"క్షమించండి. నేను ఎప్పుడూ ఎవర్నీ ఇలా హర్ట్ చెయ్యలేదు. మీరే నాచేత ఇన్ని మాటలు అనిపించారు. మీరు హనుమంతరావును పెళ్ళి చేసుకోండి సుఖపడ్తారు."
"మీరు నన్ను అవమానిస్తున్నారు" సుధ నాగినిలా చర్రునలేచింది.
"మిమ్మల్ని అవమానించాలని నా భావంకాదు"
"మరేమిటి?"
"హనుమంతరావుకు మీరంటే చాలా ఇష్టం"
"వాడంటే నాకు అసహ్యం!"
"అతను మీరు అనుకున్నంత చెడ్డవాడు కాడు. మనసు చాలామంచిది. కొన్ని బలహీనతలు ఉన్నమాట నిజమే. అది అతని తప్పుకాదు. ధనంతోపాటే ఉంటే బలహీనతలు అందరిలో ఉన్నట్టే. అతనిలోనూ ఉన్నాయ్.
"అంటే మీ ఉద్దేశ్యం ధనవంతులందరిలోనూ దుర్గుణాలుంటాయనేగా?"
"అవును! అది నా ఉద్దేశ్యం కాదు. అది వాస్తవం. స్త్రీని వాడు డబ్బుతో బజార్లో కొనే వస్తువుగా భావిస్తాడు. అది ధనంతో వచ్చిన అహంకారం. మీరు చేస్తున్నది ఏమిటి? మీ ధనం ఆశ చూపించి నా మనసు కొనాలని ఆశించలేదూ? మీకు డబ్బుంది మీరు కోరిన ఏ యువకుడైన తోక ఆడిస్తూ కుక్కలా మీ పాదాలు నాకుతాడని మీ అభిప్రాయం"
"నీకు డబ్బు లేదు. అందుకే డబ్బు ఉన్నవాళ్ళంటే కసి!" కావాలని ఏకవచన ప్రయోగం చేసింది.
"నాకు డబ్బులేదు, నిజమే! డబ్బున్న వాళ్ళంటే నాకు కసి. అది కూడా నిజమే! కాని ఆ కసి నాకు డబ్బులేదు కనక ఏర్పడింది కాదు"
"మరెందుచేతనో?" వ్యంగ్యంగా అన్నది సుధ.
"డబ్బున్న వాళ్ళంతా పరాన్న భుక్కులు. పేరాసైట్స్, కొన్ని వందల మానవుల శ్రమశక్తిని దోచుకుంటే గాని ఒక్కడు శ్రీమంతుడు...అదే మీ నాన్నలాంటి శ్రీమంతుడు కాలేడు. అందుకే మీరంటే నాకు కసి."
"మా అదృష్టం చూసి మీకు ఈర్ష్య"
"సుధారాణిగారూ! ఇకవస్తాను!"
"గౌతమ్! నా దగ్గిర వెండి బంగారాలు ఖజానాలున్నాయ్. వాటితో నీలాంటి వాళ్ళను ఎందరినైనా కొనగలను"
గౌతమ్ ఆగాడు.
వెనక్కు తిరిగాడు.
"పాపం! మిమ్మల్ని చూస్తుంటే జాలివేస్తుంది"
"నన్ను చూసి నీకు జాలా?" పకపక నవ్వింది సుధారాణి.
"పాపం! మీ నవ్వు ఎలా ఉందో మీకు తెలియడంలేదు. ఏడవలేక నవ్వుతున్నారు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. వాస్తవంగా బీదవాణ్ణి నేను కాదు, మీరు"
కోపంతో సుధారాణి పెదవులు వణుకుతున్నాయ్.
"నీకు కావాల్సింది డబ్బుతో కొనుక్కోలేనప్పుడు నువ్వు బీదదానివే"
"యూ రోగ్! షట్ అప్!" అరుస్తూ వెళ్ళి కార్లో కూర్చుని డోర్ గట్టిగా వేసింది.
గౌతమ్ చూస్తుండగానే కారు స్పీడుగా వెళ్ళిపోయింది.
గౌతమ్ చూస్తూ నిల్చున్నాడు.
సుధను తల్చుకుంటే నిజంగానే అతనికి బాధగా ఉన్నది. అవసరం అయినదానికంటే కటువుగా ప్రవర్తించానేమోనని బాధపడ్డాడు.
* * *
గౌతమ్ హాస్టల్ కు చేరేసరికి ప్రొద్దుపోయింది. హాస్టల్ టేబుల్ మీదపెట్టి ఉన్న భోజనం వడ్డించుకున్నాడు. తినబుద్ధి కాలేదు. మజ్జిగమాత్రం తాగి లేచాడు.
గదికి రాగానే "ఎరా ఇంత ఆలస్యం అయింది! మీ హీరోయిన్ ఊళ్ళోలేదుగా?" రూంమేట్ శంకర్ అడిగాడు.
గౌతమ్ మాట్లాడలేదు. అసలే విసుగ్గా ఉన్నది. పైగా అలాంటి జోక్స్ అంటే అతనికి బొత్తిగా గిట్టదు.
"మనవాడికేంరా అండ కాకపోతే మరో అండ" అన్నాడు వేణు.
"ఛ! గౌతమ్ అలాంటివాడు కాదు. వాడినంటే కళ్ళుపోతాయ్. చెంపలేసుకోమ్మా!" అన్నాడు శంకర్ వేణుతో.
గౌతమ్ వినిపించుకోనట్టే బట్టలు మార్చుకున్నాడు.
"బుద్ధిమంతుడిలా చాలారోజులు ఫోజులు కొట్టాడు. కాని ఈమధ్య బలే జల్సారాయుడిలా తయారయ్యాడులే"
"నిజంగానా? మనవాణ్ణి ఇంతకాలం శ్రీరామచంద్రుడి అవతారం అనుకున్నానే?"
"నీ మొహం! మధ్యాహ్నం ఒక హీరోయిన్ ను బండి ఎక్కించాడు అవునా?"
"అవును!"
"సాయంత్రం మరో బంగారు బాతుతో మెరీనా బీచి రోడ్డులో...."
"నోరు ముయ్యండిరా!" అన్నాడు గౌతమ్.
"అలాగే మూస్తాంగాని...ఒక సందేహం తీర్చరా బాబు!" అన్నాడు వేణు.
"ఏమిటి?" అడిగాడు కుతూహలంగా శంకర్.
"ఆ ప్రశ్న వెయ్యాల్సింది నువ్వు కాదురా చిట్టి నాయనా! గౌతమ్" చక్కగా బీచ్ లో ఇసుక తిన్నెల మీద కూర్చుని కలల్లో తేలిపోవాల్సినవాళ్ళు రోడ్డు పక్కగా, కారును ఆనుకొని నిల్చున్నారేంరా?"
"అది మాఇష్టం! నువ్వెవడివి అడగటానికి?" అన్నాడు గౌతమ్.
"అదేం ప్రశ్నరా? నేను నీ క్లాస్ మేటునూ, రూంమేటునూ కూడా!"
"మరో సంవత్సరంలో డాక్టర్ పట్టా పుచ్చుకోబోతున్నారు. ఏం లాభం? జూనీయర్ కాలేజీ స్టూడెంట్స్ లా ప్రవర్తిస్తున్నారు" విసుక్కున్నాడు గౌతమ్.
"అసలు ఇప్పటికీ ఆ కారులో షికారుకొచ్చిన 'ఆ పసిడి చాన' ఎవర్రా?"
"ఇంకెవరు? మన కాలేజీ క్వీన్!"
"కాలేజీక్వీనా! రేణుకాదేవి..."
"కాలేజీక్వీన్ అన్నాను బ్యూటిక్వీన్ అనలేదు"
శంకర్ ఆలోచనలో పడ్డాడు.
గౌతమ్ మంచంమీద పడుకొని గోడవైపు తిరిగాడు.
"ఒరేయ్ నీది వట్టి మట్టి బుర్రరా బ్రదర్! క్వీన్-అంటే అర్థం రాణి. రాణి అంటే ఎవరో తెలుసుకోలేవా?"