"అంటే నువ్విక్కడ చాలా బాధపడిపోతున్నావనేగా?"నిలదీశాడు
"నేనలా అనలేదే."
"మరి అంతా వూహించిందా అంటే ఏమో తెలీదు అని ఎలా అన్నావు?"తన తర్కశాస్త్ర పరిజ్ఞానాన్ని ప్రదర్శించాడు. "ఊహించటానికి ఏముంది అని ఎందుకు అనలేకపోయావు?"
ఆమెకి కళ్లనీళ్ళ పర్యంతమైపోతూంది.
తల్లీ కొడుకులిద్దరూ కలిసి పనిగట్టుకుని ఒక కారణాన్ని వెదుక్కుంటూ తనను సాధిస్తున్నారు. తమపరంగా ఏమైనా పొరపాటు జరిగిందా అని ఆలోచించడంలేదు ఇద్దరూ. అదికాదు - ఇంటికొచ్చిన ధీరకి అర్దమయ్యేట్టు తల్లి ఏదో రాద్దాంతం చేసివుంటుందన్న వూహకన్నా అక్కడికి హద్దులు దాటిపోతున్న భార్యని కట్టడిచేయడం ఒక గొప్ప బాధ్యతలూ ఆలోచించి ఆవేశపడుతున్నాడు. "అసలు నీ స్టేటస్సేమిటే.... నీ గురించి నువ్వేమనుకుంటున్నావే?"
అతడి ప్రశ్నలో పాయింటు లేదు - అహం తప్ప. తను చాలా అర్హుడైన భర్తనన్న పొగరు తప్ప విచక్షణతో విషయాన్ని విశ్లేషించాలన్న ధ్యాసలేదు.
"మాట్లాడవేం?"
కోపం, క్రోధం కుదిపేస్తూంటే ఏం మాట్లాడాలో తెలీని ఆర్తి ఆవేశంగా బెడ్ రూంలోకి ఓ చీపురుపుల్లలా తీసిపారేసి ఎలా వెళ్లిందో చూశావుగా."
పది సెకెండ్ల వ్యవధిలో బెడ్ రూంలోకి వచ్చిన భాస్వంత్ "ఎంత పొగరు నీకు? నేను మాట్లాడుతుంటే జవాబు చెప్పకుండా పడగ్గదిలోకొస్తావా?" అన్నాడు పిడికిలి బిగించి.
అతని కళ్లలోని ఎరుపుని చూస్తూ వెక్కిపడుతూ అంది"జవాబు చెప్పాలీ అంటే ఏం చెప్పాలో నాకు తెలియాలిగా"
"తెలీకపోయినా నా ముందు నిలబడాలి."
"నిలబడాలీ అంటే ధైర్యం కావాలి."
"మాటకి మాట జవాబు చెప్పగలుగుతున్న నీకు ధైర్యం లేదా?"
"ఎలా చావనండీ... " దుఃఖంతో తలపట్టుకుంది. "జవాబు చెప్పకపోతే పొగరూ అంటారు. చెబితే నీకెంత ధైర్యమూ అంటూ సాధిస్తారు నేనేం చేయాలి?"
"నోర్మూసుకుని పడుండాలి" అసలుసిసలైన మగాడిలా అన్నాడు. అతడన్న దాంట్లో అర్దంలేకపోయినా, ఆమె బాధకి అది జవాబుకాకపోయినా ఆ తర్వాత తను ఎంత గొప్ప భర్తో గుర్తుకొచ్చినట్టు "అసలు నీకు నేనేం తక్కువ చేశాను.. డబ్బు, సంఘంలో స్టేటస్...." అంటూ చిన్న లిస్టు చదివాడు.
ఇక నిగ్రహించుకోలేకపోయింది. "సుఖమూ అంటే అర్దం డబ్బు ఒక్కటే కాదు... సంతోషాన్నిచ్చేది భర్త స్టేటస్సు ఒక్కటేకాదు.. .ఇంకా చాలా వుంటాయి. ..." భాస్వంత్ లో ఎప్పుడో బోధపడింది. కనీసం మీలో సగభాగమని కూడా గుర్తించరని కూడా అర్దమైంది. కానీ పెళ్లి పేరిట నా అనుకున్న వాళ్లనందర్నీ విడిచిపెట్టి మీ పంచన చేరిన దాన్నే. ... కొద్దిపాటిజాలితోనైనా...."
"ఆర్తీ!" అరిచాడు ఉక్రోషంగా. "నేనేం చేయాలో చెబితే నేను సహించను. అది నీకు తెలుసు."
"తెలుసు! కానీ నేను చెప్పింది మీరేం తక్కువ చేశారో చెప్పమని మీరు అడిగాకనే.'
"బుద్దుండాలి."
"ఉందండీ! ఉండబట్టే నేను ఈ ఇంట పనిమనిషినని గుర్తుచేసుకుంటూ ఇంటి పనులు చేస్తున్నాను, వంట చేస్తున్నాను, అంట్లు తోముతున్నాను, మీరు అడగ్గానే చీర విప్పి మీ పక్కన పడుకుంటున్నాను."
" అది నీ డ్యూటీ! కాదూ అనుకుంటే పుట్టింటికి పో."
అవాక్కయిందామె. తనకున్న అధికారంలోని ఆఖరి అస్త్రాన్ని సంధించాడు. కాపురానికి వచ్చాక యిలా చాలాసార్లు అన్నాడు. కానీ ఈ రోజు కాస్త ఖచ్చితంగా చెప్పాడు అంతే తేడా.
"నేను ముందునుంచీ చూస్తున్నారా!"
తగుదునమ్మా అంటూ పిలవని పేరంటంలా సరస్వతమ్మ సీనులోకి వచ్చింది.
"పెళ్లయిన దగ్గర్నుంచీ గమనిస్తున్నాను. ఆ పుస్తకాలు చదవడమూ, జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టు కిటికీ దగ్గర నిలబడి బేలచూపులు చూడటమూ.. నాకు అనుమానంగానే వుంది."
"అత్తయ్యా!" ఆమె కళ్లల్లో నీళ్లు సుడులుతిరిగాయి.
"ఏంటమ్మా ఆ దురుసు! నేనేం తప్పనలేదే. మంచి కుటుంబంలోని మగాడు మొగుడయ్యాక, నీకు ఏ లోటూ లేకుండా చూసే భర్త నీకు దక్కాక నువ్వింకా బ్రతికున్న శవంలాగ అలాబిత్తర చూపులు చూస్తున్నావు అంటే నువ్వేమిటో ,నీ గతం ఏమిటో నేను వూహించలేనంటావా?"
భయం, బాధ ఆర్తిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే "నేను మీరనుకుంటున్నట్టు పెళ్లికి ముందు గ్రంథసాంగురాలిని కాను! నేనూ ఓ మంచి కుటుంబంలో పుట్టిన ఆడపిల్లనే" అంది.
"అలా అని నిరూపించుకోవాలి కోడలు పిల్లా!అయినా మంచి కుటుంబమని తెగ విర్రవీగిపోతున్నావు, ఏమిటమ్మా నీ కుటుంబం మంచి? పదెకరాల పొలం, చదువు పేరిట పొరుగూరులో పైలాపచ్చీసుగా తిరగడము....."
"మీరు హద్దులు దాటి మాట్లాడుతున్నారు."
"నా హద్దులు గురించి హెచ్చరిస్తే నీ జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చేస్తాను ఏమనుకుంటున్నావో... చదువు వుందని మిడిసిపడుతున్నావటే! అసలు నేనెవర్ననుకుంటున్నావు. డిప్యూటీ కలెక్టర్ పెళ్లాన్ని, నీలాంటి దాన్ని ఎదుర్కోలేననుకుంటున్నావా?"
ఆర్తి కోపంగా బయటకి నడిచింది. ఇలాంటి గొడవలు చాలాసార్లు అయినా ఈరోజు కాస్త శృతిమించింది అదికాదు... భార్యా - భర్తల మధ్య దూరాన్ని పెంచటానికి అత్తయ్య ప్రయత్నిస్తుంటే తనను కాపాడాల్సిన భర్తే మౌనంగా వినోదం చూస్తున్నాడు. అతడి మౌనం ఆర్తికన్నా సరస్వతమ్మనే ఎక్కువ బాధపెట్టింది.