రోజూ సాయంత్రం ఎటో అటు షికారుకు తీసికెళ్ళేవాడు. ఓరోజు పబ్లిక్ గార్డెన్స్, మరోరోజు టాంక్ బండ్, ఓరోజు సాలార్ జంగ్ మ్యూజియంకు, తీసికెళ్ళి తిప్పాడు.
రెండు సినిమాలకి తీసికెళ్ళాడు. తనకి వీలైనంతలో జ్యోతిని సంతోషపెట్టాలని, అలా అయినా భార్య మొహం కళకళలాడుతూ నవ్వుతూ వుంటుందని ఆశించాడు.
సినిమాలు చూసింది, షికార్లు తిరిగింది. కాని జ్యోతి మొహమాటం వీడలేదు.
ఏదో బలవంత బ్రహ్మణారార్థం అన్నట్టు, సుబ్బారావు లాంటి వాడివెంట తిరగడం చిన్నతనం అన్నట్టు, ఇష్టంలేక సుబ్బారావు సంతోషంకోసం బయలుదేరినట్లు విసుక్కుంటూ, చిరాకుపడుతూ, కసురుతూ తిరిగేది.
"అబ్బబ్బ! యీ బస్సులకోసం పడిగాపులు పడనక్కరలేకుండా ఓ స్కూటరన్నా వుంటే ఎంత బాగుంటుంది?" అంది ఒక్కసారి.
సుబ్బారావు "ఆఁ. కొందాం!" అన్నాడు.
జ్యోతి సంబరంగా "ఎప్పుడు?" అంది.
"డబ్బు కూడాక" అన్నాడు కొంటెగా నవ్వి.
జ్యోతికి వళ్ళు మండింది.
మొత్తంమీద ఎలాగై తేనేం కొత్త జీవితానికి వారంరోజులకి ఇద్దరూ సెటిలయ్యారు. సుబ్బారావు బ్యాంక్ కి వెళ్ళడం ప్రారంభించాడు. జ్యోతికి అన్నం ముద్ద చేయకుండా వండడం వచ్చింది.
మీరు ఆఫీసుకి వెళ్ళిపోతారు. రోజంతా నాకేం తోస్తుంది? రేడియో అన్నాలేదు. నాలుగు పత్రికలన్నా తెచ్చి నా మొహాన పడేయండి" అంది జ్యోతి.
"అలాగేలే! అంతగా తోచకపోతే మన పక్కవాళ్ళున్నారు, ఆవిడతో మాట్లాడు. మంచివాళ్ళు కలుపు గోలుగా వుంటారు పరిచయం చెయ్యనా?" అన్నాడు ఆఫీసుకు వెళ్ళేముందు.
ఆ పక్కవాళ్ళు అతను సెక్రటేరియట్ లో గుమస్తా అని సుబ్బారావు ఒకరోజు చెప్పగానే జ్యోతికి వాళ్ళమీద ఇంటరెస్టు పోయింది. ఒకటి రెండుసార్లు ఆ ఇంటావిడ మొహం కన్పించింది. జ్యోతికేం నచ్చలేదు.
ఆవిడ పలకరింపుగా నవ్వబోతే జ్యోతి చూడనట్లే మొహం తిప్పుకుంది.
"అక్కరలేదులెండి. ఇంతోటి గొప్పవాళ్ళతో పరిచయం కాకపోతే కొంప మునగదులెండి" విముఖతగా అంది.
సుబ్బారావు జ్యోతి మొహంలోకి చూశాడు పట్టిపట్టి. " గొప్ప వాళ్ళు కావాలంటే పైకి వెళ్ళు" అన్నాడు మేడ చూపిస్తూ.
ఆ మేడమీద భాగంలో ఏదో కంపెనీలో పనిచేస్తున్న పర్సనల్ ఆఫీసర్ వున్నాడు.
కంపెనీ ఉద్యోగం, మంచి జీతం వుందేమో ఇల్లు, ఫర్నిచర్ అదీ బాగుంటుంది.
జ్యోతి ఎక్కడనించో వస్తూ ఒకటి రెండుసార్లు మేడమీద బాల్కనీలో ఆమె కనిపిస్తే పలకరింపుగా నవ్వింది. కాని ఆవిడ యిటు చూడలేదు.
చూసినా ఎవరో అన్నట్టు నిర్లిప్తంగాచూసి వూరుకుంది.
జ్యోతి చిన్నబుచ్చుకుంది.
"మీరు వెళ్ళండి బాబూ! నా ఏడుపేదో నేను ఏడుస్తాను" అంది విసుగ్గా.
"ఏడిస్తే ఎలాగోయి లలనామణీ. పోనీ రోజంతా ఏడిస్తే ఏడువుగాని, సాయంత్రం నేను వచ్చేవేళకి మాత్రం శుభ్రంగా మొహం కడుక్కుని తయారయిపో." అంటూ జ్యోతి బుగ్గమీద ముద్దుపెట్టి "మరి నేను వెళ్ళొస్తా. సాయంత్రంవరకు విరహగీతాలు పాడుకో" అన్నాడు చిలిపిగా.
"ఆ.... అంత ప్రేమ కారిపోవడంలేదులెండి" పుల్ల విరిచినట్లంది జ్యోతి.
సుబ్బారావు మనసు చివుక్కుమంది. పదిరోజులుగా జ్యోతి మాటలు వింటున్నాడు. కనక ఆమె తీరే అంతని మనసు సరిపెట్టుకోబోయినా ఆ మనసు అతని మాట వినలేదు.
చిన్నబోయిన మొహంతో ఆఫీసుకి వెళ్ళిపోయాడు.
* * * *
సుబ్బారావు ఆఫీసుకి వెళ్ళాక 'అమ్మయ్య' అనిపించింది జ్యోతికి. ఇన్నాళ్ళకి మళ్ళీ హాయిగా తను ఒకర్తె కాసేపు వుండచ్చు. వెంట వెంట తిరుగుతూ ప్రాణంతీసే మొగుడులేడు.
"పీడ కాసేపన్నా వదిలింది" అనుకుంటూ చక్కగా పక్కఎక్కి ముసుగుపెట్టి తన కలల్లోకి జారిపోయింది.
తనకు పెళ్ళయిందని, ఇంకా తన కలలన్నీ ఏనాటికో ఒకనాటికి జరిగే ఆశలేదన్న సంగతి కూడా గుర్తురాలేదు జ్యోతికి.
ఆ కలలని చెదరగొడుతూ తలుపు చప్పుడయింది. జ్యోతి ఎవరూ? అనుకుంటూ ఆశ్చర్యంగా తలుపు తీసింది.
పక్కింటి ఆమె జ్యోతిని చూసి పలకరింపుగా నవ్వి నమస్కారం చేసింది.
"ఏం చేస్తున్నారు? మీరొచ్చిం దగ్గర నుంచి వచ్చి పలకరిద్దామనుకున్నాను. మీవారు ఇంట్లోనే వున్నారు. కొత్తదంపతుల మధ్య నేనెందుకని రాలేదు. సామాను అదీ సర్దుకుంటారని డిస్టర్బ్ చేయలేదు...." అంది చనువుగా.
"రండి" జ్యోతి కుర్చీ చూపించింది.
"అన్నీ సర్దటం అయ్యాయా?" అంది ఆమె.
"ఆ..... ఏమున్నాయి సర్దుకోవటానికి" జ్యోతి ముభావంగా అంది.
"కొత్తగా వచ్చారుగదా.... ఇన్నాళ్ళు ఆయన వంటరివారు. ఎంతయినా మనం ఆడవాళ్ళం. రాగానే అదీ యిదీ చేర్చుతాం. వంట మొదలు పెట్టారా? పనిమనిషి దొరికిందా? మా పాలవాడే ఇస్తున్నట్టున్నాడు మీకూనూ" మాటలు కలిపింది.
"ఆఁ..... ఏదో చేస్తున్నాను. నాకసలు వంట రాదండీ, వండాలంటే బోర్. మా ఇంట్లో నేనెప్పుడూ వండలేదు. నాకసలు పనులంటే చిరాకు" అంది గొప్పగా జ్యోతి.