు.

 

    చిన్నగా నవ్వి "తమాషా చేశాను. ఇలా మాట్లాడే ఒక వ్యక్తిని చూశాను నేను. అతన్ని ఎస్.ఐ. పోస్ట్ కి రికమండ్ చేశాను. ఎక్యూజ్డ్ పర్సన్స్ తో నిజాలు చెప్పించడానికి బాగా పనికొస్తాడని ఆ పని చేశాను... ఇప్పుడు చెప్పు... ఏం చెయ్యాలి నేను? ఏం నేర్చుకోవాలి? ఎన్నాళ్ళలో- నేను తైవాన్ లాంటివాడ్ని. క్షణాల్లో నేర్చేసుకుంటాను చెప్పు" అన్నాడు సామంత్.

 

    అప్పటికీ భయపడుతున్న కనకారావుని చూసి పెద్దగా నవ్వేస్తూ భయపడకు... చెప్పు" అన్నాడు సామంత్.

 

    తనతో రమ్మన్నట్లుగా సామంత్ కి సైగచేసి మెయిన్ హాలునించి మరోగదిలోకి వెళ్ళాడు కనకారావు.

 

    వెనుకే సామంత్ వెళ్లాడు. అడుగుపెడుతూనే ఆ గది వైభవాన్ని చూసి అప్రతిభుడయ్యాడు సామంత్.

 

    అది గదిలా లేదు - పెద్ద హాలు.

 

    మైసూర్ మహారాజు ప్యాలెస్ లోని డ్రాయింగ్ హాల్ లా వుంది. ఖరీదైన పర్షియన్ కార్పెట్ పాదాల్ని మెత్తగా తాకుతోంది. బంగారపు జరీతో చేసిన కర్టెన్లు నిలువెత్తు కిటికీలపై వేలాడుతున్నాయి.

 

    ప్యారిస్ షాండిలీర్లు గది మధ్యనుండి వేలాడుతున్నాయి.

 

    గోడలకి బోరిస్, పికాసో, ఎం.ఎఫ్.హుస్సేన్ వర్ణ చిత్రాలు ఫిక్స్ చేసున్నాయి. ఒక్కో పెయింట్ లక్షల ఖరీదు చేస్తుంది.

 Previous Page Next Page