పరమేశ్వరం షేక్ హాండ్ ఇవ్వబోయాడు.
స్వామి చప్పున చేయి వెనక్కి తీసుకున్నాడు. ధృతరాష్ట్రుడు ఎవర్ని కౌగిలించుకున్నా ఆ ఉక్కు పిడికిలిలో వాళ్ళు నలిగి, పొడి అయినట్టే పరమేశ్వరం ఎవరికి షేక్ హాండిస్తే వాళ్ళు మాడి మసి అయిపోవాల్సిందే!!! అటువంటి విషపు చెయ్యి అతడిది!!! స్వామిలాటివాడే తటపటాయించటం చూచి, పరమేశ్వరం నవ్వుతూ చెయ్యి వెనక్కి తీసుకుని "వెళ్ళొస్తాను" అన్నాడు.
* * *
"మీ రివాల్వర్ నాకివ్వండి" అన్నాడు విహారి. ప్రవల్లిక అతడివైపు విస్మయంగా చూసింది. ఇద్దరూ రోడ్ మీద నిలబడి, రాబోయే వాహనాల కోసం చూస్తున్నారు. అతడు ఆమెని అలా అడిగేసరికి, అర్ధంకాలేదు. "ఎందుకు" అని అడిగింది.
"నేను ఆ భవంతి దగ్గిరే... వీలయితే లోపలే వుందామనుకుంటున్నాను... మీరీ కృత్రిమ వర్షం తాలూకు ప్రయోగాలు చేస్తున్నప్పుడు...."
"దేనికి?" అడిగింది ఆశ్చర్యంగా.
"నాకెందుకో అనుమానంగా వుంది. వర్షంలో ఆ పిల్లల్ని వాళ్ళు బయటకు తీసుకు వస్తారని మీరు అనుకుంటున్నారుగాని- నాకు అలా అనిపించటం లేదు. అంత రిస్కు తీసుకోరు. వాళ్ళకి పిల్లలమీద అంత దయాదాక్షిణ్యాలు వుంటాయని కూడా నేననుకోవటం లేదు. వర్షపు చలికి ఆ దుండగులుగానీ బయటకువస్తే, నేను లోపలే వుండి పిల్లల్ని అట్నుంచి కవర్ చేయటానికి ప్రయత్నిస్తాను".
ఆమె మారు మాట్లాడకుండా తన రివాల్వర్ ఇచ్చింది. అతడు దాన్ని తీసుకుని చీకట్లో కలిసిపోయాడు. ఆమె అతడు వెళ్ళిన వైపే చూస్తూ వుండిపోయింది.
ఎందుకో తెలీదు... ఆమెకి అకస్మాత్తుగా పరమేశ్వరం జ్ఞాపకం వచ్చాడు. ఇతడికీ, పరమేశ్వరానికీ చాలా దగ్గిర పోలికలున్నాయి. అదే షార్పునెస్.... సి.బి.ఐ. ఆఫీసర్లు కూడా ఆలోచించలేని కోణంలో వేగంగా ఆలోచించగలగటం....
చల్లటిగాలి ఆమెని సున్నితంగా స్పృశించింది. ఆమెకి సడెన్ గా చాలా రిలాక్సింగ్ గా అనిపించింది. తెలివితేటలకు సంబంధించినంత వరకు ధర్మానికి అటువైపున పరమేశ్వరం వుంటే ఇటువైపు యితనున్నాడు. బలం, అధికారం అటుంటే- ఇటు సమవుజ్జీగా తనుంది! ఈ రెండు శక్తులూ కలిసి ఆ మూడు స్తంభాల్నీ పడగొట్టటం పెద్ద కష్టంకాకపోవచ్చు. ఈ వైకుంఠపాళిలో పైకి వెళ్ళటానికి ఇన్నాళ్ళకి తనకో ఆధారం దొరికింది. డిపార్టుమెంట్ లో ఇతనికన్నా తెలివైనవాళ్ళు వుండొచ్చుగాక. కాని ప్రభుత్వంతో ఏ సంబంధమూ లేకుండా యింత "కమిట్ మెంట్' వుండేవాళ్ళు చాలా చాలా తక్కువ. దీన్నే పౌరబాధ్యత అంటారేమో!
ఆమె ఆలోచన్లలో ఉండగానే 'హల్లో' అని వినిపించింది. ఆమె ఉలిక్కిపడి చూసింది. చుట్టూ ఇరవయ్ మంది ఆఫీసర్లు... చీఫ్ దగ్గిరకొచ్చాడు. "అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి" అన్నాడు.
ఆమె చాలా థ్రిల్లింగ్ గా ఫీలయింది. తన డిపార్టుమెంట్ యిది. అమెరికన్, రష్యన్ గూఢచారి సంస్థలకి ఏ మాత్రం తీసిపోని చాకచక్యంవున్న అధికారులు తమకీ వున్నారు. ఇంత దగ్గిరలో వున్న తనకే ఏ మాత్రం అనుమానం రాకుండా ఫైర్ ఇంజెన్ లతో సహా తీసుకురావటం సాధ్యమయ్యే పనికాదు.
"స్టార్ట్ ది ఆపరేషన్" సూచించాడు చీఫ్. ప్రవల్లిక తన ప్లాను వివరించింది. ప్లడ్ లైట్లు జాగ్రత్తగా అమర్చటం జరిగిపోయింది.
లోపలున్న పిల్లలు పడుతూన్న కష్టాల్ని తల్చుకుని ప్రతీవాళ్ళూ ఒక రకమైన కసితో చకచకా పనులు చేస్తున్నారు.
"ఫైర్ ఇంజెన్ రేంజి సరిపోతుందా?" అడిగింది.
"సరిపోతుంది మేడమ్"
కంట్రోలర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ స్వయంగా వచ్చాడు. అందుకే అన్నారు. 'సారే జహాఁసె అచ్చా హిందుస్తాన్ హమారా' అని. ఆంపలిఫయర్ దగ్గిర ఇంజనీరు 'అంతా రెడీ' అన్నట్టు బొటనవేలు పైకెత్తాడు. ఆర్కుబ్రూట్ క్షణకాలం మెరిసింది. వెంటనే చెవులు చిల్లులు పడేలా ఉరిమిన శబ్దం.
వర్షం మొదలయింది.
గోడమీదకి జాగ్రత్తగా ఎక్కుతున్న విహారిమీద మొదటి నీటి చుక్క పడింది. అతడు కూడా ఇంత నిశ్శబ్దంగా, ఇంత వేగంగా పని జరుగుతున్నందుకు ఆశ్చర్యపోయాడు.
టెర్రరిస్టులు కూడా ఆకాశంవైపు చూశారు. చీకట్లో ఏమీ కనపడలేదు. వర్షం ఎక్కువైంది.
"చెట్టుకిందకి పోదామా?"
"వద్దు-పిల్లలు తప్పించుకుంటే కష్టం. ఏ ఒక్కడు బయటకు వెళ్ళినా మన గురించి చెప్పేస్తాడు".
"పాడు వర్షం..." అంటూ ఒకడేదో బూతుమాట అన్నాడు. ఒక కుర్రవాడు ఏడవటం మొదలుపెట్టాడు. "నోర్మూసుకొకపోతే చంపేస్తాను" అరిచాడో టెర్రరిస్టు.
నీటిధార మరింత ఎక్కువయింది.
"నేను చెట్టుకిందకి పోతున్నాను."
"నేనుకూడా వస్తాను... ఒరేయ్, నువ్విక్కడే వుండు. పిల్లలు జాగ్రత్త" అందర్లోకీ జూనియర్ లా కనపడుతున్న వాడికి చెప్పి ఇద్దరూ బయటకు పరుగెత్తారు.
విహారి వూపిరి బిగపట్టాడు.
తమ ప్లాను ఫలించింది. బయటకు వెళ్ళి వాళ్ళిద్దరూ బంధింపబడగానే లోపలున్న వాడిని కాల్చి చంపడం పెద్ద కష్టం కాదు.
రెండు నిమిషాలు గడిచాయి.
బయట...నల్లదుస్తుల్లో వున్న ఆఫీసర్లు నెమ్మదిగా టెర్రరిస్టులున్న చెట్టు చుట్టూ వలయంగా చేరుకుంటున్నారు.
విహారి పిస్టల్ ని రేంజిలోకి తీసుకున్నాడు.
ప్రవల్లిక గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. చేప గాలానికి దగ్గరగా వచ్చింది. నిశ్శబ్దంగా పట్టెయ్యాలి అంతే.
ఇంకొక్క క్షణం ఆగితే అదే జరిగింది కానీ అంతలోనే అనూహ్యమైన సంఘటన జరిగింది.
దూరంగా వాహనాలు శబ్దం చేసుకుంటూ రావడం వినిపించింది. కొద్దిసేపటికి లైట్లు కనపడ్డాయి. అనుకొని ఈ సంఘటనకు ఆఫీసర్లు బిత్తరపోయారు. ప్రవల్లిక నిశ్చేష్టురాలయింది.
కార్లు, స్కూటర్లు, మోపెడ్లు- ఏది దొరికితే అది వేసుకుని పేరెంట్సు అక్కడికి వచ్చేశారు. ఆ రెండ్రోజుల సామీప్యంలో వాళ్ళు ఒకరికొకరు దగ్గరయ్యారు. ఒకర్నొకరు ఓదార్చుకున్నారు. ఫలానాచోట పిల్లలున్నారట అని తెలిసింది- అంతే! ప్రవాహంలా బయల్దేరారు. అడ్డు- పెట్టేవాడే లేకపోయాడు.
ఒక్కసారిగా అన్ని లైట్లు తామున్న చోటికి దూసుకువస్తూ వుండడంతో- చెట్టుదగ్గర నిలబడివున్న ఉగ్రవాదులు భవంతివైపు పరుగెత్తారు. వస్తున్నది పోలీసులే అనుకున్నారు వాళ్ళు.
భవంతివైపు వస్తున్న టెర్రరిస్టులని విహారి కూడా చూశాడు.
అతడి మెదడు చురుగ్గా పనిచేసింది.
లోపలున్న మనిషికేసి మరేమీ ఆలోచించకుండా రివాల్వర్ పేల్చాడు. లోపలున్న టెర్రరిస్టు చేతికి గాయమైంది. ఆర్తనాదం చేస్తూ మిషన్ గన్ వదిలేశాడు.
ఆ చప్పుడికి భవంతివేపు పరుగెడుతున్న టెర్రరిస్టులు చప్పున ఆగిపోయాడు.
భవంతి లోపల్నుంచి పిస్టల్ శబ్దాన్ని వాళ్ళు ఊహించలేదు. నిశ్చేష్టులయ్యారు.
ఆ అరక్షణం చాలు, ప్రవల్లికకి చక్కటి అవకాశం దొరికింది. విహారి చర్యని మనసులోనే అభినందిస్తూ "లైట్స్" అని అరిచింది. ఒక్కసారిగా అన్నివైపుల్నించీ లైట్లు వెలిగాయి. అనుకోని ఈ పరిణామం బయటవున్న టెర్రరిస్టులని మరింత భయభ్రాంతుల్ని చేసింది.
ఈ హడావుడికి పిల్లలందరూ ఉత్తేజితులయ్యారు. ముఖ్యంగా విష్ణు.
నీటిధార ఆగిపోయింది. లైట్ల వెలుతురులో అక్కడి ప్రదేశమంతా పట్టపగలుగా మారింది. విహారి గోడమీదనుండి లోపలికి దూకి "రన్... బోయ్స్... రన్" అని అరిచాడు. పరిస్థితి అందరికన్నా మొదట అర్ధం చేసుకున్నవాడు విష్ణు. వాడు ముందు బయటకు పరుగెత్తాడు.
అక్కడే చిన్న తప్పు జరిగింది.
విష్ణుని బయటవున్న టెర్రరిస్టు ఒకడు పట్టుకుని మిషన్ గన్ గురిపెట్టాడు. మిగతా పిల్లల గురించి వాళ్ళు పట్టించుకోలేదు. భవంతిలోంచి బయటపడ్డ పిల్లలు అప్పుడే అక్కడకొచ్చిన తల్లిదండ్రుల దగ్గిరకి పరుగెత్తారు. అన్ని గంటలపాటు పడిన భయం, టెన్షన్, శ్రమ- అన్నీ మరిచిపోయి పిల్లలు వెళ్ళి తమ తమ తల్లితండ్రుల కౌగిళ్ళలో ఒదిగిపోయారు. అక్కడి దృశ్యం హృద్యంగా వుంది. తల్లులు పిల్లల్ని హృదయాలకు హత్తుకుని ఆనందంతో ఏడుస్తున్నారు. పిల్లలు తల్లుల మెడచుట్టూ చేతులువేసి అతుక్కుపోయారు.
సునాదమాల ఒక్కతే మిగిలిపోయింది.
ఆమె దృష్టి టెర్రరిస్టుల మధ్య చిక్కుకుపోయిన విష్ణుమీద పడింది. అంతే! ఆమె ఆగలేదు. గాలివేగంతో అటు పరుగెత్తింది. ప్రవల్లిక "నో... నో" అని అరుస్తూనే వుంది. సునాదమాల వినిపించుకోలేదు. ఆమె మడిలో మెదులుతున్నది ఒకే ఒక విషయం. పిల్లలందరూ తమ తమ గూళ్ళకి చేరుకున్నారు. ఒక్క విష్ణుమాత్రం వాళ్ళ దగ్గిర వుండిపోయాడు. తమ విష్ణుని మాత్రం వాళ్ళు పట్టి వుంచారు.
ఆమె భయస్తురాలు కావొచ్చు. గట్టిగా మాట్లాడడానికి కూడా జంకేది కావొచ్చు. కానీ ఆ క్షణం విష్ణుమీద ఆమె ప్రేమ దేన్నీ ఆలోచించేలా చెయ్యలేదు. పరుగెత్తుకెళ్ళి విష్ణుని వాళ్ళ చేతుల్లోంచి లాక్కోవడానికి ప్రయత్నించింది.
ఆమె అలా రావడం చూసి ఒక్కక్షణం టెర్రరిస్టులు కంగారుపడ్డా, వెంటనే సర్దుకున్నారు. ఆ అమ్మాయిని కూడా పట్టుకున్నారు, అంతా క్షణాల్లో జరిగిపోయింది.
ఈ లోపులో విహారి లోపల్నుంచి టెర్రరిస్టుతో సహా బయటకు వచ్చాడు. ఉగ్రవాది చేతినుంచి రక్తం స్రవిస్తూంది. ఇద్దరికీ బయట జరుగుతున్నది తెలీదు. విహారి బయట దృశ్యాన్ని చూసి విస్తుబోయాడు.
"పిస్తోలు వదిలేయ్" ఆజ్ఞాపించాడు ఒకడు.
చేసేదిలేక వదిలేశాడు విహారి. అందుకుని, విహారి చెంపమీద బలంగా కొట్టాడు చేతికి గాయమైన ఉగ్రవాది. ఆ తరువాత బిగ్గరగా అన్నాడు.
"చీఫ్.... ఒక కారు మాకు వదిలి మీరంతా దూరంగా వెళ్ళండి. ఈ పిల్లాడు, ఈ అమ్మాయీ మాతో వస్తారు. మేము సురక్షిత ప్రాంతానికి వెళ్లిన తరువాత వీళ్ళని వదిలేస్తాం. మీరు మమ్మల్ని ఫాలో అయినా, మాకు అపకారం తలపెట్టినా వీళ్ళు ప్రాణాల్తో దక్కరు."
చీఫ్, ప్రవల్లిక మొహమొహాలు చూసుకున్నారు.
ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆ కిరాతకులు అనుకున్నంతా చేయగల సమర్ధులు. వాళ్ళని పట్టుకోవడం కోసం యిద్దర్ని బలిపెట్టడం అవివేకం. చీఫ్ ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా తమ ఆఫీసర్లకి తప్పుకొమ్మన్నట్టు సైగచేశాడు. టెర్రరిస్టులు సునాదమాలనీ, విష్ణుని తీసుకుని కారు వద్దకు నడిచారు. వాళ్ళందరూ కారు ఎక్కుతూండగా "ఆగండి!" అన్నాడు విహారి. అందరూ అటువేపు చూశారు.
విహారి రెండు చేతులూ పైకెత్తి రాళ్ళ దగ్గిరకి వెళ్ళాడు. "మీకు కావాల్సింది మీతోపాటు బందీగా ఒకరు రావడం. అంతేగా, వాళ్ళబదులు నేను వస్తాను. వాళ్ళని వదలిపెట్టండి" అన్నాడు.
"వీల్లేదు" అన్నాడు వాళ్ళలో ఒకడు.
అక్కడ సూదిపడితే వినపడేటంత శబ్దం.
ఆ ముగ్గురిలోకీ నాయకుడిలా వున్నవాడు "...రానీ" అన్నాడు. విహారి అతడివైపు ఆశ్చర్యంగా చూశాడు. అంత తొందరగా వాళ్ళు ఒప్పుకుంటారని అతడు అనుకోలేదు. (దానికి కారణం కారు ఎక్కాక తెలిసింది).
ఒకడు విహారి దగ్గిరకివచ్చి జేబులు చెక్ చేశాడు. తరువాత కారు దగ్గిరకి తీసుకెళ్ళి "ఎక్కు" అన్నాడు.
అక్కడే సునాదమాల నిలబడి వుంది. విష్ణుని పొదివి పట్టుకుని వుంది. పూర్వపు భయం ఆమెలో తిరిగి చోటుచేసుకుంది. భయం భయంగా చూస్తోంది. విహారి ఆమెని చూసి నవ్వేడు... "గంటలో వదిలేస్తారు. రేపు బస్ స్టాఫ్ లో కలుసుకుందాం".