"తప్పదమ్మా... మనకోట అంటే మంచి ప్రపంచం అమ్మా... సత్యకాలం అంటే అక్కడుంది. కోటనుంచి బయటకు వచ్చాక మనం మిగతా వాళ్ళలాగానే ప్రవర్తించాలమ్మా... అవతలవాడు రెండు ఎత్తులు వేస్తే, మనం నాలుగు ఎత్తులు వేయాలి తప్పదు" అన్నాడు ముత్యాలు.
చాలాకాలానికి ఇంటి ముందు కారు శబ్దం వినబడితే, విశ్వరూపశర్మ, పరంజ్యోతి ఇద్దరూ బయటకు వచ్చారు.
కారుని, కారులో స్టీరింగ్ ముందు కూర్చుని వున్న ఇందుమతిని చూసి ఆశ్చర్యపోయాడు విశ్వరూపశర్మ.
కారుని పరిశీలించాక తనకు తెలిసిన బ్రోకర్లకు ఫోన్ చేసి చెప్పాడు విశ్వరూపశర్మ.
ఆరోజు మధ్యాహ్నానికి మరో బ్రోకరు వచ్చాడు.
పదిలక్షలకు బేరం కుదిరింది.
బేరమాడితే రేటు ఇంకా పెరుగుతుందని ముత్యాలుకు తెలుసు. కానీ తెగేవరకూ లాగదలుచుకోలేదు. అంత సమయమూ లేదు.
తాగి తాగి విశ్వరూపశర్మ శరీరం అప్పటికే శుష్కించిపోయింది. పైగా వృద్ధాప్యం... ఎన్నాళ్ళు బ్రతుకుతాడో తెప్పడం కష్టం. అతను పోతే నిధికి దారి శాశ్వతంగా మూసుకుపోతుంది. అతను బ్రతికి వుండి సహకరిస్తేనే నిధికి చేరుకోగలిగేది. సమయం వృధా కావటానికి వీల్లేదు. అందుకే మరింత పెద్ద బేరానికి వెళ్లదలుచుకోలేదు ముత్యాలు.
అడ్వాన్స్ మూడు లక్షలు ఇచ్చి, రెండు రోజుల్లో వస్తానని చెప్పి బ్రోకర్ వెళ్ళిపోయాడు.
"ఒకసారి... కోటకు వెళ్ళి నాన్నగారిని కలిసివస్తే... మన ప్రయత్నాలలో మనం పడొచ్చు ఏమంటారు...?" అడిగాడు ముత్యాలనాయుడు.
అదే కారులో దేవులపల్లి కోటకు బయల్దేరారు ముత్యాలనాయుడూ ఇందుమతి.
* * * *
కళ్ళద్దాలను సర్దుకుని, పేపర్ లోని వార్తల్ని కూడబలుక్కుని చదువుతూ మధ్య మధ్యలో ఆలోచిస్తున్నాడు కౌశిక భూపతి.
అంతలో-
కారు శబ్దం వినిపిస్తే... తలెత్తి చూశాడాయన. రూపురేఖల్ని మార్చుకున్న కారు తళతళలాడిపోతుంది. ఉత్సాహంగా లేచి మెట్లు దిగి కారు దగ్గరకు వచ్చారాయన.
"డొక్కు కారు... స్వరూపం మారిపోయిందే" కూతురువైపు ప్రశంసగా చూస్తూ అన్నాడాయన.
"కారు స్వరూపమే కాదు బాబూ... మన స్వరూపాలు కూడా మారిపోతాయి... చూస్తుండండి" అని కారు బేరసారాల గురించిన విషయాలు చెప్పుకొచ్చాడు ముత్యాలనాయుడు.
భోజనాల సమయం...
"అయితే... నిధి అన్వేషణలో పడతారన్న మాట" కౌశికభూపతి అన్నారు.
"పడటం ఏమిటి? పడినట్లే" ముత్యాలనాయుడు హుషారుగా అన్నాడు.
"అమ్మాయి... నువ్వూ... ఇద్దరేనా... బాగుంది జట్టు" నవ్వుతూ అన్నాడు కౌశికభూపతి.
"వేటకు వెళ్ళాలంటే... వేటగాళ్ళను తీసుకువెళతాం... వేట కుక్కల్ని తీసుకువెళతాం... అలాగే... జమా జట్టీల్లాంటి నా శిష్యులు, వైజాగ్ లో వున్నారు. ఇద్దరు ముగ్గురిని ఎంపిక చేస్తే బాగుంటుంది. విశ్వరూపశర్మగారిని కలిసిన మీదట కానీ- మా కార్యక్రమానికి ఒక పూర్తి స్వరూపం రాదు రాజావారూ" చెప్పాడు ముత్యాలనాయుడు.
నిధి అన్వేషణకు ఉక్కు పిడుగుల్లాంటి, మనుష్యులు ఎంత అవసరమో, వారి విశ్వాస పాత్రత కూడా అంతే అవసరం... కొత్తవాళ్ళను నమ్మొద్దు నీతి చంద్రికలోని జంతుసూక్తి చాలా అవసరం... అమ్మాయికి అంతా కొత్త... ఎంపిక దగ్గరనుంచీ అన్ని విషయాలూ నువ్వే చూసుకోవాలి ముత్యాలూ" చెప్పారు కౌశికభూపతి.
"అమ్మాయిగారిని ముందుపెట్టి కథనంతా నడిపించనూ... కంటికి రెప్పలా కాపాడతాను బాబుగారూ... మీ వంశానికి సేవ చేసుకునే అదృష్టము... ఇన్నేళ్ళకు కలిగింది మళ్ళీ... ఈ కోట పూర్వవైభవంతో వెలగాలి బాబూ... అందుకే నాకు ఈ పట్టుదల."
"నాన్నగారూ! కోటలో మనం నివాసం వుండే గదులన్నీ బాగు చేయించాలి. ఎలక్ట్రిసిటీ పెట్టించాలనుకుంటున్నాం. మీరేమంటారు" తండ్రి సంతోషం కోసమే డబ్బు అవసరం ఎంతో వున్నా, ఆ ఖర్చుకి సిద్ధపడింది.
"ముందు ముందు చాలా ఖర్చులుంటాయి. జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టండి" అన్నారాయన.
"ఇది కూడా ముఖ్యమైన ఖర్చే. కాదనకండి" ముత్యాలనాయుడు ఒప్పించాడు.
గదుల మరమ్మతులు- సున్నాలు- కరెంటు పనులు ప్రారంభం కాగానే-
ఇందుమతి, ముత్యాలనాయుడు, విశ్వరూపశర్మ దగ్గరకు బయలుదేరారు.
* * * *
టేబుల్ మీద పెట్టిన ఐదులక్షల రూపాయల నోట్ల కట్టలవైపు చూసి నవ్వాడు విశ్వరూపశర్మ.
ఆయనెందుకు నవ్వుతున్నాడో అర్ధంకాలేదు ఇందుమతికి.
"ఐదులక్షలు ఇమ్మని చెప్పాను కానీ- అంతా ఒక్కసారే ఇవ్వమని అడగలేదు కదా తల్లీ! అడ్వాన్సుగా రెండులక్షలు చాల్లే... మిగతాది నువ్వు నిధిని చేజిక్కించుకున్నాక ఇద్దువుగాని" అన్నాడు శర్మ మృదువుగా.
అర్ధంకాలేదు ఇందుమతికి.
"ఆ నిధి దొరికాక అందులో కొంత నాకు పడేయ్" మూడులక్షల కరెన్సీని ఇందుమతి చేతిలో పెట్టేస్తూ అన్నాడాయన.
అమ్మా... ముసలాడు పెద్ద ఎత్తేవేశాడు. నిధిలో వాటాకే లంకె పెట్టాడు. ఎంతయినా దోచుకోవడం బాగా తెలిసిన దొంగలతో తిరిగాడు గదా... అని అనుకున్నాడు ముత్యాలనాయుడు మనస్సులోనే.
"మీరు ఎలాగంటే అలాగే" ఒప్పుకుంది ఇందుమతి.
కాఫీ, టిఫెన్ లు అయ్యాక విశ్వరూపశర్మ చెప్పడం ప్రారంభించాడు. అప్పటికే ఆయన ముందు గత వారంరోజులుగా బూజు దులిపి తీసిన పాత ఫైళ్ళు, తాటాకు గ్రంథాలు- బూడిద రంగులోకి మారిపోయి ముట్టుకుంటే చిరిగిపోతాయేమో అన్నట్టుగా వుండే గ్రంథాలు, చుట్టలు చుట్టి వున్న జంతు చర్మాలు ఏవో మ్యాపులు పడి వున్నాయి. వాటిల్లో ఒక గ్రంథాన్ని తీసి పట్టుకుని, ఆ గ్రంథాన్ని ఇందుమతికి చూపిస్తూ "ఇదీ మీ వంశ చరిత్ర తల్లీ- ది హిస్టరీ ఆఫ్ దేవులపల్లి ఫోర్ట్ మీ వంశ మూలపురుషుడు ఆదిత్య భూపతిరాజావారు 15వ శతాబ్దంలో ఆయన ఇప్పటి మధ్యప్రదేశ్ నుంచి వలస వచ్చి ఇక్కడ గిరిజన తెగతో సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకున్నారు.
దుర్గమ అరణ్యంలో క్రూరమృగాల మధ్య, అనేక బాధలు పడుతున్న గిరిజనులకు ఆయన రాక ఎంతో ఊరటను కలిగించింది. క్రూర మృగాల బారి నుండి గిరిజనులను రక్షించి వారికి అండగా నిలబడ్డారు. ఆయన క్రమంగా వారి నాయకుడు అయ్యారు.
అదే కాకుండా ఆదిత్య భూపతి రాజావారు, గిరిజన యువతినే పెళ్ళి చేసుకోవడంతో వన్య ప్రాంతం అంతా ఆయన అధీనంలోకి వచ్చింది. అందుచేత మీకు మొదటి నుంచీ గిరిజనుల మద్దతు వుండేది. తెల్లదొరలతో జరిగిన అనేక చిన్న చిన్న యుద్ధాల్లో మీవారు గెలవటానికి కారణంలోని రహస్యం అదే అవిక్రపరాక్రములైన గిరిజన నేతలు మీకు, మీ సంస్థానానికి తోడుగా వుండటమే కారణం"
విశ్వరూపశర్మ చెబుతున్న విషయాలను శ్రద్ధగా వింటోంది ఇందుమతి.
"వంశ చరిత్ర తర్వాత చెప్తాను... ముందు కోట చరిత్ర విను. దేవులపల్లి కోటను శాస్త్రీయంగా చెప్పుకోవాలంటే వనదుర్గం అంటారు. అంటే అరణ్యంలో ఏర్పాటు చేసుకున్న కోట అని అర్ధం. ప్రాచీన భారతదేశంలో మొట్టమొదట దుర్గాలు ఏర్పడ్డాయి. ఆ దుర్గాలే ఆ తర్వాత పరిణామ క్రమంలో కోటలుగా రూపాంతరం చెందాయి. దుర్గం అంటే శత్రువులను ప్రవేశించడానికి వీలులేకుండా పకడ్బందీగా ఏర్పాటు చేసిన నివాసం అని అర్ధం.
నాలుగువైపులా పొడవాటి గోడమధ్య, వ్యూహాత్మకంగా నిర్మాణం చేసిన మహాభవనాలు వుండేవి. రహస్య మార్గాలు, గుహాంతర్భాగాలు ఆ వ్యూహ నిర్మాణంలోని భాగాలే. ప్రధానంగా మన భారతదేశంలో ఆరు రకాలైన కోటలు వుండేవి ధాన్య దుర్గం, అంటే ఎడారి కోట... మహిదుర్గం అంటే మట్టికోట- జలదుర్గం అంటే నీటిమధ్య కట్టిన కోట- గిరిదుర్గం అంటే కొండమీద కట్టే కోట. వనదుర్గం అంటే అడవుల్లో కట్టే కోట- నరదుర్గం అంటే మనుష్యుల చేత రక్షింపబడే కోట.
ప్రధానంగా రక్షణ వ్యవస్థకు కోటలు గుర్తు- అందుకే కోట నిర్మాణం విషయంలో రాజులు చాలా ఆలోచించేవారు. జాగ్రత్తలు తీసుకునేవారు.
చిత్తూరుజిల్లాలో చంద్రగిరి కోటను తీసుకో. అది గిరిదుర్గం... కాని కోట కంటే ఎత్తయిన కొండలు వుండటం అదీ సమీపంలోనే వుండటము వల్ల ప్రారంభంలో ఎక్కువ శత్రుదాడులు జరిగాయి. దాంతో అది ఉపకోటగా మారిపోయింది.
అలాగే విజయనగరం కోట... ముందు అది ఒక పల్లెటూరు. సమీపంలో వున్న ఒకచోట మట్టికోట కట్టారు విజయనగరం రాజులు. ఆ కోట చుట్టూ కొండల మధ్య వుండేవి. కొండల్లోంచి ఎవరైనా తుపాకులు పేలిస్తే సరిగ్గా రాజావారి భవనానికి తగులుతాయి. కోట సగంలో నిర్మాణ దశలో వుండగా ఈ విషయం తెలిసింది. వెంటనే ఆ నిర్మాణాన్ని ఆపేసి, విజయనగరంలో కోట కట్టడానికి నిర్ణయించుకున్నారు. అంతటి బొబ్బిలి యుద్ధంలో కూడా విజయనగరం కోట చెక్కుచెదరకుండా ఉండటానికి కారణం అదే... ఒక దేవులపల్లి కోట సంగతి కొద్దాం- అది వనదుర్గం- వనదుర్గానికి సరిహద్దుల్లోని అడవులతోనే కాదు- దూరప్రాంతాల అడవులతోనూ, ఆటవిక జాతులతోనూ సంబంధ బాంధవ్యాలుంటాయి. అందుకే మీ వాళ్ళకి తూర్పు కనుమల్లోని గిరిజనులలో మంచి సంబంధాలు వున్నాయి. మీ నిధి కూడా తూర్పు కనుమల్లోనే ఉంది" అన్నాడు విశ్వరూపశర్మ.
"తూర్పు కనుమలంటే?" అడిగాడు ముత్యాలనాయుడు.
"తూర్పు ప్రాంతంలో ఉండే కొండలు. విశాఖ ప్రాంతం నుండి అటు ఒరిస్సా బోర్డరు వరకు"
"మీ అంచనా ప్రకారం... అసలు నిధి ఎంతుంటుందంటారు" ఉత్సాహంగా అడిగాడు ముత్యాలనాయుడు.
చేతిలో వున్న పుస్తకాన్ని ప్రక్కన పడేసి, ఇంకొక తాళపత్ర గ్రంథాన్ని చూసి, ఎంతుంటుందంటే, ఏం చెప్తాం- చాలా ఉండొచ్చు. అప్పటి అంచనా ప్రకారమే యాభైకోట్ల రూపాయలు. మరిప్పుడు సుమారు రెండువందల కోట్లకు పైగానే ఉంటుంది. బంగారు హారాలు... విలువైన పచ్చల బాకులు- స్వర్ణ మయూరం... గోమేధి కాలసింహాసనం- స్వర్ణదేవీ ప్రతిమలు, బ్రిటీష్ దొరలు మీవారి స్నేహం కోరుతూ ఇచ్చిన కానుకలు... వజ్రాలు, వైఢూర్యాలు, బంగారు దారాలతో నేసిన దుస్తులు- చెప్పలేం... ఇలాంటివే చాలా ఉండొచ్చు" చెప్పాడాయన.