సరస్వతి చిరునవ్వు నవ్వింది.
'కానక కన్న సంతానాన్ని కానలకే అర్పిస్తున్నారా? అహల్య ఆశ్రమవాసిని అవుతుందా?' అంది.
'అమ్మా!' తొలిసారి నోరు విప్పింది అహల్య. అన్నివిధాలా యోగ్యులయిన వారితో జీవితం అడవిలో అయినా నాకు స్వర్గతుల్యం కదా! తండ్రి గారి నిర్ణయమే నాకు శిరోధార్యం!'
'లెస్స పలికితివమ్మా!' మెచ్చుకున్నాడు నారదుడు. 'పుట్టింటికీ మెట్టినింటికీ కీర్తి తెచ్చేలా నడుచుకో! సృష్టించినందుకు పరమేష్టికీ, స్వీకరించినందుకు గౌతములకూ పేరు ప్రఖ్యాతులను తీసుకురావాలమ్మా!'
హితోపదేశం చేశాడు నారదుడు.
'నారదా!'
'ఏమి సెలవు? పరమేష్టీ'
'మహేంద్రుల వారు వచ్చేవరకూ వేచి ఉండాలా?'
'నారాయణ! నారాయణ! నన్నా అడుగుతారు? నాలుగు వేదాలను ప్రవచించిన వారు, అఖిల ధర్మాలూ ఎరిగినవారు. తమరికి తెలియని ధర్మం ఉందా?'
'అక్కర్లేదనే మా భావన. గౌతములు ముందొచ్చారు! నిర్ణయించిన నిబంధన నెరవేర్చారు. ముందొచ్చిన వారికే కదా కన్యనిచ్చి పెళ్ళి చేస్తామని చెప్పాం. వారొచ్చారు. రానివారికోసం ఆగవలసిన అవసరం లేదు. వెంటనే పెళ్ళి జరిపిద్దాం!'
'బ్రహ్మ వాక్కు వేద శాసనం కదా! అలాగే కానివ్వండి!'
సంకల్ప మాత్రంలో వివాహ వేదిక తయారయింది. సర్వాంగ సుందరంగా వెలసింది కళ్యాణ వేదిక.
సమస్త సంభారాలు, అగ్నిహోత్రంతో సిద్ధమయ్యాయి. పెళ్ళిపీటల మీద గౌతముణ్ణి ఆశీనుణ్ణి చేశాడు నారదుడు. గౌతములు కూర్చోగానే ముత్తైదువలు అహల్యను తెచ్చి కూచోబెట్టారు. క్షణంలో ఆమె సర్వాలంకార భూషిత అయింది. వేద మంత్రాలు వినిపించసాగాయి. గౌతముడు అహల్యను పెండ్లాడాడు. మంగళ తూర్యనాదాలు మిన్నంటాయి.
బ్రహ్మ, సరస్వతి, నారదుడు వధూవరులపై అశీరక్షతలు చల్లి దీవించారు. అహల్య సమేతుడై గౌతముడు అత్తమామల పాదపద్మాలకు ప్రణమిల్లాడు.
అహల్య చేతులు గౌతముడి చేతిలో ఉంచి చెప్పాడు బ్రహ్మ 'గౌతమా! నేటీనుంచీ అహల్య బ్రహ్మ మానస పుత్రికే కాదు. గౌతముడి ఇల్లాలు. ఆమె వల్ల వచ్చే కీర్తి అపకీర్తులు నీవే! ఆమెని లాలించి పాలించి మీ జీవితం సుఖశాంతుల నిలయం చేసుకో!'
'మీ మాట శిరోధార్యం సృష్టికర్తా! అక్షరాలా పాటిస్తాను' ఆనందంగా అన్నాడు గౌతముడు.
అహల్య శిరస్సు నిమురుతూ అంది సరస్వతీ దేవి 'అమ్మా అహల్యా! బ్రహ్మ పధాన్నించి జనపధానికి వెడుతున్నావు. త్రిమూర్తులలో ఆదిరూపుడు అతిశయంగా సృష్టించిన కన్యారాత్నానివి నీవు. నీ గర్భవాసాన మహనీయులు, మహర్షులు జన్మిస్తారు. సకల జగాలూ, యుగయుగాలూ నీ పేరు స్మరించేలా నడుచుకో!'
అహల్య తలూపింది.
అహల్యా, గౌతములు భూలోకానికి ప్రయాణం కాబోతున్నారు.
అప్పుడొచ్చారు ఆఘమేఘాల మీద ముల్లోకాల ఏలిక.
'పరమేష్టీ! నీవు నిర్ణయించిన వర పరీక్షలో నేనే ముందుగా వచ్చేశాను. వేగానికి ప్రసిద్ధుడైన వాయుదేవుడు కూడా నా గమన వేగాన్ని అందుకోలేకపోయాడు. వాహనాలెక్కి వచ్చిన దిక్పాలకులెవ్వరూ నన్నధిగమించలేకపోయారు. నేనే- నేనే ముందు వచ్చాను. అహల్యణు ఇచ్చి వివాహం చేయించు. నా త్రిలోకాధిపత్యానికి తగినట్టుగా అంగరంగవైభవంగా వివాహం ఏర్పాట్లు కల్పించు' అన్నాడు దేవేంద్రుడు.
తాను వర పరీక్షలో నెగ్గానన్న గర్వం, అహంభావం అక్షరాక్షరానా తొణికిసలాడుతున్నాయి.
పకపక నవ్వాడు నారదుడు.
ఆ నవ్వుకీ- ఆ నవ్వులోని హేళనకీ ఇంద్రుడు విస్తుపోయాడు.
'ఏమి నారదా! ఏమో వెటకారం! కాబోయే బావగారిని గౌరవించే రీతి అదేనా! అందునా నేను సురనాధుడనే మాట ఏమరుపాటున మరచినట్లున్నావే!'
'అయిన పెండ్లికి మేళం ఎందుకని త్రిలింగ దేశంలో వాడుకలే సురనాధా! నీకంటే ముందుగా భూ ప్రదక్షిణం చేసి బ్రహ్మ సన్నిధికి చేరిన గౌతముడికి అహల్యనిచ్చి శాస్త్రోక్తంగా వివాహం జరిపించి అత్తవారింటికి పంపబోతున్నారు. సృష్టికర్త, ఆయన సతీమణి సరస్వతీదేవి! నీవు చాలా ఆలస్యంగా వచ్చావు. వచ్చినవాడవు విచారించుకోకుండా పెడబొబ్బలు పెడుతున్నావు' అన్నాడు నారదుడు.
నారదుని మాటలు ముగీసీ ముగియగానే బిలబిలా వచ్చేశారు మిగతా దేవతలూ, దిక్పాలురూ మునులూ.
వారూ నారదుడి మాటలు అల్లంత. దూరాన్నుంచి విన్నారు. అమరేంద్రుడే అహల్యా నాధుడవుటాడనీ భావించారు అందరూ. కానీ విధి వైపరీత్యం! బ్రహ్మరాత మరో విధంగా ఉంది.
అహల్య అదృష్టాన్ని ఎవరు మార్చగలరు? తన మానసపుత్రికగా పరమేష్టి గొప్పగా సంభావించినా అమరేంద్రుడి అర్ధ సింహాసనం అధిరోహించగలదని దేవనాధుడు ఆశించినా- అహల్య సౌందర్యాన్ని చూసి అందరూ ఆశించినా అహల్య అదృష్టం మరోవిధంగా ఉంది.
ఇంద్రుడికి పట్టరానంత ఆగ్రహం పుట్టుకొచ్చింది.
'ఏమిటీ నారదా! నువ్వంటున్నది? గౌతముడు మా అందరికంటే ముందుగా భూ ప్రదక్షిణం చేసి వచ్చాడా? పరుగు పందెంలో ముందు వెళ్ళిన వాళ్లం. మమ్మల్ని కాదనే ఎలా వెళ్ళాడు? ఇదంతా మోసం! ఇందులో ఏదో మాయ! ఏం జరిగింది?!'