"నన్నంటే - అదే ఆ పిల్ల బంధువుల్ని ! ప్రేమలేఖంటే పిల్ల మామనీ, తండ్రిని తెగడటమా ? నాన్సెన్స్ ! ఏం బావుండలేదు. తండ్రి అంటే ఏమాత్రం గౌరవం వున్న అమ్మాయి అయినా ఇలాంటి లేఖ చదివి ప్రేమించదు."
"రాధకు ఘంటసాల పాటలంటే ఎంతో ఇష్టమని తెలిసింది ! అంచేత నేను రేపు కాలేజీలో జరగబోయే లలిత సంగీత పోటీల్లో ఘంటసాలలా పాడి నా రాధ హృదయం దోచుకుంటాను."
"అంటే... నీకు పాడటం వచ్చా ?"
అమితాబ్ ఇదే అదనని రామలింగం భుజం విరిగేలా చరిచాడు.
"అక్కడే ఉంది సార్ మనాది మేధసౌందర్యం ! కర్టెన్ వెనుక గ్రామ్ ఫోన్ పెట్టి ఘంటసాల రికార్డ్ వేసి మనాడు పాడుతున్నట్లు యాక్షన్ చేస్తాడన్నమాట !"
రామలింగం ఆనందపడిపోయాడు.
'అమ్మ రాస్కెల్ ! దొరికావురా ! ఆట ఈ నాటితో కట్టించేస్తాను చూడు' అనుకుని పైకిమాత్రం "అద్భుతమయిన తెలివిరా బాబూ నీది !" అన్నాడు అభినందిస్తూ.
* * *
"ఒరేయ్ కృష్ణా! ఇన్నాళ్ళ తరువాత, జరిగిందంతా తల్చుకుంటుంటే నాకే ఆశ్చర్యంగా వుందిరా. అన్నిటిమీదా ఆశ వదిలేసుకుని, జీవచ్చవంలా జీవితం గడుపుతున్న నాకు, జైలు నుంచి బయటపడగానే నువ్వు ఎదురుతావటం ఏమిటి ? కాలంలో కలిసిపోయారనుకున్న ఇద్దరు కొడుకుల్లో ఒకరు ఇలా ఎదురుపడతారనీ, నా శేషజీవితంలో నాకు తోడుంటారనీ కలలో కూడా వూహించలేదురా నేను."
కృష్ణ నవ్వేడు. "దేవుడికి మనిషి పట్ల కాస్త సానుభూతి వుందమ్మా ! అందుకే పూర్తిగా కష్టాల్నే వ్రాయడు. కాస్త సుఖాన్ని, అదృష్టాన్నీ కూడా రుచి చూపిస్తూ వుంటాడు. లేకపోతే ఆ జైలు సెంట్రీ నాకు పరిచయస్థుడవటమేమిటి ? మాటల సందర్భంలో నీ టాపిక్కే రావటం ఏమిటి ? అతడేగానీ నీ వివరాలు చెప్పకపోయివుంటే, అసలింకెప్పుడూ మనం కలుసుకోకపోయి వుండేవాళ్ళం-"
"కానీ నాకు ఒకటే అర్ధం కావటం లేదురా. నా గురించి తెలిసిన వెంటనే నువ్వు ఎందుకు జైలుకు రాలేదు ?"
"కేవలం నాల్రోజులముందే నాకీ విషయం తెలిసిందమ్మా ! నేను నిన్ను జైల్లో కలుసుకుని వుంటే, కనీసం అలా కలుసుకున్నట్టు 'వాళ్ళకి' తెలిసివుంటే అక్కడే నీ ప్రాణాలకి ప్రమాదం సంభవించివుండేది. అందుకే వాళ్ళు కూడా వూహించని రీతిలో నేను తెరవెనుక నుంచి బయటకొచ్చాను. నేను వూహించినదే కానీ నిజమైవుంటే, ఈ ఆకస్మిక సంఘటనకి వాళ్ళు బుర్రలు బద్దలు కొట్టుకుంటూ వుండివుంటారు."
"ఇంకా వాళ్ళకి నామీద ఇంత పగ వుందంటావురా కృష్ణా ?"
"నువ్వు బ్రతికి వుంటే వాళ్ళకి ఎప్పుడైనా నష్టమేనే అమ్మా. ఆ విషయం మాత్రం నాకు బాగా తెలుసు. అందుకే నిన్ను తీసుకొచ్చి ఈ నాలుగ్గోడల మధ్యా వుంచటం. అమ్మా ! నన్ను క్షమించు. ఇన్ని సంవత్సరాలు జైల్లో వున్నావు. ఇంకొద్ది కాలం ఓపిక పడితే చాలు, ఈ మబ్బులు తొలగిపోతాయి."
శారదమ్మ నవ్వింది. "అంత కాలం జైల్లో వున్నదాన్ని - నాకు అలవాటు అయిపోయిందిరా. ఇప్పుడు నా కొడుకు దగ్గిరవుండటం కంటే ఆనందం ఏముంది ?"
"ఆ మాటన్నావ్ అంతేచాలు. ఆ నర్సింహగాడిని ఇక ఒక ఆట ఆడిస్తాను చూడు. ఈ ఆట ప్రారంభం కావాలీ అంటే వాడి కూతురికి పెళ్ళి కావాలి ?"
కాలేజీ ఆడిటోరియం అంతా క్రిక్కిరిసిపోయి ఉంది. పాటల పోటీలో పాల్గొనే వాళ్ళు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. దాంతో ఎవరు స్టేజిమీద కొచ్చినా విజిల్స్, తప్పట్లతో దింపి పారేస్తున్నారు స్టూడెంట్స్ !
"ఇప్పుడు మురళి - ఫైనల్ బియెస్సీ" అంటూ ఎనౌన్స్ మెంట్ వినబడగానే మురళీ గాంగ్ అంతా తప్పట్లు కొట్టేరు.
మురళి స్టేజిమీద కొచ్చాడు.
ముందు వరుసలో నుంచి లేచి రామలింగం హడావుడిగా స్టేజి వెనుక వేపుకు బయలుదేరాడు.