Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 12


    రామలింగం వెళ్ళినవైపే ఆశ్చర్యంగా చూస్తూ, "ఇదేమిటి గురూ ! మనవాడికున్నట్టుండి ఇంత మంచి బుద్ధి వచ్చింది ?" అన్నాడు కనకారావు.

    మురళి మాట్లాడలేదు. రాధకున్న అపార్ధం పోగొట్టి ఎలా మంచిచేసుకోవటమా అన్న ఆలోచనలో వున్నాడు.


                         *    *    *


    "బుద్ధుండాలి."

    __అన్న మాటలకు లక్ష్మీ కాంతం తలెత్తి చూసింది. రామలింగం ఎదురు కుర్చీలో కూర్చున్నాడు. అతడి మొహంలో విజయగర్వం తొణికిసలాడుతూంది.

    "మిస్టర్ రామలింగం ! నేనే మిమ్మల్ని కలుసుకుందామనుకుంటున్నాను. ఇంతలో మీరే వస్తున్నాను అని కబురంపించారు.

    "ఎందుకో కల్సుకోవాలనుకోవటం ?" ఓరగా చూస్తూ అడిగాడు.

    "ఒక మాట చెప్పడానికి."

    "ఏ మాట ?"

    "బుద్ధుండాలి."

    "వ్వాట్ ?"

    "బుద్దుండాలి. ఆ మాట చెప్పడానికే."

    రామలింగం గతుక్కుమని, అంతలోనే సర్దుకుని, "మీ అమ్మాయిలు ఎంత పెట్రేగిపోతున్నారో తెలియజెప్పడానికే వచ్చాను. మీ హాస్టల్లో ఒకమ్మాయి బరితెగించి బోయ్ ఫ్రెండ్స్ కు నడివీధుల్లో డ్రింక్ లు ఇప్పిస్తున్నదట. మీ అమ్మాయిలు భారత సంస్కృతి, మర్యాద మరిచిపోయి అసభ్యంగా వస్త్రధారణ చేసుకొని తిరగటంతో అబ్బాయిలకు మతి పోతూందని నాకు కంప్లెయింటు చేశారు. అలా పోవటంలో తప్పులేదు ! ఒక కుర్రవాడైతే మతి భ్రమించి నడివీధిలో ముద్దు పెట్టేసుకున్నాడట కూడా ! దీనికంతా కారణం ఎవరు ? అమ్మాయిలు కూడా మిసెస్ లక్ష్మీకాంతం! దీనికి కారణం మీరు. లేడీస్ హాస్టల్ వార్డెన్ అంటే ఎవరు ? తల్లిలాంటిది. ఉదాహరణకి నన్నే ... నన్నే తీసుకోండి. నేను మా పిల్లకాయల్నందర్నీ తండ్రిలా చూసుకుంటాను ! తల్లీతండ్రుల సంస్కారాన్ని బట్టే పిల్లలు పెరుగుతారనడానికి మీ హాస్టలే ఒక ఉదాహరణ. ఇప్పటినుంచన్నా మీ పిల్లల్ని ఒక కంట కనిపెట్టి వుండండి. కాలేజీకే వెళుతున్నరో - ఆ పేరు చెప్పి కూల్ డ్రింకు లిప్పిస్తున్నారో ..." 

    లక్ష్మీకాంతం ముక్కుపుటాలు ఎర్రబడ్డాయి. "మిస్టర్ !" అంది.

    రామలింగం వినిపించుకోలేదు. ఎన్నాళ్ళకో దొరికింది ఛాన్సు అన్నట్టు పెట్రేగిపోయాడు. "అసలు సంస్కారం అనేది మన రక్తంలో వుండాలి మొదట. అప్పుడు మన పిల్లలకు వస్తుంది. మనమీద ఎంతో పవిత్రమైన బాధ్యత పెట్టింది కాలేజి మానేజిమెంటు. పిల్లల్ని ఒక కంట కనిపెట్టి వుండాలి, స్వంత తల్లి, తండ్రికన్నా ఎక్కువగా వాళ్ళ నడవడిక పరిశీలిస్తూ వుండాలి."

    "మిస్టర్ రామలింగం !" లక్ష్మీకాంతం కుర్చీలోంచి చివాలున నిలబడుతూ అంది- "మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావటం లేదు. ఫర్ యువర్ ఇన్ ఫర్ మేషన్ మీరు చెప్పిన ఆ కూల్ డ్రింకులమ్మాయి, నడివీధిలో రౌడీ ముద్దుపెట్టుకున్న అమ్మాయీ ఒకరే" అంది.

    "నాకు తెలుసు ! ఒకరయితేనేం ? కుండెడు పాలలో ఒక చుక్క విషం చాలు. నిండు చంద్రుడిలో ఒక చిన్న మచ్చ చాలు."

    "ఆ అమ్మాయి మా హాస్టలమ్మాయి కాదు."

    రామలింగానికి బ్రేకు పడ్డట్లు అయింది.

    "అవును. ఆ అమ్మాయి 'అనురాధ' అని గుడివీధిలో వుంటుంది"

    రామలింగం జుట్టులోంచి చెమట కారటం మొదలు పెట్టింది. "గుడివీధా?" అన్నాడు.

    "అవును. అక్కణ్నుంచి కాలేజీ కొస్తుంటేనే ఆ మురళి అనే కుర్రాడు ముద్దు పెట్టుకున్నాట్ట."

    "చచ్చాన్రో దేముడో" అని అరిచాడు రామలింగం. నెత్తిన చేతులు పెట్టుకుంటూ. "ఆ అనూరాధ నా మేనకోడలే-"

   
                          *    *    *


    ఆ మరుసటి రోజు, అంటే సరీగ్గా ఇరవై నాలుగ్గంటల తరువాత మురళీ తన గాంగ్ తో హడావుడిగా రామలింగం రూమ్ లోకి జొరబడ్డాడు.

    "నమస్కారం గురూగారూ ! మీరు చెప్పినట్టు రాధకు అద్భుతమయిన ప్రేమలేఖ రాసేశాను. రాత్రంతా కూర్చుని ! చూడండి !" అంటూ ప్రేమలేఖ రామలింగం ముందుంచాడు.

    రామలింగం అతికష్టంమీద తన మొహంలో ఫీలింగ్స్ ని పైకి కనబడకుండా దాచుకున్నాడు.

    "చదవండి గురూజీ !  అలా చూస్తారేమిటి ? ఆ రోజుల్లో మీరూ ఇలాంటి ప్రేమలేఖలు దంచేశానన్నారుగా."

    ఇక తప్పదన్నట్టు రామలింగం చదవటం పారంభించాడు.

    "నా హృదయ కుసుమ రసస్వాదిత శ్వేత సుసుర గంగభీ ?" అని చదివి మనసులోనే కారాలు నూరుతూ.

    "ఏమిటిది ? ఇలాంటి పదాలు నేనింతకు ముందెక్కడా చూళ్ళేదూ, చదవలేదే ?" అన్నాడు గంభీరంగా.

    "అదేసార్ మన గొప్పతనం ! అందుకే ఓ రాత్రంతా పట్టింది ఇది రాయటానికి." గొప్పగా అన్నాడు మురళీ. తిరిగి ఉత్తరం మీదకు దృష్టి సారించాడు రామలింగం.

    "...రాధా ! ఆ రోజు నువ్వు నా చేతికి అయిదురూపాయలిచ్చి నీ చేతి వ్రేళ్ళ కొనలు నా చేతిని తాకి నా శరీరంలో వేయి వోల్టులద్యుత్ ప్రవహించి గుండెకు చేరుకొని ప్రేమ అరలో నిండిపోయింది. ఆ తరువాత నే చేయి నా చెంపను తాకినపుడు ఆ ప్రేమ ప్రవాహం యావత్తూ ఘనీభవించింది. రాధా మన ప్రేమకు - మన పవిత్ర ప్రేమకు ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుపడలేదు. ఆఖరికి మీ మామైనా, నాన్న అయినా సరే, మన ప్రేమను కాదంటే - ఆ చండాల పాషాణుడిని, ఆ దగుల్భాజీ అవతారాన్ని నడిరోడ్డుమీద చెరిగిపారేసి, రూపు మార్చేసి-" రామలింగానికి కోపం ఆగలేదు. ఉత్తరం ముక్కలు ముక్కలుగా చింపివేస్తూ. 

 Previous Page Next Page