Previous Page Next Page 
ఆఖరి పోరాటం పేజి 13


    "లేదు. ఏమాత్రం లేదు. నాకయితే ఏదైనా పదెకరాల పొలం మధ్యలో మంచె వేసుకుని నాలుగు కోళ్ళు, పది మేకలు పెంచుకోవటం ఇష్టం."

    "ఇంకా నయం మీక్కాబోయే ఆయన...."

    పక్కనుంచి వెళ్తూన్న కారు హారన్ శబ్దంలో అతడి మాటలు పూర్తిగా వినపడలేదు.

    "ఏమన్నారూ?"

    "మీ కల్నల్ గారు..."

    మరో కారు హారన్.

    "మైగాడ్. ఈ కారు హారన్ ల గొడవకి చెవి పక్కగా చెప్పింది కూడా వినపడటం లేదు......"

    అతడి మాట పూర్తి అవలేదు-ఆమె కారుని సర్రున పక్కకు తీసి ఆపింది. అతడామె వంక 'ఎందుకు' అన్నట్టు విస్మయంగా చూశాడు.

    ఆమె సాలోచనగా- "వాళ్ళు మాట్లాడుతూ వుంటే విమాన శబ్దం వినిపించింది. చాలా దగ్గిరగా, చెవి పక్కగా వెళుతున్నట్టు...." అంది. ఒక దుర్భేద్యమైన కోటలో ప్రవేశించటానికి గాలి చొరబడేంత సందు దొరికిన ఫీలింగ్... ఇద్దరూ మొహామోహాలు చూసుకున్నారు. విహారి కారులోంచి జేబురుమాలు బయటపెట్టి గాలివాటం చూశాడు.

    "వాళ్ళు ఫోన్ చేసినది సరీగ్గా బెంగుళూరు విమానం దిగే టైము. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళినా, దిగేటప్పుడు తప్పనిసరిగా వీస్తున్న గాలికి ఎదురుగా దిగాలి. బ్రేకుల వత్తిడి ఒక్కటే సరిపోదు. గాలి తూర్పునుంచి పడమరకు వీస్తూంది. అంటే విమానం పడమరనుంచి తూర్పుకి దిగి వుంటుంది కాబట్టి వాళ్ళు పిల్లల్ని దాచిన స్థలం విమానాశ్రయానికి పడమర వైపువుండి వుండడానికి ఎక్కువ ఛాన్స్ వుంది. రన్ వేకి అత్యంత సమీపంలో".

    ఆమె ఆశ్చర్యంగా చూసింది. సి.బి.ఐ.లో కూడా అంత వేగంగా విషయాన్ని ఆకళింపు చేసుకుని దానిమీద చర్చించగలిగే ఆఫీసర్లు చాలా తక్కువమంది వుంటారు. అతడు చెప్పింది అక్షరాలా నిజం కాకపోవచ్చు. కానీ లాజిక్....

    "అటు వెళ్ళి చూద్దామా? గాలిలో బాణం వేద్దాం. తగుల్తే తగులుతుంది."

    అతడు తలూపాడు.

    కారు విమానాశ్రయంవేపు వెళ్ళింది.

    రన్ వేకి పడమటివైపు చిన్న చిన్న పాకలు, ఆక్రమిత స్థలాలూ వున్నాయి.

    "టెర్రరిస్టులు ఇక్కడ ఏదో ఒక షాపునుంచి చేసి వుంటారు. చిన్నపిల్లల్ని అంత మందిని నడిపిస్తూ తీసుకువెళ్ళలేరు కాబట్టి, వ్యాన్ తాలూకు టైరు గుర్తులు వుండి వుంటాయి. పిల్లల్ని దింపేశాక వ్యాన్ ని దూరంగా వదిలేసి వుంటారు. ఆ టైరు గుర్తులు పట్టుకోవటం కష్టం కాదనుకుంటాను."

    ప్రవల్లిక నవ్వింది. "మీరు పోలీసు డిపార్టుమెంట్ లో చేరాల్సింది."

    విహారి సీరియస్ గా అన్నాడు, "డిటెక్టివ్ నవల్స్ చిన్నప్పుడు చదివేవాడిని-" 

    కారు విమానాశ్రయానికి అటువైపు రన్ వేకి సమాంతరంగా వెళుతూంది. దూరంగా గట్టుమీద పాడుపడిన భవంతి కనిపిస్తోంది. పై కప్పులేదు. మొండి గోడలున్నాయి. చుట్టూ చెట్లు దట్టంగా అల్లుకుని, ఆ చీకట్లో భయంకరంగా వున్నాయి.

    "మన అంచనా ఏమాత్రం కరెక్టయినా ఆ బిల్డింగే మన టార్గెట్...." విహారి పూర్తి చేశాడు.

    ఇద్దరూ చాలాసేపు ఆ బిల్డింగ్ వంకే చూస్తూ నిశ్శబ్దంగా కూర్చున్నారు.

    "చాలా డెలికేట్ వ్యవహారం. లోపల టెర్రరిస్టులు ఎంతమంది వున్నారో చూడాలి. ఒక్కసారిగా అందర్నీ బంధించకపోతే పనిపిల్లల ప్రాణాలకే ప్రమాదం".

    కారు అక్కడే ఆపుచేసి, వాళ్ళు దాదాపు రెండు ఫర్లాంగులు నడిచి, గుట్ట దగ్గిరకి చేరుకున్నారు. అక్కణ్నుంచి కూడా బిల్డింగ్ ని చెట్లు కవర్ చేస్తున్నాయి.

    "ఇన్ని గంటలపాటు పగలు, రాత్రి, ఎండలో, చలిలో ఇలా పిల్లల్ని పై కప్పు లేకుండా వుంచారంటే, వాళ్ళు మనుషులు కాదు- రాక్షసులు" అన్నదామె.

    "చాలా కొద్దిసేపట్లో ఇంతకు ఇంతా అనుభవించబోతున్నారు వాళ్ళు" విహారి ముందుకు సాగుతూ అన్నాడు. అతడి కళ్ళముందు వినీల్ శవం కనబడుతోంది. రక్తంలో తడిసి, గువ్వలా ముడుచుకు పడివున్న శరీరం...

    బిల్డింగ్ వెనుకవైపు చేరుకున్నారు. మిలటరీలోలా ఆమె వేళ్ళు ఒక చేతిలోకి మరొకటి జొనిపి పట్టుకుంటే అతడు వాటిమధ్య కాలుపెట్టి పైకి ఎక్కి... గోడ అంచు ఆధారంగా లోపలికి చూసేడు.

    లోపల దృశ్యం హృదయవిదారకంగా వుంది.

    పిల్లలు ఏడవటానికి కూడా ఓపికలేనట్టు పడివున్నారు. ముగ్గురు టెర్రరిస్టులున్నారు. ముగ్గురి దగ్గరా మిషన్ గన్స్ వున్నాయి. హరికెన్ లాంతరు మినుక్కు మినుక్కుమని వెలుగుతూంది. ఒకడు గుమ్మం దగ్గిర నిల్చుని బయటకు చూస్తున్నాడు. ఒకడు బ్రెడ్ తింటూ బొగ్గుతో ఒక స్త్రీ నగ్నంగావున్న బొమ్మ గోడమీద గీస్తున్నాడు. ఇంకొకడు అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. ముగ్గురి మొహాలకి (పిల్లలు తరువాత తమని గుర్తుపట్టటానికి వీల్లేకుండా) మాస్క్ లున్నాయి.

    దాదాపు పిల్లలందరూ స్పృహతప్పి పడివున్నారు. కొందరు జ్వరంతో మూలుగుతున్నారు. కొందరు చలికి ముణగదీసుకు పడివున్నారు. ఎవరో కుర్రవాడు నిద్రలోనే 'అమ్మా-అమ్మా' అంటూ ఏడుస్తున్నాడు.

    చిక్కేమిటంటే, వారిద్దరి దగ్గిరా కలిపి ఒకటే రివాల్వర్ వుంది. ముగ్గురు ఉద్రవాదుల్నీ ఒక పిస్టల్ తో ఎదుర్కోవటం అంత తెలివితక్కువ పని మరొకటి లేదు. ప్రత్యర్ధుల దగ్గిర మిషన్ గన్స్ వున్నాయి. పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.

    ఇద్దరూ ఆ బిల్డింగ్ కి దూరంగా వచ్చారు.

    "లోపల ముగ్గురు టెర్రరిస్టులు కనబడుతున్నారు. గోడకి అటువైపు ఇంకా ఎందరున్నారో తెలీదు. మనం పోలీసులని రప్పిద్దామా" అడిగాడు విహారి.

    "దీనికి పోలీసులు లాభంలేదు. బ్లాక్ కమెండోలు కావాలి. వాళ్ళే ఇటువంటి ఆపరేషన్ చేయగలరు. కానీ వాళ్ళని ఢిల్లీనుంచి రప్పించాలి-" అంది ప్రవల్లిక.

    "ఈ పిల్లలు ఈ రాత్రి అంతసేపు వుండగలరనుకోను. ఇప్పటికే సగంమంది ఫెయింట్ అయివున్నారు" అన్నాడు తను చూసిన దృశ్యం గుర్తుకు తెచ్చుకుంటూ. ఇద్దరూ కొంతసేపు మౌనంగా వున్నారు.

    ప్రవల్లిక "నాకో అయిడియా వచ్చింది" అంటూ చెప్పింది. అంతా విని "గుడ్" అన్నాడు విహారి. ఇద్దరూ కారు దగ్గిరకి వెళ్ళారు. ఆమె కారులోంచి వైర్ లెస్ తో తన ఆఫీసుకి మాట్లాడింది.

    ఢిల్లీనుంచి అప్పుడే అత్యవసరంగా పిలిపించబడిన చీఫ్- ఆ కాల్ అందుకున్నాడు.

    "నేను సర్! డిప్యూటీ మాట్లాడుతున్నాను. టెర్రరిస్టుల స్థావరం దొరికింది"-

    చీఫ్ ఎగ్జయిట్ అయ్యాడు. అతడి కంఠంలో రిలీఫ్ కనపడింది.

    "ఎక్కడ?" అని అడిగాడు. ఆమె వివరాలు చెప్పి, "ఇందులో ఒక ప్రమాదం వుంది సర్. మనం ఏమాత్రం ఫోర్స్ ఉపయోగించినా- వాళ్ళు ఎటూ తోచని పరిస్థితుల్లో పిల్లల ప్రాణాలు తీయొచ్చు."

    "మరేం చేద్దాం" చీఫ్ సిన్సియర్ గా అడిగాడు. అతడు దేశ ద్రోహి కాదు. డ్యూటీకన్నా భక్తి ఎక్కువ అంతే. వయసు పెరిగేకొద్దీ ఆ భక్తి మూర్ఖత్వంగా మారుతున్న స్టేజీలో వున్నాడే తప్ప- చిన్న పిల్లల విషయమై అతడూ ఆందోళన చెందుతున్నాడు.

    "నాకో ఆలోచన వచ్చింది సర్. లోపల ఎంతమంది వున్నారో తెలియటంలేదు. పుట్టలోంచి బయటకు వచ్చేలా చెయ్యాలి వాళ్ళని?"

    "ఏం చేద్దామని నీ ఆలోచన మిస్ ప్రవల్లికా?"

    "ఆర్టిఫీషియల్ రెయిన్ సృష్టించాలి సర్."

    చీఫ్ కి తను వింటున్నది అర్ధంకాలేదు. "ఏమిటి?" అన్నాడు సందిగ్ధంగా.

    "మూడు ఫైరింజెన్లు, రెండు ఎలక్ట్రానిక్స్ స్పీకర్లు, ఒక ఆర్కుబ్రూట్ తో వరుసగా వర్షం, ఉరుములు, మెరుపులూ సృష్టించాలి. ఈ భవంతికి పైకప్పు లేదు టెర్రరిస్టులు పిల్లల్ని మరోచోటుకి తీసుకువెళ్ళే ప్రయత్నం ఏదీ చెయ్యరని నేను అనుకుంటున్నాను. ఇక్కడే ఏ చెట్టుకిందో తాత్కాలికంగా తలదాచుకుని, వర్షం తగ్గేక పిల్లల్ని భవంతిలోకే తీసుకు వెళతారు. బాగా చీకటి వుంది ఇక్కడ. చెట్లు కూడా చాలా వున్నాయి. ప్రతి చెట్టు దగ్గిర మన వాళ్ళని నలుగురి చొప్పున వుంచితే, అకస్మాత్తుగా దాడి జరపవచ్చు. ఒక్కసారిగా ఫ్లాష్ లైట్లు వేసి, ఆ కంగారునుంచి వాళ్ళు తేరుకునే లోపులో ఓవర్ పవర్ చెయ్యాలి వాళ్ళని".

    "గుడ్..." అన్నాడు చీఫ్. ".... నువ్వు కారు దగ్గిరే వుండు. సరీగ్గా అరగంటలో నేను అన్ని ఏర్పాట్లతో వస్తాను".

    "సర్..." ఆమె సందేహించింది.

    "ఏమిటి?"

    "ఇదంతా ఎంతో నిశ్శబ్దంగా- మూడో కంటికి తెలియకుండా జరగాలి."

    చీఫ్ నవ్వాడు- "అమ్మాయ్! నీకన్నా నాకు ఈ డిపార్టుమెంట్ లో పాతిక సంవత్సరాల పైగా అనుభవం వుంది. నువ్వేం కంగారు పడకు. ఆ స్థావరాన్ని కనుక్కున్నందుకు నీకు మరో మెడల్ రికమెండ్ చేయబోతున్నాను" వైర్ లెస్ ఆఫ్ చేసి, ఫోన్ అందుకున్నాడు చీఫ్. ముందు ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేశాడు. తరువాత ఆర్కుబ్రూట్, ఎలక్ట్రానిక్ ఆంప్లియర్స్ వచ్చాయి. పది నిముషాల్లో యాభైమంది ఆఫీసర్లు పూర్తి నల్ల డ్రస్సుల్లో తయారై బయల్దేరారు. పది కార్లు ఆ చీకట్లో నిశ్శబ్దంగా విమానాశ్రయం వైపు బయల్దేరాయి.

    చీఫ్ చేతికి వున్న తాయెత్తుద్వారా మొత్తం సంభాషణంతా అనంతానంతస్వామికి చేరిందన్న సంగతి వారికి తెలీదు.


                        *    *    *


    ఆ గదిలో అనంతానంతస్వామి నిశ్శబ్దంగా కూర్చుని వున్నాడు.

    మిస్ ప్రవల్లిక...

    విత్తనం అనుకున్నది మొక్క అయింది. ముళ్ళపొద కాకముందే తొలగించాలి కానీ అది తరువాత సంగతి.

    ముందు తన మనుష్యులు ముగ్గుర్నీ రక్షించుకోవాలి.

    అతడు లేచి పచార్లు చేయటం ప్రారంభించాడు. విసుగ్గా గడియారం వంక చూస్తూండగా పరమేశ్వరం వచ్చాడు.

    "రా. నీ కోసమే చూస్తున్నాను. చిన్న సమస్య వచ్చి పడింది" అంటూ జరిగింది చెప్పి, "మనవాళ్ళని బ్లాక్ కమెండోస్ వలయంలా చుట్టుముట్టారు. వాళ్ళకి ప్రమాద సూచన పంపించాలి. ఎలాగో అర్ధం కావటంలేదు. మనం ఎక్కడా బయటపడకూడదు. మన వాళ్ళని రక్షించుకోవాలి.... ఎలా?"

    పరమేశ్వరం కళ్ళు మూసుకున్నాడు. ప్రధానమంత్రిని నలుగురి మధ్యా చంపిన హంతకుడిని నేరం నుంచి ఎలా తప్పించాలా అని ఆలోచించే లాయర్ లా ఆలోచించాడు. రెండు క్షణాల తరువాత కళ్ళు తెరిచి, "ఆ పిల్లల తల్లిదండ్రులు ఎక్కడున్నారు?" అని అడిగాడు.

    "ఆ కంట్రోల్ రూమ్ దగ్గిరే".

    "-పిల్లల్ని టెర్రరిస్టులు ఎక్కడ దాచారో పోలీసులకి తెలిసి పోయింది. ఫలానా చోటుకి వెళ్ళారు- అన్న వార్తని ఆ తల్లిదండ్రులకి తెలియజేస్తే చాలు" పూర్తిచేశాడు పరమేశ్వరం. 

    ఒక అద్భుతాన్ని చూసినట్టు అతడిని చూశాడు స్వామి. ఇటువంటి 'తెలివి' తనకి ఒక స్తంభంలా ఆసరా ఇస్తూ వుండటం అతడికి సంతోషంగా వుంది.

    ఈ లోపులో పరమేశ్వరం వివరించాడు. "మనవాళ్ళు దయాదాక్షిణ్యం లేని కర్కోటకులు. వర్షంలో పిల్లలు తడిసినా పెద్దగా పట్టించుకోరు. తాము మాత్రం బయటకొచ్చి చెట్లక్రింద నిలబడి- ఆ భవంతిని గార్డు చేస్తారే తప్ప, పిల్లల్ని బయటకు తీసుకురారు. ఏ ఒక్కపిల్లవాడు ఆ చీకట్లో తప్పించుకున్నా ప్రమాదం అని వాళ్ళు ఆలోచిస్తారు. ఇదే సమయానికి పిల్లల తల్లిదండ్రులు రకరకాల వాహనాల మీద అక్కడికి చేరుకుంటారు. వాళ్ళని ఆపగలిగే ధైర్యంగాని, సామర్ధ్యంగాని పోలీసులకి వుండదు. వాళ్ళ ఆతృత వాళ్ళది. అదే మనని రక్షిస్తుంది. మన వాళ్ళకి రాబోయే అపాయాన్ని సూచిస్తుంది...." 

    స్వామి రిలాక్సింగ్ గా నవ్వేడు. అయిదు నిమిషాల క్రితం వున్న టెన్షన్ ఇప్పుడు లేదు. చేయి సాచి "థాంక్స్" అన్నాడు. "ఇటువంటి ఆలోచన కోసమే నిన్ను పిలిపించింది."

 Previous Page Next Page