"బాగున్నానో, లేదో మీరే చెప్పాలి డాక్టర్ కదా!"
ఒక నిమిషం పరిశీలనగా చూసాడు. "కొంచెం చిక్కావు. చిక్కినా అందంగా వున్నావు. తమలపాకు తీగ అంటారే!"
"మీకోసం వారం రోజులనుండి చూస్తున్నాను మీరు వస్తారని."
"దేనికి?"
"మీరొకసారి మా ఇంటికి వచ్చి, అమ్మమ్మతో మాట్లాడాలి."
"దేనిగురించి?"
"మా బంధువుల్లో ఒకతను నన్ను పెళ్లి చేసుకుంటానని కబురు చేశాడు."
"శుభమస్తు! ఇక మాట్లాడేది ఏముంది?"
"నాకిష్టంలేదు."
"పెళ్లా? అతడా?"
"రెండూ!"
"అబ్బాయి బాగుండడా?"
"మీ అంత బాగుండడు."
"నేను బాగుంటానని సర్టిఫికెట్ ఇచ్చావన్నమాట" సూర్య నవ్వుతుంటే "
"నవ్వితే మీరుచాలా బాగుంటారు" అన్నమాట పెదవులవరకూ వచ్చి ఆగిపోయింది సిగ్గుతో.
"మరి ఎంతబాగుంటే చేసుకుంటావు?"
"మీ అంత బాగా!"
"ఈ మాట మీ అమ్మమ్మతో చెప్పడానికి రావాలన్నమాట."
"అదికాదు - నాకు చదువుకోవాలని వుంది. నృత్యమంటే నాకు ప్రాణం. గొప్ప గొప్ప నృత్యాచార్యులవద్ద శిష్యరికం చేయాలనివుంది. పదహారేళ్లకే పెళ్లి చేసుకుని, పదిహేడేళ్ళకే పిల్లల్ని కని ... ఊహూ..... అలాంటి జీవితం నాకిష్టం లేదు."
"మరి మీ అమ్మ, అమ్మమ్మ ఏమంటున్నారు?"
"అమ్మ ఏమీ అనదు. ఏ నిర్ణయం తీసుకున్నా అమ్మమ్మే. 'నిన్ను పై వూళ్ళో చదివించడానికి నెల నెల జీతాలు వస్తాయా?' మగదిక్కులేని సంసారంకదా అంటుంది."
"డబ్బు సమస్య అన్నమట. సరే ఆ విషయమైతే మాట్లాడటానికి తప్పకుండా వస్తాను. ఎప్పుడు రమ్మంటావు?"
"మీ ఇష్టం.... మీకెప్పుడు వీలయితే అప్పుడు."
"అయితే నీ పెళ్ళయిపోయాక వస్తాను...ఏం?" తమాషాగా అన్నాడు.
"అప్పుడొచ్చి ఏం చేస్తారు? నా శవాన్ని చూడ్డానికి వస్తారా?"
"ఛ..... అవేం మాలు?"
"మరి అంతే! నాకిష్టంలేని పెళ్లిచేస్తే చచ్చిపోతాను" బుంగమూతి పెట్టి అంది "మీరెప్పుడు చేసుకుంటారు పెళ్లి?"
"పెళ్లి ఆలోచన ప్రస్తుతానికి లేదు హరిచందనా!"
"ఎందుకని?" వెన్నెలచిందే చందమామ మీద నల్లటి మబ్బుతునక ప్రాకినట్లుగా అయింది.
"నా జీవితం ఏమౌతుందో నాకే తెలియదు. పెళ్లిచేసుకుని ఆమెక అన్యాయం చేయలేను."
"ఎవరి జీవితం ఏమౌతుందో ఎవరికి మాత్రం తెలుసు డాక్టర్ బాబూ! ఏమౌతుందోనని చేయాల్సిన పనులు చేయకుండా వుండలేముగా?"
"నేను మాత్రం మానేశానా! తింటున్నాను, తిరుగుతున్నాను. డాక్టర్ ని కాబట్టి పేషెంట్లను చూస్తున్నాను."
"మరి పెళ్లెందుకు చేసుకోరు?"
"చేసుకోవాలనిపించడం లేదంతే!"
"ఎవరినైనా ప్రేమించారా?"
"లేదంటే అబద్దం చెప్పినవాడినవుతాను."
"నిజమే చెప్పండి!"
"ఒక అమ్మాయిపట్ల అనురాగపు మొలక మొలిచిన మాట వార్తవం కానీ ఆమెతో జీవితాన్ని పెనవేసుకోలేను. ఎన్నో అడ్డంకులున్నాయి. అందుకని ఆ మొలక మొలకగానే వుంచేశాను. పెరగనీయలేదు."
"కనీసం మీ అనురాగాన్నయినా నోచుకున్న ఆ అమ్మాయి ఎవరో అదృష్టవంతురాలు. చాలా అదృష్టవంతురాలు...." హరిచందన కళ్లనిండా నీళ్లు.
"ఏయ్....ఎందుకా కన్నీళ్లు?" విచలితంగా అడిగాడు సూర్య.
"మీరంటే నాకిష్టం డాక్టర్ బాబూ! ఇంతకంటే ఏం చెప్పను?"హరిచందన బిందె చంకలో పెట్టుకొని గబగబా వెళ్లిపోతుంటే
"ఏయ్ పిచ్చి.... ఆ అదృష్టవంతురాలు నువ్వే...." అని చెప్పాలనిపించింది. కానీ చెప్పలేదు. ఆమెలో ఆశలు రేకెత్తించడం ఇష్టంలేక.
దుఃఖంతో పూడుకుపోయిన ఆమె కంఠం చెబుతోంది ఆమె తననెంతగా ప్రేమిస్తూందో.
పుట్టిలో అవతలి వడ్డుకు పనిమీద వెళ్లిన దేశికాచారి తిరిగివస్తూ రేపులో దిగాడు.
"బాగున్నారా చారీజీ?"
"ఆ ....ఏమిటి విశేషాలు?" అంటూ సూర్య ప్రక్కన మెట్టుమీద కూర్చున్నాడు దేశికాచారి.
"ఏమంటోంది మీ చంద్రరేఖ? ఇంకా మిమ్మల్ని పీడిస్తోందా?"
"ప్రస్తుతం నాతో కయ్యం లాభంలేదని తెలిసిపోయింది. అందుకని వియ్యానికి సిద్దపడింది."
"వియ్యమా? ఎవరితో?"
"నాతోటే. పెళ్లి చేసుకొమ్మని అడుగుతోంది. నేను వాగ్దానం చేశాను పెళ్లాడతానని."
"పిశాచంతో పెళ్లేమిటండీ బాబూ? ఇదెక్కడి వింత? జోక్ చేస్తున్నారా?"
"జోక్ కాదు. చంద్రరేఖ మళ్లీ జన్మిస్తే, ఆమెను పెళ్లాడతానని వాగ్దానం చేశాను. క్రితం జన్మలో ఆమెపట్ల నేను చేసిన అన్యాయానికి అదే సరైన న్యాయంకదా?" అంటూ చంద్రరేఖకీ, తనకీ మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్పాడు.
"ఆమెకు పిశాచిరూపం నుండి విముక్తి లభించి మళ్లీ జన్మించడమే"జరిగితే,ఆమెకు కనీసం పదహారో, పదిహేడో రావాలికదా! అప్పుడుకదా మీరు పెళ్లికొడుకు అయ్యేది. అప్పుడుమీవయసు నలభయ్యోపడిలో పడి వుంటుంది. సరే! నలభయ్యేళ్లకే పెళ్లికొడుకు అవుతారనుకోండి. చంద్ర రేఖ ఎక్కడ జన్మ ఎత్తిందో మీకెలా తెలుస్తుంది?"
"కుండలనీ జాగృతపరిస్తే త్రికాలజ్ఞానం కలుగుతుంది. అందుకే తపస్సుకు మంచి ప్రదేశం కావాలనుకుంటున్నాను. ముందు చంద్రరేఖకి పిచాశరూపం వదిలించాలి."
"పిశాచరూపం వదిలించండి చాలు. ఆమెనే పెళ్లాడతాననటం హాస్యాస్పదం."
"వచ్చే చైత్రపూర్ణిమకునేను సలేశ్వరం వెడుతున్నాను. ప్రతి సంవత్సరం వెడతాను. మీరొస్తారా?"
"ఎక్కడిది?"
"నల్లమలలోనే! ప్రకృతి సౌందర్యోపాసకులందరికి కనువిందు చేసే స్థలమది. సంవత్సరానికి ఒక్కనాడు మాత్రమే సలేశ్వరం లింగయ్య భక్తులు దర్శిస్తారు. చెంచులు దేవుడాయన. చైత్రపూర్ణిమ రోజు మాత్రం అక్కడికి భక్తులు వెడతారు. మిగతా రోజుల్లో వెడితే పులి తినేస్తుందని అక్కడి ప్రజల్లో నమ్మకం. బస్సుల్లో, జీపుల్లో వెళ్లినా అడవిలో లోయల్లో నడవాల్సిందే. ఏడెనిమిది కిలోమీటర్లయినా వుంటుంది. దారి పోడవునా ప్రకృతిశోభ మనల్ని ఎంత ముగ్దుల్ని చేస్తుందో, ప్రమాదమూ అంత హెచ్చరిస్తూ వుంటుంది. లోయలోకి దిగుతుంటే, ఒక్కరుమాత్రమే నడిచే దారిలో చాలా జాగ్రత్తగా నడవాలి. అడుగు జారితే అంతే సంగతులు! ఒకప్రక్కనంతా అగాధమైన లోయలు.
ఎంతో శ్రమపడి లింగమయ్య దగ్గరికి చేరేసరికి మన శ్రమనంతా మరిచిపోతాం. అక్కడ దేవతలు తిరుగుతుంటారని చెప్పే మాటల్లో ఎంత మాత్రం అబద్దం లేదనిపిస్తుంది. మూడొందల అడుగుల ఎత్తునుండి జలపాతం పడుతూంటుంది కిదంద గుండంలో.
మండువేసవిలో మంచులా చల్లగా నీళ్లు . అటునుండి ఇటునుండి లోయలోకి వాలిన భక్తులకు శిఖరాలు గొడుగు పడుతున్నట్లుగా వుంటాయి. వెన్నెల్లో చూడాలి అక్కడి అందాలు. గండంలో స్నానంచేసి, తడిబట్టల తోనే కొంచెం ఎత్తుమీదుండే లింగమయ్య దగ్గరికి పాకుతూ వెళ్లాలి. అసలు నల్లమల అడవి సౌందర్యం జీవితంలో ఒక్కసారయినా దర్శించకపోతే జీవితం వ్యర్దం.
ఎటు చూసినా పచ్చని చెట్లు, అల్లిబిల్లిగా అల్లుకొన్న లతలు, పొదలు, ఒకదాన్ని మించి ఒకటి పోటీపడి కోటలు కట్టుకున్నట్లుగా పుట్టలు, పర్వత శిఖరాల మీదనుండి జలజలదూకే సెలయేళ్లు, జలపాతాలు ఎన్నడూ వినని పక్షి కూతలు. పురివిప్పి ఆడే నెమళ్లు, పడగెత్తి ఆడే పాములు. గాల్లో తేలిపోతున్నట్లుగా జింకలు, జింక చర్మం మీద ఏర్పడ్డ మచ్చల్లో, నెమలి కన్నుల్లో, పక్షి ఈకల్లో, పాము పడగల్లో, విరిసిన పువ్వుల్లో.... అంతటా సౌందర్యమే! రాళ్లూ, కొండలు అంతటా సౌందర్యమే!
"మీరేం చదువుకున్నారు చారీజీ?"
"ఎం. ఏ. ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను"
"మరి ఈ పిలక, గోచీ... భూతవైద్యం , మూలికా వైద్యం...."
"మూలికావైద్యం మా వంశంలో తరతరాలుగా వస్తున్న విద్య. మా నాన్నగారికి నన్ను బాగా చదివించాలని కోరిక. మా తాతగారికేమో నన్ను వేదపండితుడిగా తీర్చిదిద్దాలని ఆశ. నేను వారి ఇద్దరి కోరికలూ తీర్చాను.
మా ఊళ్లో మాది ఒక్కటే బ్రాహ్మణ కుటుంబం. నేను ఉద్యోగం చూసుకుని వెళ్లిపోతే ఊరు బ్రాహ్మడు లేని వూరు అవుతుందని ఊరివాళ్లు వెళ్లినివ్వలేదు.
ఊళ్లో వేణుగోపాలస్వామి గుడిలో అర్చకత్వం వదలొద్దని తాత గారి ఆజ్ఞ. ఊరివాళ్ల అభ్యర్దన అనుకోండి, తాతగారి ఆజ్ఞ అనుకోండి, గ్రామంలో వుండిపోయాను. పురోహితుడికి పిలక అందం కాబట్టి పిలక పెట్టుకున్నాను."