Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 13

    "మరి ఆత్మానందుల పరిచయం....."

    "నేను మా తాతగారి అస్తికలు తీసుకుని వారణాసిలో గంగలో నిమజ్జనం చేయడానికి వెళ్లాను. అక్కడ పరిచయమయ్యారు ఆత్మానందులు. చూడగానే, ఎందుకో ఆయన గొప్ప  మహిమాన్వితులనిపించింది. ఆయన వెంట రెండు సంవత్సరాలు తిరిగాను. అప్పటికే నేను ఒక మంచి గురువుకోసం అన్వేషిస్తున్నాను. నాకాయన సరయిన వ్యక్తిగా అనిపించారు.

     ఆయన జ్ఞాని. విజ్ఞాని ఖని. కుండలినీ శక్తిని జాగృతపరచీ, అష్టసిద్దులను పొందినవారు. ఆయన యోగశక్తి అనన్య సామాన్యం. ఆయన కృపకు పాత్రుడివి కావడం నా అదృష్టమనిపించింది.

    ఆత్మోన్నతి కోసం తామెంత శ్రమించినాసరే, పరోపకారం కూడా మనసులో పెట్టుకోవాలనుకుంటారు ఆయన. అందుకే ఆత్మోన్నతి కోసం తారకం ఉపదేశించినా  ప్రజలకు ఉపయోగపడే పాముమంత్రం, తేలు మంత్రంకూడా ఉపదేశించారు ఆయన.

    గాలి, ధూళి సోకినా పారద్రోలే మంత్రాలు కూడా చెప్పారు. పాముకాటు వలన విషం ప్రాకి కొనప్రాణంతో వున్నాసరే గురుదేవుల కృపవల్ల బ్రతికించగలను."

    "ఆ సంగతి రాందత్ చెప్పాడు. మొన్న పాముకాటువల్ల చనిపోయాడనుకున్న వ్యక్తిని మీరు బ్రతికించారట! చనిపోయిన వాళ్లని  బ్రతికించేంత అధ్బుతాన్ని మీరు ఎలా సాధించారు చారీజీ?"

    "చనిపోయిన వాళ్లని  బ్రతికించేంత దమ్ము మన గురుదేవులంతటి వాళ్లకే వుంటుంది. నేను సామాన్యుడిని. మొన్న పాముకాటు తిన్న వ్యక్తి చనిపోలేదు. ఊపిరి స్థంబించిపోయింది. విషప్రభావంవల్ల. చాలా బలహీనంగా నాడి కొట్టుకుంటోంది. ఆరిపోయే దీపానికి చేతులడ్డు పెట్టానంతే.  చమురు వుంది.  బ్రతికాడు. దీపమే  ఆరిపోతే వెలిగించేంత శక్తిని పొందలేదింకా గురుదేవుల కృపవుంటే  ముందు ముందు అది సాధిస్తానేమో!"

    "చైత్ర పూర్ణిమకు సలేశ్వరం నేనూ వస్తాను. కానీ నల్లమల అందాలు నాకు కొత్తకాదు. సూర్యోపాసన చేస్తున్న నాగుపాముని కుడా చూసాను.

     భైరవుని కొండలోని నిధి గురించి విని వెళ్లొచ్చాం. నేనూ, మునిరాజూ, అంబాజీ, పీర్ సాహెబ్" అంటూ అప్పటి అనుభవాలు చెప్పాడు సూర్య.

     "మూలికల కోసం  చెంచులను తీసుకుని అడవిలోకి వెళ్లినప్పుడు నేను చూసాను భైరవుని కొండకు. అంతకుముందే భైరవుని కొండకు సంబంధించిన తాళపత్రం ఒకటి చూసాను మా ఇంట్లో."

    మా ముత్తాతగారు పురాతన మయిన శాసనాలు, శిలాఫలకాలు చదవటంలో మంచిదిట్ట. ఆయన దేశసంచారం చేసి చాలా భాషలు, లిపులు నేర్చుకున్నారు. మనకిప్పుడు షార్ట్ హాండ్ లాగా కొండగుర్తులు కూడా వుంటాయట కొన్ని శాసనాల్లో. ఒకసారి మా ముత్తాతగారు ఆ భైరవుని కొండ దగ్గరికి వెళ్లినప్పుడు ఆ కొండమీద చెంచుపిల్ల బొమ్మనూ, ఆ బొమ్మక్రింద వున్న కొండ గుర్తులనూ నకలు తీసుకువచ్చి   ఇంటి దగ్గర అధ్యయనం చేసి నిధ రహస్య కనుక్కున్నారట.  ఆయన వ్రాసిన గుప్తనిధులు అన్నపుస్తకంలో  ఈ విషయం వ్రాసిపెట్టారు.

    అలాగే శ్రీశైలంలో వున్న నిధుల గురించీ, వృద్ద మల్లికార్జునుడి క్రిందవున్న స్పర్శవేది గురించి, చంద్రగుప్త మహారాజు ప్రాకారంలో వున్న మణిశిల గురించీ, అహోబిలంలో వున్న గుప్తసంపద గురించీ... ఇంకా అనేకానేక నిధుల గురించి ఆయన పరిశోధించి వ్రాశారు. కానీ ఆయన ఎప్పుడూ నిధుల జోలికి పోలేదు.

     నిధులవేట మంచిది కాదన్న అభిప్రాయం వుండటంవల్ల తన కుతూహలాన్ని కేవలం పరిశోధనలకి పరిమితం చేసారు.  ఒకసారి ఆయన సేకరించిన తాళపత్రాలు, శాసనాల నకళ్ళు   చూస్తుంటే భైరవుని కొండకు సంబంధించిన తాళపత్రం కూడా దొరికింది. మరోసారి ట్రై చేస్తారా డాక్టర్  గారూ! ఆ తాళపత్రం తీసిస్తాను."

    "చాలా గొప్ నిధినే గురువులు నాకిచ్చారు. ఆ నిధి ముందు ఈ నిధి తృణప్రాయంకదా! కొన్నాళ్లక్రిందట అంటే గురుదేవులతో పరిచయం  కాకముందు నేను చాలా అజ్ఞానంలో వున్నాము. అప్పుడు నిధుల గురించి కథలు విన్నప్పుడు కుతూహలం కలిగేది, నిజమెంతో తెలుసుకోవాలని.  ఇప్పుడా ఆశక్తిలేదు. నేను కావాలనుకుంటే చంద్రరేఖే ఆ నిధిని నాకు ఇస్తానంటోందికదా! కానీ నాకొద్దు.

     ఒక నిండు యవ్వనవతిని బలితీసుకున్న ఆ నిధి పేరు వింటేనే నా మనసు ఏదోలా అయిపోతుంది. రక్తసిక్తమైన ఆ నిధిని ఎవరు తాకినా నాశనమైపోతారని నా నమ్మకం.

     మునిరాజు వాళ్లు మరోసారి ఆ నిధి కోసం ట్రయ్ చేస్తారట. ఈసారి డైనమేట్లతో కొండను పేల్చేసైనాసరే నిధిని చేజిక్కించుకుంటాం అన్నాడు."

    "అయితే వాళ్లకి ఏదో మూడిందన్నమాటే!"

    "తాయెత్తులు కట్టుకుని గరుడయంత్రం రాయించుకుని వెళతారుట."

    "వాళ్లకి ఆ యంత్రాలు తయారుచేసిచ్చేవాడు ఎవడట?"

    "అంబాజీ అని మా వూళ్లో ఒక మంత్రగాడున్నాడు"

    "వాడి గురించి నేనూ  విన్నాను చిన్నప్పుడు తిరుపతిలోనో ఎక్కడో తప్పిపోయి ఒక సన్యాసివెంట తిరిగివచ్చాడట కదా!"

    "అవును. నాకదే చెప్పాడు అంబాజీ"

    "మీరు నాతో సలేశ్వరం వస్తున్నట్టేనా?"

    "వస్తున్నాను. అలాగే నా తపస్సుకు మంచి ప్రదేశం కూడా చూసుకోవాలి."

    సూర్య ముఖంలోకి చూస్తున్న దేశికాచారికి హఠాత్తుగా ఏం గుర్తుకొచ్చిందో -"ఒకసారి మీ చెయ్యి చూస్తాను ఇటివ్వండి" అన్నాడు.

     సూర్య కుడిచెయ్యి చాపాడు.

    అతడి వేలికొసలు పట్టుకొని ఒకే ఒక్క నిముషం చూసాడు అతడి హస్తరేఖని.

     "మీవయసెంత డాక్టర్ గారూ?"

    "వచ్చే దీపావళికి ఇరవయ్ ఎనిమిది నిండుతాయి."

    దేశికాచారి సూర్య చేతిని వదిలేశాడు.

     ఆ వదిలేయడంలో ఏదో నిస్పృ-హ

    "ఎల్లుండి నాతో రావద్దు డాక్టర్ బాబూ! సలేశ్వరం వచ్చేసరికి చూడవచ్చు."
   
    "నాచేతిని చూడగానే మీ నిర్ణయం ఎందుకు మారింది చారీజీ? ఏం కనిపించిదక్కడ?"

    "దయచేసి తరచి తరచి అడగకండి. ఎల్లుండి మీరు నాతో రావడం లేదు అంతే. నల్లమలేకాదు. మీరసలు ఎక్కడికీ ప్రయాణాలు చేయవద్దు. ఈ నలభయ్ రోజులు మీరు ఇంటిపట్టునే వుండి రోజూ మృత్యుంజయాష్టకం చదువుకోండి."

    "నా హస్తరేఖల్లో మీకు మృత్యునీడ కనిపించిందా?" చెదరని చిరునవ్వుతో అడిగాడు సూర్య.

     జవాబు చెప్పలేనట్లుగా దేశికాచారి మౌనం వహించాడు.

    "నిజంగా  నాకోసం మృత్యువే పొంచి వుంటే, నేను అడవిలో వున్నా ఇంటిలో వున్నా  విడిచిపెట్టదు. నేనొస్తున్నాను మీతో."

    "వద్దు! నేనుకూడా ఈసారి విరమించుకుంటున్నాను. వచ్చే సంవత్సరం మిమ్మల్ని తీసుకునే సలేశ్వరం వెళతాను.'

    "మీరు విరమించుకున్నా నేనుమార్చుకోను నా నిర్ణయం. నాలోని ఆత్మశక్తిని జాగృతపరుచుకోవాలి. చంద్రరేఖ  ఆత్మకి విముక్తి కలిగించాలి"

    "మీ ఆశయం మంచిదే. మీరు ఏం తలపెట్టినా ఈ నలభై రోజుల తరువాతే తలపెట్టండి. ఈ నలభైరోజులు  జాగ్రత్తగా వుంటే చాలు. మీ మీదినుండి మృత్యునీడ తొలగిపోతుంది. ఈ గండం తప్పితే మీరు నిండు నూరేళ్లు పూర్ణాయుష్షుతో జీవిస్తారు."

    "నిజంగానే నేను మరణించవలసివస్తే సంతోషంగా మృత్యుదేవత ముందు తలొంచుతాను. అంతేగానీ దొంగలా ఇంట్లో దాక్కోను, ఘంటసాలగారి పాట రేడియోలో వినలేదా "బహుదూరపు బాటసారి... ఇటు రావో  ఒక్కసారి" అంటూ మృత్యుదేవతకు  స్వాగతం పలుకుతాడు. 'పయనమెచటికోయీ నీ దేశమేనటోయీ నా ఆశలు తీరెనోయి నీతో గొనిపోవోయి' అని మృత్యువుతో వెళ్లిపోవడానికి తన సంసిద్దతను వ్యక్తం చేస్తాడు. చావంటే భయపడే వ్యక్తిని చూసి మృత్యుదేవత ఎంత నవ్వుకుంటుందో!"

    "చావంటే భయపడని నేను కూడా చెప్పను. కానీ మీచేత తల కొరివి పెట్టించుకోవావ్సిన మీ తండ్రి మీకే తలకొరివి పెట్టాల్సివస్తే, అదెంత బాధాకరమో మీరే ఆలోచించండి. కనీసం అందుకోసమైనా మీరు ఈ నలభై రోజులు జాగ్రత్తగా వుండండి."

    నిజంగా నాకీ నలభై రోజుల్లో మరణమే రాసిపెట్టి వుంటే నేను ఇంట్లో వున్నా తప్పించుకోలేను చారీజీ. ఎలా జరగాల్సి వుంటే అలా జరుగుతుంది. దయచేసి నన్ను ఆపే ప్రయత్నం చేయకండి. నేను వస్తున్నాను సలేశ్వరం. నేను అక్కడే ఎక్కడైనా తపస్సుకు మంచి ప్రదేశాన్ని ఎన్నుకుంటాను"

    "అయితే నేను కూడా మీతోబాటే వుంటాను. ఆ అడవిలో మిమ్మల్ని ఒక్కరినీ విడిచిపెట్టి రాలేను. ఎలాగూ నా ఆయుర్వేద వైద్యానికి కావాల్సిన మూలికలను  అన్వేషించే పని కూడా వుంది నాకు."

    "మీరు నాతో వుంటే నాకేమీ అబ్యంతరం లేదు."


        *    *    *    *    *   

   
    "జయసూర్య కథ ముగింపుకు వచ్చేస్తోంది కౌస్తుభా! అతడి పూర్వ జన్మలో అతడి చేతిలో హతమైన కేతకి 'ప్రేమించి సర్వస్వం అర్పించుకోవడానికి వచ్చిన స్త్రీని మోసం చేశావు. గొంతు కోశావు. నేను నిన్ను వదలను. జన్మజన్మలకీ వెంటాడతాను వేటాడతాను' అని చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చిందా లేదా అన్నది  వచ్చే ఉత్తరంలో వ్రాస్తాను. ఈలోపుగా జయసూర్య కథలో నువ్వెవరో వూహించు. జయసూర్యను ప్రేమించిన హరిచందనా?" అతడి చేతిలో హతమైన కేతకివా? ఉంటాను.
                                                                                                                          ఇట్లు     

                                                                                                                          శ్రీచక్ర."

    తను పూర్వజన్మలో పిశాచమా?" తలుచుకుంటేనే వెన్నులో పాము పిల్ల పాకినట్టుగా అయింది కౌస్తుభకు.

     "ఏమిటి మామయ్యా ఇతడి తలతిక్కరాతలు? చదవడానికైనా జయసూర్య కథ బాగుందికానీ, ఇది యదార్దంగా జరిగిందంటే  ఎవరు నమ్ముతారు?ఇంకా ఈ కాలంలో దెయ్యాలు, మంత్రాలూ, తపస్సులూ ఎక్కడున్నాయి? ఈ సైంటిఫిక్ యుగంలో దెయ్యాల కథలు చెబితే జనాలు నవ్వి పోతారు. అసలు మనకి వచ్చి కలలకి అర్దమే వుండదు. చిత్రవిచిత్రంగా వస్తాయి. వాటికి అర్దాలు  వెతకడం దండగ. తనకి వచ్చే కలల ఆధారంగా ఇంత కథ అల్లి, ఇదంతా యదార్దంగా జరిగిందంటే చెవిలో పువ్వు పెట్టుకున్నవాళ్లు ఎవరూ లేరిక్కడ. పైగా జయసూర్య కథలో నేనొకదాన్నట. ఇప్పుడైనా తెలిసిందా? అతడొక తలతిక్క మనిషని?"

 Previous Page Next Page