Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 13


    అవంతిని చూస్తూనే కుర్చీలో కూర్చుని సన్ డే తిరగవేస్తున్న అతను చటుక్కున లేచి నుంచున్నాడు.

    "ఫోర్.ఆర్.వన్.పి." అన్నాడు అతను నవ్వుతూ.

    "మిస్.త్రి.ఆర్." అంది అవంతి చిరునవ్వుతో.

    వాళ్ళ కోడ్ పూర్తి అయింది. ఇంక యిరువురూ చెరో కుర్చీలో కూర్చుని సంభాషణ మొదలు పెట్టారు.

    "మీరొచ్చి చాలాసేపు అయిందా?" అవంతి అడిగింది.

    "అరగంట" అతను చెప్పాడు.

    "కొంత దూరం నడిచి ఆ తర్వాత టాక్సీ ఎక్కాను అందుకే లేటు అయింది"

    "పని కావటం ముఖ్యం."

    "చాలా తేలిగ్గా పని పూర్తి అయింది."

    "ఇలా ప్రతీదీ తేలికగా చేస్తే ప్రమోషన్ ఖాయం. మీరు త్వరత్వరగా ఎదిగిపోతున్నారు." తను మెచ్చుకోలుగా అన్నాడు.

    "ఆడవాళ్ళు ఇట్టే ఎదిగిపోతారు. మూడు పదులు దాటితే ముసలితనంలో పడ్డట్టే" అవంతి నవ్వుతూ అంది.

    "తమాషాగా మాట్లాడుతున్నారు." అతను నవ్వాడు.

    "వన్ మినిట్" అంటూ అవంతి లేచి వెళ్ళింది.

    అతను మళ్ళీ సన్ డే చేతిలోకి తీసుకున్నాడు.

    రెండు నిమిషాల తర్వాత అవంతి పొగలు కక్కుతున్న రెండు కాఫీ కప్పులతో వచ్చింది. అతనికి ఒకటి యిచ్చి తనొకటి తీసుకుంది. ఇరువురు మౌనంగా కాఫీ తాగారు. ఆర్.పి.ఆర్.ఆర్.ఆర్. నుంచి అతను వచ్చాడంటే అది మామూలు విషయం అయి వుండదు. ఈ విషయం అవంతికి బాగా తెలుసు. ఫోనులో చర్చించే విషయం కానప్పుడే తనని అక్కడకు పిలవటం గాని తన కోసం నెంబర్ త్రి.పి.ఎ.గాని రావటం జరుగుతుంది.

    "ఊ.... ఇంక చెప్పండి" ఖాళీ అయిన కాఫీ కప్పు కిందపెడుతూ అవంతి అంది.

    "దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో వుంది" అతను నాందీగా అన్నాడు.

    "ప్రమాదం సరిహద్దులో పొంచి వున్నప్పుడే మనం చేయూత నివ్వాలి" అవంతి గంభీరంగా అంది.

    అతను తలపంకించాడు. కోటు జేబులో నుంచి కలం, మడతలు పెట్టబడ్డ నాలుగు కాగితాలు తీశాడు. కాగితం మీద చకచకా ఏదో రాసి అవంతికిచ్చాడు. అవ్మతి చదివింది. ఆ అక్షరాలు మరో నిమిషం తర్వాత మాయమై ఉత్త తెల్లకాగితం మిగులుతుంది. అక్షరాలు మాయమయ్యే ఇంకుతో రాయడం జరిగింది. నోటితో మాట్లాడకుండా విషయం తెలియ జేయడానికి ,సాక్ష్యాధారాలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడానికి వాళ్ళు ఇలాంటి ఇంకు చాలా సీక్రెట్ విషయాల్లో వాడుతుంటారు.

    అవంతి పూర్తిగా చదివిన తర్వాత అంది. "దీనిలో చాలా రిస్క్ వుంది." అతను తల పంకించాడు.

    "ఈ మధ్య రాత్రింబగళ్ళూ డ్యూటీలో తిరిగి తిరిగి బాగా అలసిపోయాను. ఇలాంటి కార్యాలకు మర్సీదా నా అంతటిది. ఈ పనికి ఆమెను ఉపయోగించకూడదా! మర్సీదా అన్ని కేసుల్లో విజయం సాధించింది. మీకు తెల్సినదే కదా!"

    "ఈ మాట మీరు అంటారని ఫోర్ ఆర్.వన్.పి. ముందే అన్నారు" అతను ఆ మాట అనగానే అవంతి వులిక్కిపడింది.

    "మర్సీదా ఇప్పుడు ఇక్కడలేదు. లండన్ వెళ్ళింది" అతనన్నాడు. అవంతి ఆలోచిస్తూ వుండిపోయింది.

    "ప్రమోషన్ ఈ కేసు సక్సెస్ మీద వుంది. ప్రమోషన్ అక్కర్లేదా?" అతను చిరునవ్వుతో అడిగాడు.

    "నా కర్తవ్యం నేను సరిగ్గా నిర్వహించినప్పుడు ప్రమోషన్ దేముంది అదే వస్తుంది. నా బాధ ప్రమోషన్ గురించి కాదు. కేసు చాలా జటిలమైందని. జటిలమైన కేసును చేపట్టి సాధించడంలోనే గొప్పదనం వుంది. ఈ కేసు తర్వాత పదిరోజులు రెస్ట్ తీసుకుంటాను. కేసు తీసుకుంటున్నాను." అవంతి గంభీరంగా అంది.

    "గుడ్, చాకులాంటి పిల్లలెప్పుడూ మంచి నిర్ణయమే తీసుకుంటారు" అని అవంతిని అభినందించాడు అతను. అవంతి పెదవులపై చిరుమందహాసం నర్తించింది.

    "రెడీ!"

    "య్యా"

    అతను ఇందాకటి తెల్లకాగితాలు అదే పెన్ను తీసుకున్నాడు. అవంతి అతని ముందుకి చిన్న బల్లను జరిపింది. వత్తుకి వెడల్పాటి పుస్తకాన్ని వుంచింది. అతను కాగితం పరిచి దానిమీద కొన్ని బొమ్మలు వేసి రాశాడు. ఆ తర్వాత ప్లాన్ గీశాడు. అవి కొద్దిసేపు వుండి మాయం కావడం మొదలు పెట్టాయి. అతను అలా రాయడమే ఆలస్యంగా అవంతి బుర్రలో ప్రింట్ లాపడిపోయాయి. తనకి అనుమానం వున్నచోట అవంతి అడిగింది. అడగడం అంటే నోటితో కాదు. అదే కాగితం మీద రాసి తన అనుమానాలు తెలియజేసింది. దాదాపు ఇరవై నిమిషాలు వాళ్ళిద్దరూ మౌనంగా కాగితం మీద రాస్తూ వివరం విషయం అతను తెలియజేయడం అవంతి గ్రహించుకోవడం జరిగింది. టాప్ సీక్రెట్ విషయాల్లో సాక్ష్యాధారాలు లేకుండా వుండడానికి, మాటలు రికార్డు కాకుండా వుండడానికి ఈ పద్ధతి ఎన్నుకుంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యా జరిగింది అదే. వచ్చిన పని పూర్తయింది. అతను కాగితాలు మడిచి కోటుజేబులో పెట్టుకున్నాడు. పెన్ను కూడా తీసుకొని లేచాడు. అవంతి చేసిన చిన్న పనిని ఆ నిమిషాన అతను గుర్తించలేదు. అతనిలో వాకిలిదాకా వెళ్ళి అవంతి సాగనంపి వచ్చింది. ఆ తర్వాత అవంతి లోపలికి వచ్చి విశ్రాంతిగా బెడ్ మీద వాలింది. సన్న సన్నగా మొదలైన తలనొప్పి ఎక్కువ అయ్యే సూచనలు కానరావడంలో అమృతాంజనం రాసుకుంటూ కళ్ళుమూసుకుంది.

    కళ్ళముందు....   

 Previous Page Next Page