Previous Page Next Page 
నివేదిత పేజి 14


    ఆమె ఉలిక్కిపడి బాధగా అతని వైపు చూచింది. ఆమె కనుకొనలలో రెండు నీటి బిందువులు నిలిచీ నిలవనట్లు నిలిచాయి. "నిజమే శేషుబాబూ! నిజాన్ని ఎంత నిష్కల్మషంగా చెప్పారు! అప్పటిలా ఆడుకునే మనస్తత్వం ఉన్నా ఈ శరీరాలు ఎదిగిపోయినాయిగా?" అంది విచలిత స్వరంతో.

 

    "శరీరంతోపాటు మనస్తత్వాలూ మారుతూ ఉంటాయి వేదితా!" అన్నాడతను ఆలోచనాత్మకంగా.

 

    ఆమె అతని వంక ఒకసారి చూసి కనురెప్పలు క్రిందికి వాల్చి ఆలోచిస్తూ నేలమీద ప్రాకుతున్న చీమలను చూస్తున్నది. ఆమెకు హఠాత్తుగా ఎందుకో భయం వేసింది. తను చాలా సామాన్యురాలిగా మారిపోతున్నట్లు అనుభూతి పొందింది.

 

    ఇక ఆ ప్రమేయం మార్చివేయటానికి "మీరు శుద్ధ నాస్తికుల క్రింద ప్రకటించుకున్నారు కదా శేషుబాబూ? మరి ఈ వేళ దేవాలయా గమనంచేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారే" అంది బలవంతాన నవ్వటానికి ప్రయత్నిస్తూ. అతను చిలిపిగా ఆమె విశాల నయనాల్లోకి చూస్తూ "గుళ్ళోకి అడుగు పెట్టినంత మాత్రాన నేనేదో భక్తిపరుడ్ని అనుకుంటున్నావేమిటి? నేను ఇక్కడికి వచ్చిన కారణంవేరు. తీరా వచ్చాక నీ మృదు హస్తాలు యిచ్చిన ఆతిథ్యం స్వీకరించకుండా ఉండటానికి ఎలా మనస్కరిస్తుంది? నీ తృప్తి కోసం, ఆనందం కోసం అవన్నీ చేశాను" అన్నాడు.  

 

    "నా తృప్తి కోసమూ, ఆనందం కోసమూనూ? అదేమిటి శేషుబాబూ!"

 

    "అవును, లేకపోతే నీకు కోపంరాదూ?"

 

    "అది సరే. మీరు ఇక్కడికి వచ్చిన కారణం వేరన్నారు అదేమిటి?"

 

    ఒక్కక్షణం అతను ఏదో అడ్డుపడినట్లు మాట్లాడలేకపోయాడు. "చెప్పనా?" అన్నాడు డగ్గుత్తికతో. తను ఇంక దాచుకోలేడనిపించింది. దాగుడుమూతలాడలేననుకున్నాడు.  

 

    "కేవలం నిన్ను కావాలనే వచ్చాను. చిన్ననాటి నెచ్చెలివి. నీ సావాసపు మృదు సువాసనలు నన్నింకా విడనాడి పోలేదు. నిన్ను కలుసుకోవాలనీ, నీతో ఎన్నో చెప్పాలని ఉవ్విళ్ళూరాను. అయినా మన ఇద్దరి సిద్దాంతాలకూ ఎన్నో వేలమైళ్ళ వ్యత్యాసముంది. అర్థం చేసుకుంటావో అపోహపడతావో అని భయం. నిన్న మా ఇంటికి నువ్వు రావటం, నీ గానం ఆలకించటం జరిగాక యిక్కడకు రాకుండా ఉండలేకపోయాను."

 

    మబ్బులను చీల్చుకుని భూమిని తాకుతున్న సూర్యకిరణాలు వేదిత మీదపడి ఎర్రగా కందుతూన్న ఆమె ముఖం అతని మాటలకు మరింత ఎర్రబడి అరుణరాగ రంజితమైంది.

 

    "మీ మాటలు నాకు అర్థంకావటంలేదు శేషుబాబూ?" అంది గగుర్పాటునూ, కోపోద్రిక్తతనూ అణుచుకుంటూ.

 

    "ఒక విషయం సూటిగా అడుగుతున్నాను. నీ జీవితం ఇలా అడవిగాచిన వెన్నెలగా వృధా గావలసిందేనా?"

 

    "ఈ వెన్నెల కాస్తూన్న ప్రదేశం అడవే అని ఎందుకనుకుంటున్నారు మీరు?"

 

    "అడవి అనుకోకపోతే, స్వర్గధామమని ఆత్మవంచన చేసుకోమంటావా? వేదితా! నీ తండ్రి స్వార్థంకోసం ఆయన మూఢనమ్మకాల కోసం, ఛాందస సిద్ధాంతాలకోసం నిన్ను ఓ యంత్రాన్ని చేసి నిన్ను నీకు అర్థంగాకుండా చేసి ఒదిలిపెట్టాడు. అతని పాటకు ఊళ్ళోని ప్రజలు అమ్మలక్కలు నలుగురూ చేరి నిన్ను అందల మెక్కిస్తూ వంత పాడారు. ఆ భట్రాజు పొగడ్తలతో ఆ మతిభ్రష్టుల ఉన్మాదపు చేష్టలతో నీకు మైకం వచ్చి కనులు మూసుకొని పోయాయి. నిన్ను నీవు ఆత్మవంచన చేసుకుంటూ, నరుక్కుంటూ, తరుక్కుంటూ ఆ గొప్ప ఏదో నీకే తెలియకుండా, ఆదర్శ శిఖరంమీద అయోమయంగా కూర్చుని పూనకం వచ్చినట్లు ఊగుతున్నావు నువ్వు. నీకో దేవుడు దొరికాడు. అతన్లో అన్నీ చూసుకుంటూ ఊహలతో, కలలతో, కల్పనలతో తృప్తిపడుతూ దాన్ని ఆరాధన అనీ, తపస్సు అనీ అనుకుంటున్నావు నువ్వు. వాళ్ళతో బాటూ నీకు మతిచెడింది. ఈ దగాపడిన మనస్సుతో బావుకునేది యేమిటి? నీ సహజ జీవితాన్ని ఒదులుకుని నువ్వు సాధించేది సున్నా. నీ యోగసాధన, నీ ఆరాటమూ రాను రానూ నీలో సంక్షోభాన్ని, కలవరపాటునూ అధికం చేస్తాయోగాని సుఖశాంతులు ప్రసాదించలేవు.

 

    ఒక్క నిముషం.... ఒక్క నిముషం మాత్రం సంక్షోభానికి గురి అయినట్లు కనిపించింది వేదిత. తర్వాత నిర్మలంగా ఒక్క నవ్వు నవ్వి "నా సుఖశాంతులు, చిత్తవికాసం, నా అంతరంగిక సంపదలు మీరెలా గ్రహించగలరు శేషబాబూ?" అన్నది మృదుస్వరాన.

 

    "మానవ స్వభావపు హద్దులని నే నెరుగుదును. మనుషులకు అతీతపు విలువల్ని అంటగట్టి అంధుడిలా ఆరాధించటం నా చేతకాదు."

 

    "ఆరాధించకండి. ఇప్పుడు మిమ్మల్నెవరూ బలవంతం చెయ్యలేదు. పల్లెటూరివాళ్ళం. మా మానాన మమ్మల్నిలా బ్రతకనివ్వండి."

 

    "అయితే నీ జీవితాన్ని యిలా నాశనం చేసుకోవటానికి నిశ్చయించుకున్నావా?"

 

    అతని కంఠస్వరంలో క్రొత్తదనం విని ఆమె ఉలికిపాటును అణుచుకుంటూ "మీ దృష్టిలో ఇది నాశనం అయితే నన్ను నాశనమే కానివ్వండి. నన్ను నేను దగ్ధం చేసుకోనివ్వండి."

 

    "నువ్వు మూర్ఖురాలివి" అన్నాడు శేషుశాయి కంపితుడై.

 

    "మీరు విదేశాలకు పోయి నేర్చుకున్నది యితరులమీద దోషాలు ఆరోపించటమేనా శేషుబాబూ? ఇంతకన్నా స్వతఃసిద్ధంగా మీరేమీ పెరగ లేదా? మీరు నన్ను మూర్ఖురాల ననుకుంటే ఏమీ నష్టంలేదు. మీరందరూ సుఖశాంతులతో తులతూగితే నాకదే పదివేలు."

 

    శేషశాయి కొంత చల్లబడి, ఆమె కన్నులలోకి చూస్తూ "వేదితా! సుఖశాంతులనేవి వెదికితే దొరికే వస్తువులా? మనం పోగొట్టుకున్న సుఖం ఒక్కో వ్యక్తిని చూస్తే స్ఫుర్తిస్తుంది. మనం పోగొట్టుకున్న శాంతి ఏ మనోహరిణి దివ్యలోచనాల వీక్షణంలోనో లభిస్తుంది. నీకీ బోధనంతా ఎందుకు చేశానంటావు! నిన్ను గురించి కూడా ఆలోచించి వుండవు. యెప్పుడో చెప్పాలనుకున్నాను. అసలు చెప్పగలనో లేదో అనుకున్నాను. అవును, యింత మనఃస్థయిర్యం మళ్ళీ చిక్కదేమో! ప్రపంచములో మనవి అన్నిటి కన్నా సమ్మోహన పరిచే గొంతు ఎవరిదో తెలుసా? మనకి అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తిది. నిన్నటి నీ గానం.... ఆ సంగీత తరంగాలు నా కళ్ళముందు సృష్టించిన నీ రూపం...! ఈ భూమ్మీద ప్రజలంతా నిన్ను పవిత్ర దృష్టిలో చూడనీ, నేను చూడలేను! చూస్తాను  కాని నా పవిత్రతకు నిర్వచనం వేరు. అవధులు వేరు. నీ శరీరం నాకు శరీరంలా కనబడుతుంది వేదితా! నీ యవ్వనం నాకు యవ్వనంలానే కనబడుతుంది. నిన్ను నేను రంగుటద్దాలతో చూడను, వాస్తవిక నిస్ఫాక్షిక దృష్టితోనే చూస్తాను వేదితా. నువ్వు..."

 Previous Page Next Page