Previous Page Next Page 
గిఫ్ట్ పేజి 14

    సాటి మనిషి మనల్ని అన్యాయం చేస్తే మనం చంపితే హత్య అవుతుంది. ఒకదేశం సిపాయి మరొక దేశం సిపాయి మీదకి తుపాకీ పేలిస్తే, ఆ తూటాదెబ్బకి వాడు ఛస్తే కొనప్రాణంతో వున్నవాడిని వీడు చంపితే అది యుద్ధంక్రిందకి వస్తుంది. హత్య క్రింద రాదు.

    ఎవరికి వారు తాము చేసేది మంచి న్యాయమైన పని అనుకుంటారు. అన్నీ మనమనుకోవటంలోనే ఉంది. ఒక మనిషి ఇంకొక మనిషిని చంపటం అన్యాయమయినపుడు, ఎవరు ఎవరిని ఏ కారణం చేత చంపినా అన్యాయమే...."

    నేనడిగింది ఏమిటి? నువ్వు చెప్పే సమాధానం ఏమిటి? నీవడిగిన వంద రూపాయలూ ఇస్తాం, కారణం చెప్పరా అంటే, హత్యలు చెయ్యటం తప్పుకాదు. కత్తులతో నరకటం తప్పుకాదు అంటావేమిటి?" జగన్నాధం కయ్యిమని లేచాడు.

    "నాకవసరమై వందరూపాయలు అడిగాను. ఆఫ్ ట్రాల్ వందరూపాయలు అడిగితే ఇన్ని ప్రశ్నలు. చెప్పే విషయమైతే చెబుతాను కదా! చెప్పు చెప్పు అని మీరు బలవంతం చెయ్యడం వల్ల నేను నిజం చెప్పను సరికదా! అబద్ధం ఆడవలసి వస్తుంది. అబద్ధం చెప్పమంటే నిక్షేపంగా చెబుతాను.

    ఈకాలం ఏ పని చెయ్యాలన్నా డబ్బుతో ముడిపడి వుంది. డబ్బుకు వున్న విలువ మనిషికి లేదు. మానవత్వానికి లేదు. ఏదో జరగరానిది జరిగి ఒక్కసారిగా ఈ ప్రపంచం మొత్తంమీదా వున్న ప్రతిపైసా మాయమైపోతే, డబ్బు తాలూకా అంశం ఏదీ మిగలకుండాపోతే, వున్నట్టుండి అందరూ ఏమైపోతారు? ఏం జరుగుతుంది? ఎలా మసలుకుంటారు?

    మానవుడు తయారుచేసిన ఈ డబ్బు మానవుడి కన్నా బలమైనది. హ్హ....హ్హ....హ్హా!" బోసుబాబు ఆవేశంగా పలికి పెద్దపెట్టున హాలు దద్దరిల్లేలాగా నవ్వాడు.

    స్టేజీ మీద నాటకం చూసినట్లు, స్టేజీ ఎక్కి బోసుబాబు స్టేజీ మీద ఒక్కడే యాక్షన్ చేస్తున్నల్టు అందరూ వింతగా చూస్తూ, నోరు తెరిచి అలా వుండిపోయారు.

    బోసుబాబు చెయ్యిచాచాడు "ఏదీ! వందరూపాయలు ఇస్తామన్నారుగా ఇవ్వండి!" అన్నాడు.

    మళ్ళీ తలోమాటా అందామనుకున్నారు గానీ, ఎందుకనో ఎవరి నోరూ పెగలలేదు. వందరూపాయలు తీసి ఇచ్చే ప్రయత్నమేమీ లక్ష్మణమూర్తి చేయలేదు.

    ఏమనుకున్నాడో జగన్నాధం వందరూపాయల నోటు జేబులోంచి తీసి బోసుబాబుకి ఇచ్చాడు.

    చేతిలో డామ్ (వంద రూపాయల నోటు) పడగానే బోసుబాబు "రాత్రికి భోజనానికి వస్తాను. అటునుంచి అటే ఎక్కడికో పోతాననుకోకమ్మా!" అని తల్లితో చెప్పి, డబ్బులు ఇచ్చిన తండ్రికి కనీసం "థాంక్స్" అని అయినా చెప్పకుండా, అటు నుంచీ అటే బయటకి వెళ్లిపోయాడు.

    బోసుబాబు వెళ్లిపోంగానే మళ్ళీ అందరి నోళ్ళకి పని కల్పించబడింది.

    "వంద రూపాయలకి, అయిదు జాకెట్లు వస్తాయి. ఫామిలీ మొత్తం కలిసివెడితే నాలుగు సినిమాలు చూడవచ్చు." అలవాటు ప్రకారం ఒకసారి మూతి తిప్పి అంది సామ్రాజ్యలక్ష్మి.

    "వస్తాయి అనుకుంటే ఏమైనా వస్తాయి వందరూపాయలకి అనవసరంగా మీరు అన్నయ్యని మాటలతో రెచ్చగొడుతున్నారు. వాడు అడగంగానే ముందే వంద రూపాయలూ ఇచ్చినట్లయితే అవసరమేమిటో చెప్పేవాడు కదా! డబ్బూ పోయే, విషయమూ తెలియకాపోయే." రాగం తీస్తూ అంది సుమిత్ర.

    అన్నగారు చేసే పనులు సుమిత్రకు విరోచితంగా వుంటాయి. సినిమా హీరోలూ, నవలా నాయకులు గుర్తుకు వస్తూంటారు ఆమెకి.

    "నిక్షేపంలాంటి సోఫా పాడు చెయ్యటానికి అయిన యిష్టపడతాడేమో కాని, వాడు నిజం మాత్రం చెప్పడు. కావాలంటే కాగితం మీద రాసిస్తాను. నామాట అబద్ధం అయితే కుడిచెవి కోసి యిస్తాను." లక్ష్మణమూర్తి ఆవేశంగా అన్నాడు.

    "ఏమిటో వాడిని చూస్తే ఒక్కోసారి జాలివేస్తుంది, మరోసారి భయం కలుగుతుంది." ఓ నిట్టూర్పు విడిచి నెమ్మదిగా గొణుగుతూన్నట్లుగా అంది కల్యాణమ్మ.

    "ఇది మన యింటి సమస్య. బోసు పరాయివాడు కాదు. మనవాడు వాడిని మనం అడిగి మాటలతో రెచ్చగొట్టే బదులు రోజూ మొత్తం మీదా వాడేం చేస్తున్నాడన్నది వాడికి అనుమానం రానివిధంగా మనం పరిశీలించి చూద్దాం. వాడు అసలు ఏం చేస్తున్నాడో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో తెలుస్తుంది, వాడి విషయంలో ఇంతకు మించి మంచిమార్గం మరొకటి కనపడలేదు." జగన్నాధం అంతక్రితం అరిచినా, ప్రస్తుతం ఈ మాటలు మాత్రం బాధతోనే అన్నాడు.

    "చాటుగా గమనించడం అంటే ఎలా అండి మావయ్యగారూ!" సామ్రాజ్యలక్ష్మి అడిగింది.

    "ఎలా అంటే నేను మాత్రం ఏం చెప్పగలను? అందరం ఇక్కడే వున్నాం కదా! ఆలోచించి చూద్దాం. ఎవరికి వచ్చిన ఆలోచన వారు చెప్పండి అలా చేద్దాం! అయితే వక్రంగాకాక, మంచిగా ఆలోచించండి!" జగన్నాధం అన్నాడు.

    కొద్దిసేపు అందరూ ఆలోచనలో పడిపోయారు.

    అయిదారు నిమిషాల తరువాత.

    ఎవరికి తోచిన ఆలోచన వాళ్ళు చెప్పారు.

    "మీరు చెప్పినవి ఏవీ నాకు అంతగా నచ్చలేదు. ప్రస్తుతానికి నేను చెప్పింది చెయ్యండి! బోసు యింట్లో వున్నప్పుడు ఆడవాళ్ళు ముగ్గురూ వాడి మీద ఒక కన్నేసి వుంచుతారు. వాడు బయటకి వెళ్ళినప్పుడు. వాడికి తెలియకుండా లక్ష్మణ్ ఒక్కడూ వాడి వెనుక వెళ్ళి చూసి వస్తూ ఉంటాడు. మా యిద్దరికీ ఉద్యోగాలు వున్నాయి కాబట్టి. నాకు వీలయినపుడు నేను. వాడికి వీలయినపుడు వాడూ వెళ్ళి వస్తూంటాము. ఏదో ఒకరోజు వాడి గురించీ నిజం తెలియకపోదు" జగన్నాధం అన్నాడు.

    ఈ సూచన యింట్లో అందరికీ నచ్చింది.

    సుమిత్రకి ఇలా చెయ్యటం తమాషాగా అనిపించి తను కూడా మనస్పూర్తిగా సహకరిస్తానంది.

    అక్కడితో అందరి మనస్సులూ తేలికబడ్డాయి.


                                         11


    "నేను అర్జంటుగా లోపలికి వెళ్ళాలి!"

    "మీరు అర్జంటుగా లోపలికి వెళ్ళాలంటే మీరు మీ కేసేమిటో చెప్పాలి." వాకిట్లో నిల్చున్న సెంట్రీ అన్నాడు.

    అసలు విషయం సెంట్రీకి మోడరన్ దుస్తులు వేసుకున్న ఆడవాళ్ళంటే వళ్ళు మంట. వయస్సులో కూడా కాస్త పెద్దవాడేమో చీర కట్టుకున్న వాళ్ళంతా ఆయన దృష్టిలో వీరవనితలు. మోడరన్ డ్రస్ లు వేసుకున్న అమ్మాయిలంతా అల్లరి చిల్లరి పిల్లలని గాఢనమ్మకం.

    స్కూటర్ దిగి చంకలో సంచీ వ్రేలాడదీసుకుని మిడ్డి, షర్ట్ ధరించి సరాసరి లోపలికి వస్తున్న బబితను చూడంగానే, ఆమె ఒక ప్రెస్ రిపోర్టర్ కమ్ జర్నలిస్ట్ అని అనుకోలేదు సెంట్రీ కాలేజీ స్టూడెంటు అనుకున్నాడు. అలా అనుకోవడం వల్లనే బబిత లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డు తగిలాడు.

    "నేను ఇన్ స్పెక్టర్ గారితో అర్జంటుగా మాట్లాడాలి. బబిత సీరియస్ గా అంది. 

 Previous Page Next Page