Previous Page Next Page 
సరస్వతీ మహల్ పేజి 13

                                    కప్పుర ఖోగి వంటకం కమ్మని
                                                             గోధుమ వంట

    ఆనాడే కాదు - ఈనాడే కాదు - రేపే - రేపే కాదు ఏనాడైనా మనిషి కోరేవి మూడే మూడు! కూడు - గుడ్డ - గూడు. వాటిల్లో ముందు కోరేది కూడు! తిండి కలిగితే కండ కలదోయ్ కండ గలిగిన వాడే మనిషోయ్ అన్నట్లు అన్నిటికి మించి అన్ని సుఖాలకు మించి కోరేది భోజన సుఖం. అదుంటేనే ఆపైవన్నీ.

    ఒకరోజు ఓరుగల్లు నగరంలో ఇద్దరు మిత్రులు తిరుగుతూ ఎదురుగా వస్తున్న పరదేశిని చూశారు. అతడు బాగా భోజనంచేసి వస్తున్నాడు. ఈ మిత్రులు పూట కూటి వంటకం గూర్చి అడిగారు. దానికి విహారములకో - ఆహారమునకో - విహారమునకో - బేహారము అని అడిగి ఆహారమునకు అంటే వినండి.

   
    కప్పుర భోగి వంటకము కమ్మని గోధుమ పిండి వంటయున్
    గుప్పెడు పంచదారయును కొత్తగా కాచిన యాలనే పెసర్
    పప్పును కొమ్ము నల్లటి పండ్లును నాలుగునైదు నంజులున్
    లప్పల తోడ క్రొంబెరుగు లక్ష్మణ వజ్ఘల యింట రూకకున్

    అయ్యా - మీరు పూట భోజనానికి ఒక రూక ఇస్తే ఆ లక్షణ వఝుల వారింట మంచి పసందైన భోజనము దొరుకుతుంది. ఎలాగంటారా? కప్పుర భోగి బియ్యంతో అన్నం వండుతారు. చేయి చురుక్కనేలా అప్పుడే కాచిన ఆవు నేయి వడ్డిస్తారు. కమ్మని వేడి వేడి పెసరపప్పుకి ఆ నెయ్యి జోడైతే నసాలం అంటుతుంది. నాలుగైదు పచ్చళ్ళు ఊరగాయలు ఉంటాయి. పైగా గోధుమ పిండి వంటలుంటాయి. అరటిపళ్ళు - పంచదార అంతేనా గడ్డ పెరుగు గుమ్మరిస్తారు. జిహ్వా తర్పణంగా వుంటుందనుకో -

    బహుశా కవిగారు అలాంటి భోజనం ఆరగించాక దాన్ని గుర్తు చేసుకొని ఆ రుచిని నెమరు వేసుకొని చెప్పి ఉంటారు. ఈ పద్యాన్ని, నిజానికి సాహిత్యంలో ఎక్కువగా భోజనానికి సంబంధించిన వర్ణనలే ఎక్కువగా ఉంటాయి. ఎవరో కవి "భోజనం దేహీ రాజేంద్ర ఘ్రత సూప సమన్వితం మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దధి" అని భోజుడ్ని అడిగాడట! మళ్ళూ మాన్యాలు కాదు హారాలు అగ్రహారాలు కాదు అడిగింది! భోజనం!!

    శ్రీనాధుడిలా భోజన ప్రియుడు ఎవరూ ఉండరేమో, అందుకే ఆయన కవిత్వంలో, గ్రంధాల్లో, చాటువుల్లో భోజన వర్ణనలు చాలా చోట్ల చోటు చేసుకొన్నాయి.

    ఆయన విద్యానగరం వెళ్ళి ఓ మామూలు కవిగా రాజుగారి దర్శనం కొరకు పడిన పాట్లు ఒక ఎత్తు - అక్కడ భోజనం రుచించక పడ్డ పాట్లు ఒక ఎత్తు అందుకే.
   
    కుల్లా యుంచితి కోక సుట్టతి మహా కూర్పాసమున్ తొడ్గితిన్
    వెల్లుల్లిన్ తిల షిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా

    చల్లా అంబలి త్రావితిన్ రుచుల్ దోసం బంచు పోనాడి తిక తల్లీ.... అని వాపోయాడు....
    నిజమే మరి రాజులు పంపే దిన వెచ్చాలతో హేమపాత్రల్లో సుష్టుగా సరస సల్లాపాలతో విందారగించిన కవీంద్రుడికి విశ్వస్త వడ్డిస్తే అంబలి మజ్జిగ తాగి వెల్లుల్లి తినడం కష్టమే. అక్కడే కాదు. పలనాటి సీమలో ఆయనకి ఎటుచూసినా ఎటుపోయిన జొన్న కలి జొన్న అంబలి జొన్నన్నము జొన్న పిసరు, జొన్నలు తప్ప మరేమీ కన్పించలేదు అందుకే ఆ తిండి తినలేక శివుడిని సవాలు చేశాడు.
   
    పూర్వమందు విషము పుచ్చుకున్నానని గర్వపడెదవేల గరళకంఠ!
    కొండవీటి సీమపండు జొన్నల కూడు తిన్న నీదు బయసి
                           తేట పడును!

    బహుశా కొండవీటి జొన్నన్నం పండు మిరపపచ్చడి నోరు చురుక్కుమన్పించి ఉంటాయి. అంతేకాదు ఆ భోజనం చూసి జిహ్వ చచ్చి ఉంటుంది. దాంతో
   
    కఠినంపు జొన్నల కటుకు కుడ్ములు సూచి వక్త్రమా భయపడవద్దు    సుమ్ము         
    నా నారుచుల్ కోరు నాలుక నీవేమి సందేహ పడవద్దు చప్పరించు
    ఎన్నడు కడి చేయ నెరుగ నెట్లో యని కుడిహస్తమా నీవు జడియబోకు

    కమ్మని బాసనల్ గ్రక్కున లేన్చెడు గర్భమా కుట కుట కాకయండు అని నచ్చ చెప్పుకున్నాడు, అయితే ఈ భోజన సుఖాన్ని గూడ గుర్తు పెట్టుకున్నాడు కాబోలు.


    నడినూక లేని అన్నము
    వడబోసిన నెయ్యి బుడమ వరుగున్ పెరుగున్
    గడిమీద నీయ బెట్టిన
    నడ గూడెపు నంబి పడుచు నడిగితి అనుమీ
    అచి కుశలం అడిగాడు. ఇలా కబురు పంపడం ఆయనకి అలవాటే.

    గుడిమీద కోతి తోడను
    గుడి లోపలి నంబివారి కోడలితోన్
    నడివీధి వేశ్య తోడను
    నడి గొప్పుల పైరగాలి నడిగితి ననుమీ
    అలనాడు ఆనందం పంచిన వారిని మరువక పలకరించడం
                             విట ధర్మం కాబోలు
    తిరిగి తిండి విషయానికి వస్తే తాగిన చల్లను గుర్తు తెచ్చుకోవడం గొప్పే

    గొప్పయిన నిమ్మ పండ్లను
    కప్పురమును సొంఠి పొడియు కరివేపాకున్
    ఉప్పును యేలకు ఇంగువు
    ఒప్పుగ నీ చల్ల రుచికి నొన గూర్పదగున్

    ఇలా విశేషంగా వర్ణించడం ఒక కళే గదా! హాయిగా భోజనం చేసినవారికి ససిలేని భోజనం పెడితే చుర్రు మనదూ? అందుకే ఆ దేవుడ్నే మళ్ళీ సవాల్ అన్నాడు శ్రీనాధుడు.

    పుల్ల సరోజ నేత్ర అలపూతన చన్నుల చేదు తావినా
    నల్లదవాగ్ని మింగితి నటంచును నిక్కెదవేల తింత్రిణీ
    పల్లవ యుక్తమో ఉడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
    మెల్లన ఒక్క ముద్ద దిగ మింగుము నీ పస కాననయ్యెడిన్

    ఇలా తిండి మీద దండిగా కవిత చెప్పిన కవులు అరుదే - శ్రీనాధుడే అందుకు శ్రీకారనాధుడు.

                                                   ----*----

 Previous Page Next Page