Previous Page Next Page 
అనితర సాధ్యుడు పేజి 13


    "అవును. మాటల్లోపడి మర్చిపోయాను. ఇందాక ఏమన్నావ్" సామంత్ ప్రశ్నించాడు సీరియస్ గా.

 

    "ఇందాకా? నేనా! ఏమన్నాను?"

 

    "నన్ను వదిలెయ్యవయ్యా బాబు అన్నావేం?"

 

    "అవును. ఏం అంటే?"

 

    "ఈపాటికి నాలుగు డ్రైవింగ్ కేసులు, మరో నాలుగు చిత్తర దొంగతనాలు ఒప్పుకుని రెండువేలుదాకా సంపాదించుకునేవాడ్ని. అనవసరంగా నిన్ను నమ్ముకుని వచ్చాను. నెలరోజులపాటు కష్టపడితే యాభైవేలు ఇస్తానని తీసుకువచ్చి ఇప్పుడు నన్ను వదిలెయ్యమంటావేం?"

 

    "మాటవరసకన్నానయ్యా బాబు... నీ హింస భరించలేక అన్నానంతే"

 

    "అయితే ఇకనుంచి మాట్లాడేముందే ఏదో మాటవరసకో, ఏది వరసైనమాటో చెప్పాలి. నాయకురాలు నాగమ్మ అంటే హడల్ అన్నావ్. ఆ నాయకి ఆవలించకుండానే పేగులు లెక్కేస్తుందని చెప్పావ్. అదీ మాటవరసకేనా?" కారుని ఓ సమాధి ముందు ఆపుతూ అన్నాడు.

 

    "అది నిజమే..."

 

    "ఏది నిజమో, ఏది అబద్ధమో తెలీకుండా నన్ను కన్ ఫ్యూజ్ చేస్తున్నావ్"

 

    "పైగా ఇదొకటా... కన్ ఫ్యూజ్ చేస్తున్నది నేనా?" బిత్తరపోతూ అన్నాడు కనకారావు.

 

    "నువ్వే... అసలు నీ పేరు అలా వుందేమిటి?"

 

    "ఎలా?"

 

    "కత్తుల కనకారావు"

 

    "పేరు మార్చకయ్యా బాబు... నా పేరు కత్తెర్ల కనకారావు అనుకుంటాను"

 

    "అనుకుంటాను అంటావ్... నీకే గుర్తులేదా?"

 

    "నువ్వెక్కడ వుండనిస్తున్నావ్?"

 

    "అయితే నువ్వు మర్చిపోయి ఒకటికి మరొకటి చెబితే నేను ఆ నాగమ్మ చేతిలో ఇరుక్కుపోతే ఎవరు రక్షిస్తారు? నువ్వా... ఆ పిల్లిగడ్డంగారా?"

 

    "నిజమే అన్నీ మర్చిపోయానయ్యా... నాకిప్పుడేం గుర్తులేవు"

 

    "అయితే నా యాభైవేలు నాకిచ్చెయ్ నేనెళ్ళిపోతాను"

 

    "లక్ష రావాల్సిన నేనే తొందరపడడం లేదు. బోడియాభైవేలగాడివి నీకెంత తొందర?"

 

    "చచ్చినా చెప్పనన్నావుగా?"  

 

    "ఏమిటి?"

 

    "నీకెంత వచ్చేది?"

 

    "అవును..."

 

    "లక్ష అని చెప్పేశావుగా?"

 

    కనకారావు షాక్ తిన్నాడు. కొద్దిక్షణాలు సామంత్ కేసి పిచ్చిచూపులు చూసాడు.

 

    కేవలం అతనెంత తీసుకుంటున్నాడో తెలుసుకోవడం కోసమే అంత డ్రామా ఆడాడు సామంత్.

 

    "అసలు విషయం వదిలేసి వేరే విషయాల్ని హఠాత్తుగా మధ్యలోకి తెచ్చి మాట్లాడేవారంటే నాకు అసహ్యం - చెడ్డ చిరాకు" అన్నాడు సామంత్ కారు దిగుతూ.

 

    కనకారావు కారుదిగి సామంత్ దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి అతని రెండు చేతులను పట్టేసుకున్నాడు.

 

    "నన్ను వదిలెయ్ మహాప్రభో... మార్తాండ తేజో" అన్నాడు.

 

    "ప్రాసకోసం ప్రాకులాడే కూస నాయాళ్ళంటే నాకు మరీ చిరాకు"

 

    "ప్రాస కోసమా?"

 

    "అవును"

 

    "నేనెక్కడ ప్రాకులాడాను?"

 

    "మహాప్రభో కరెక్ట్ పదమే. దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం మార్తాండతేజో అన్నావ్. మార్తాండతేజ అనాలి."

 

    కనకారావు హిస్టీరియా వచ్చిన వాడిలా తన చెంపల్ని తానే వాయించేసుకున్నాడు.

 

    "నీకు ఎంకిపాటలు వచ్చా?" సామంత్ అడిగాడు.

 

    "ఎంకి... ఆవిడెవరో?"

 

    "నండూరి సుబ్బారావు తెలుసా?"

 

    "మళ్ళీ ఈయనెవరు?"

 

    "నాయకి గురించి... అదే శృంగార నాయకి గురించి అద్భుతమైన గేయాలు రాశాడు. ఆయనే తెలీదా?"

 

    "దేశంలో వున్న అన్నీ తెలుసుకోకపోవడం హత్య చేసినంత తప్పా?"

 

    "అవును తప్పే ఎందుకంటే మనకిప్పుడు ఎంకిలాంటి పిల్ల తారసపడబోతోంది. అందుకు సంబంధించినవన్నీ తెలుసుకోకపోతే ఎలా? ఎందుకు పనికొస్తావయ్యా...? పైగా లక్షరూపాయలు కావాలా నీకు...?"

 

    "నాకొద్దయ్యా బాబు... నేను పాతవృత్తిలోకే వెళ్ళిపోతాను"

 

    "కొత్తగా ఒకటుందా! పాతదొకటి వుండడానికి?"

 

    "కత్తెర్లు... దొంగ వెధవలకి కత్తెర్లు అమ్ముకునేప్పుడు కూడా అనుమానించినా ఏ పోలీసూ నన్నింతగా పిచ్చోడ్ని చెయ్యలేదు. నాకింతగా మెంటల్ తెప్పించిన వాడెవడూ లేడు ఏ కేసులోనూ."

 

    "అదన్న మాట నీ పాతవృత్తి!"

 

    "ఏది?"

 

    "అదే... దొంగవెధవలకు కత్తెర్లు అమ్మడం"

 

    "నేనెక్కడ చెప్పాను?"

 

    "ఇప్పుడు నువ్వేగా చెప్పావ్?"

 

    "అది కూడా చెప్పేశానా... బాబు సామంత్ ఏమేం కావాలో అడగవయ్యా! అన్నీ చెప్పేస్తాను. ఇలా కొద్ది కొద్దిగా నా మెదడు తినేసి నన్ను హింసించకయ్యా బాబు" ఏడుస్తూ చెప్పాడు కనకారావు.

 

    "అలా అన్నావ్ బావుంది. ఇప్పుడు చెప్పు... ఏ లాభం ఆశించి ఈ పని చేస్తున్నారు?" హఠాత్తుగా సామంత్ గొంతులో వచ్చిన మార్పును గుర్తించాడు కనకారావు.

 

    "ఇక్కడ కాదు. ఈ పక్కనే దర్గా అనే చిన్నగ్రామం వుంది. అక్కడ ఓ ఎస్టేట్ వుంది. అందులోనే నీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రైట్ కి పద" అన్నాడు కనకారావు ఓ పక్క భయపడుతూనే.

 

    కారు తిరిగి బయలుదేరింది.

 

    ఈసారి ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు.

 

    మరో అయిదు నిమిషాలలో కారు దర్గా గ్రామంలోకి ప్రవేశించింది...

 

    ప్రవేశిస్తుండగానే పెద్ద ప్రహరీగోడ ఒకటి కొన్ని ఫర్లాంగుల దూరం వరకు కవర్ చేస్తూ కనిపించింది.

 

    కారిప్పుడు ఆ గోడ వెంటే వెళుతోంది. ఒకింత దూరం వెళ్ళాక "లెఫ్ట్ లో వున్న సింహద్వారం గుండా లోపలకు పోనీ" అన్నాడు కనకారావు.

 

    కారు కొద్ది క్షణాలలోనే గేటు ముందుకి వచ్చి ఆగింది. "ఒక్క నిముషం" అంటూ కనకారావు దిగి గేటు దగ్గరకు వెళ్ళి తలుపు మధ్యలో వున్న చిన్న చెక్కను పక్కకు జరిపి "మస్తాన్... ఓ మస్తాన్..." అంటూ పెద్దగా అరిచాడు.

 

    ఓ నిమిషానికి ఇరవై అడుగుల ఎత్తులో వున్న పెద్ద గేట్ రెక్క ఒకటి భారంగా లోపలికి వెళ్ళిపోయి కారుకి దారిచ్చింది. 

 Previous Page Next Page