Previous Page Next Page 
నీరు పల్లమెరుగు పేజి 13


    అంతకు రెండు రోజులు ముందు గేదెలు పేడవేస్తే, అది పిడకలుగా చేసి గోడకి కొట్టమంది జానకి, పొయ్యిలోకి పనికొస్తాయని. తులసి విసుక్కొంటూనే పిడకలు కొట్టింది. అలాంటి పని చేసినందుకు, అలా చెయ్యవలసి వచ్చినందుకు అప్పటి నుంచీ లోలోపల సిగ్గుతో చచ్చిపోతూనే ఉంది. సరిగ్గా ఆ విషయమే ఎత్తి సూర్యం దెప్పిపొడిచేసరికి తులసి రెచ్చిపోయింది.
    "అవునులే! డబ్బులు నాలాంటి వాళ్ళ దగ్గిరెందుకుంటాయి? నీ అక్క దగ్గరుంటాయి. చెడిపోయింది గనుక, లేచిపోయింది గనుక సంపాదిస్తుంది, బోలెడన్ని డబ్బులు....."
    తులసి ఈ మాటలనగానే సూర్యం శివమెత్తినట్లయి ప్రక్కనే పడి ఉన్న విరిగిపోయిన ముక్కాలిపీట కోడు తీసుకొని విసురుగా తులసి తలమీద కొట్టాడు.
    "అబ్బా!" అని గావుకేక పెట్టింది తుఅల్సి. కోడుకున్న మేకు తులసి నుదుటికి గీరుకుపోయి రక్తం చిమ్మింది. అక్కడ నిలబడకుండా పారిపోయాడు సూర్యం.... సూర్యం ఆ రాత్రి తిరిగి వచ్చేసరికి అతడు ఊహించినట్లుగానే జగన్నాథం పంతులు వెఱ్ఱికోపంతో చిందులు తొక్కుతున్నాడు.
    "చెప్పు తులసీ? ఎవరు నిన్నిలా కొట్టింది? వాడి డొక్క చీరేస్తాను. వాడి అంతుచూస్తాను."
    గట్టిగా అరుస్తున్నాడు జగన్నాథం పంతులు. తులసి సూర్యాన్ని చూసింది. దేన్నైనా ఎదుర్కోవటానికి సిద్ధపడిన వాడిలా ధైర్యంగా నిలబడ్డాడు సూర్యం.
    "నన్ను కొట్టింది..... కృష్ణారావు."
    జగన్నాథం పంతులు చేతిలో కర్ర జారి నేలమీద ధన్ మని పడింది. "ఆ!" అన్నాడు అయోమయంగా.... అంత బాధలోనూ తండ్రి అవస్థచూసి తులసి పకాలున నవ్వేసింది. సూర్యానికి నవ్వొచ్చింది. తులసినేమీ అనలేని జగన్నాథం పంతులు కర్ర తీసుకుని, "వెధవా! ఎందుకురా నవ్వుతున్నావ్?" అని సూర్యం మీదకొచ్చాడు. సూర్యం ఉరిమి చూశాడు. అప్రయత్నంగా వెనక్కు తగ్గిపోయాడు జగన్నాథం పంతులు. "వెధవసంత, వెధవ మనుష్యులు" అని ఎవరిమీదో తెలియకుండా విసుక్కొంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. సూర్యం తులసి మంచం దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. తులసి తలెత్తి సూర్యాన్ని చూడలేదు. దిండులో ముఖం దాచుకుంది. సూర్యం తులసి మంచం దగ్గర అలాగే చాలాసేపు నిలబడి జానకి వస్తున్న అలికిడికి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఆ మరునాటికి తులసికి జ్వరం వచ్చింది. కర్ర పట్టుకుని తులసిని కొట్టిన వాడిని శిక్షించటానికి తయారయిన జగన్నాథం పంతులు తులసికి జ్వరం వచ్చిందని తెలుసుకొని కూడా డాక్టర్ని పిలవటానికి ప్రయత్నించక, "ఇంత కషాయం కాచి పొయ్యి" అన్నాడు జానకితో. అతనికి తులసి మీద ప్రేమలేక కాదు. కానీ వైద్యం కోసం డబ్బు వృధా చెయ్యటమెందుకనుకొనే మధ్యతరగతి మనస్తత్వమది.
    ఆరోజే సూర్యం తనతో డాక్టర్ని వెంటబెట్టుకొని వచ్చాడు.
    "నాకేం అక్కర్లేదు." అంది తులసి రోషంగా.
    "నీకు మేకు గుచ్చుకుంది. అది సెప్టిక్ కావచ్చు. ముందు ఇంజక్షన్లు తీసుకో! నా అపరాధానికి ఏ రకంగానయినా శిక్షించు. కాని ఈ రకంగా మాత్రం వద్దు."
    తులసి ఒకసారి సూర్యం ముఖంలోకి చూసి మరేమీ అభ్యంతరం చెప్పకుండా ఇంజక్షన్ తీసుకొంది. ఇంటికి డాక్టర్ ని పిలిపించి వైద్యం చేయించాలంటే చాలా డబ్బు ఖర్చవుతుంది. ఆ సంగతి తులసికి తెలుసు. తనకు ఇనుప మేకు గుచ్చుకుందని తెలిసినా, ఇంట్లో ఎవరూ శ్రద్ధతీసుకోలేదు. సమయానికి సూర్యం డాక్టర్ ని తీసుకు రాకపోయిఉంటే తన గాయం సెప్టిక్ అయి ఉంటే.....
    ఆ తరువాత ఆలోచించటం ఇష్టంలేకపోయింది తులసికి.


                                   7


    జగన్నాథం పంతులు ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది ఒక నడివయసు స్త్రీ. ఆ అపరిచిత యువతిని చూసి జానకి తెల్లబోతూ "ఎవరు మీరు?" అంది.
    ఆవిడ తాంబూలంతో గారపట్టిన పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ "నేను మీకు తెలియదు లెండి. నేను ధనలక్ష్మి భర్తవైపు చుట్టాన్ని. ధనం సూర్యాన్ని తీసుకురమ్మంటే వచ్చాను" అంది.
    అందరూ ఒక్క క్షణం మతిపోయిన వాళ్ళలా నిలబడ్డారు. సూర్యం ఆ నూతన యువతి చేతులు ఆవేశంగా పట్టుకుని, "అక్క ఎక్కడుంది? ఎలా ఉంది?" అన్నాడు.
    "నువ్వేనా సూర్యానివి? పాపం, మీ అక్క ఎప్పుడూ నిన్ను గురించే కలవరిస్తూ ఉంటుంది. నువ్వు చదువు మానేశావేమోనని ఒకటే బెంగ పడుతూ ఉంటుంది. నిన్ను ఎలా అయినా పెద్ద చదువులు చదివించాలని ఆరాటపడుతూ ఉంటుంది."
    "అదంతా సరే! అక్క ఎక్కడుంది? ఎలా ఉంది?"
    "లక్షణంగా పెళ్లి చేసుకొని దర్జాగా మొగుడితో కాపురం చేసుకుంటోంది. నేను మీ బావగారికి పెద్దమ్మనవుతాను. మీ అక్క నిన్ను తీసుకురమ్మంటే వచ్చాను. వస్తావా?"
    "ఇప్పుడే వచ్చేస్తాను."
    వెంటనే తన చిన్న సంచీ సర్దుకోసాగాడు సూర్యం.
    "దిక్కూ మొక్కూ లేకుండా ఇంట్లోంచి లేచిపోయిన ధనలక్ష్మికి చక్కగా పెళ్ళయిందా?" ఆశ్చర్యంగా అడిగింది సుమతి. ఆ ఆశ్చర్యంలో దాచినా దాగని కుళ్ళు చక్కగా వినిపిస్తోంది. సుమతికి ఇరవయ్యేళ్ళు నిండిపోయాయి. పదహారేళ్ళు నిండగానే "ఇంకా మీ అమ్మాయికి పెళ్ళి కాలేదా?" అని అడిగే రోజులవి. అలా అడిగి అడిగి సుమతి ముఖంమీదే "ఇంక ఈ అమ్మాయికి పెళ్ళి కాదు" అని నిర్ధారించేశారు అమ్మలక్కలు సుమతి ముఖం మీదే! ఆ మాటలన్నీ విని విని సుమతి గుండెల్లో రాయి పడింది. పెళ్ళికొడుకు, సంసార జీవితం, అందులో కష్టసుఖాలు, అవన్నీ మరిచిపోయి ఒక్క తాళిబొట్టు కోసం తహతాహలాడే దశకు చేరుకుంది ఆ అమ్మాయి మనసు. ఆ వచ్చినావిడ ఆవులిస్తే పేగులు లెక్కపెట్టగలిగే వ్యక్తిలా ఉంది. వెటకారంగా "ఈ రోజుల్లో ఎవరికెవరు దిక్కమ్మా! ఎవరి స్వార్థం వాళ్ళది. పాపం, ధనం నాకన్నీ చెప్పింది. ధనం ఇక్కడే ఉండి తనకు దిక్కయిన వాళ్లు ప్రేమతో చూసిన సంబంధం నోరు మూసుకుని చేసుకొని ఉంటే ఈపాటికి నీకు పెళ్ళయిపోయేదే! ఇప్పుడు నీకు పెళ్ళికావటం కొంచెం కష్టమే మరి!" అంది.

 Previous Page Next Page